స్వీట్ బాబీ: అబ్బాయిగా పరిచయమైన అమ్మాయి... 9 ఏళ్లపాటు సాగిన బంధం.. చివరకు ఏమైందంటే..

ఫొటో సోర్స్, Netflix
- రచయిత, ఆంబర్ సంధు, మనీష్ పాండే
- హోదా, బీబీసీ ప్రతినిధులు
ఇదంతా ఓ ఫ్రెండ్ రిక్వెస్ట్‌తో మొదలైంది.
అందగాడైన కార్డియాలజిస్ట్ బాబీతో ఆన్‌లైన్‌లో 2009లో పరిచయమైనందుకు కిరాత్ అస్సీ ఎంతో సంబరపడ్డారు.
బాబీ, కిరాత్‌కు పూర్తిగా అపరిచితుడేమీ కాదు. పశ్చిమ లండన్‌లోని సిక్కుసమాజానికి చెందిన ఈ ఇద్దరికీ ఉమ్మడి స్నేహితులు ఉన్నారు.
అందుకే కిరాత్ అతని ఫ్రెండ్ రిక్వెస్ట్‌ని అంగీకరించింది. ఆన్‌లైన్‌లో వీరు గంటలకొద్దీ మాట్లాడుకునేవారు. తరువాత వారి పరిచయం ప్రేమగా మారింది.
ఇద్దరూఒకరి జీవితంలో మరొకరు అంతర్భాగం అనుకునేంతగా మాట్లాడుకునేవారు. కానీ ఏనాడూ వారు వ్యక్తిగతంగా కలుసుకోలేదు.
వ్యక్తిగతంగా కలిసి మాట్లాడుకుందాం అని కిరాత్ ఎప్పుడు అడిగినా బాబీ ఏదో ఒకసాకు చెప్పేవారు. ఒకసారి గుండెపోటు వచ్చిందని, మరో సారి తనని బుల్లెట్‌తో కాల్చారని.. తాను సాక్షిగా పోలీసు రక్షణలో ఉన్నానని ఇలా రకరకాల కారణాలు చెప్పేవారు.
కానీ, నిజం ఏమిటంటే కిరాత్ ఓ దారుణమైన క్యాట్‌ఫిషింగ్ అనే స్కీమ్‌కు బాధితురాలిగా మారారు.
కుంటిసాకులతో ఎప్పటికప్పుడు వ్యక్తిగతంగా కలవకుండా తప్పించుకు తిరుగుతున్న బాబీనీ ఎట్టకేలకు 9 ఏళ్ల తరువాత కిరాత్ కలుసుకున్నారు.
కానీ తన ముందు ఉన్నది ఎవరో ఆమె గుర్తుపట్టలేకపోయారు. ఆమె కలుసుకున్నది తన కజిన్ సిమ్రన్‌ను. ఇంతకాలం మెసేజ్‌లు చేసింది తనే. మొత్తం ఈ కథంతా నడిపింది సిమ్రాన్ అని తెలిసి కిరాత్ బాధపడ్డారు.
జరిగిందంతా తలుచుకున్న కిరాత్ ‘ఇంత తెలివి తక్కువగా ఎలా వ్యవహరించాను’ అని తనను తానే ప్రశ్నించుకున్నారు.
దిగ్భ్రాంతి కలిగించే కిరాత్ స్టోరీని పాడ్ కాస్ట్ మేకర్ టార్టాయిస్ ప్రసారం చేయగా చాలా మందికి నచ్చిందది. (మీరు దానిని ఇక్కడ బీబీసీ సౌండ్స్‌లో వినవచ్చు)
మూడేళ్ల తరువాత కిరాత్ అనుభవాన్ని వివరిస్తూ తాజాగా నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీని విడుదల చేసింది.
తన కథను బయటకు చెప్పడంతో ‘అలా ఎలా మోసపోయారు’ అనే ప్రశ్నను అనేకమంది పదేపదే అడిగారని ఆమె చెప్పారు. కొంతమందైతే ఆన్‌లైన్‌లో తనను దూషించారని కూడా చెప్పారామె.
‘‘నేను ఇప్పటికీ తెలివితక్కువదాన్నని ఎవరైనా భావిస్తే నాకేం అభ్యంతరం లేదు. ఎవరి అభిప్రాయాలు వారివి’’ అని బీబీసీ ఏసియన్ నెట్ వర్క్ న్యూస్‌తో కిరాత్ అన్నారు.
అయితే ప్రజలు నిజాలు తెలుసుకోకుండా ఏవేవో ఊహించుకోవడం నాకిష్టం లేదు. అందుకే నిజమేమిటో చెప్పాలనే వచ్చాను.
నేను తెలివితక్కువదాన్ని కాదు,మూగదాన్నీకాదు. మాట్లాడటానికే వచ్చాను" అని ఆమె అన్నారు. "నేనే కాదు, నాలాంటి బాధితులందరూ ముందుకొచ్చి మాట్లాడాలని కోరుకుంటున్నాను" అని ఆమె అన్నారు.
అయితే ఇక్కడ మరో ప్రశ్న ఉంది. ‘ఇలా మోసపోయిన వ్యక్తులు ప్రజలు తమని గుర్తించాలని ఎందుకు అనుకుంటున్నారు?’


ఫొటో సోర్స్, Netflix
‘అపోహలను సవాల్ చేస్తా’
పంజాబీ నేపథ్యానికి చెందిన కిరాత్, దక్షిణాసియా సమాజంలోని అపోహలను సవాలు చేయాలనుకుంటున్నానని, అందుకే తాను నోరువిప్పడం చాలా ముఖ్యమని ఆమె చెప్పారు.
