కొమ్ముసొర: కత్తిలాంటి పదునైన ముక్కుతో దాడి చేయడంతో మహిళ మృతి, ఈ చేప నిజంగా ప్రమాదకరమా?

కొమ్ము సొర

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కొమ్ముసొర చేపను బొంత చేప అని కూడా అంటారు.
    • రచయిత, అమీ వాకర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఇండోనేషియాలో కొమ్ముసొర చేప (స్వార్డ్ ఫిష్, బొంత చేప) దాడిలో మరణించిన ఇటలీ మహిళకు స్థానికులు నివాళులు అర్పించారు.

ఇటలీలోని టురిన్‌కు చెందిన జూలియా మన్‌ఫ్రిని వయసు 36 ఏళ్లు. గత శుక్రవారం ఆమెపై కొమ్ముసొర చేప దాడి చేసింది.

ఈ ఘటన జరగడానికి ముందు ఆమె ఇండోనేషియాలోని పశ్చిమ సుమత్రా ప్రావిన్స్‌లోని మెంటావై ఐలాండ్స్ రీజెన్సీ దగ్గర సర్ఫింగ్ చేస్తున్నారని మీడియా రిపోర్టులు చెబుతున్నాయి.

కొమ్ముసొర దాడికి గురైన మన్‌ఫ్రినికి ప్రాథమిక చికిత్స అందించేందుకు ప్రయత్నించారని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. అనంతరం ఆమెను ఆసుపత్రికి తరలించారు.

“జూలియాను కాపాడటానికి ఆమె భర్త, స్థానిక రిసార్ట్ సిబ్బంది, వైద్యులు ఎంత ప్రయత్నించినా కాపాడలేకపోయారు” అని మన్‌ఫ్రినితో కలిసి ట్రావెల్ ఏజెన్సీ ఏర్పాటు చేసిన జేమ్స్ కోల్ట్‌సన్ తన ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లో తెలిపారు.

బీబీసీ న్యూస్ తెలుగు, వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

“సర్ఫింగ్ చేస్తుండగా ఇటలీకి చెందిన మహిళ ప్రమాదానికి గురయ్యారని నైరుతి సిబెరుట్ జిల్లా అధిపతి నుంచి మాకు సమాచారం అందింది” అని మెంటావై దీవుల రీజెన్సీ రీజినల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ(బీపీబీడీ) అధ్యక్షులు లాహ్ముడిన్ సిరెగార్ వార్తా సంస్థ ‘అంతరా’కు చెప్పారు.

“మన్‌ఫ్రినిపై కొమ్ముసొర చేప దాడి చేసింది. ఆ క్రమంలో ఆమె ఛాతిలో కుడి వైపున బలంగా ఆ కత్తి ముక్కు గుచ్చుకుంది” అని ఆయన చెప్పారు.

తన మాజీ సహోద్యోగి ఊహించని ప్రమాదానికి గురయ్యారని కోల్ట్‌సన్ అన్నారు.

“తను ఇష్టపడే ప్రదేశంలో, తనకు ఇష్టమైన పని చేస్తున్నప్పుడు ఆమె మరణించింది. మా కంపెనీకి జూలియా ప్రధాన ఆధారం. సర్ఫింగ్ మీద, మంచు మీద, ప్రాణుల మీద ఆమెకున్న ఆసక్తి ఆమెతో పరిచయమున్న అందరికీ గుర్తుండిపోతుంది” అని ఆయన అన్నారు.

“ఆమె మృతి వార్త విని మేం దిగ్భ్రాంతికి గురయ్యాం.” అని ఫాబియో గియులివి అన్నారు. ఈయన మన్‌ఫ్రిని స్వస్థలం వెనారియా రియాలీ పట్టణ మేయర్.

‘సర్ఫింగ్, ట్రావెల్ ఏజెన్సీ’ ఏర్పాటు చేయడం ఆమె కల అని ఆయన గుర్తు చేసుకున్నారు.

స్వార్డ్ ఫిష్‌లు దాడి చేయడం చాలా అరుదని పలు అధ్యయనాల్లో తేలింది. కానీ, వాటిని రెచ్చగొట్టినప్పుడు అత్యంత ప్రమాదకరంగా మారుతాయని కూడా తేలింది.

