'లగ్గం' సినిమా రివ్యూ: ఫీల్‌‌గుడ్‌ గా వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది?

సాయి రోనక్, ప్రగ్యా నాగ్రా

ఫొటో సోర్స్, Laggamcinema/INSTA

    • రచయిత, శృంగవరపు రచన
    • హోదా, బీబీసీ కోసం

సాయి రోనక్, ప్రగ్యా నాగ్రాతో జంటగా నటించిన సినిమా ‘లగ్గం The craziest wedding ever’. ట్రైలర్‌తోనే అంచనాలు పెంచుకుని వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం.

బీబీసీ న్యూస్ తెలుగు, వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

కథ ఏంటి?

తెలంగాణ ప్రాంతంలోని ఓ గ్రామంలో తన కూతురుతో ఉంటారు సదానందం. కూతురు పేరు మానస (ప్రగ్యా నాగ్రా). మేనల్లుడు చైతన్య (సాయి రోనక్). అల్లుడికి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఉందని తన కూతురితో లగ్గం ఖాయం చేస్తారు సదానందం.

అనుకోని పరిస్థితుల్లో చైతన్య ఉద్యోగం పోతుంది? ఈ పరిస్థితుల్లో వారి పెళ్ళి జరిగిందా? లేదా? అన్నదే కథ.

రోహిణి, ఎల్‌బి శ్రీరామ్, రచ్చ రవి, ప్రభాస్ శ్రీను

ఫొటో సోర్స్, Laggamcinema/INSTA

ఫొటో క్యాప్షన్, లగ్గం సినిమాలోని నటీ,నటులు

ఎవరు ఎలా చేశారంటే?

సాయి రోనక్ అటు తెలంగాణ యాస, ఇటు సాఫ్ట్‌వేర్ రంగంలో ఉండటం వల్ల వచ్చే సంస్కృతి మార్పు ఈ రెండిట్లోనూ చక్కగా ఇమిడిపోయారు. గ్రామంలో వైద్య సేవలు అందించే పాత్రలో మానస (ప్రగ్యా నాగ్రా )కూడా పల్లెటూరి అమ్మాయి పాత్రలో గొప్పగా నటించారు.

మానస తండ్రి పాత్రలో రాజేంద్రప్రసాద్ తెలంగాణ యాస మాట్లాడుతూ ఫుల్‌లెంగ్త్ రోల్‌లో కనిపించారు. ఫస్టాఫ్‌లో యాస విషయంలో కొంత తడబడినట్టు కనిపించినా, సెకండాఫ్‌లో బాగానే చేశారనిపించింది.

రోహిణి (సుగుణవ్వ) పాత్ర ఈ సినిమాకు గొప్ప ఎమోషనల్ కనెక్షన్ ఉన్న పాత్ర. అమ్మగా, అత్తగా స్క్రీన్ మీద కొన్నిసార్లు కన్నీళ్ళు పెట్టించి, మంచి మార్కులు కొట్టేశారు. సదానందంకి బాబాయి పాత్రలో ఎల్‌బి శ్రీరామ్ కూడా బాగా నటించారు.

చమ్మక్ చంద్ర, రచ్చ రవి, సప్తగిరి, రఘుబాబు, శ్రీకృష్ణుడు అతిథి పాత్రల్లో నటించారు.

ఈ సినిమాలో క్యాస్టింగ్‌ను దర్శకుడు పర్ఫెక్ట్ గా స్క్రీన్ మీద ప్రెజెంట్ చేశారు. అందరి నటన క్లీన్‌గా ఉంది.

లగ్గం సినిమా, టాలీవుడ్, రాజేంద్ర ప్రసాద్

ఫొటో సోర్స్, Laggamcinema/INSTA

పాటలు -సంగీతం :

ఈ సినిమాకు పాటలు ప్లస్ పాయింట్. 'ఉండలేనే 'పాట గ్రామీణ నేపథ్యంలో బావమరదళ్లకు బాల్యం నుంచి ఉన్న జ్ఞాపకాల గురించి చెప్తుంది. లగ్గం పాట తెలంగాణ ప్రాంతంలో పెళ్లిళ్ల గురించి చక్కగా చూపించే పాట.

