లెబనాన్: ‘నేను వాళ్లలాగా హంతకుడిగా మారలేను’ - బిడ్డ కాలిన గాయాలను చూపిస్తూ ఓ తండ్రి ఆవేదన

- రచయిత, ఓర్లా గ్యురెన్
- హోదా, బీబీసీ ప్రతినిధి, బేరూత్ నుంచి
గమనిక: ఈ కథనంలో కలచివేసే అంశాలున్నాయి.
ఇవానా కుటుంబం దక్షిణ లెబనాన్ నుంచి పారిపోవాల్సి ఉంది. అయితే వారు వెళ్లడానికి ముందే ఇజ్రాయెల్ ప్రయోగించిన క్షిపణి ఒకటి అక్కడ విధ్వంసం సృష్టించింది. ఈ దాడిలో రెండేళ్ల చిన్నారి తీవ్రంగా గాయపడ్డారు. శరీరంలో సగానికి పైగా మంట పుట్టేలా, భరించలేనంత నొప్పి పెట్టేలా కాలిన గాయాలు అయ్యాయి. ఆమె తల, చేతులను బ్యాండేజ్‌లు చుట్టేశాయి.
బేరూత్‌లోని గీటౌయి ఆసుపత్రిలో కాలిన గాయాలకు చికిత్స అందించే యూనిట్‌లో బెడ్ మీద పడుకుని ఉంది ఇవానా.
తీవ్రమైన నొప్పితో చిన్నారి విలపిస్తుంటే, ఆమె తండ్రి మొహమ్మద్ ఓదారుస్తూ దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు.
తన కుమార్తె చర్మం, మాంసం ఎలా కరిగిపోయాయో ఆయన గుర్తు చేసుకున్నారు.
2024 సెప్టెంబర్ 23 మధ్యాహ్నం దక్షిణ లెబనాన్ మీద ఇజ్రాయెల్ బాంబు దాడులు మొదలు పెట్టింది.
అప్పుడు మొహమ్మద్ ఉంటున్న ప్రాంతాన్ని ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ ఆర్మీ నుంచి ఎలాంటి ఆదేశాలూ రాలేదు. అయినప్పటికీ వారు ఉంటున్న ప్రాంతానికి దగ్గర్లోనే పేలుళ్లు జరిగాయి.
“మేము వెళ్లిపోవడానికి సిద్ధం అవుతున్నాం. మా సామాన్లన్నీ ప్యాక్ చేసుకుంటున్నాం. ఆ లోపే దాడి జరిగింది” అని మొహమ్మద్ చెప్పారు.
“ఆ దాడి చాలా దగ్గరగా జరిగింది. మా ఇంటికి పది మీటర్ల దూరంలో, మా ఇంటి గేటు ముందు జరిగింది. దాంతో మా ఇల్లంతా ఊగిపోయింది. నా కూతుళ్లు బాల్కనీలో ఆడుకుంటున్నారు. నేను చిన్న పాపను చూశాను. మిస్సైల్ పేలుడు నుంచి వచ్చిన దుమ్ము అంటుకోవడంతో ఆమె అంతా నల్లగా అయిపోయింది. నేను ఆమెను పట్టుకున్నాను. ఇంట్లో కూడా ఏదో పేలింది. ఇంటి పైకప్పు పడిపోతూ కనిపించింది” అని ఆయన వివరించారు.
ఈ సంఘటనలో ఆ కుటుంబం చెల్లా చెదురైంది. దీర్ ఖానౌన్ ఎన్ నహ్ పట్టణంతో ఉన్న అనుబంధం తెంచుకుని వచ్చేసింది. “మేం మా ఇంటిని వదిలేసి వచ్చాం. మాతోపాటు మా ఫోన్లు, 50 డాలర్లు మాత్రమే తెచ్చుకోగలిగాం” అని మొహమ్మద్ చెప్పారు.
సహాయ సిబ్బంది ఇవానాతో పాటు ఆమె అక్క రహాఫ్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఏడేళ్ల రహాఫ్ గాయాలు అంత తీవ్రంగా ఏమీ లేవు.
ఆమెను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసి బంధువుల ఇంటికి పంపించారు.
దాడి జరక్క ముందు తీసిన ఇవానా ఫోటోను మొహమ్మద్ చూపించారు.
ఆ చిత్రంలో ఇవానా తన పెద్ద గోధుమ రంగు కళ్లను పెద్దవి చేసి, గులాబి రంగు పాలపీకను నోట్లో పెట్టుకుని ఉంది. ఆమె రింగుల జుట్టు ముఖంపైకి వాలి ఉంది.
