‘హమాస్ మాజీ అధినేత యాహ్యా సిన్వార్‌ చనిపోయింది మా ఇంట్లోనే, అది చూసి షాక్‌ అయ్యాను’ - గాజా వాసి

హమాస్ మాజీ అధినేత యాహ్యా సిన్వార్‌

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, అలి అబ్బాస్ అహ్మది, మార్వ నాసెర్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

హమాస్ మాజీ అధినేత యాహ్యా సిన్వార్‌ చనిపోయిన ఇల్లు తమదేనని గాజాకు చెందిన ఒక నిర్వాసిత పాలస్తీనియన్ చెప్పారు. తాము 15 ఏళ్లపాటు ఆ ఇంట్లోనే ఉన్నామని, యుద్ధం కారణంగా ఈ ఏడాది మే నెలలోనే ఆ ఇంటిని వదిలి వచ్చామని ఆయన తెలిపారు.

ఇజ్రాయెల్ డ్రోన్ ఫుటేజీలో పాక్షికంగా దెబ్బతిన్న భవనాన్ని చూసిన అష్రఫ్ అబో తాహా అనే వ్యక్తి, అది తన ఇల్లేనని గుర్తించారు. ఈ ఇల్లు దక్షిణ గాజాలోని రఫాలో ఇబ్న్ సేనా వీధిలో ఉంది.

ఈ డ్రోన్ ఫుటేజీ చూసిన తర్వాత తాము చాలా షాక్‌కు గురయ్యామని అష్రఫ్ చెప్పారు.

2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన మెరుపుదాడుల ప్రధాన సూత్రధారి అయిన యాహ్యా సిన్వార్‌ 2024 అక్టోబర్ 16 (బుధవారం)న తమ దాడిలో చనిపోయారని ఇజ్రాయెల్ వెల్లడించింది.

యాహ్యా సిన్వార్‌ చనిపోవడానికి ముందు పాక్షికంగా దెబ్బతిన్న ఇంట్లో ఉన్నప్పుడు డ్రోన్‌తో చిత్రీకరించిన వీడియోను ఇజ్రాయెల్ సైన్యం విడుదల చేసింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

హమాస్ ఫైటర్లకు వ్యతిరేకంగా జరుపుతున్న ఆపరేషన్‌లో, దక్షిణ గాజాలోని ప్రజలు తమ ఇళ్లను విడిచిపెట్టి వెళ్లాలని మే నెలలో ఇజ్రాయెల్ ఆదేశాలు జారీ చేసింది.

ఆ ఆదేశాల తర్వాత మే 6 రఫాలో ఉన్న తమ ఇంటిని వదిలిపెట్టి ఖాన్ యూనిస్‌కు వెళ్లిపోయామని బీబీసీ అరబిక్‌కు చెప్పారు అష్రఫ్.

అప్పటి నుంచి తన ఇంటికి సంబంధించిన ఎలాంటి వార్త తనకు తెలియలేదన్నారు.

సోషల్ మీడియాలో సిన్వార్ చివరి క్షణాలకు సంబంధించిన వీడియో ఫుటేజీని తొలుత తన కూతురు చూపించిందని, ఆ భవనం తమ ఇల్లు మాదిరిగానే ఉందని చెప్పిందన్నారు.

కూతురు చెబుతున్న మాటలను తొలుత తాను నమ్మలేదని, కానీ, తన సోదరుడు కూడా ఆ ఇల్లు తమదేనని చెప్పిన తర్వాత గుర్తుపట్టినట్లు ఆయన వివరించారు.

అబో తాహా ఇల్లు

ఫొటో సోర్స్, Ashraf Abo Taha

ఫొటో క్యాప్షన్, అష్రఫ్ అబో తాహా ఇల్లు (పాత చిత్రం)

‘అమ్మ కొన్న వస్తువులు నాకు చాలా విలువైనవి’

‘‘అవును ఇది మా ఇల్లే. నేను ఫోటోలు చూశాను. అవి చూసి చాలా షాక్‌కి గురయ్యాను’’ అని అష్రఫ్ అబో తాహా చెప్పారు.