మేనత్త సుగుణవ్వ పాట జోష్ ఫుల్ పాట. ‘ఇంతేనేమో’ పాట ఆడపిల్ల పెళ్లయ్యాక పుట్టింటి నుంచి అత్తారింటికి వెళ్ళే సమయంలో ఆమె, కుటుంబ సభ్యులు పడే బాధ గురించి చెబుతుంది. పాటలన్నీ సినిమా కథతో ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాయి.

సినిమాలో ఎమోషనల్ సన్నివేశాల్లోనూ, హాస్య సన్నివేశాల్లోనూ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది.

సాంకేతిక అంశాలు :

క్వాలిటీ పరంగా రాజీ పడకుండా తీసిన సినిమా ఇది. ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ బావున్నాయి.

సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు -పెళ్లిళ్లు:

సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలపై ఆకర్షణ సమాజంలో ఎప్పటి నుంచో ఉంది. తమ పిల్లలు సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల్లో స్థిరపడి లక్షల జీతాలు అందుకోవాలని, విదేశాల్లో స్థిరపడాలని కోరుకునే తల్లిదండ్రులు ఎందరో ఉన్నారు. అలాగే తమ ఆడపిల్లలకు పెళ్లి చేసేటప్పుడు సాఫ్ట్‌వేర్ అల్లుళ్లకి ప్రాధాన్యత ఇచ్చే తల్లిదండ్రులు ఉన్నారు. ఈ రెండు కోణాల నుండి తీసిన సినిమా ఇది.

ఈ నేపథ్యంలో ఐదంకెల జీతం కోసం ఆ సాఫ్ట్‌వేర్ ఉద్యోగస్తులు కోల్పోతున్న జీవితాన్ని గురించి చెప్పే సినిమా ఇది. ఈ ఉద్యోగాలు ఎంత అభద్రతా భావాన్ని కలిగిస్తాయో, వాటి వల్ల వైభవాల పేరుతో ఎన్ని ఈఎమ్ఐలలో ఇరుక్కుపోతారో, ఆర్థిక మాంద్యం వంటివి వస్తే ఎంత వారి లైఫ్ ఎలా తలకిందులు అవుతుందో చెప్పే సినిమా ఇది.

ఉద్యోగాన్ని బట్టి వ్యక్తులను అంచనా వేసే ప్రస్తుత సంస్కృతిని పరోక్షంగా ప్రశ్నించే సినిమా కూడా.

ఎమోషనల్, సినిమా, తెలంగాణ యాస

ఫొటో సోర్స్, Laggamcinema/INSTA

ఎమోషనల్ అంశాలు :

ఈ సినిమాలో ఎన్నో ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయి. మేనత్త -మేనకోడళ్ల బంధం, అలాగే బావ -మరదళ్ల మధ్య చెప్పకపోయినా మనసులో ఉండే అనుబంధం గురించి నీట్‌గా చెప్పిన సినిమా ఇది. సంప్రదాయాలు వేరు, ట్రెండ్స్ వేరు అని చెప్తూ.... పెళ్లి ఒక వైభవం కాదు పండుగ అని గుర్తు చేసే సినిమా ఇది.

ప్లస్ పాయింట్స్ :

1)కథ -కథనం

2)పాటలు -సంగీతం

3)నటుల నటన

4)సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్ :

1) సదానందం పాత్ర (రాజేంద్ర ప్రసాద్) కు ఫస్ట్ హాఫ్ లో తెలంగాణ యాస కొంత నప్పకపోవడం

సాఫ్ట్‌వేర్ మోజులో పడి జీవితంలో ఎన్నో అనుభూతులు కోల్పోతూ, ఒత్తిడితో జీవిస్తున్న ఎందరికో... ఉద్యోగం కోసం జీవితంలో బంధాలు వదులుకోవద్దని చెప్పే సినిమా ఇది.

చక్కగా హాస్య ధోరణిలో మొదలయ్యే సినిమా, చివరకు వచ్చేసరికి అనేక సార్లు కళ్లు చెమర్చేలా చేస్తుంది. మొత్తం మీద తల్లిదండ్రులకు దూరంగా ఉండాల్సి వచ్చి, తప్పక ఉంటున్న పిల్లల దుస్థితి గురించి, వారి భవిష్యత్తు కోసం ఒంటరిగా మిగిలిపోయే తల్లిదండ్రుల గురించి ఎమోషనల్‌ టోన్‌లో ఫీల్ గుడ్ సినిమా ఇది.

(గమనిక: ఈ రివ్యూలోని అభిప్రాయాలు సమీక్షకురాలి వ్యక్తిగతం)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)