ఇజ్రాయెల్ ఆర్మీ: ‘మా విమానాలు ఇరాన్‌పై దాడి చేసి తిరిగొచ్చాయి’

ఫొటో సోర్స్, Reuters
ఇరాన్ సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్ సైన్యం(ఐడీఎఫ్) తాజాగా చేపట్టిన దాడులు పూర్తయ్యాయి.
‘‘ఇరాన్‌లోని చాలా ప్రాంతాల్లో చేపట్టిన లక్షిత దాడులను సైన్యం పూర్తి చేసింది. ప్రస్తుతం మా యుద్ధ విమానాలు సురక్షితంగా స్వదేశానికి తిరిగి వచ్చాయి’’ అని ఐడీఎఫ్ ప్రకటించింది.
అంతకుముందు, ఇరాన్‌లోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులు ప్రారంభించినట్లు ఇజ్రాయెల్ మిలటరీ ప్రకటించింది.
ఇరాన్ రాజధాని తెహ్రాన్‌లో బాంబు దాడుల శబ్దాలు వినిపించినట్లు తమకు రిపోర్టులు వచ్చాయని ప్రభుత్వ మీడియా వెల్లడించింది.
ఇరాన్ సైనిక స్థావరాలలో కొన్ని కచ్చితమైన లక్ష్యాలను గురిపెట్టి తాము దాడులు చేశామని ఇజ్రాయెల్ సైన్యం అంతకుముందు చెప్పింది.
‘‘ప్రపంచంలోని ఇతర సార్వభౌమత్వ దేశాల మాదిరిగానే, ఇజ్రాయెల్‌కు కూడా స్పందించే హక్కు, బాధ్యత ఉంది. 2023 అక్టోబర్ 7 నుంచి ఇరాన్, ఆ ప్రాంతంలోని దాని మిత్ర దేశాలు ఇజ్రాయెల్‌పై నిరంతరం భీకర దాడులు చేస్తున్నాయి’’ అని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) అధికార ప్రతినిధి డేనియల్ హగారీ పేర్కొన్నారు.


ఇరాన్ తమపై ఇటీవల చేసిన దాడులకు ప్రతిగా తాము ఈ దాడులను చేశామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.
‘‘ఇజ్రాయెల్ ప్రజలు, దేశం కోసం మేం చేయాల్సిందంతా చేస్తాం’’ అని సైన్యం ప్రకటించింది.
ఆత్మ రక్షణలో భాగంగా ఇరాన్‌లో ఇజ్రాయెల్ దాడులు చేస్తుందని అంతకుముందు అమెరికా కూడా ప్రకటించింది.
‘‘అక్టోబర్ 1న ఇజ్రాయెల్‌పై ఇరాన్ చేసిన బాలిస్టిక్ క్షిపణి దాడికి ప్రతిగా ఆత్మ రక్షణ కోసం ఇరాన్‌లోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ లక్షిత దాడులు ప్రారంభించిందని మాకు అర్థమైంది’’ అని బీబీసీ యూఎస్ న్యూస్ పార్టనర్ సీబీఎస్‌కి అమెరికా నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అధికార ప్రతినిధి తెలిపారు.

ఫొటో సోర్స్, @IDF
అయితే, ఇరాన్ సైనిక స్థావరాలలో ఏయే ప్రాంతాలపై ఇజ్రాయెల్ దాడులు చేసిందో ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.
ఏఎఫ్‌పీ వార్తా సంస్థ చెప్పిన వివరాల ప్రకారం, ఇరాన్ రాజధాని తెహ్రాన్‌లో రెండు విమానాశ్రయాలు మామూలుగానే కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి.
ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడి పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు.
సిరియా రాజధాని డమాస్కస్‌లో కూడా దాడుల శబ్దాలు వినబడినట్లు సిరియా ప్రభుత్వ టీవీని ఉటంకిస్తూ రాయిటర్స్ , ఏఎఫ్‌పీ వార్తా సంస్థలు తెలిపాయి.

ఫొటో సోర్స్, Reuters
నెల క్రితం ఇజ్రాయెల్ మీద ఇరాన్ దాడి
ఈ ఏడాది అక్టోబర్ 1 అర్ధరాత్రి 180కి పైగా క్షిపణులను ఇజ్రాయెల్ మీదికి ప్రయోగించింది ఇరాన్. ఈ సంవత్సరం ఇజ్రాయెల్ మీద ఇరాన్ చేసిన రెండో దాడి అది.
ఏప్రిల్‌లో కూడా వందకు పైగా క్షిపణులను ఇజ్రాయెల్ మీదికి ప్రయోగించింది ఇరాన్.
ఆ దాడుల సమయంలో ఇజ్రాయెల్ తన వద్దనున్న అన్ని రకాల మిసైల్ నిరోధక వ్యవస్థలను ఉపయోగించింది.
ఇరాన్ దాడులకు ప్రతి చర్య తప్పదని అప్పుడే ఐడీఎఫ్ అధికార ప్రతినిధి డేనియల్ హాగారీ అన్నారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














