గ్రహణాలను వెంటాడేవాళ్ళు ఉత్తర అమెరికాకు వచ్చేస్తున్నారు...

ఫొటో సోర్స్, Kate Russo
- రచయిత, నదీన్ యూసిఫ్
- హోదా, బీబీసీ న్యూస్
కేట్ రస్సో 25 సంవత్సరాల క్రితం మొట్టమొదటి సంపూర్ణ సూర్యగ్రహణాన్ని చూశారు. ఆమె ఆస్ట్రేలియాకు చెందిన సైకాలజిస్ట్.
1999లో ఉత్తర ఐర్లాండ్‌లో నివసిస్తున్న రోజుల్లో సూర్యగ్రహణం వ్యక్తిగతంగా చూడాలని కేట్ కోరుకున్నారు. ఆ సమయంలో 20వ పడిలో ఉన్న కేట్ మాస్టర్స్, పీహెచ్‌డీ చదువుతున్నారు.
ఫ్రాన్స్ దక్షిణ తీరం చేరుకొని ఆమె తన మొదటి సంపూర్ణ సూర్యగ్రహణం వీక్షించారు.
"ఇది నా మొదటి, ఏకైక గ్రహణ వీక్షణ అనుభవం అనుకున్నాను" అని కేట్ అప్పటి రోజులను గుర్తుచేసుకున్నారు.
''ఇప్పటివరకు అనుభవించనిది ఎదురైతే చాలా బాగుంటుంది'' అని ఆమె అన్నారు.
ఆ రోజు కేట్ చూసిన దృశ్యం ఆమె జీవితాన్ని మార్చేసింది. అనంతరం ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకునే సూర్యగ్రహణాలను అధ్యయనం చేస్తూ, వాటిని వెంబడిస్తూ ప్రయాణాన్ని ప్రారంభించారామె.
ఈనెల 8న కేట్ తన 14వ సంపూర్ణ సూర్యగ్రహణాన్ని టెక్సాస్‌లోని ఉవాల్డేలో వీక్షించనున్నారు.

ఫొటో సోర్స్, Patrick Poitevin
ఎవరి ప్రయాణం వారిది...
గ్రహణాన్ని చూడటానికి ఇటీవల ఉత్తర అమెరికాకు వచ్చిన చాలామంది ఔత్సాహికుల్లో కేట్ ఒకరు. సంపూర్ణ సూర్యగ్రహణం కనిపించే ప్రాంతానికి లక్షలాదిగా జనం ప్రయాణిస్తారని నిపుణుల అంచనా.
వీరిలో ఖగోళ శాస్త్రం, అన్వేషణ, విజ్ఞాన శాస్త్ర నిపుణులతో పాటు, వారి జీవితకాలంలో వీలైనన్ని ఎక్కువ గ్రహణాలను చూడటానికి కేటాయించిన వ్యక్తులు ఉంటారు.
కొందరు అంతరిక్ష ప్రేమ, చుట్టూ ఉన్న విశ్వాన్ని అర్థం చేసుకోవాలనే కోరికతో నడుస్తారు. కేట్ వంటి వాళ్లు సంపూర్ణ సూర్యగ్రహణాన్ని వ్యక్తిగతంగా చూసి, గొప్ప అనుభూతిని పొందడానికి ప్రయాణిస్తారు.
51 ఏళ్ల కేట్ చంద్రుని నీడలో మొదటిసారి ఎలా నిలబడ్డారో గుర్తుచేసుకుంటూ అప్పటి భావోద్వేగాన్ని అనుభవించారు.

