టీజీఎస్పీ: ఈ పోలీస్ ఉద్యోగులు, వారి కుటుంబాల ఆందోళనకు కారణమేంటి?

- రచయిత, ప్రవీణ్ శుభం
- హోదా, బీబీసీ కోసం
కొన్ని రోజులుగా తెలంగాణ స్పెషల్ పోలీస్ ( టీజీఎస్పీ) బెటాలియన్ల సిబ్బంది కుటుంబ సభ్యులు ‘ఏక్ పోలీస్ విధానం’ తీసుకురావాలంటూ ఆందోళన చేస్తున్నారు.
కొన్ని బెటాలియన్లలో కానిస్టేబుళ్లు యూనిఫామ్ వేసుకుని ఈ నిరసనల్లో పాల్గొనడం కనిపించింది.
పోలీసు ఉద్యోగం పేరుతో అధికారులు వెట్టిచాకిరీ చేయిస్తున్నారని, సెలవులు ఇవ్వకుండా వేధిస్తున్నారని కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
ఈ ఆందోళనలకు ప్రతిపక్ష బీఆర్ఎస్ సంఘీభావం తెలిపింది.
మరోవైపు, సమస్యలను సావధానంగా పరిష్కరిస్తామని, పాత పద్ధతిలోనే సెలవుల విధానం కొనసాగిస్తామని తెలంగాణ డీజీపీ ప్రకటించారు. కుటుంబ సభ్యులు ఆందోళన వీడాలని, కానిస్టేబుళ్లు విధులకు హాజరు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
డ్యూటీ నిబంధనలకు విరుద్ధంగా ఆందోళనల్లో పాల్గొన్న కొందరిని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.


ఏపీఎస్పీ నుండి టీజీఎస్పీగా...
ఏపీఎస్పీ పోలీసు బలగాల పుట్టుక ఉమ్మడి మద్రాస్, హైదరాబాద్ రాష్ట్రాలతో ముడిపడి ఉంది. 1947 నుంచి ఇది పనిచేస్తోంది.
మొదట్లో తాడేపల్లి గూడెం, బళ్లారిలో రెండు బెటాలియన్లతో ఇది ప్రారంభం కాగా 1950 లో హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వం ఇబ్రహీంబాగ్‌లో హైదరాబాద్ స్టేట్ రిజర్వ్ పోలీసు (హెచ్ఎస్ఆర్పీ) విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటయ్యాక 1957 నుంచి దీన్ని ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ (ఏపీఎస్పీ)గా పిలుస్తున్నారు.
రాష్ట్ర విభజన సమయంలో 10 బెటాలియన్లతో తెలంగాణ స్పెషల్ పోలీసు విభాగం వేరయింది. అదనపు బెటాలియన్ల ఏర్పాటుతో ప్రస్తుతం ఈ సంఖ్య పెరిగింది.
ఈ బెటాలియన్లలో తెలంగాణ వ్యాప్తంగా దాదాపు పది వేలకు పైగా సిబ్బంది ఉన్నారు.
రాష్ట్ర డీజీపీ సాధారణ పర్యవేక్షణలో ఈ బెటాలియన్లు ఉంటాయి. వీటి పరిపాలన వ్యవహారాలు అడిషనల్ డీజీ ఆధ్వర్యంలో కొనసాగుతాయి. ప్రతి బెటాలియన్ ఎస్పీ ర్యాంకు గల కమాండెంట్ ఆధ్వర్యంలో కొనసాగుతుంది.
ఇతర రాష్ట్రాల ఎన్నికలు, వివిధ ఉత్సవాల బందోబస్తుల్లో విధులు నిర్వహిస్తుంటారు. ఏడాదిలో ఎక్కువ రోజులు అపాయింట్ అయిన బెటాలియన్లకు దూరంగా డ్యూటీలు చేస్తుంటారు.
ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ మ్యానువల్-1986 స్పెషల్ పోలీస్ విభాగానికి సంబంధించిన విధులు, పనితీరును నిర్వచిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోనూ ఈ మ్యానువల్‌నే అనుసరిస్తున్నారు.
