నాగ్‌పూర్‌-‘దృశ్యం’: ప్రియురాలిని చంపి, పాతిపెట్టి దానిపై కాంక్రీట్ నిర్మాణం, ఈ నేరం ఎలా వెలుగులోకి వచ్చింది?

నాగ్‌పూర్, హత్య, నేరాలు, దృశ్యం
    • రచయిత, భాగ్యశ్రీ రౌత్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

‘దృశ్యం’ సినిమా తరహాలో ప్రియురాలిని ఓ ప్రేమికుడు చంపిన ఘటన నాగ్‌పూర్‌లో జరిగింది.

ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్న ఓ యువకుడు తన ప్రియురాలిని హత్య చేసి మృతదేహాన్ని పాతిపెట్టి, సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు కాంక్రీట్‌తో పూడ్చిపెట్టారని పోలీసులు తెలిపారు. నాగ్‌పూర్‌లోని బెల్తరోడి పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

32 ఏళ్ల జ్యోత్స్న ప్రకాష్ ఆక్రే 2024 ఆగస్టు 28 నుంచి కనిపించకుండా పోయారని, ఆమె హత్యకు గురైనట్లు 55 రోజుల తర్వాత తెలిసిందని నాగ్‌పూర్ పోలీసులు చెప్పారు. జ్యోత్స్నను 34 ఏళ్ల అజయ్ వాంఖడే హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు.

బుట్టిబోరి ప్రాంతంలోని రైల్వే ట్రాక్ సమీపంలోని దట్టమైన పొదల్లో జ్యోత్స్న మృతదేహాన్ని పాతిపెట్టినట్లు పోలీసులు తెలిపారు. పెద్ద గొయ్యి తవ్వి మృతదేహాన్ని అక్కడ పడేశారు. ఆ తర్వాత డెడ్‌బాడీపైన ప్లాస్టిక్ వేసి దానిపై రాళ్లు వేసి సిమెంట్ కాంక్రీట్ వేశారు.

పోలీసులు మృతదేహాన్ని తవ్వి తీసి ఫోరెన్సిక్ పరీక్షకు పంపించారు.

నాగ్‌పూర్, హత్య, నేరాలు, దృశ్యం
ఫొటో క్యాప్షన్, నిందితుడు అజయ్ వాంఖడే(ముసుగు కప్పుకున్న వ్యక్తి )ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

హత్యను ఎలా ఛేదించారు?

జ్యోత్స్న ఆక్రే స్వస్థలం కలమేశ్వర్. నాగ్‌పూర్‌లో స్నేహితురాలితో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఎంఐడీసీలోని టీవీఎస్ షోరూంలో పని చేస్తున్నారని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రష్మితారావు చెప్పారు.

ఆగస్టు 28న రాత్రి ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో జ్యోత్స్న ఇంటి నుంచి బయటకు వెళ్లారు. తర్వాతి రోజు తెల్లవారిన తర్వాత కూడా ఆమె తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆమె సోదరుడు రిద్దేశ్వర్ ఆక్రే తన సోదరి తప్పిపోయిందని బెల్తరోడి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

దీంతో బెల్తరోడి పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. దర్యాప్తులో జ్యోత్స్న మొబైల్ ఫోన్ లొకేషన్‌ హైదరాబాద్‌లో లభ్యమైంది.

రెండ్రోజుల తర్వాత కూడా అక్క ఆచూకీ లేకపోవడంతో రిద్దేశ్వర్ మరోసారి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. తన సోదరిని హత్య చేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.

దీంతో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. జ్యోత్స్న మొబైల్‌కి కాల్ చేయగా, దానిని ఒక ట్రక్ డ్రైవర్ తీశారు. తన ట్రక్‌లో మొబైల్ ఫోన్ దొరికిందని డ్రైవర్ చెప్పారు. ట్రక్ డ్రైవర్‌ను స్టేషన్‌కు తీసుకువచ్చిన పోలీసులు ఆయన దగ్గర్నుంచి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.

తర్వాత పోలీసులు జ్యోత్స్న కాల్ రికార్డులను పరిశీలించారు.

‘దృశ్యం’ సినిమాలో హత్య చేసిన వ్యక్తి పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు మొబైల్‌ని ట్రక్కులో పడేసినట్లు చూపిస్తారు. ఇలా చెయ్యడం వల్ల మొబైల్ యజమాని ప్రయాణంలో ఉన్నట్లు కనిపిస్తుంది. నిందితులు కూడా అదే చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

పోలీసులు మొబైల్ ఫోన్‌లోని రికార్డుల్ని పరిశీలించినప్పుడు అజయ్ వాంఖడే, జ్యోత్స్న మధ్య పదే పదే ఫోన్ కాల్స్ జరిగాయని గుర్తించారు. అందులోనే ఇద్దరి మధ్య కొన్ని డబ్బు లావాదేవీలు జరిగాయని తెలుసుకున్నారు.