సర్జరీ, కత్తి ముక్క గల చేప, మృతి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పవర్‌ఫుల్ జంపింగ్స్‌కు స్వార్డ్‌ఫిష్‌లు ప్రసిద్ధి

రెచ్చగొడితే ఇవి అత్యంత ప్రమాదకరం

సైన్స్‌ డైరెక్ట్ వెబ్‌సైట్‌లో పెట్టిన “ఆసియన్ జర్నల్ ఆఫ్ సర్జరీ” ప్రకారం...ఈ కొమ్ము సొర చేప మనషులపై దాడి చేసినట్లు గానీ, ఫలితంగా వారు మృతి చెందారనే ఘటనలు చాలా అరుదుగానే జరిగినట్లు తెలుస్తోంది.

మనుషులపై అకారణంగా ఈ చేపలు దాడి చేసినట్లు రికార్డులు లేకపోయినప్పటికీ, వాటిని రెచ్చగొడితే అవి అత్యంత ప్రమాదకరంగా మారుతాయి. తమ కత్తిలాంటి ముక్కుతో లక్ష్యంపై దాడి చేసేందుకు దూకుతాయి.

ఇందులో ఓ కేసు రిపోర్టును కూడా మెన్షన్ చేశారు. మలేషియాలోని కేదాలో అలోర్ స్టార్ ఆసుపత్రి సర్జరీ అండ్ ఫోరెన్సిక్ డిపార్ట్‌మెంట్స్‌లోని పలువురు వైద్యులు ఈ నివేదిక తయారు చేశారు.

ఆ వివరాల ప్రకారం...‘‘చేపల బోటు నుంచి నీటిలోకి టార్చ్ లైట్ వేయడంతో 39 ఏళ్ల మత్స్యకారుడు కూడా ఇలాగే దాడికి గురయ్యాడు. ఆ చేప అతడిపై దూకి కుడి కన్నును గాయపరిచింది. ఆ వ్యక్తిని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. కుడి కన్నుకు విపరీతమైన వాపు రావడంతో వైద్యపరీక్షలు నిర్వహించి మా ఆసుపత్రికి తీసుకొచ్చారు.’’ అని పేర్కొన్నారు.

‘‘ప్రమాదం జరిగిన 20 గంటల తరువాత ఆయనను మా ఆసుపత్రికి వచ్చారు. అప్పటికే ఆయన కోమాలోకి వెళ్లిపోయారు. వెంటిలేటర్‌ చికిత్స అందించాం. కానీ, ఒకరోజు తరువాత ఆయన మరణించాడు. ఆయన మృతికి ప్రధాన కారణం స్వార్డ్‌‌ఫిష్ దాడేనని పోస్ట్‌మార్టంలో కూడా తేలింది.’’ అని ఆ రిపోర్ట్ వెల్లడించింది.

ఆ మత్య్సకారుడు ఫ్లాష్ లైట్ వేయడంతో ఆ చేప రెచ్చిపోయి ఉంటుంది. కాబట్టి, మత్య్సకారులు నీటిపై ఫ్లాష్ లైట్స్ వేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని ఆ నివేదిక సూచిస్తోంది.

చేపలు, బరువు, మత్య్సకారులు, చేపల వేట

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, స్వార్డ్ షిఫ్‌ల బరువు సుమారు 90 నుంచి 150 కేజీల మధ్యలో ఉంటుంది

కత్తి ఆకారంలో ముక్కు

కొమ్ము సొర చేప ముక్కు నిజమైన కత్తి ఆకారంలో పొడుగ్గా ఉంటుంది. పై దవడ శరీర పొడవులో కనీసం మూడోవంతు ఉంటుంది. చాలా పదునుగా కూడా ఉంటుంది.

ఈ చేపల బరువు సుమారు 90 నుంచి 150 కిలోల మధ్య ఉంటుంది. సముద్రాల్లో దిగువన లేదా తీరానికి దూరంగా ఇవి నివసిస్తాయి.

పవర్‌ఫుల్ జంపింగ్‌కు ఇవి ప్రసిద్ధి. రాత్రిపూట ఆహార వేటలో గడిపే ఈ చేపలు తమ ముక్కుతో చిన్న చిన్న చేపలను వేటాడుతాయి.

2015లోనూ ఇలాంటిదే ఓ ఘటన జరిగింది. హవాయి ద్వీపంలో ఓ వ్యక్తి కొమ్ముసొర చేప దాడిలో మృతి చెందారు.

ఆ వ్యక్తి నీటిలోకి దిగి చేపలను ఈటెతో వేటాడే క్రమంలో ఈ చేప ఆయనపై దాడి చేసినట్లు అప్పట్లో ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.

ప్రమాదానికి గురైన 47 ఏళ్ల రాండి లాయెన్స్‌ను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. అయితే, ఈ దాడిలో ఆయన చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)