కర్ణాటక: పదేళ్లనాటి దళితులపై దాడి కేసులో ఒకేసారి 98 మందికి జీవిత ఖైదు...అసలు వివాదం ఏంటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఇమ్రాన్ ఖురేషి
- హోదా, బీబీసీ కోసం
పదేళ్ల కిందట రాష్ట్రాన్ని కుదిపేసిన దళితులపై హింసాకాండ కేసులో 98 మందికి జీవిత ఖైదు, ఐదుగురికి సాధారణ జైలు శిక్ష విధిస్తూ కర్ణాటకలోని జిల్లా సెషన్స్ కోర్టు తీర్పునిచ్చింది.
ఈ కేసులో తీర్పును 172 పేజీల్లో వెల్లడించింది.
2014 ఆగస్టు 28న గంగావతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మరుకుంబి గ్రామంలో షెడ్యూల్డ్ కులాలపై జరిగిన హింసాత్మక ఘటన సాధారణ మూక దాడి కాదని, అది కులహింస అని కొప్పల్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్, సెషన్స్ కోర్టు స్పెషల్ జడ్జి సి.చంద్రశేఖర్ అన్నారు.

మరుకుంబి గ్రామానికి చెందిన మంజునాథ్ అనే వ్యక్తి సినిమా చూసి తిరిగి వస్తుండగా ఆయనపై కొందరు దాడి చేశారు.
ఆ తర్వాత, షెడ్యూల్డ్ కులాల కాలనీకి దగ్గర్లో ఉన్న ఆలయం వద్ద నాన్-హెడ్యూల్డ్ కులాలకు చెందినవారు పోగయ్యారు.
వారు దళిత కమ్యూనిటీకి చెందిన షాపులపై దాడి చేసి, ధ్వంసం చేశారు. కొందరి ఇళ్లకు నిప్పంటించారు.
షెడ్యూల్డ్ కులాల వారిపై దాడి చేసిన వారు ముఖ్యంగా అగ్రవర్ణాలకు చెందిన లింగాయత్, భోవి, ఇతర కులస్తులని ప్రభుత్వ న్యాయవాది అపర్ణ దామోదర్ బండి వెల్లడించారు.
‘‘సినిమా ఘటనకు ముందు కూడా, మాదిగ కమ్యూనిటీ పట్ల వివక్ష ఉంది. గ్రామంలో వాళ్లు కనీసం హెయిర్ కట్ చేయించుకోవడానికి కూడా వీలుండేది కాదు. హెయిర్ కట్ కోసం గంగావతి వెళ్లాల్సి వచ్చేది. ఇది అంటరానితనం సమస్య. అందుకే ఈ హింసాత్మక ఘటన జరిగింది.’’ అని దళిత్ సంఘర్ష్ సమితికి చెందిన రత్నాకర్ అన్నారు.
షెడ్యూల్డ్ కులాల, హెడ్యూల్డ్ తెగల(వేధింపుల నిరోధక) చట్టం, 1989కు చెందిన సెక్షన్ 3(2)(iv) కింద వీరికి జీవిత ఖైదు, జరిమానా విధించింది కోర్టు.
ఈ సెక్షన్ ఏం చెబుతోంది?
షెడ్యూల్డ్ కులాలు లేదా షెడ్యూల్డ్ తెగలకు చెందిన ఒక వ్యక్తి ఆస్తిని కానీ, ఇంటిని కానీ, భవనాన్ని లేదా వారి ప్రార్థనా స్థలానికి ఉద్దేశ్యపూర్వకంగా నిప్పంటించినా లేదా పేలుడు పదార్థాలతో ధ్వంసం చేసినా వారికి జరిమానాతో పాటు జీవిత ఖైదు శిక్షను విధించాలని ఈ సెక్షన్ చెబుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
తీర్పులో ఏం చెప్పారు?