ఈ మ్యానువల్‌లోని చాప్టర్-1 లో పొందుపరిచిన వివరాల ప్రకారం.. రాష్ట్ర వ్యాప్తంగా శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, గస్తీలో స్థానిక సివిల్ పోలీసులకు మద్దతుగా ఉండటం, ప్రకృతి వైపరీత్యాల సమయంలో రక్షణ, సహాయక చర్యల్లో పాలుపంచుకోవడం స్పెషల్ పోలీసు విభాగం ప్రధాన విధులు. అవసరాన్ని బట్టి దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో కూడా వీరి సేవలను వినియోగిస్తారు.

వివాదం ఏంటి?
స్పెషల్ పోలీసు బృందాల్లో క్షేత్రస్థాయి విధులు నిర్వహించే వారి సంఖ్యను పెంచాలని, వారికిచ్చే సెలవుల విధానాన్ని పునర్వ్యవస్థీకరించాలని ఇటీవల ఒక సర్క్యులర్ జారీ అయింది.
ఇది అమలైతే గతంలో ఉన్న 15రోజులకు నాలుగు రోజుల సెలవు ( రికార్డ్ పర్మిషన్) విధానం స్థానంలో ఒక నెలలో వరుసగా 26 రోజులు డ్యూటీలు చేయాల్సి వస్తుందని, అవసరమైతే అదనంగా మరికొన్ని రోజులు విధులు నిర్వహించాల్సి వస్తుందన్నది కానిస్టేబుళ్లు, వారి కుటుంబ సభ్యుల అభ్యంతరం.
దీన్ని వ్యతిరేకిస్తూ వారం రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బెటాలియన్ల పరిధిలో వారు నిరసన కార్యక్రమాలు జరుపుతున్నారు.
దాదాపు ఇలాంటి కారణాలతోనే 2012లోనూ ఇదే తరహా ఆందోళనలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగాయి.
కానిస్టేబుళ్లకు నెలల తరబడి కుటుంబాలకు దూరంగా డ్యూటీలు వేయడం, పోలీసు విధుల స్థానంలో వెట్టి చాకిరీ చేయించడం, సెలవులు ఇవ్వడం లేదన్నది టీఎస్ఎస్పీ పోలీసు కుటుంబ సభ్యులు చేస్తున్న ప్రధాన ఆరోపణ.
ఆందోళనల నేపథ్యంలో ఈ సర్క్యులర్ అమలును ప్రస్తుతానికి నిలిపివేయాలని టీజీఎస్పీ అడిషనల్ డైరెక్టర్ జనరల్ సంజయ్ జైన్ ఆదేశాలు జారీ చేశారు. ఆయా బెటాలియన్ల కమాండెంట్లు దర్బార్ నిర్వహించి సిబ్బంది, కుటుంబ సభ్యుల నుంచి ఫిర్యాదులు తీసుకుని, నిర్దిష్టమైన సిఫార్సులు సూచించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత రిక్రూట్‌మెంట్, మౌలిక వసతుల కల్పనలో పోలీసు శాఖకు ఎనలేని ప్రాధాన్యం లభించింది. అయితే స్పెషల్ పోలీసు విభాగంలో పరిస్థితులు ఏమాత్రం మారలేదనే వాదనలున్నాయి.
తమ వివరాలు గోప్యంగా ఉంచాలని కోరుతూ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న బెటాలియన్లలో పనిచేస్తున్న కొంతమంది టీఎస్ఎస్పీ కానిస్టేబుళ్లు, వారి కుటుంబ సభ్యులు తమకు ఎదురవుతున్న కొన్ని సమస్యలను బీబీసీతో చెప్పారు.

‘ఏక్ పోలీసు విధానం కావాలి’
గతంలో పోలీసు కానిస్టేబుళ్ల రిక్రూట్‌మెంట్ విధానం సివిల్, ఆర్మ్డ్ రిజర్వ్, స్పెషల్ పోలీసు విభాగాలకు వేర్వేరుగా ఉండేది. ప్రస్తుతం కంబైన్డ్ నోటిఫికేషన్ ద్వారా నియామకాలు చేస్తున్నారు.
పరీక్షలో అభ్యర్థుల మెరిట్ ఆధారంగా వారిచ్చిన ప్రాధాన్యతా క్రమంలోని సివిల్, అగ్నిమాపక, రిజర్వ్, స్పెషల్ పోలీస్, జైళ్లశాఖ వంటి విభాగాలకు ఎంపిక జరుగుతోంది.