జ్యోత్స్న ఆఖరి లొకేషన్, నిందితుడి లొకేషన్ కూడా ఒకటేనని తేలింది. దీని ఆధారంగా పోలీసులు బేసా చౌక్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌ను సేకరించారు. అందులో ఓ కారు కనిపించింది. దీంతో పోలీసుల అనుమానాలు మరింత బలపడ్డాయి.

ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత నిందితుడు మధుమేహ వ్యాధికి చికిత్స కోసం పుణెలోని ఓ ఆసుపత్రిలో చేరారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రికి ఫోన్ చేసి ఆ వ్యక్తిని డిశ్చార్జి చేయవద్దని చెప్పారు. అయితే నిందితుడు అప్పటికే ఆసుపత్రి నుంచి పారిపోయారు.

పోలీసులు వెతుకులాట ప్రారంభించడంతో నిందితుడు నాగ్‌పూర్ సెషన్స్ కోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఆయనే నిందితుడని పోలీసులు నిర్థరణకు వచ్చారు. అజయ్ వాంఖడే బెయిల్‌ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.

2024 అక్టోబర్ 18న నిందితుడే స్వయంగా పోలీసుల ఎదుట లొంగిపోయి హత్య చేసినట్లు అంగీకరించారు. పూడ్చిపెట్టిన మృతదేహాన్ని పోలీసులు ఆగస్టు 21న బయటకు తీశారు.

నాగ్‌పూర్, హత్య, నేరాలు, దృశ్యం సినిమా
ఫొటో క్యాప్షన్, మాట్రిమోనీ సైట్ ద్వారా అజయ్ వాంఖడేను కలిశారు జ్యోత్స్న.

జ్యోత్స్నను అజయ్ ఎందుకు హత్య చేశారు?

అజయ్ వాంఖడే నాగ్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ అధికారి కుమారుడు. 12 ఏళ్లుగా ఆర్మీలో ఫార్మసిస్ట్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం నాగాలాండ్‌లో విధులు నిర్వహిస్తున్నారు.

అంతకుముందు రెండు పెళ్లిళ్లు చేసుకుని విడాకులు తీసుకున్నారు. మూడో పెళ్లికి అమ్మాయి కోసం వెతుకుతూ మ్యాట్రిమోనీ సైట్ ద్వారా జ్యోత్స్నను కలిశారు.

జ్యోత్స్న కూడా విడాకులు తీసుకున్నారు. మళ్లీ పెళ్లి చేసుకునేందుకు పెళ్లి కొడుకు కోసం వెతికారు. వీరి పెళ్లి కోసం జ్యోత్స్న ఇంట్లో మీటింగ్ కూడా జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల పెళ్లి చేసుకోలేకపోయారు. ఆ తర్వాత కూడా వీరిద్దరూ టచ్‌లో ఉన్నట్టు కాల్ రికార్డ్‌ల ద్వారా తేలింది.

అజయ్ మూడో పెళ్లి వేరే అమ్మాయితో 2024 మేలో జరిగింది. హత్య జరిగిన రోజు జ్యోత్స్న అజయ్‌తో మాట్లాడారు. ఆయన్ను కలవడానికి ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లారని మొబైల్ లొకేషన్ ద్వారా వెల్లడైంది.

అజయ్‌కు జ్యోత్స్నతో మాత్రమే కాకుండా మరికొందరు అమ్మాయిలతో సంబంధాలున్నాయి. ఆయనకు మరికొందరు స్నేహితురాళ్లు ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది.

నాగ్‌పూర్, హత్య, నేరాలు, దృశ్యం సినిమా
ఫొటో క్యాప్షన్, నిందితుడు బుట్టిబోరి ప్రాంతంలోని రైల్వే ట్రాక్ పక్కన పొదల్లో పూడ్చి పెట్టాడు.

ఈ హత్య ముందస్తు ప్రణాళికతోనే జరిగిందని ఇప్పటి వరకు జరిగిన విచారణలో తేలినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రష్మితారావు తెలిపారు.

నిందితుడు అజయ్ తీవ్ర మధుమేహంతో బాధపడుతున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగితే ఆయనకు మూర్చ వస్తుందని, ఇది విచారణకు ఇబ్బందిగా మారిందని పోలీసులు చెబుతున్నారు.

జ్యోత్స్నను హత్య చేయడానికి ముందు ‘దృశ్యం’ సినిమాని ఎన్నిసార్లు చూశారు? సినిమా చూసి హత్య చేశారా? లాంటి ప్రశ్నలను నిందితుడిని అడుగుతామని పోలీసులు తెలిపారు.

జ్యోత్స్నను హత్య చేసిన తర్వాత గొయ్యి తవ్వి మృతదేహానికి కాంక్రీట్ సిమెంట్‌తో ప్లాస్టరింగ్ చెయ్యడం ద్వారా ఆధారాలు దొరక్కుండా చేసేందుకు నిందితుడు ప్రయత్నించారని పోలీసులు వెల్లడించారు.

అయితే ఈ పనంతా నిందితుడు ఒక్కరే చేశారా లేక ఎవరైనా సహకరించారా అనే కోణంలోనూ బెల్తరోడి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)