ప్రస్తుతం ఆమె జుట్టు బ్యాండేజ్‌ల కింద కనిపించకుండా పోయింది. ఆమె గాయాలు తగ్గినా, గాయాల వల్ల ఏర్పడిన మచ్చలు మాత్రం ఆమె జీవించినంత కాలం ఆమెతో ఉంటాయి.

ఫోర్త్ డిగ్రీ గాయమైతే ఆ భాగాన్ని తొలగించడమే
ఆమె వేగంగా కోలుకుంటున్నారని డాక్టర్ జెయిద్ స్లేమన్ చెప్పారు. ఆయన ఆ ఆసుపత్రిలో ఉన్న ఇద్దరు ప్లాస్టిక్ సర్జన్లలో ఒకరు.
“ఇవానా చాలా క్యూట్‌గా ఉంటుంది. కామ్‌గా ఉంటుంది. చక్కగా నవ్వుతుంది. గాయాలకు మందు పూస్తున్నప్పుడు కూడా పెద్దగా అరవదు, ఏడవదు. తన చుట్టూ ఉన్న ప్రతి వస్తువునూ చూస్తూ ఉంటుంది. ఆమెకు అన్నీ తెలుసేమో అనిపిస్తుంది. కచ్చితంగా ఆమె చాలా ప్రత్యేకమైనది. ప్రత్యేకమైన బేబీ. ధైర్యవంతురాలు. ధీశాలి” అని డాక్టర్ జెయిద్ చెప్పారు.
కాలిన గాయాలకు చికిత్స అందించే వార్డులో ఉన్న ఇవానాను ఆ వార్డు సిబ్బంది చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు.
బర్న్స్ యూనిట్‌లో 8 గదుల్ని గుండ్రంగా ఏర్పాటు చేశారు. నర్సులు మధ్యలో కూర్చుని అన్ని వైపులా చూస్తుంటారు.
గాయాలతో ఆసుపత్రిలో చేరేందుకు ఇంకా అనేక మంది ఎదురు చూస్తున్నారు.
“రోగులను చేర్చుకోవాలని రోజూ మాకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. మేము అందరినీ ఆసుపత్రిలో చేర్చుకోలేం. ముందుగా చిన్న పిల్లలు, మహిళలు, ఆ తర్వాత తీవ్రంగా గాయాలైనవారు, తీవ్ర ఆందోళనలో ఉన్న వారికి చికిత్స అందించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నాం” అని డాక్టర్ స్లేమన్ చెప్పారు.
ఎక్కువ మంది పేషెంట్లు థర్డ్ డిగ్రీ గాయాలతో వస్తున్నారు.
‘‘ఫోర్త్ డిగ్రీ గాయాలంటే మీకు నల్లటి మాంసం ముద్ద మాత్రమే కనిపిస్తుంది. అంటే చెక్క మాదిరిగా అన్న మాట. అలాంటి గాయాలకు చికిత్స ఏమీ ఉండదు. ఆ శరీర భాగాన్ని తొలగించడమే” అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Goktay Koraltan/BBC
ఆరోగ్య కేంద్రాలపై దాడులు
ఇజ్రాయెల్ దాడులతో లెబనాన్ ఆరోగ్య వ్యవస్థ యుద్ధంలో గాయపడిన బాధితురాలిలా మారింది. 2024 సెప్టెంబర్‌లో లెబనాన్‌లోని ఆరోగ్య కేంద్రాలపై 23 దాడులు జరిగాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. ఈ దాడుల్లో 72 మంది చనిపోయిట్లు వెల్లడైంది.
“ఆసుపత్రుల మీద 55 దాడులు, 201 మంది అత్యవసర వైద్య సేవల టెక్నీషియన్లపై దాడులు జరిగినట్లు” లెబనీస్ ఆరోగ్యశాఖ రికార్డుల్లో నమోదు చేసింది.
“ఆరోగ్య సేవలు, ఆసుపత్రులు, వైద్య వ్యవస్థల మీద దాడులు అంతర్జాతీయ చట్టాలను, జెనీవా ఒప్పందాన్ని దుర్మార్గంగా ఉల్లంఘించడమే” అని లెబనీస్ ఆరోగ్య శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇటీవల బేరూత్‌లో లెబనాన్‌లోనే అతిపెద్ద ఆసుపత్రి రఫీక్ హరీరీ మీద ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసినప్పుడు మేము అక్కడి నుంచి రిపోర్ట్ చేశాం. ఆ దాడిలో కొన్ని పౌర ఆవాసాలు ధ్వంసం అయ్యాయి. 18 మంది చనిపోయారు. వారిలో నలుగురు చిన్నారు. ఈ దాడికి సంబంధించి ఇజ్రాయెల్ సైన్యం ముందుగా ఎలాంటి హెచ్చరికలూ చేయలేదు.
