‘లొంగిపోండి లేదా ఆకలితో అలమటించండి’: ఉత్తర గాజాను ఖాళీ చేయించేందుకు ఇజ్రాయెల్ కొత్త ప్లాన్?

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, జెరెమీ బోవెన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఇజ్రాయెల్ సైన్యానికి చెందిన అరబిక్ అధికార ప్రతినిధి శనివారం (అక్టోబర్ 12) ఉదయం సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. ఉత్తర గాజాలోని డీ5 ప్రాంతంలో నివాసం ఉంటున్న పౌరులు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి దక్షిణగాజాకు వెళ్లాలనేది ఆ పోస్ట్ సారాంశం.
డీ5 ప్రాంతం ఇజ్రాయెల్ సైన్యం మ్యాపుల్లో దీర్ఘ చతురస్రాకారంలో అరలు అరలుగా రేఖలతో విభజించినట్లు కనిపిస్తుంటుంది.
ఉత్తర గాజాలో కొంత ప్రాంతాన్ని ఇజ్రాయెల్ చిన్న చిన్న భాగాలుగా మార్క్ చేసి గుర్తిస్తోంది.
తాజా పరిణామాలలో ఈ సందేశం కొత్తది. అందులో “ఇజ్రాయెల్ సైన్యం బలమైన శక్తితో తీవ్రవాద సంస్థల మీద పోరాడుతోంది. దీర్ఘకాలం పాటు ఆ పోరాటాన్ని కొనసాగిస్తుంది. ఈ నిర్దేశిత ప్రాంతం, అందులో ఉన్న ఆవాసాలు ప్రమాదకర యుద్ధ క్షేత్రంలోకి వస్తాయి. ఈ ప్రాంతాన్ని తక్షణం ఖాళీ చేసి సలాహ్ అల్ దిన్ రోడ్ గుండా పునరావాస కేంద్రానికి వెళ్లాలి” అని పేర్కొన్నారు.
బ్లాక్ డీ5లో కొంత ప్రాంతాన్ని పసుపు రంగు బాణం గుర్తులతో విభజిస్తూ గీసిన చిత్రాలతో కూడిన మ్యాప్‌ను ఇందులో పోస్ట్ చేశారు. సలాహ్ అల్ దిన్ రోడ్ ఉత్తర – దక్షిణ గాజాలను కలుపుతున్న కీలక మార్గం.
ఈ సందేశంలో ఈ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్లే వారు తిరిగి ఎప్పుడు రావచ్చనే దాని గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఈ ప్రాంతం మీద ఇజ్రాయెల్ సైన్యం ఇప్పటికే అనేకసార్లు దాడులు చేసింది.
ఈ మెసేజ్‌లో మరో కీలక అంశం ఇజ్రాయెల్ సైన్యం వాడిన పదాలు “బలమైన శక్తితో, సుదీర్ఘ కాలం పాటు” అనేవి. స్థానికులు ఇప్పట్లో తిరిగి వచ్చే అవకాశం లేదని చెప్పడం ఈ పదాల ఉద్దేశం అయ్యుంటుందని అనిపిస్తోంది.
ఇజ్రాయెల్ చెబుతున్న శరణార్థి ప్రాంతం అల్ మసావి. రఫా తీరానికి దగ్గర్లో, గతంలో వ్యవసాయం చేసే భూముల్లో ఈ పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీనిని ‘హ్యుమానిటేరియన్ ఏరియా’గా ఇజ్రాయెల్ గుర్తించింది.
ఇక్కడ ఇప్పటికే పరిమితికి మించి ఉన్నారు. పైగా ఈ ప్రాంతం గాజాలోని మరే ఇతర ప్రాంతం కన్నా సురక్షితమైనదేమీ కాదు.
ఈ ప్రాంతం మీద 18 సార్లు వైమానిక దాడులు జరిగినట్లు ‘బీబీసీ వెరిఫై’ బృందం గుర్తించింది.
ఉత్తర గాజాలో మిగిలి ఉన్న 4,00,000 మంది ప్రజలకు హమాస్ తన సందేశాలను పంపించింది. ఇజ్రాయెల్ చెబుతున్నా, ప్రజలు ఎవరూ అక్కడి నుంచి కదలవద్దని హమాస్ చెప్పింది. ఈ ప్రాంతం ఇంతకుముందు దాదాపు 14 లక్షల మంది జనాభాతో గాజా స్ట్రిప్‌కు కేంద్రంగా ఉండేది.
ఇక్కడి నుంచి దక్షిణ గాజాకు వెళ్లినా, అక్కడ పరిస్థితులు కూడా అంత సురక్షితంగా లేవని హమాస్ చెబుతోంది. ఇక్కడి నుంచి వెళ్లిన వాళ్లను తిరిగి ఇక్కడికి రానివ్వరని హెచ్చరించింది.
ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేస్తున్నా, యుద్ధ ట్యాంకులతో విరుచుకు పడుతున్నా, ఇక్కడి నుంచి కదలకూడదని అనేక మంది ప్రజలు భావిస్తున్నారు.
బీబీసీ ప్రతినిధి ఉత్తర గాజా ప్రాంతం దగ్గరికి వెళ్లినప్పుడు అక్కడ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి, కొన్ని చోట్ల పొగలు కనిపించాయి. ఆ పేలుళ్ల తీవ్రత గాజా మీద యుద్ధం ఆరంభ రోజులను గుర్తు చేసేలా ఉంది.


ఫొటో సోర్స్, Reuters
దక్షిణ గాజా నుంచి కొంతమంది ఉత్తర గాజాలోని తమ బంధువుల వద్దకు వెళ్లారు. అయితే చాలా మంది దక్షిణ గాజాలోనే ఉండిపోయారు. హమాస్‌తో సంబంధాలు ఉన్న కుటుంబాలు కూడా దక్షిణ గాజాలోనే ఉండిపోయాయి. యుద్ధ చట్టాల ప్రకారం హమాస్‌తో సంబంధాలు ఉన్నవారి కుటుంబ సభ్యులంతా హమాస్ సభ్యులేనని భావించకూడదు.
ప్రమాదకరమైన, రద్దీగా ఉండే దక్షిణ గాజాలో ఇజ్రాయెల్ దాడుల నుంచి తప్పించుకునేందుకు స్థానికులు దక్షిణ గాజాను వదిలేయకుండా ఆ ప్రాంతంలోనే మరో పట్టణానికి లేదా నగరానికి వెళ్లే వ్యూహాన్ని అమలు చేస్తూ వచ్చారు.
ఉదాహరణకు కొందరు బీట్ హనౌన్ నుంచి గాజా సిటీకి వెళ్లేవారు. ఇజ్రాయెల్ సైన్యం వారి ఇళ్ల దగ్గర ఆపరేషన్ కొనసాగిస్తున్నప్పుడు వాళ్లు అక్కడి నుంచి వెళ్లిపోయేవారు. సైన్యం వెళ్లిపోగానే తిరిగి వచ్చేవారు.
అయితే, దీన్ని అడ్డుకునేందుకు ఇజ్రాయెల్ సైన్యం ప్రయత్నించిందని గాజాలోని పాలస్తీనీయులతో సంబంధాలున్న పాత్రికేయులు చెప్పారు.
సలాహ్ అల్ దిన్ రహదారి గుండా వెళ్తున్న కుటుంబాలకు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి.
యుద్ధం గురించి వార్తలు రాసేందుకు వస్తున్న రిపోర్టర్లను ఇజ్రాయెల్ గాజాలోకి అనుమతించడం లేదు. ఒకరిద్దరిని అనుమతించినా సైన్యం వారిని తమతోనే తీసుకెళ్తోంది.
2023 అక్టోబర్ 7 నుంచి అక్కడ ఉన్న పాలస్తీనా జర్నలిస్టులు ఇప్పటికీ ధైర్యంగా పని చేస్తున్నారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి గాజాలో కనీసం 128 మంది పాలస్తీనా మీడియా ఉద్యోగులు మరణించారని జర్నలిస్టుల రక్షణ కమిటీ తెలిపింది.
ఉత్తర గాజాలో, ఇజ్రాయెల్ తిరిగి దాడులు ప్రారంభించిన తర్వాత ఈ ప్రాంతం నుంచి పారిపోతున్న కుటుంబాలను వారు చిత్రీకరిస్తున్నారు.
పెద్ద పెద్ద బ్యాగుల్ని మోసుకు వెళుతున్న చిన్న పిల్లలకు వారు సాయం చేస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆ జర్నలిస్టుల్లో ఒకరు చిన్న పిల్లవాడిని తీసుకుని వీధిలో పరుగెత్తుతున్న మనర్ అల్ బయార్ అనే మహిళ ఇంటర్వ్యూ పంపించారు.
తాను జబాలియా క్యాంపుకు వెళ్లేందుకు కొంత సేపు నడుస్తూ, కొంత సేపు పరుగెడుతున్నానని ఆమె అందులో చెప్పారు.
“మేము ఫల్లుజా పాఠశాల నుంచి బయలుదేరడానికి ఐదు నిమిషాల సమయం ఉందని వారు మాకు చెప్పారు. మేము ఎక్కడికి వెళ్లాలి? దక్షిణ గాజాలో హత్యలు జరుగుతున్నాయి. పశ్చిమ గాజాలో ప్రజల మీద బాంబులు వేస్తున్నారు” అని ఆమె చెప్పారు.
