ఆ ఆసుపత్రిలోని రోగులందరూ బీజేపీ సభ్యులయ్యారు, అసలేం జరిగిందంటే..

ఫొటో సోర్స్, BIPIN TANKARIYA
- రచయిత, భార్గవ పారిఖ్
- హోదా, బీబీసీ గుజరాతీ కోసం
“నేను రిటైరయ్యాను. కంటి శుక్లంఆపరేషన్ చేయించుకున్నాను. ఆపరేషన్ పూర్తయ్యాక రాత్రి రోగులందరం కళ్లలో మెడిసిన్ వేసుకుని పడుకున్నాం. ఆ సమయంలో ఓ సోదరుడు వచ్చి మా వద్ద ఉన్న ఫోన్లు తీసుకున్నాడు. అందులో వచ్చిన ఓటీపీలను నమోదు చేసుకున్నాడు. అతడు మా ఫోన్లు తీసుకుని అక్కడున్న రోగులందరినీ బీజేపీ సభ్యులుగా మార్చాడని ఆ తరువాత మాకు అర్ధమైంది” అని కమలేశ్ తుమ్మర్ చెప్పారు.
ఆయన జునాగఢ్‌లోని ఖలీల్‌పూర్‌కు చెందినవారు. రాజ్‌కోట్‌లోని రాంచోడ్ దాస్ బాపు ట్రస్ట్ ఆసుపత్రిలో కేటరాక్ట్ ఆపరేషన్‌కు వచ్చిన మనుభాయ్ పటేల్‌కూ ఇలాంటి అనుభవమే ఎదురైంది.
“ఓ సోదరుడు మా దగ్గరికి వచ్చాడు. మా ఫోన్లు తీసుకుని ఏదో చేశాడు. ఆ సమయంలో మా కళ్లలో మెడిసిన్ ఉండటంతో మాకేమీ కనిపించలేదు. నా పక్క బెడ్‌పై ఉన్న కమలేష్‌కు నా ఫోన్‌లో వచ్చిన మెసేజ్ ఏమిటని అడిగా. నువ్వు బీజేపీ సభ్యుడవయ్యాని మెసేజ్ వచ్చిందని చెప్పారు” అని మనుభాయి పటేల్ బీబీసీకి తెలిపారు.
ఈయనతో పాటు చాలా మందిని బీజేపీ సభ్యులుగా ఆ పార్టీ కార్యకర్తలు మార్చారని కమలేష్ చెప్పారు.
ఇదే కాదు, గతంలోనూ గుజరాత్‌లో బీజేపీ సభ్యత్వ నమోదుపై పలు వివాదాలు వెలుగులోకి వచ్చాయి.


ఫొటో సోర్స్, SOCIALMEDIA
అసలేం జరిగింది?
రాజ్‌కోట్‌లోని రాంచోడ్‌దాస్ ట్రస్ట్ ఆసుపత్రిలో కంటి శుక్లాల ఆపరేషన్లు జరిగాయి. అయితే, అక్కడి రోగులు ఈ ఆసుపత్రిలో తమను బీజేపీ సభ్యులుగా మార్చారని చెప్పారు.
దీనికి సంబంధించి ఓ రోగి తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఓ వ్యక్తి రోగితో మాట్లాడుతున్నాడు. ఆయనను బీజేపీ కార్యకర్తగా అక్కడున్న వారు చెబుతున్నారు.
“నాకు కంటిలో శుక్లాలు ఏర్పడటంతో ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చింది. అప్పట్లో జునాగఢ్‌లో త్రిమూర్తి ఆసుపత్రిలో కంటికి సంబంధించి మెడికల్ క్యాంపు నిర్వహించారు. రాజ్‌కోట్‌లోని రాంచోడ్‌దాస్ బాపు ట్రస్ట్ ఆసుపత్రిలో కంటి శుక్లాల ఆపరేషన్ మంచిగా చేస్తారని అక్కడికి వచ్చిన చాలా మంది చెప్పడంతో రాజ్‌కోట్‌కు వచ్చాను. ఇక్కడ ఆపరేషన్ చక్కగానే జరిగింది”అని కమలేష్ ఫోన్‌లో బీబీసీకి వివరించారు.
“నాకు కచ్చితంగా తేదీ గుర్తులేదు గానీ, ఆపరేషన్ అయిపోయిన తరువాత మా కళ్లలో మెడిసిన్ వేయడంతో మేం కళ్లు మూసుకుని పడుకున్నాం. అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఓ యువకుడు అక్కడకు వచ్చాడు. అక్కడ ఉన్నవాళ్లను నిద్రలేపి ఫోన్లు అడిగాడు. ఆ ఫోన్‌లో ఏదో చేయడంతో ఓటీపీ వచ్చింది. దానిని ఎంటర్ చేశాడు. దీంతో, మేం బీజేపీ సభ్యత్వాన్ని తీసుకున్నట్లైంది” అని కమలేశ్ తెలిపారు.