తాము హిజ్బుల్లాను లక్ష్యంగా చేసుకున్నామని, అదొక ‘టెర్రరిస్టు సంస్థ’ అని ఇజ్రాయెల్ భద్రతా బలగాలు బీబీసీకి చెప్పాయి. “హిజ్బుల్లా అంబులెన్సులు, వైద్య సౌకర్యాలను అక్రమంగా వాడుకుంటోంది” అని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. తాము వైద్య సిబ్బందిని లక్ష్యంగా చేసుకున్నామన్న ఆరోపణల్ని ఖండించింది.
బర్న్స్ వార్డులో ఇప్పటికీ 30 మందికి పైగా సిబ్బంది రోజూ పని చేస్తున్నారు. వాళ్లెవరినీ సురక్షిత ప్రాంతాలకు పంపించలేదు. అయితే బేరూత్‌లో ఇప్పుడొక కొత్తరకం సాధారణ పరిస్థితి కనిపిస్తోంది. రాత్రి పూట బాంబు దాడులు, తెల్లవారిన తర్వాత ట్రాఫిక్ జామ్‌లు సాధారణంగా మారాయి. బాంబు దాడుల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు.
‘‘వాస్తవంగా చెప్పాలంటే యుద్ధంలో తగిలిన గాయాలు, కాలిన గాయాలకు చికిత్స చేయడం చాలా కష్టం. ఇక్కడ మా దగ్గర గాయపడిన వారిలో సైనికులు లేరు. బాధితులంతా పౌరులే. అందులో మహిళలు, బాలికలు, చిన్నారులు ఉన్నారు. యుద్ధంతో వారికేం సంబంధం లేదు. డాక్టర్లుగా మేము బలంగా నిలబడాల్సిందే. కానీ మాకు కూడా హృదయం ఉంది. మాకూ పిల్లలున్నారు” అని డాక్టర్ స్లేమన్ అన్నారు.
మేం అక్కడ నుంచి వెళ్లిపోవడానికి ముందు, తన చిన్నారి కుమార్తెను గాయపరిచిన వారి గురించి ఏమైనా చెప్పాలని అనుకుంటున్నారా? అని ఇవానా తండ్రి మొహమ్మద్‌ను అడిగాం. ఆయన మాకు సమాధానం చెప్పేందుకు ఓ క్షణం ఇబ్బందిపడ్డారు. గద్గద స్వరంతో ఇలా చెప్పారు.
“నేను ఆనందంగా లేను. సైనికులు సైనికులతో పోరాడాలి. పౌరులతో కాదు. వీళ్లంతా పిల్లలు, చిన్న బిడ్డలు” అని అంటూనే.. ఇవానా గురించి మాట్లాడుతూ “నాకిదంతా నచ్చలేదు. కానీ నేనేం చేయగలను? నేను వాళ్ల మాదిరిగా హంతకుడిగా మారలేను” అని అన్నారు.

ఫొటో సోర్స్, Family handout
యుద్ధానికి ముగింపు ఎక్కడ?
ఇవానా చర్మం కాలిన దగ్గర, ఆమె తొడ భాగంలో కత్తిరించిన చర్మాన్ని అతికించారు. ఆమెను మరో 10 రోజుల తర్వాత డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది. ఆమె కుటుంబం ఇప్పటికీ రోడ్డు మీదనే ఉంది. వాళ్లిప్పుడు ఉత్తర గాజాలోని వాళ్ల ఇంటికి వెళ్లలేరు. ప్రస్తుతం అక్కడ ఇజ్రాయెల్ భారీగా బాంబు దాడులు చేస్తోంది.
రానున్న రోజుల్లో ఇవానా లాంటి పిల్లలు మరింత మంది ఆసుపత్రికి రావచ్చని డాక్టర్ స్లేమన్ ఆందోళన చెందుతున్నారు.
యుద్ధానికి ముగింపు ఏదీ ఆయనకు కనిపించడం లేదు. ఒక వేళ యుద్ధం ముగిసినా విజేతలు ఎవరూ ఉండరని ఆయన భావిస్తున్నారు.
“యుద్ధంలో విజేతలు ఎవరూ ఉండరు. ప్రతి యుద్ధం అనేక మంది పరాజితులతోనే ముగుస్తుంది. యుద్ధంలో అందరూ నష్టపోవాల్సిందే” అని ఆయన చెప్పారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














