దళపతి విజయ్: ‘అనుభవం లేదు, భయం లేదు.. 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యం’

ఫొటో సోర్స్, ANI
- రచయిత, నందిని వెల్లిచామి
- హోదా, బీబీసీ ప్రతినిధి
తమిళ రాజకీయ వర్గాలు ఎదురుచూస్తున్న నటుడు విజయ్ పార్టీ మొదటి బహిరంగ సభ ఆదివారం జరిగింది.
పార్టీ జెండాను ఎగరవేయడంలో కొత్తదనాన్ని పరిచయం చేసిన విజయ్, తన పార్టీ సిద్ధాంతాలను వివరించారు. తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ విధానాలు, 2026 అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ వ్యూహం వంటి పలు అంశాలను ఆయన తన ప్రసంగంలో ప్రస్తావించారు.
బటన్‌ను నొక్కడం ద్వారా విజయ్ తన పార్టీ జెండాను ఎగురవేశారు. తరువాత, తమిళనాడు రాజకీయ రంగంలో ఓ నేతగా పార్టీ సదస్సులో విజయ్ తన తొలి ప్రసంగాన్ని ప్రారంభించారు.
‘‘నేను రాజకీయాల్లో చిన్నపిల్లాడినని కొంతమంది అంటున్నారు. నిజమే. కానీ పామును చిన్న పిల్లలు చేతులతో పట్టుకుంటారు. ఆ పాము (రాజకీయం) అంటే నాకు భయం లేదు. రాజకీయం అంటే సినిమా కాదు, రణరంగం” అని విజయ్ అన్నారు.
“మారాల్సింది సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక్కటేనా? రాజకీయాలు కూడా మారాలి. వేదికలపై భావోద్వేగంతో మాట్లాడాల్సిన అవసరం లేదు. నేటి తరాన్ని అర్థం చేసుకుంటే సమస్య ఏమిటో, పరిష్కారమేమిటో చెబితే ప్రజలకు నమ్మకం కలుగుతుంది” అని ఈ సభకు హాజరైన ప్రజలనుద్దేశించి విజయ్ చెప్పారు.

ఫొటో సోర్స్, PTI


‘అంజలై అమ్మాళ్ మనకు మార్గదర్శి’
అనంతరం పార్టీ విధి విధానాలపై ఆయన మాట్లాడారు.
"హేతువాది పెరియార్ మన పార్టీకి విధాన మార్గదర్శి అవుతారు. కానీ పెరియార్ నాస్తిక సిద్ధాంతాన్ని మాత్రమే మేము అంగీకరించం. ఆ విషయంలో ఒకటే వంశం- ఒకటే దేవుడు అన్న ‘అన్నా’ సూత్రాన్ని పాటిస్తాం. అంటే ప్రతి వ్యక్తి తనకు ఇష్టమైన దైవాన్ని ఆరాధించవచ్చు. మతం విషయంలో పార్టీ జోక్యం చేసుకోదు, అదే సమయంలో పెరియార్ సిద్ధాంతాన్ని ఆచరిస్తూ మహిళా విద్య, మహిళల పురోగతి, సామాజిక సంస్కరణ, సామాజిక న్యాయం హేతుబద్ధమైన ఆలోచనల ఆధారంగా పార్టీ పని చేస్తుంది” అని విజయ్ చెప్పారు.
‘‘మా లక్ష్యం కామరాజ్ లౌకికవాదం, నిజాయితీ పరిపాలన, అంబేడ్కర్ మత ప్రాతినిధ్య సిద్ధాంతాన్ని నిలబెట్టడం, కుల అణచివేతను వ్యతిరేకించడం. వీరమంగై వేలునాచియార్ పార్టీకి సలహాదారుగా ఉంటారు’’ అని విజయ్ ప్రకటించారు.
"మహిళలను విధాన నాయకులుగా అంగీకరించిన మొదటి పార్టీ మనది. అభ్యుదయ సమాజంలో పుట్టి, అభ్యుదయానికి పాటుపడిన అంజలై అమ్మాళ్ మనకు మార్గదర్శి. ఆస్తులు పోగొట్టుకున్నప్పటికీ, అంజలై అమ్మాళ్ స్వాతంత్య్రం కోసం పోరాడారు" అని విజయ్ చెప్పారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విజయ్ విమర్శలు గుప్పించారు.
బీజేపీ విభజన రాజకీయాలు తమ ప్రాథమిక సిద్ధాంతపరమైన శత్రువు అన్న విజయ్, రాష్ట్రాన్ని పాలిస్తున్న డీఎంకే అవినీతికి బాసటగా నిలిచిందని విమర్శించారు.

