జర్మనీ: మనుషుల ప్రాణాలు తీస్తున్న ఆ పడవలను ఎలా అమ్ముతున్నారు, ఎక్కడ తయారవుతున్నాయి.. బీబీసీ అండర్‌కవర్

ఇంగ్లిష్ చానల్, వలసదారులు, అక్రమ రవాణా
    • రచయిత, జెస్సికా పార్కర్
    • హోదా, బెర్లిన్ ప్రతినిధి, ఎస్సేన్ నుంచి రిపోర్టింగ్

మొత్తం ప్యాకేజీ 15,000 యూరోలు (దాదాపు 13 లక్షల 64వేల రూపాయలు) అవుతాయని మాకు చెప్పారు. ఆ ప్యాకేజీలో భాగంగా ఇంగ్లిష్ చానల్ దాటడానికి ఓ డింగీ, ఒక ఔట్‌బోర్డు మోటర్, 60 లైఫ్ జాకెట్లు ఇస్తారు.

ఎస్సేన్‌లోని అండర్‌కవర్ బీబీసీ జర్నలిస్ట్‌కు ఇద్దరు చిన్నబోట్ల స్మగ్లర్లు చెప్పిన ‘మంచి ధర’ ఇది. పశ్చిమ జర్మనీలోని ఓ నగరం ఎస్సేన్. వలసదారులు ఈ నగరం మీద నుంచి ప్రయాణించడమో, ఇక్కడే నివసించడమో చేస్తుంటారు.

ఇంగ్లిష్ చానల్ మీదుగా కొనసాగుతున్న మానవ అక్రమ రవాణాతో జర్మనీకి ఉన్న సంబంధాన్ని 5 నెలల పాటు పరిశోధించి బీబీసీ బట్టబయలు చేసింది.

ఈ తరహా ముఠాలను అంతమొందిస్తామని బ్రిటన్ నూతన ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇంగ్లిష్ చానల్ దాటడానికి ఉపయోగించే బోట్లు, ఇంజిన్స్‌ను దాచడానికి జర్మనీ అడ్డాగా మారిపోయిందని బ్రిటన్‌ నేషనల్ క్రైమ్ ఏజెన్సీ బీబీసీకి ధ్రువీకరించింది.

బీబీసీ రహస్యంగా వీడియో రికార్డు చేస్తున్న క్రమంలో స్మగ్లర్లు ఏం చెప్పారంటే... వారు జర్మనీ పోలీసులతో దాగుడు మూతలు ఆడుతూ ఆ పడవలు వారి కంటపడకుండా వాటిని వివిధ రహస్య గోదాములలో దాచుతారుట.

ఈ ఏడాది ఇప్పటికే ఈ చానల్ గుండా ప్రమాదకర స్థాయిలో వలసలు జరిగాయి. ఇప్పటి వరకు 28,000 మందికిపైగా కిక్కిరిసిపోయిన చిన్నబోట్లలో ప్రమాదకరంగా ప్రయాణించారని ఐక్యరాజ్యసమితి లెక్కలు చెబుతున్నాయి.

ఎస్సేన్ నగరంలో సెంట్రల్ స్టేషన్ బయట మా అండర్‌కవర్ రిపోర్టర్ వేచి చూస్తున్నారు.

అతను ఓ సీక్రెట్ కెమెరా ధరించి, సిరియా వలసదారుడిగా నటిస్తున్నారు. తన కుటుంబం, స్నేహితులతో కలిసి యూకేకు వెళ్లేందుకు ఇంగ్లిష్ చానల్ గుండా ప్రయాణించడానికి ఆసక్తిగా ఉన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.

ఆ రిపోర్టర్ భద్రత దృష్ట్యా అతడి వివరాలు కచ్చితంగా గోప్యంగా ఉండాలి. అందుకే, మేం అతడిని ‘హంజా’గా పిలుస్తున్నాం.

అతను ఓ వ్యక్తి దగ్గరకి వెళ్తున్నాడు. ఆయన ఎవరో కాదు నెలల తరబడి వాట్సాప్ కాల్స్ ద్వారా హంజాతో సంప్రదింపులు జరుపుతున్న వ్యక్తి. వలసదారుల సంఘం నుంచి ఆ వ్యక్తి నంబర్‌ను హంజా సంపాదించాడు. కానీ, వారు కలుసుకోవడం ఇదే మొదటి సారి.

ఆ వ్యక్తి తనను తాను ‘అబూ సహర్‌’గా పరిచయం చేసుకున్నారు. అది ఆయన నిజమైన పేరో కాదో తెలియదు.

బీబీసీ న్యూస్ తెలుగు, వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

నెలల తరబడి సంభాషణ

ఇంగ్లండ్ దక్షిణ తీర ప్రాంతానికి వెళ్లడానికి డింగీ (చిన్న బోటు)ని ఎలా సిద్ధం చేస్తారనే విషయంపైనే సహర్‌తో హంజా నెలలు తరబడి మాట్లాడుతున్నారు.