ఆ ప్రయాణం చాలా కష్టం. అలా వెళుతున్న వారిపైన కొన్నిసార్లు ఇజ్రాయెల్ సైనికులు కాల్పులు జరిపారని గాజాలో పాలస్తీనీయులు చెప్పారు.
ఇజ్రాయెల్ సైనికులు అంతర్జాతీయ మానవీయ చట్టాలను పాటించేలా వారిపై ఒత్తిడి తేవాల్సిన అవసరాన్ని ఇలాంటి సంఘటనలు చెబుతున్నాయి.
గాయపడిన పౌరులు అందించిన ఆధారాలు ఇజ్రాయెల్ సైనికులు పౌరులే లక్ష్యంగా కాల్పులు జరిపినట్లు సూచిస్తున్నాయని పాలస్తీనా వైద్య సహాయ అధికారి లిజ్ ఆల్‌కాక్ చెప్పారు.
“ఆసుపత్రులలో మా దగ్గరకు రోగులు వచ్చినప్పుడు పెద్ద సంఖ్యలో స్త్రీలు, పిల్లలు ఉంటున్నారు. యుద్ధంలో పాల్గొనే శక్తి, వయసు లేని వారికి తల, వెన్నెముక, కాళ్ల పైన నేరుగా కాల్చిన గాయాలు కనిపిస్తున్నాయి” అని లిజ్ అల్‌కాక్ తెలిపారు.
గాజాలో పని చేస్తున్న ఐక్యరాజ్య సమితి సహాయ బృందాలు ఇజ్రాయెల్ సైన్యం దాడుల వల్ల మానవీయ విపత్తు పెరుగుతోందని చెబుతున్నాయి.
ఉత్తర గాజాలో మిగిలిన ఆసుపత్రుల నుంచి పదే పదే అవే సందేశాలు వస్తున్నాయి. తమ వద్ద జనరేటర్లను నడిపించడానికి అవసరమైన ఇంధనం లేదని, ఔషధాలు లేవని, తీవ్రంగా గాయపడిన వారికి వైద్యం చెయ్యలేకపోతున్నామని చెబుతున్నారు.
కొన్ని ఆసుపత్రులు తమ భవనంపైన ఇజ్రాయెల్ సైన్యం దాడులు చేసిందని చెబుతున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఉత్తర గాజాను ఖాళీ చేయించేందుకు ఐక్య రాజ్య సమితి, సహాయ సంస్థలు, ఇజ్రాయెల్ సైన్యం “జనరల్స్ ప్లాన్” అని పిలిచే కొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నాయని పాలస్తీనీయులు సందేహిస్తున్నారు. ఈ ప్రణాళికను రిటైర్డ్ మేజర్ జనరల్ గియోరా ఈలాండ్ నాయకత్వంలోని కొంతమంది రిటైర్డ్ సీనియర్ అధికారులు ప్రతిపాదించారు. గియోరా ఈలాండ్ మాజీ జాతీయ భద్రత సలహాదారు.
ఇజ్రాయెల్ యుద్ధం మొదలుపెట్టి ఏడాది దాటింది. అయినప్పటికీ హమాస్‌ను అంతం చేసి బందీలను తీసుకు రావాలన్న లక్ష్యాన్ని తమ సైన్యం చేరుకోలేకపోయిందని అనేక మంది ఇజ్రాయెలీలు అసహనం, ఆవేశంతో ఉన్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో జనరల్స్ ప్లాన్ ఈ ప్రతిష్టంభనను బద్దలు చేస్తుందని ఇజ్రాయెల్ కోణం నుంచి ఆలోచించేవారు భావిస్తున్నారు.
ఉత్తర గాజాలో పౌరుల మీద ఒత్తిడి పెంచడం ద్వారా హమాస్ ఫైటర్లు, హమాస్ నాయకుడు యహ్యా సిన్వార్ లొంగిపోయేలా ఒత్తిడి తేవచ్చనేది జనరల్స్ ప్లాన్‌లో కీలక అంశం.
ఉత్తర గాజా నుంచి ప్రజల్ని సురక్షిత కారిడార్ల ద్వారా దక్షిణ గాజాలోకి పంపించడం ఇందులో మొదటి దశ.

ఫొటో సోర్స్, Oren Rosenfeld/BBC
ఇప్పుడు ఇజ్రాయెల్ వ్యూహాలు మార్చుకోవాల్సిన అవసరం ఉందని గియోరా ఈలాండ్ చెప్పారు. సెంట్రల్ ఇజ్రాయెల్‌లోని తన ఆఫీసులో దీనికి సంబంధించి ఆయన ఒక ప్రణాళికను ఆవిష్కరించారు.