విధాన శత్రువు, రాజకీయ శత్రువు ఎవరు?
‘పుట్టుకతో అందరూ సమానమే (పిర్‌ప్పోకుం ఎల్లా వియొక్కుం )’ అనే నినాదాన్ని తన పార్టీ నినాదంగా ప్రకటించినప్పుడే తన శత్రువును ప్రకటించుకున్నానని విజయ్ అన్నారు.
కులం, మతం, జాతి, భాష, లింగం, డబ్బు అనే విభజన రాజకీయాలను, భ్రష్టు పట్టిన రాజకీయ సంస్కృతిని ప్రతిఘటిస్తామని చెప్పారు.
“రాజకీయాల్లోకి ఎవరు వచ్చినా, ఒక వర్గం.. వారికి నిర్దిష్టమైన ‘రంగు’ వేసి, ‘ఫాసిజం’ గురించి మాట్లాడుతుంది. ఈ ప్రజావ్యతిరేక పాలనను ద్రవిడ మోడల్ పాలన అంటూ మోసం చేస్తున్నారు” అని విజయ్ ఆరోపించారు.
“తమిళగ వెట్రి కళగం పార్టీకి విభజన రాజకీయ నాయకులు విధానపరమైన శత్రువులు. ద్రవిడ, పెరియార్, అన్నా పేరుతో తమిళనాడును దోచుకుంటున్న కుటుంబ స్వార్థపూరిత వర్గం మన రాజకీయ శత్రువు” అని విజయ్ అన్నారు.
"విధాన సిద్ధాంతంలో ద్రవిడ, తమిళ జాతీయవాదం మధ్య విభజన లేదు, రెండూ మా రెండు కళ్ళు" అని చెప్పారు.
అధికార భాగస్వామ్యమే తన ఎజెండాలో ప్రధానాంశమని విజయ్ అన్నారు. ‘‘2026 అసెంబ్లీ ఎన్నికల్లో మాకే మెజారిటీ వస్తుందని ఆశిస్తున్నాం. మాతో పొత్తు పెట్టుకున్న వారినే అధికారంలో భాగస్వాములను చేస్తాం’’ అన్నారు.

పార్టీ విధానాలు
టీవీకే సిద్ధాంతాలను ఆ పార్టీ కార్యకర్త సంపత్‌కుమార్ చదివి వినిపించారు.
'సర్వ జీవకోటికి' అన్నదే పార్టీ సిద్ధాంతమని, మతం, కుట్రలతో తమిళనాడు ప్రజలను విడదీయకుండా ప్రజలందరి వ్యక్తిగత సామాజిక-ఆర్థిక రాజకీయ హక్కులను పరిరక్షించడం ద్వారా సమతుల్య సమాజాన్ని సృష్టించడమే పార్టీ ధ్యేయమని అన్నారు.
ప్రజల ప్రాథమిక స్వేచ్ఛను హరించేలా పాలనా యంత్రాంగాన్ని, చట్టాన్ని, న్యాయాన్ని, ప్రభుత్వాన్ని దుర్వినియోగం చేస్తున్న రాష్ట్ర పాలకుల ప్రజావ్యతిరేక చర్యలను వ్యతిరేకించడమే పార్టీ విధానమన్నారు.
రిజర్వేషన్ల గురించి మాట్లాడుతూ.. దామాషా రిజర్వేషన్లే నిజమైన సామాజిక న్యాయం అని చెప్పారు.
కుల వివక్ష నిర్మూలన జరిగే వరకు అన్ని రంగాల్లో అన్ని వర్గాలకు దామాషా ప్రాతినిధ్యమే పార్టీ విధానంగా ప్రకటించారు.
మహిళలు, థర్డ్ జెండర్, వికలాంగులకు సమానత్వం కల్పిస్తామని చెప్పారు.
అదే విధంగా రాష్ట్ర స్వయంప్రతిపత్తి హక్కులను పునరుద్ధరించడంతోపాటు తమిళం- ఆంగ్లం ద్విభాషా విధానాన్ని అనుసరించడమే పార్టీ విధానమని అన్నారు.
విజయ్ పార్టీ సదస్సుపై చెన్నైలో పాత్రికేయులతో మాట్లాడిన తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్, విజయ్‌కు అభినందనలు తెలిపారు.
విజయ్ చేసిన విమర్శలు, ఆరోపణలపై డీఎంకే, బీజేపీ సహా ఇతర పార్టీలు ఇంకా స్పందించలేదు.

సభకు భారీ ఏర్పాట్లు
నటుడు విజయ్‌ను చూసేందుకు అభిమానులు, వాలంటీర్లు ఉదయం నుంచే సభా వేదిక వద్దకు చేరుకున్నారు.
విజయ్ స్వయంగా సదస్సు జరిగే స్థలాన్ని సందర్శించి ప్రజలకు అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేశారా లేదా అని పరిశీలించారు.
అభిమానులు కార్యకర్తల కోసం 8 విభాగాల్లో కనీసం 75 వేల సీట్లను ఏర్పాటు చేశారు. ప్లాట్‌ఫాంకు ఇరువైపులా నీటి ట్యాంకులు ఏర్పాటు చేశారు.
ఎలాంటి ప్రమాదం జరగకుండా 3,000 మందికి పైగా పోలీసులతో బందోబస్తు కల్పించారు.
వేదిక వద్ద 700కి పైగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
ఉదయం నుంచి సదస్సుకు వేలాది మంది తరలిరావడంతో మధ్యాహ్నం 12 గంటలకే ఆ స్థలంలో ఉంచిన ట్యాంకుల్లో నీరంతా ఖాళీ అయింది.
వాటర్ బాటిల్ కొనాలన్నా.. వేదిక నుంచి రెండు కిలోమీటర్లు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
చుట్టుపక్కల పెద్ద సంఖ్యలో దుకాణాలు లేకపోవడంతో ఆహార లభ్యత కూడా సమస్యగా మారింది.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)