“కలైస్ ప్రాంతంలో స్మగ్లింగ్ ముఠాలతో మాకు చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఈ అనుభవాలే మా కుటుంబ సభ్యులు, స్నేహితులు ఒంటరిగా సరిహద్దులు దాటేందుకు ప్రేరేపిస్తున్నాయి. అదో అసాధారణమైన చర్య” అని హంజా ఆ స్మగ్లర్‌తో చెప్పారు.

సహర్ ఎస్సేన్‌ ప్రాంతంలోని ఓ గోదాములో దాచి ఉంచిన డింగీ బోటు వీడియోను హంజాకు పంపారు. ఈ బోటు కొత్తదని కూడా చెప్పారు.

ఆ వీడియో ఒక్కటే కాకుండా ఇలాంటి మరిన్ని బోట్లు, ఔట్‌బోర్డ్ ఇంజిన్ల వీడియోలు కూడా పంపుతానని చెప్పారు.

బీబీసీ ఇన్వెస్టిగేటివ్ రిపోర్టింగ్, యూకే , బ్రిటన్, జర్మనీ
ఫొటో క్యాప్షన్, వివిధ రకాల బోట్ల వీడియోలు స్మగ్లర్లు బీబీసీ రిపోర్టర్‌‌కు పంపారు

కదలికలను పసిగడుతూ..

ఆ బోట్ల నాణ్యతను తాను పరిశీలించాలనుకుంటున్నట్టు హంజా సహర్‌కు తెలిపారు. అందుకే వాళ్లిద్దరు ఇప్పుడు కలుసుకుంటున్నారు.

హంజా కదలికలను దగ్గర్లోని ఓ ప్రదేశం నుంచి బీబీసీ బృందం పర్యవేక్షిస్తోంది. అన్నీ అనుకున్నట్టుగా కాకుండా, ఏదైనా తప్పు జరిగితే వెంటనే ఆ రిపోర్టర్‌ను కాపాడటానికి ఆ బృందం అక్కడ సిద్ధంగా ఉంది.

వాళ్లిద్దరూ ఎస్సేన్‌ సెంట్రల్ స్టేషన్‌లోకి వెళ్లారు. ఇక్కడి నుంచి ఆ గోదాములు ఉన్న స్థలానికి వెళ్లడానికి కేవలం 15 నిమిషాలు మాత్రమే పడుతుంది.అయినా,అక్కడికి వెళ్లి బోట్లను చూడటం చాలా ప్రమాదకరమని హంజాతో సహర్ చెప్పారు.

అయితే, ఆ బోట్లను జర్మనీలో ఈ ప్రాంతంలోనే ఎందుకు దాచారు? అని హంజా అడిగారు. దీనికి సమాధానంగా ‘భద్రత, సౌలభ్యం ’ కోసమని సహర్ తెలిపారు.

పడవల దగ్గరకు చేరుకోవాలంటే కలైస్ ప్రాంతానికి వెళ్లాలి. ఈ ప్రాంతం ఎస్సేన్ నుంచి కేవలం 4,5 గంటల ప్రయాణ దూరంలో ఉండటం, ఉత్తరఫ్రాన్స్‌లో గట్టి గస్తీ ఉండే బీచ్‌లకు దూరంగా ఉండటంతో ఇది వ్యూహాత్మకంగా మారింది.

జర్మనీలో పోలీసుల దాడులు జరుగుతాయి. కొన్ని దాడుల కోసం యూరోపియన్ అరెస్ట్ వారెంట్లను ఉపయోగిస్తారు. అయితే యూరోపియన్ యూనియనేతేర దేశాలకు మనుషుల అక్రమ రవాణాను జర్మనీ చట్టవిరుద్ధంగా పరిగణించదు. బ్రెగ్జిట్ కారణంగా యూకే ఇప్పుడు యూరోపియన్ యూనియేనేతర దేశంగా మారింది.

జర్మనీ, యూకే భౌగోళికంగా ఇరుగుపొరుగు దేశాలేమీ కాదని, ప్రత్యక్షంగా ఎటువంటి స్మగ్లింగ్ జరగడం లేదని బెర్లిన్‌ అంతర్గత వ్యవహారాల శాఖ వాదిస్తోంది. కానీ, జర్మనీ చట్టాలపై తాము నిరాశతో ఉన్నామని బ్రిటన్ హోం మంత్రిత్వశాఖ వర్గాలు బీబీసీకి తెలిపాయి.

హంజాను సహర్ ఓ కేఫ్‌కు తీసుకెళ్లారు. అక్కడ సిగరెట్, కాఫీ ఆర్డర్ చేశారు. అయితే, వాళ్లు కూర్చున్న టేబుల్ పక్కనే అరబిక్ మాట్లాడేవాళ్లు ఉండటంతో వాళ్లు తమ సంభాషణ వింటారేమోనని సహర్, హంజాను మరో టేబుల్‌ వైపు తీసుకెళ్లారు.

అలా ఓ 35 నిమిషాలు గడిచిన తరువాత సహర్ కుర్చీలోనుంచి లేచి ‘మెల్లిగా మాట్లాడు, ఆయన వస్తున్నారు’ అని హంజాకు చెప్పారు.