ఈ కేసు తీర్పు సందర్భంగా అమెరికా గాయకురాలు మారియన్ ఆండర్సన్‌ను, హైకోర్టు, సుప్రీంకోర్టులు వెల్లడించిన పలు తీర్పులను జడ్జి చంద్రశేఖర్ ప్రస్తావించారు.
20వ శతాబ్దంలో ఆఫ్రికన్-అమెరికన్ ఆర్టిస్టుల పట్ల సాగుతున్న వర్ణ వివక్షకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఆండర్సన్ కీలక పాత్ర పోషించారు. మెట్రోపాలిటన్ ఓపెరాలో ప్రదర్శన ఇచ్చిన తొలి ఆఫ్రికన్-అమెరికన్ ఈమె.
1939లో వైట్‌హౌజ్ వద్ద రెండుసార్లు ప్రదర్శన చేసిన తొలి ఆఫ్రికన్-అమెరికన్ కళాకారిణి కూడా ఈమెనే.
మారియన్ ఆండర్సన్ కోట్‌తోనే జడ్జి తీర్పును ప్రారంభించారు. ‘‘ఏ దేశమైనా, ఎంత గొప్పదైనా, తన దేశంలో బలహీనవర్గాలకన్నా బలమైనది కాదు. నువ్వు ఒక వ్యక్తిని అణచి పెట్టాలని అనుకుంటున్నప్పుడు, అతన్ని అణచివేసే క్రమంలో నీలో కొంత భాగాన్ని కిందకు దించాల్సి ఉంటుంది. అంటే దీని అర్ధం నువ్వు అనుకున్నంత ఎదగలేవని..’’ అని మారియన్ ఆండర్సన్ చెప్పిన కోట్‌ను తీర్పులో ప్రస్తావించారు.
‘‘మంజూదేవి కేసులో సుప్రీంకోర్టు తీర్పును ప్రస్తావిస్తూ...షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తరగతుల సామాజిక ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచేందుకు పలు చర్యలు తీసుకున్నప్పటికీ, వారి పరిస్థితులు ఇంకా ఇబ్బందికరంగానే ఉన్నాయి. వారు హక్కులను కోల్పోతున్నారు. పలు కేసులను, వేధింపులను ఎదుర్కొంటున్నారు. ఈ కేసు వాస్తవాలను, అంశాలను పరిగణనలోకి తీసుకుంటే, నిందితుల పట్ల దయాదాక్షిణ్యాలు చూపించే పరిస్థితులేమీ కనిపించ లేదు’’ అని జడ్జి చెప్పారు.
‘‘షెడ్యూల్డ్ కులాలు, తెగలకు చెందిన పురుషులు, మహిళలు ఈ ఘటనలో గాయాలు పాలయ్యారు. మహిళల గౌరవాన్ని నిందితులు భంగపరిచారు. బాధితులను కర్రలు, రాళ్లు, ఇటుక పెడ్డలతో కొట్టి, గాయపరిచారు. నిర్దేశించిన దాని కంటే సుదీర్ఘమైన శిక్షను వారు అనుభవించాలి. శిక్షను తగ్గించేందుకు ఎలాంటి కారణం లేదు’’ అని చెప్పారు.
నిందితులు కేవలం ఒక్కరిపై కాకుండా, ఒక కమ్యూనిటీ మీద ఈ నేరానికి పాల్పడ్డారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పారు.
21వ శతాబ్దంలో కూడా ఇలాంటి నేరాలు జరుగుతున్నాయని ఊహించుకోవడానికే కష్టంగా ఉందన్నారు. ఇది అంటరానితనం అనే వివక్షకు నిదర్శనమని వ్యాఖ్యానించారు.
నిందితుల వయసు 60 ఏళ్లు, ఆపై ఉందని, వారు ఆర్థికంగా వెనుకబడిన వర్గానికి చెందిన వారని డిఫెన్స్ లాయర్ వాదించారు. జరిమానా నుంచి వారికి మినహాయింపు ఇవ్వాలన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