సూర్యుడికి, భూమికి మధ్యలో చంద్రుడు వచ్చినప్పుడు, భూమిపై ఉన్న ప్రజలకు సూర్యుడు పూర్తిగా లేదా పాక్షికంగా కనిపించకపోవడమే ఈ సూర్య గ్రహణం.
ఇలా సూర్యుడిని చంద్రుడు కప్పి ఉంచే కాలాన్ని గ్రహణ సమయమని అంటారు.
ఆ క్షణాలను అనుభవించడం బాగుంటుందని కేట్ అంటున్నారు. తుఫాను సమీపిస్తున్నట్లుగా గాలి తన చుట్టూ తిరుగుతున్నట్లు, ఉష్ణోగ్రత తగ్గుతున్నట్లు అనిపిస్తుందని ఆమె వివరించారు.
సూర్య కిరణాలు కనిపించని ఆ క్షణాన క్షితిజరేఖ చుట్టూ నారింజ, ఎర్రటి మెరుపు, ఆకాశంలో కాంతి వలయం మినహా తన చుట్టూ రంగులు మాయమైనట్లు గమనించానని కేట్ చెబుతున్నారు.
"సూర్యుడు ఉండాల్సిన చోట ఆ క్షణాల్లో ఆకాశంలో ఒక రంధ్రం కనిపిస్తుంది. ఆ కాసేపు అంతా తలకిందులైనట్లు ఉంటుంది" అని ఆమె అన్నారు.
సంపూర్ణ సూర్యగ్రహణాన్ని చూస్తుండగా ప్రజలకు కలిగే భావోద్వేగ ప్రతిస్పందనలు తనను అధ్యయనం చేసేలా ప్రేరేపించాయని కేట్ గుర్తుచేసుకున్నారు.
ఎక్కువ సైంటిఫిక్ ఆలోచన ఉన్నవారు కూడా గ్రహణాన్ని విస్మయంతో చూడటం గమనించానని ఆమె అన్నారు.
"సంస్కృతి, భాషతో సంబంధం లేకుండా ప్రజలు ఆ అనుభవం పొందుతారు" అని కేట్ వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
అంత ఎమోషనల్ ఎలా చేయగలుగుతోంది: ఎక్లిప్స్ ఛేజర్ డేవిడ్
కెనడాలోని టొరంటోకు చెందిన మరో గ్రహణ వీక్షకుడు డేవిడ్ మేక్‌పీస్‌కి దీని గురించి బాగా తెలుసు.
డేవిడ్ వయసు 61 ఏళ్లు, ఇది ఆయనకు 19వ సూర్యగ్రహణ వీక్షణ. ఈ అనుభవం తనలో అస్తిత్వ ప్రశ్నలను రేకెత్తిస్తుందని అంటున్నారు.
"ఇంత అందమైన సౌర వ్యవస్థలో మనం ఎలా ఉంటున్నాం? అది మనల్ని ఎలా ఇంతలా ఉద్వేగానికి గురి చేయగలుగుతోంది? ఇదంతా ఎలా సాధ్యం?" అని డేవిడ్ ఆశ్చర్యపోతున్నారు.
ఇదొక వ్యసనం: నాసా రిటైర్డ్ డేటా అనలిస్ట్
గ్రహణాన్ని వెంబడించాలనే కోరిక ఒక రకమైన వ్యసనమని 76 ఏళ్ల రిటైర్డ్ డేటా అనలిస్ట్, ఫ్లైట్ కంట్రోల్ స్పెషలిస్ట్ పాల్ మాలే అంటున్నారు. పాల్ మాలే నాసాలో 41 సంవత్సరాల పాటు పనిచేశారు.
"మీరు ఒకసారి ఇలాంటి ప్రత్యేకమైనదాన్ని చూస్తే, మీరు ఇంకా కోరుకుంటారు" అని మాలే అన్నారు.
మాలే అరిజోనాలో ఉంటున్నారు. 1970 నుంచి ఆయన 42 దేశాల్లో 83 గ్రహణాలను చూశారు. వీటిలో పాక్షిక, సంపూర్ణ సూర్యగ్రహణాలున్నాయి.
తనలాగే డజన్ల కొద్దీ వ్యక్తులు ఆ గ్రహణాలను చూడటానికి ప్రయాణిస్తారని తెలుసుకున్న ఆయన ఓ టూరిజం కంపెనీ కూడా ప్రారంభించారు.
తన కస్టమర్లలో కొందరు అనుభవజ్ఞులని, మరికొందరు తొలి గ్రహణం చూడటానికి ప్రయాణిస్తున్నారని మాలే చెప్పారు.
ఏప్రిల్ 8న గ్రహణం సంభవించనుండటంతో మెక్సికోలోని కాబో శాన్ లూకాస్ తీరంలో మాలే 200 మంది ప్రయాణికులతో బోట్ క్రూయిజ్ సైతం ప్రారంభించారు.
అలా నీటిపై ఉండి గ్రహణం చూస్తే అద్భుతంగా ఉంటుందని మాలే అంటున్నారు.
మొదటి సారి చూసే వారికి సూచన ఇదే..
బ్రిటీష్ 'ఎక్లిప్స్ ఛేజర్' అయిన రిటైర్డ్ మెటీరియల్ సైంటిస్ట్ పాట్రిక్ పోయిటెవిన్ కూడా మెక్సికో వెళుతున్నారు.
ఆయనకిది 26వ సంపూర్ణ సూర్యగ్రహణ వీక్షణ. పొయిటెవిన్ డెర్బీషైర్‌లో నివసిస్తారు.
శాస్త్రీయ ఆవిష్కరణలు, ఖగోళ శాస్త్రాలపై తనకున్న ప్రేమతో గ్రహణ వీక్షణకు ప్రయాణిస్తుంటానని ఆయన తెలిపారు.
ఒక జత బైనాక్యులర్‌తో కూర్చొని, రాబోయే గ్రహణం చూడాలని భావిస్తున్నట్లు పోయిటెవిన్ చెప్పారు.
మెక్సికోలో ఈ ప్రత్యేక గ్రహణం నాలుగున్నర నిమిషాలపాటు ఉంటుందని, ఆ సమయంలో బహుశా కొన్ని గ్రహాలు, నక్షత్రాలు, ఒక తోకచుక్కను కూడా గుర్తించవచ్చని ఆయన అన్నారు.
ఈ సంవత్సరం ఎవరైతే వారి మొట్టమొదటి సూర్యగ్రహణాన్ని చూడాలనుకుంటున్నారో వాళ్లు కెమెరాను దూరంగా ఉంచి, ఆ క్షణాన్ని ఆస్వాదించాలని అనుభవజ్ఞులైన ఛేజర్స్ సూచిస్తున్నారు.
కెమెరా లేదా ఫోన్లతో రికార్డు చేస్తే వారికి ఆ వీక్షణ అనుభవాన్ని తగ్గిస్తుందని డేవిడ్ చెప్పారు.
అది ''ప్రపంచంలో అత్యుత్తమమైన ఘటన మీ ముందు జరుగుతున్నప్పుడు, మీరు వేరే పనిలో బిజీగా ఉండటం'' వంటిదని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఈ కల్పిత సముద్రం మాల్దీవుల పర్యాటక ఆకర్షణగా ఎలా మారింది?
- జర్మనీకి 20 వేల ఏనుగులను పంపిస్తామని బోట్స్వానా ఎందుకు హెచ్చరించింది?
- చక్కెర కన్నా బెల్లం మంచిదా?
- మనిషికి పంది కిడ్నీ: ఈ సర్జరీ చేయించుకున్న రిక్ ఇప్పుడు ఎలా ఉన్నారు?
- ఐపీఎల్: హార్దిక్ పాండ్యాపై అభిమానుల హేళనలు ప్రశంసలుగా మారుతాయా? ఈ పరిస్థితిని ఆయనే కొనితెచ్చుకున్నారా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