ఇలా ఒకే పరీక్ష ద్వారా ఎంపికైన తమకు మిగతా వారితో పోలిస్తే విధుల్లో పొంతనే లేదన్నది టీజీఎస్పీ కానిస్టేబుళ్ల వాదన.
“తమిళనాడు, కర్ణాటక తరహాలో ఏక్ పోలీసు విధానం తేవాలని కోరుతున్నాం. ఈ విధానంలో ఐదేళ్ల సర్వీస్ తర్వాత ఆర్మ్డ్ రిజర్వ్, ఆ తర్వాత సివిల్ పోలీస్ విభాగానికి మారే అవకాశం ఆ రాష్ట్రాల్లో ఉంది. అది ఇక్కడ అమలైతే కొన్నేళ్ల తర్వాతైనా మా కుటుంబాలతో గడిపే అవకాశం ఉంటుంది.’’
‘డ్యూటీ ప్రాంతాల్లో సరైన వసతి, భోజన సౌకర్యాలు లేక అనారోగ్యం బారిన పడుతున్నాం. మానసిక ఒత్తిడిలో ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఏక్ పోలీసు విధానం తెస్తామని గతంలో సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. అదే అమలు చేయాలని ఇప్పుడు అడుగుతున్నాం’’ అని కానిస్టేబుల్ ఒకరు చెప్పారు.
రాజ్యాంగాన్ని ఎన్నోసార్లు సవరించుకున్నాం. ఈ మ్యాన్యువల్ ను ఎందుకు సరిచేయడం లేదు. ఈ ఉద్యోగంలో ఎప్పుడు ఎక్కడ ఉంటామో తెలియని కారణంగా స్పెషల్ పోలీసు సిబ్బంది అంటే పిల్లనివ్వడానికి కూడా ఎవరూ ముందుకు రావడం లేదు. కుటుంబంతో కలిసుండొచ్చని మనసు చంపుకుని ఆఫీసర్ల ఇళ్లలో పని మనుషులుగా(ఆర్డర్లీ) చేస్తున్న వారు ఉన్నారని ఆయన అన్నారు.
తరచూ ప్రాంతాలు మార్చకుండా ఐదేళ్ల పాటు ఒకే చోట విధినిర్వహణకు అవకాశం కల్పిస్తే కుటుంబాలతో సహా అక్కడే నివసించే అవకాశం కలుగుతుందని కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు కొందరు చెప్పారు.

ప్రమోషన్ వదులుకుంటున్నారు
స్పెషల్ పోలీసులో నాలుగేళ్ల తర్వాత హెడ్ కానిస్టేబుల్‌గా ప్రమోషన్ అవకాశం ఉంది. అయితే పదేళ్ల సర్వీసు పూర్తయితే అందుబాటులో ఉన్న ఖాళీల్లో కొందరికి కన్వర్షన్ కింద ఆర్మ్డ్ రిజర్వ్ విభాగంలోకి మారే అవకాశం ఉంది. దీంతో ప్రమోషన్ అవకాశం ఉన్నా వదులుకుంటున్నారని టీజీఎస్పీ కానిస్టేబుల్ ఒకరు తెలిపారు.
‘’గడిచిన మూడేళ్లలో నాలుగు నెలలు కూడా నా భర్త నాతో లేరు. మా బంధం చుట్టం చూపులా మారింది. డాడీ ఎందుకు లేడు అని పిల్లలు అడుగుతున్నారు.సింగిల్ పేరెంట్‌లా మా బతుకులు మారాయి. ఉద్యోగమే జీవితం కాదు కదా? ఇన్ని రోజులు ఓపికగా ఉన్నాం. ఇప్పుడు పరిస్థితి మరింత అధ్వాన్నంగా చేయాలని చూస్తున్నారు. మా కుటుంబాలు సంతోషంగా లేవు”అని పోలీసు కుటుంబ సభ్యురాలు ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రేహౌండ్స్, ఆక్టోపస్, ఇంటెలిజెన్స్, వీఐపీ సెక్యూరిటీ వింగ్, సిటీ సెక్యూరిటీ వింగ్, సీఐడీ, కౌంటర్ ఇంటెలిజెన్స్, ట్రాన్స్ కో, జెన్ కో విభాగాలతో పాటు రాజ్‌భవన్, సెక్రటేరియట్, మినిస్టర్స్ క్వార్టర్స్, అసెంబ్లీ, దిల్లీ లోని సీఎం రెసిడెన్స్, తెలంగాణ భవన్ భద్రతా విభాగాల్లో తెలంగాణ స్పెషల్ పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని కొంతమంది తెలిపారు.