సిన్వార్ ఎందుకు అక్కడ ఉన్నారో, ఇజ్రాయెల్ సైన్యానికి ఎలా దొరికిపోయారో తనకు తెలియదన్నారు.

అష్రఫ్ చూపించిన ఇంటి ఫోటోలు, వీడియోలను సిన్వార్ చనిపోయిన ఇంటి ఫోటోలను బీబీసీ వెరిఫై బృందం పరిశీలించింది. ఆ రెండు భవనాలూ ఒకేలా ఉన్నాయి.

అయితే, ఈ ఇల్లు అష్రఫ్ సొంత ఇల్లేనా? అనే విషయాన్ని మాత్రం బీబీసీ స్వతంత్రంగా వెరిఫై చేయలేదు.

సిన్వార్ కనిపిస్తున్న ఫుటేజీని బీబీసీ పరిశీలించింది. ఆయన చివరిసారి కనిపించిన ఇల్లు, ఇజ్రాయెల్ దాడులతో స్థానికంగా పాక్షికంగా ధ్వంసమైన పలు భవంతుల్లో ఒకటి.

ఇజ్రాయెల్ భద్రత బలగాలు

ఫొటో సోర్స్, IDF

మే నెలలో రఫాలో ఇజ్రాయెల్ చేపట్టిన దాడులపై అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు వచ్చాయని యూఎన్ చెప్పింది. పది లక్షల మందికి పైగా పాలస్తీనియన్లు ఆ ప్రాంతాన్ని వీడి వేరే ప్రాంతానికి వెళ్లాల్సి వచ్చిందని పేర్కొంది.

రఫాలో తాను తోబుట్టువుల సాయంతో ఈ ఇల్లు కట్టుకున్నట్లు అష్రఫ్ అబో తాహా చెప్పారు. ఈ ఇంటి కోసం 41,400 పౌండ్లు అంటే దాదాపు రూ.45 లక్షలు ఖర్చు పెట్టామన్నారు. తాము ఆ ఇంటిని వదిలిపెట్టినప్పుడు అది బాగానే ఉందన్నారు.

ఇంటిని వీడి వస్తున్నప్పుడు చూసిన సోఫాలు, మిగిలిన వస్తువులను ఆయన గుర్తుచేసుకున్నారు.

ఆ ఇంట్లో తమకు చాలా జ్ఞాపకాలున్నాయని, వస్తువుల్లో కొన్నింటిని తన తల్లి కొన్నారని అష్రఫ్ అబో తాహా చెప్పారు. అవి తనకు చాలా విలువైనవని అన్నారు.

‘‘జరిగింది నన్ను చాలా బాధకు గురి చేసింది. నేను కట్టుకున్న ఇల్లు, డబ్బు అంతా శిథిలమైపోయింది. కేవలం భగవంతుడు మాత్రమే ఆ నష్టాన్ని పూరించగలడు’’ అని ఆయన అన్నారు.

ఇజ్రాయెల్ దాడులు

ఫొటో సోర్స్, Reuters

ఉత్తర గాజాలో 73 మంది మృతి

సోఫియా ఫెరీరా శాంటోస్

బీబీసీ న్యూస్

ఉత్తర గాజాలోని బిట్ లాహియా నగరంలో ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో మహిళలు, చిన్నారులు సహా 73 మంది మరణించినట్లు గాజా స్ట్రిప్‌లోని హమాస్‌ అధికారులు తెలిపారు.

శనివారం రాత్రి ఇజ్రాయెల్ జరిపిన బాంబు దాడితో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారని, చాలా మంది ఇంకా శిథిలాల కిందనే చిక్కుకుని ఉన్నారని హమాస్ తెలిపింది.

ప్రజలు ఎక్కువగా ఉండే నివాస ప్రాంతాలపై బాంబు దాడులు జరిగాయని హమాస్ ప్రభుత్వ మీడియా కార్యాలయం పేర్కొంది.

ఈ దాడులతో 73 మంది మరణించినట్లు గాజాలోని సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ తెలిపింది. అయితే, ఈ మరణాల సంఖ్యను బీబీసీ స్వతంత్రంగా వెరిఫై చేయలేదు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)