"ఇటువంటి సమస్యలను పంచుకోవడానికి మేం చాలా భయపడుతున్నాం. ఎందుకంటే మా సమాజాన్ని మిగతా ప్రపంచం ఎలా చూస్తుందనేది ముఖ్యం. అందుకే బాధితులు తమకు జరిగిన అన్యాయాన్ని బయటకు చెప్పుకోలేక ఇబ్బంది పడుతూనే ఉన్నారు’’ అని చెప్పారు కిరాత్.
"నా కథను చెప్పినప్పుడు మా నాన్న స్పందించిన తీరే ఇందుకు ఉదాహరణ" అంటారు కిరాత్
"అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని కూడా ఆయన అనుకోలేదు".
"నాకు మా నాన్నంటే చాలా ఇష్టం. నేనంటే కూడా మా నాన్నకు చాలా ఇష్టమని నాకు తెలుసు. కానీ ఆయన పెరిగిన నేపథ్యానికి నాకు జరిగిన అన్యాయం భిన్నమైనది" అని ఆమె అన్నారు.
ఏం జరిగిందనే విషయంపై తాను నేరుగా "అసలైన బాబీ"తో మాట్లాడలేదని, ఇలాంటి సంభాషణలు చేయడానికి తమ సమాజం సమ్మతించదని ఆమె చెప్పారు. కానీ మా సమాజంపట్ల నాకు బాధ్యత ఉంది.
"నేను భిన్నమైన నిర్ణయాలు తీసుకుంటాను"అని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, Netflix
‘బాధితురాలిగా ఉండటానికి ఇష్టపడను’
స్వీట్ బాబీ గురించి చెప్పినందుకు కొన్ని ప్రతికూలతలు వచ్చినప్పటికీ, కిరాత్ తనకు ఎదురయ్యే ప్రశ్నలకు సమాధానం చెప్పాలనుకున్నారు. అందుకే "మీరు ఎప్పుడైనా నన్ను చూస్తే నన్ను పలకరించడానికి భయపడకండి"అని ఆమె చెప్పారు.
"నాగురించి వివాదాస్పదంగా ఏదైనా చెప్పాలనుకున్నా సరే నాకు ఓకేనే. దాని గురించి కూడా మాట్లాడదాం ’’ అని చెప్పారు.
పాడ్‌కాస్ట్,డాక్యుమెంటరీ నిర్మాతలతో తనకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడటం వల్ల ఊరట దక్కిందా అంటే కచ్చితంగా దక్కింది అని ఆమె చెప్పలేకపోయారు.
ఇక కిరాత్‌కు ఆన్‌లైన్‌లో బాబీగా పరిచయమైన ఆమె కజిన్ సిమ్రన్ ఈ డాక్యుమెంటరీలో నటించడానికి నిరాకరించారు. దీంతో ఆమె పాత్రను వేరేవారు పోషించారు.
ఆన్‌లైన్‌లో వేరేపేరుతో పరిచయమై తనను 9 ఏళ్లపాటు మోసం చేసిన తన కజిన్ సిమ్రన్‌పై కిరాత్ సివిల్ కేసుపెట్టి గెలిచారు. పరిహారంతో పాటు సిమ్రన్ క్షమాపణలు కూడా చెప్పాల్సి వచ్చింది.
అయితే సిమ్రన్ నుంచి వచ్చిన ఓ ప్రకటనను షోలో చేర్చారు. అందులో ఈ విషయం తాను పాఠశాల విద్యార్థినిగా ఉన్నప్పుడు జరిగిన సంఘటనలతో ముడిపడి ఉందని, ఇది తన వ్యక్తిగత విషయంగా భావిస్తున్నానని, తనపై నిరాధార, అప్రతిష్ఠ కలిగించే అభియోగాలను మోపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు సిమ్రన్ ఆ ప్రకటనలో చెప్పారు.
"సిమ్రన్ ఎలాంటి నేరారోపణలను ఎదుర్కోలేదు,కానీ, కనీసం దీనికి బాధ్యత వహించాలని కోరుకుంటున్నా" అని కిరాత్ అన్నారు.
"ఆ వ్యక్తి బయట ప్రపంచంలో ఉండడం నాకు నచ్చలేదు" అని కిరాత్ అన్నారు.
అయితే తనకి సమాధానం దొరకని మరోక ప్రశ్న ఉంది... సిమ్రన్ ఎందుకిలా చేసింది? అని.
"కానీ ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరకకపోవడంతో జీవితంలో ముందుకు సాగిపోతున్నాను, మళ్లీ డేటింగ్ కూడా చేస్తున్నాను"
"నేను నిజంగా కష్టపడి పని చేస్తున్నాను.నా జీవితాన్ని,వృత్తిని పునర్నిర్మించుకోవడానికి నేను చేయవలసిన దానికంటే ఎక్కువే కష్టపడుతున్నాను"అని కిరాత్ చెప్పారు.
"నేను బాధితురాలి మనస్తత్వాన్ని దరిచేరనీయను .బాధితురాలిగా ఉండాలనుకోవడం లేదు. నేను లక్ష్యాలు,కలల కోసం పనిచేస్తాను"అంటారు కిరాత్.
స్వీట్ బాబీ:మై క్యాట్ ఫిష్ నైట్‌మేర్ డాక్యుమెంటరీ నెట్‍ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














