కర్నూలు జిల్లాలో దొరికిన ఆ రాయి అంతరిక్షం నుంచే పడిందా?

ఫొటో సోర్స్, UGC
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా జొన్నగిరి ప్రాంతంలో ఒక రాయిని నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎన్‌జీఆర్‌ఐ) శాస్త్రవేత్తలు స్వాధీనం చేసుకున్నారు.
ఆ రాయికి వివిధ రకాల పరీక్షలు చేసిన తర్వాత దానిని ఆకాశం నుంచి పడిన ఉల్కగా గుర్తించామని వారు చెప్పారు.
‘‘ముందు మేం దానిని ఉల్క అనుకోలేదు. అక్కడి రాళ్లలో ఈ రాయి చాలా భిన్నంగా కనిపించింది, దీంతో దానిని తీసుకొచ్చి పరీక్షలు చేశాం. ఉల్కకు ఉండాల్సిన లక్షణాలన్నీ దానికి ఉన్నాయి’’ అని ఎన్‌జీఆర్‌ఐ చీఫ్ సైంటిస్ట్ పీవీ సుందర్ రాజు బీబీసీకి చెప్పారు.


ఫొటో సోర్స్, UGC
ఉల్కలు భూమిపైకి ఎలా వస్తాయి?
అంతరిక్షం నుంచి వేరుపడి, భూగురుత్వాకర్షణకు లోనై కొన్ని ఉల్కలు నేలవైపు దూసుకువస్తుంటాయి. కానీ ఇవి సాధారణంగా భూ వాతావరణంలోకి ప్రవేశించేలోపే మండిపోతుంటాయి. కొన్ని సందర్భాల్లో మాత్రమే అవి భూమికి చేరుతుంటాయి.
అంతరిక్షం నుంచి భూమికి చేరేలోపు జరిగే ప్రయాణంలో చాలా మార్పులకు గురవుతుంటాయని సుందర్ రాజు చెప్పారు.
‘‘భూ వాతావరణంలోకి వచ్చిన తర్వాత ఉల్కల పరిమాణం, వాటి రూపంలో ఎన్నో మార్పులు జరుగుతాయి. కొన్నిసార్లు పెద్దపెద్ద ఉల్కలు చిన్నచిన్న రాళ్లుగా విడిపోతుంటాయి. అవి పడే ప్రదేశాన్ని బట్టి వాటిని గుర్తించడం కష్టమవుతుంది’’ అని ఆయన చెప్పారు.
ఎడారి, మంచు ప్రాంతాల్లో ఉల్కలు పడితే గుర్తించడం సులువుగా ఉంటుందని, అదే నేలపై పడితే ఇతర రాళ్లతో కలిసిపోయి గుర్తించడం కష్టమని చెప్పారు సుందర్ రాజు.

ఫొటో సోర్స్, UGC
‘నల్లటిరాయిని గుర్తించాం’
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా జొన్నగిరి ప్రాంతంలో ఓ నల్లటి రాయిని సుందరరాజు, ఆయన విద్యార్థి లింగరాజు గుర్తించారు.
బంగారు గనులపై విశ్లేషణలో భాగంగా జులైలో సుందర్ రాజు బృందం జొన్నగిరిలో పర్యటించింది.
ఆ సమయంలో జొన్నగిరి ప్రాంతంలో స్థానికులు వజ్రాల కోసం వెతుకుతున్నారని లింగరాజు చెప్పారు.
‘‘సాధారణంగా వర్షాలు పడిన సందర్భంలో జొన్నగిరి సమీప ప్రాంతాల్లో వజ్రాల కోసం స్థానికులు వెతుకుంటారు. మేం వెళ్లిన సమయంలో కొందరు అదే పనిలో ఉన్నారు. మేం సమీపంలోని ఓ పొలంలోకి వెళ్లినప్పుడు ఓ నల్లటి రాయి కనిపించింది. అది దాదాపు 73.36 గ్రాముల బరువుంది’’ అని బీబీసీతో లింగరాజు చెప్పారు.