“నేను స్వతహాగా బీజేపీ సభ్యుడినే. కానీ, ఒక ఒకరి అనుమతి లేకుండా, వారికి తెలియకుండా సభ్యత్వం నమోదు చేయడం సరికాదు. నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావ్? ఆ వ్యక్తిని అడగ్గా, పై వాళ్లు ఆదేశించారని ఆ యువకుడు చెప్పడంతో నేను వీడియో రికార్డ్ చేశాను” అని కమలేష్ తెలిపారు.
“కచ్చితంగా ఎంత మందిని బీజేపీ సభ్యులుగా నమోదు చేయించారనేది తెలియదు. కానీ అక్కడ దాదాపు 200 మంది రోగుల దగ్గర ఫోన్లు ఉన్నారు. అందరినీ సభ్యులుగా చేసి ఉండొచ్చు” అని కమలేష్ తెలిపారు.
“నాకు రాజకీయాలంటే పెద్దగా ఆసక్తి ఉండదు. అందుకే ఆ మెసేజ్‌లు కూడా డిలీట్ చేశాను. ‘దరి’ ప్రాంతం నుంచి వాళ్లు ఈ సభ్యత్వ నమోదుకు పాల్పడి ఉంటారని నాకు అనుమానంగా ఉంది” అని మనుభాయి పటేల్ బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, BIPIN TANKARIYA
‘విచారణ జరుపుతాం’
“ఎన్నో ఏళ్లుగా ఈ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. గుజరాత్‌లోని వివిధ ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు, ఉచిత కంటి ఆపరేషన్లు వంటివి చేస్తోంది. ట్రస్ట్ తమ డబ్బులతో రోగులను రాజ్‌కోట్‌కు తీసుకువస్తుంది. ఇక్కడ అన్ని రకాల సేవలు ఉచితంగానే లభిస్తాయి. ఈ ట్రస్ట్ ఇప్పటి వరకు వివాదాల్లో చిక్కుకోలేదు” అని శాంతిభాయ్ వడోలియా చెప్పారు. ఈయన రాజ్‌కోట్‌లోని రాంచోదాస్ బాపు ట్రస్ట్ ధర్మకర్త.
“ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ విషయం మాకు తెలిసింది. దీనిపై ఆసుపత్రి సూపరిండెంట్ నుంచి వివరణ తీసుకున్నాం. ఆ వీడియోలో కనిపించే వ్యక్తి అక్కడున్న రోగులలో ఒకరికి సంబంధించిన బంధువని మా ప్రాథమిక విచారణలో తేలింది” అని శాంతిభాయ్ చెప్పారు.
“ఆసుపత్రిలోని అన్ని సీసీటీవీలను నిశితంగా పరిశీలిస్తున్నాం. ఒకవేళ ఈ విషయంలో ట్రస్ట్ లేదా ఆసుపత్రికి సంబంధించిన వాళ్ల ప్రమేయం ఉంటే, కచ్చితంగా వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. తద్వారా ట్రస్ట్ సభ్యులు ఇలాంటి వివాదాలకు దూరంగా ఉంటారు” అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, @BJP4Gujarat
బీజేపీ ఏమంటోంది..?
రోగులకు తెలియకుండా వారికి పార్టీలో సభ్యత్వం కల్పించారనే వివాదంపై బీజేపీ వివరణ కోసం ఆ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి యమల్ వ్యాస్‌ను బీబీసీ సంప్రదించింది.
ఎవరైనా అత్యుత్సాహంతో ఇలాంటి పని చేసి ఉంటే, దానిపై విచారణ జరిపై పార్టీలో అంతర్గతంగా అతడిపై చర్యలు తీసుకుంటాం. ఇలాంటి ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోమని పార్టీ ఆదేశాలు ఇచ్చిందని ఆయన చెప్పారు.
“గతంలో, భవనగర్‌లో జనాలకు డబ్బులిచ్చి సభ్యత్వ నమోదు కార్యక్రమం చేస్తున్నారనే ప్రచారం జరిగింది. దీనిపై మేం విచారణ చేపట్టగా అది అబద్ధమైని తేలింది. ఇప్పుడు కూడా విచారణ జరుపుతాం. ” అని ఆయన అన్నారు.
ఇదే విషయంపై రాజ్‌కోట్‌కు చెందిన బీబీసీ ప్రతినిధి బిపిన్ తంకారియా సహకారంతో రాజోకోట్ నగర బీజేపీ అధ్యక్షుడు ముకేశ్ దోషిని సంప్రదించాం.