“గత 10 నెలల్లో ఇజ్రాయెల్ సైన్యం ఇప్పటికే ఉత్తర గాజాను చుట్టుముట్టింది. ఇప్పటికీ అక్కడ నివసిస్తున్న 3 లక్షల మందికి ( ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారం 4 లక్షల మంది) మనం ఒక విషయం చెప్పాలి. అదేంటంటే వారు ఈప్రాంతాన్ని వదిలివెళ్లాలి. ఇజ్రాయెల్ సైన్యం సూచించిన సురక్షిత కారిడార్ల ద్వారా వెళ్లేందుకు 10 రోజుల సమయం ఇవ్వాలి.’’
"10 రోజులు గడిచిన తర్వాత, ఈ ప్రాంతమంతా మిలిటరీ జోన్‌గా మారుతుంది. అక్కడ ఉండేది హమాస్ అనుకూల వాదులైన ప్రజలు, హమాస్ ఫైటర్లు మాత్రమే. అక్కడ మిగిలి ఉన్న వారికి రెండే ఆప్షన్లు ఉంటాయి. ఒకటి లొంగిపోవడం, రెండు ఆకలితో పస్తులుండటం" అని గియోరా ఈలాండ్ చెప్పారు.
ఉత్తర గాజా నుంచి ప్రజలు వెళ్లేందుకు అనుమతించిన సురక్షిత కారిడార్లు మూసివేసిన తర్వాత ఇజ్రాయెల్ ఈ ప్రాంతాన్ని అన్ని వైపుల నుంచి సీల్ చేయాలని ఈలాండ్ కోరారు. పది రోజుల తర్వాత ఈ ప్రాంతంలో మిగిలిన వారిని ఇజ్రాయెల్‌కు శత్రువులుగానే భావించాలి.
ఈ ప్రాంతం అంతా ఇజ్రాయెల్ సైన్యం ఆధీనంలో ఉంటుంది కాబట్టి ఆహారం, నీరు లాంటి నిత్యావసరాల్ని ఈ ప్రాంతంలోకి అనుమతించకూడదు.
అలా జరిగితే అక్కడ ఉంటున్న వారి మీద భరించలేనంత ఒత్తిడి పెరుగుతుంది. అప్పుడు హమాస్ బందీలను విడిచి పెడుతుంది. అదే ఇజ్రాయెల్ కోరుకుంటున్న విజయం అని ఆయన నమ్ముతున్నారు.
ఉత్తర గాజాలో అనుసరిస్తున్న విధానాల వల్ల “వేలాది పాలస్తీనీయన్ కుటుంబాల ఆహార భద్రత మీద వినాశకరమైన ప్రభావాన్ని చూపిస్తుంది’’ అని ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఆహార కార్యక్రమం చెబుతోంది.
అక్టోబర్ 1 నుంచి ఉత్తర గాజాలోని ప్రధాన దారులను మూసివేశారు. అక్కడ ఎలాంటి ఆహార సాయం అందడం లేదు.
వైమానిక దాడుల వల్ల మొబైల్ కిచెన్స్, బేకరీలు పని చేయడం ఆగిపోయింది. ఉత్తర గాజాలో ప్రపంచ ఆహార కార్యక్రమం మద్దతుతో ఒక్క బేకరీ మాత్రమే పని చేస్తోంది.
ఇది కూడా ఓ పేలుడు సందర్భంగా మంటల్లో చిక్కుకుంది. దక్షిణ గాజాలో పరిస్థితి కూడా దాదాపుగా ఇలాగే ఉంది.
“జనరల్స్ ప్లాన్”ను ఇజ్రాయెల్ సైన్యం అమలు చేస్తుందా లేదా అనే దానిపై స్పష్టత రాలేదు. అయితే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ ఈ ప్రణాళిక అమలవుతోందనే సంకేతాల్ని వెల్లడిస్తున్నాయి.
ఉత్తర గాజాలో ప్రజల మీద జనరల్స్ ప్లాన్‌లో ప్రతిపాదించిన వ్యూహాన్నే అమలు చేస్తున్నారు. దీని గురించి బీబీసీ ఇజ్రాయెల్ సైన్యాన్ని అనేక ప్రశ్నలు అడిగింది.
అయితే ఇజ్రాయెల్ సైన్యం నుంచి ఎలాంటి సమాధానాలు రాలేదు.
ఉత్తర గాజా నుంచి పాలస్తీనీయులను పంపించేసి అక్కడ యూదు సెటిల్‌మెంట్లు ఏర్పాటు చేయాలని నెతన్యాహు మంత్రి వర్గంలోని కొందరు డిమాండ్ చేస్తున్నారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