“రాష్ట్రంలో హోమ్ మినిస్టర్ లేరు. ఆందోళనలను అర్థం చేసుకునే ప్రయత్నం అధికారులు చేయడం లేదు. పోలీసు సంక్షేమ సంఘం ముందుకు రావడం లేదు. ఐదేళ్లు స్థిరంగా ఒకే చోట ఉండేలా మార్పులు తేవొచ్చు. గతంలో సీనియర్ ఐపీఎస్ అధికారి జేవీ రాముడు ఈ సిఫార్సు చేశారు. దీని వల్ల బలగాలను తరలించే ఖర్చులు తగ్గి నిధులు ఆదా అవుతాయి’’ అని హైదరాబాద్‌కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ మురళీధర్ బీబీసీతో అన్నారు.

వీధుల్లోకి రావడం సరికాదు: డీజీపీ
ఆందోళనలకు ప్రతిపక్ష బీఆర్ఎస్ మాజీ మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి సంఘీభావం ప్రకటించారు. శనివారం(అక్టోబరు 26) నల్లగొండ జిల్లా అన్నెపర్తి బెటాలియన్ లో సంఘీభావం ప్రకటించేందుకు వచ్చిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.
బీఆర్ఎస్ నాయకుడు, మాజీ పోలీస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హైదారాబాద్‌లో ఆందోళనకు దిగిన పోలీస్ కుటుంబ సభ్యులను కలిసి మద్దతు ప్రకటించారు.
“15 రోజులు డ్యూటీ చేస్తే నాలుగు రోజులు సెలవు ఇవ్వాలన్న గత ప్రభుత్వ నిర్ణయాన్ని ఈ ప్రభుత్వం వెనక్కి తీసుకుంటోంది. గతంలో ఆర్డర్లీ వ్యవస్థను రద్దు చేశాం. కానీ ఇప్పటికీ ఉందని పోలీసు కుటుంబాలంటున్నాయి. ఏక్ పోలీస్ వ్యవస్థ తీసుకొస్తామని పీసీసీ అధ్యక్షుని హోదాలో రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. వారిని పిలిచి మాట్లాడాలన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి, అధికారులకు లేదు’’ అని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
డ్యూటీ దినాల సంఖ్య పెంచే కొత్త సర్క్యులర్‌పై నిరసనలు పెరుగుతుంటడంతో టీజీఎస్పీ అడిషనల్ డీజీ సంజయ్ జైన్ ఒక ప్రకటన విడుదల చేశారు.
“కొత్త ఉత్తర్వులు బెటాలియన్ సిబ్బందిలో గందరగోళం సృష్టించి కొంత బాధను కలిగించాయని నాకు అర్థం అయింది. ఆ ఆర్డర్‌ను ప్రస్తుతానికి రద్దు చేశాం. సమస్యల పరిష్కారానికి శాయశక్తులా ప్రయత్నం చేస్తాం. సిబ్బందికి వ్యక్తిగత ఫిర్యాదులుంటే నన్ను నేరుగా ఈమెయిల్ ([email protected]) లేదా వాట్సప్ (8712658531) ద్వారా సంప్రదించవచ్చు’’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
“టీజీఎస్పీ పోలీసుల సమస్యలను సానుభూతి, ప్రాధాన్యతతో పరిశీలిస్తున్నాం. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ పోలీసులకు ఎక్కువ జీతభత్యాలున్నాయి. ఆరోగ్య భద్రత లాంటి సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయి. వారు వీధుల్లోకి రావడం సరైంది కాదు. యూనిఫామ్ సర్వీసుల్లో క్రమశిక్షణా రాహిత్యం తీవ్రమైన విషయం. చట్ట ప్రకారం శిక్షార్హం’’ అని తెలంగాణ డీజీపీ జితేందర్ రెడ్డి ఒక ప్రకటన లో తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