“పార్టీ సభ్యత్వ నమోదులో రాజ్‌కోట్‌లో బీజేపీ టార్గెట్ కంప్లీట్ చేసింది. ఒక వేళ ఎవరైనా అత్యుత్సాహంతో ఆసుపత్రుల్లో రోగులతో సభ్యత్వం చేయిస్తే, అది తప్పే. మేం దీనిపై విచారణ చేస్తున్నాం. సభ్యత్వ నమోదు కార్యక్రమాలను బీజేపీ కార్యకర్తలు మంచి పద్ధతుల్లోనే చేస్తారని నమ్ముతున్నాం. కానీ, ఇది చూస్తుంటే ఎవరో కావాలనే బీజేపీ ప్రతిష్టను దిగజార్చేందుకు ఇలా చేసి ఉంటారని అర్థమవుతోంది” ముకేశ్ దోషి చెప్పారు.

ఫొటో సోర్స్, BIPIN TANKARIYA
కాంగ్రెస్ విమర్శలు
“గుజరాత్‌లో ప్రస్తుతం ప్రజలు బీజేపీని తిరస్కరిస్తున్నారు. చాలా మంది సౌరాష్ట్ర ప్రజలు ఇకపై బీజేపీని ఇష్టపడరు. అందుకే ప్రజలకు తెలియకుండా వారికి తమ పార్టీలో బీజేపీ సభ్యత్వం ఇస్తోంది” అని రాజ్‌కోట్ కాంగ్రెస్ నాయకులు హేమాంగ్ వాసావద బీబీసీతో చెప్పారు.
“గుడికి వెళ్లిన వారి ఫోన్లు బలవంతంగా లాక్కోవడం, పాఠశాలలో విద్యార్థుల దగ్గరి నుంచి తల్లిదండ్రుల నంబర్లు తీసుకోవడం, ప్రభుత్వ లేదా ట్రస్ట్ ఆసుపత్రుల్లో రోగులకు తెలియకుండానే సభ్యత్వాలు చేయించడం వంటివి బీజేపీ నేతలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
“మేం ఆ రోగులను కలుస్తాం. ఒకవేళ వాళ్లు ఈ ఘటనపై ఫిర్యాదు చేయడానికి ముందుకు వస్తే మేం సంపూర్ణ మద్దతిస్తాం. అహ్మదాబాద్‌లో ఇలాగే ప్రజలకు తెలియకుండా పార్టీ సభ్యత్వం నమోదు చేసిన మా పార్టీ కార్యకర్తపై చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నాం. ఇదే విధంగా, ఈ ఘటనలోనూ న్యాయ పరంగా ముందుకెళ్తాం. ప్రజలకు బలవంతంగా పార్టీ సభ్యత్వం ఇస్తున్న బీజేపీ తీరును మేం బట్టబయలు చేస్తాం” అని ఆయన అన్నారు.
ఎన్నో వివాదాలు
1980 నుంచే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని బీజేపీ చేపడుతోంది.
ప్రతి మూడేళ్లకోసారి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడతామని బీజేపీ అధికార ప్రతినిధి తెలిపారు.
సభ్యులుగా ఉన్నవారు సైతం ప్రతి 6 ఏళ్లకోసారి రెన్యూవల్ చేయించుకోవాలి. మొదట్లో ఈ ప్రక్రియ పేపర్ల ద్వారా జరిగేది. ప్రస్తుతం ఫోన్ల ద్వారా చేస్తున్నారు.
పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం 2021లోనే నిర్వహించాల్సి ఉంది. కానీ, కరోనా వల్ల వాయిదా పడింది. దీంతో ఇటీవల సభ్యత్వ నమోదు ప్రక్రియ మొదలుపెట్టారు. గుజరాత్‌లో సెప్టెంబర్ నుంచి బీజేపీ సభ్యత్వ నమోదుపై పలు వివాదాలు వెలుగులోకి వస్తున్నాయి.
సురేంద్రనగర్ వాడ్వాన్‌లోని ఒక పాఠశాలలో పిల్లలను స్కూల్‌కు మొబైల్ ఫోన్లు తీసుకురావాలని టీచర్లు చెప్పారని, వారి ఫోన్లతో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేశారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఆ జిల్లా విద్యాధికారి విచారణ చేపట్టారు.
మెహసనాలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో తన భార్యకు రేబిస్ ఇంజెక్షన్ వేయించుకోవడానికి వెళ్లిన వీరంబాహ దర్బార్ అనే వ్యక్తికి వార్డుబాయ్ బీజేపీ సభ్యత్వం నమోదు చేశారనే విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో బాధితుడి ఫిర్యాదు మేరకు అధికారులు శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు.
అహ్మదాబాద్‌లో కాంగ్రెస్ కార్యకర్తకు తెలియకుండానే ఆయనకు బీజేపీ సభ్యత్వం ఇచ్చారనే వార్త కూడా అప్పట్లో బయటకు వచ్చింది.
అలాగే వంద మందితో పార్టీ సభ్యత్వం నమోదు చేయిస్తే 500 రూపాయలు ఇస్తానని భవనగర్‌లో బీజేపీ నేత చెప్పినట్లుగా ఆరోపణలు ఉన్న ఓ వీడియో వైరల్‌గా మారింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