ఫొటో సోర్స్, UGC
ఉల్కగా ఎలా గుర్తించారంటే..
సాధారణ రాళ్లతో పోల్చితే ఉల్కలో ఉండే మినరల్స్ (ఖనిజాలు) శాతం వేరుగా ఉంటాయి. వాటిని గుర్తించేందుకు కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి.
జొన్నగిరి ప్రాంతంలో దొరికిన రాయిని పరిశోధించి, విశ్లేషించిన తర్వాత ఉల్కగా నిర్ధరించుకున్నట్లు సుందర్ రాజు చెప్పారు .
‘‘మేం మొదట రాయిలో ఆయస్కాంత గుణాన్ని తెలుసుకున్నాం. సాంద్రత (డెన్సిటీ)ను లెక్కించాం. మైక్రోస్కోప్‌లో థిన్ సెక్షన్ (సన్నగా కోసి) విశ్లేషణ చేశాం. విడ్మన్‌స్టాటెన్ తరహా శైలి (ఓ ప్రత్యేకమైన గీతల్లాంటి డిజైన్) కనిపించింది. ఇది ఉల్కలో ఉండే ప్రధాన లక్షణంగా చెప్పవచ్చు. ఎక్సా-డీలో విశ్లేషణ చేసినప్పుడు ఫెలియేట్ అనే మినరల్ ఉన్నట్లు తేలింది. అలాగే అందుబాటులో ఉన్న గత ఉల్కల డేటాతో సరిపోల్చుకున్నాం. ఇలా అన్ని అంశాలనూ పరిశోధించి మాకు దొరికన రాయి ఉల్క అని నిర్ధరించుకున్నాం’’ అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, UGC
రాయిపై పరిశోధన చేసే క్రమంలో దానిలో కార్బన్, నైట్రోజన్, సిలికాన్, ఫాస్ఫరస్, సల్ఫర్, టైటానియం, వెనాడియం, క్రోమియం, మాంగనీస్, ఐరన్, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్ ఉన్నట్లు గుర్తించామని సుందర్ రాజు చెప్పారు.
ఇవన్నీ ఉల్క రాయిలో ఉంటాయని, అలాగే ఉల్కలో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుందని ఆయన అంటున్నారు.

ఫొటో సోర్స్, UGC
‘‘కర్నూలులో మాకు లభించిన ఉల్క ఎప్పుడు పడిందో చెప్పడం కష్టమే. అది చాలా కాలం క్రితం పడిందని అర్థమవుతోంది. దాని వయసును తెలుసుకునేందుకు కెమికల్ అనాలసిస్ చేయాల్సి ఉంటుంది. కానీ, ఉల్కకు కస్టోడియన్‌గా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) ఉంది. అందుకే వారికి అప్పగించాం’’ అని సుందర్ రాజు చెప్పారు.
ఉల్కలు దొరికితే జీఎస్ఐకి ఇవ్వాల్సిందే!
ఉల్కగా పరిగణిస్తున్న రాయిని ఎన్‌జీఆర్ఐ శాస్త్రవేత్త సుందర్ రాజు కోల్‌కతాలోని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ)కు అప్పగించారు. భారత్‌లో ఉల్కలకు నోడల్ ఏజెన్సీగా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఉంటుందని కేంద్ర ప్రభుత్వం 2018లో గెజిట్ జారీ చేసింది.
ఇందుకుగాను నేషనల్ మిటోయోరైట్ రిపాజిటరీ ఆఫ్ ఇండియా అనే మ్యూజియం నిర్వహిస్తోంది జీఎస్ఐ.

ఫొటో సోర్స్, UGC
‘‘మా పరిశోధనలో ఉల్కగా నిర్ధరించుకున్నాక జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు లేఖ రాశాం. వారు ఒక నమూనా పత్రం పంపించి, దాన్ని నింపి, శాంపిల్‌తో పంపించాలని కోరారు. దానికి తగ్గట్టుగా నేను వారికి శాంపిల్‌ను అందించాను’’ అని సుందర్ రాజు చెప్పారు.
జీఎస్ఐ ఏర్పడినప్పట్నుంచి ఇప్పటివరకు భారత్‌లో వివిధ రకాలైన దాదాపు 700 ఉల్కల శిలలను గుర్తించినట్లు జీఎస్ఐ తెలిపింది.
దేశంలో దొరికిన 105 రకాల ఉల్కలు, ప్రపంచవ్యాప్తంగా వివిధ వనరుల నుంచి సేకరించిన 384 ఉల్కలను మ్యూజియంలో పరిరక్షిస్తున్నట్లు జీఎస్ఐ చెబుతోంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