స్మగ్లింగ్, స్మగ్లర్ల ముఠా, ఐక్యరాజ్యసమితి, నేరాలు
ఫొటో క్యాప్షన్, ఈ వ్యక్తిని "అల్-ఖల్" అని పరిచయం చేశారు, అంటే అంకుల్ అని అర్ధం.అరబిక్ లో గౌరవాన్ని సూచిస్తుంది.

‘బాడీగార్డుతో వచ్చి...’

బేస్ బాల్ టోపీ, మంచి దుస్తులు ధరించిన ఓ వ్యక్తి వచ్చారు. ఆయనను "అల్-ఖల్" అని పిలుస్తారు, దీని అర్థం "అంకుల్". ఇది అరబిక్‌లో గణనీయమైన గౌరవాన్ని పొందే వ్యక్తిని సూచించే పదబంధం.

ఖల్‌తో పాటు మరొక వ్యక్తి వచ్చారు. కానీ ఆయన పెద్దగా మాట్లాడేలా కనిపించలేదు. చూడటానికి ఖల్ బాడీగార్డ్‌లాగా ఉన్నారు.

ఖల్‌ వెయిటర్స్‌కు షేక్‌హ్యాండ్‌ ఇచ్చి వారితో జర్మన్ భాషలో మాట్లాడారు. ఆ తరువాత మాతృభాష అరబిక్‌లో మాట్లాడారు.

తన మొబైల్ ఫోన్‌ ఇవ్వాలని వాళ్లు హంజాను అడిగారు. ఇవ్వగానే, దానిని తీసి వేరే టేబుల్‌పై పెట్టారు.

హంజా పక్కనే ఆ బాడీగార్డు కూర్చున్నారు. అలా, 22 నిమిషాల పాటు సమావేశం జరుగుతున్నంత సేపూ అతడు హంజాను నిశితంగా గమనిస్తూనే ఉన్నాడు.

అయితే, జర్మనీలోని చట్టాల ప్రకారం ఆ సమావేశానికి సంబంధించి బీబీసీ కేవలం వీడియో మాత్రమే రికార్డు చేయలగదు. ఆడియో కాదు.

కాబట్టి, ఆ సమయంలో అక్కడ ఏం జరిగిందనే విషయాలను మా అండర్‌కవర్ రిపోర్టర్‌ తనకు గుర్తున్న విషయాలన్నీ వెంటవెంటనే చెప్పారు. జర్మనీ ఇన్వెస్టిగేటివ్ రిపోర్టింగ్‌లో ఇది కూడా ఓ పద్ధతి.

అయితే, హంజాకు స్మగ్లర్లకు మధ్య జరిగిన మెసేజులు, కాల్ రికార్డులు, వాయిస్ నోట్స్ బ్యాకప్ అయ్యాయి.

అసలు తాను ఎవరు? తనకు ఏం కావాలో? చెప్పడానికి హంజా ప్రయత్నించగా “మీరు మాట్లాడకండి ” అన్నట్లుగా ఖల్ వారించారు.

అయితే, హంజా మరోసారి తన వివరాలను ఆయనకు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేశారు.

జర్మనీ చట్టాల్లో ‘గ్రే జోన్లు’ ఉన్నప్పటికీ బోట్లు కొనుగోలు చేయడం చట్టవిరుద్ధం కదా.. అని అంటూ హంజా అడిగారు.

హంజా మాటలను ఖల్ తిరస్కరించాడు.

“ఇది చట్ట విరుద్ధమని నీకు ఎవరు చెప్పారు” అని ఖల్ అడిగారు.

బోట్ స్మగ్లింగ్‌కు సంబంధించి జర్మనీ చట్టాల్లో లొసుగులు ఉన్నప్పటికీ, విస్తృతమైన క్రైమ్ నెట్‌వర్క్‌లో తాము భాగమైనట్లు వాళ్లకు తెలుసు.

వారు కాఫీ సేవిస్తూ ఖల్, తనకు ఎన్ని గోదాములు ఉంది హంజాకు వివరించారు. తమకు ఎస్సేన్ ప్రాంతంలో 10 గోదాములు ఉన్నాయని చెప్పారు.

మొత్తం అన్నింటినీ ఒకేచోట కాకుండా వివిధ ప్రాంతాలలో దాచడం ద్వారా పోలీసుల దాడుల నుంచి వాటిని కాపాడుకోవచ్చని తెలిపారు.

అయితే, కొన్నిసార్లు సోదాలకు వచ్చిన పోలీసులకు ‘ఎర’ వేస్తామని వాళ్లు తెలిపారు. ఎలాగంటే, రికార్డుల్లో రాసుకోవడానికి పేరుకు కొన్ని వస్తువులు స్వాధీనం చేసుకోవడానికి అవకాశమిస్తారు. అంతేకానీ, మొత్తం ఆపరేషన్‌కు అంతరాయం కలిగించేలా పోలీసుల దాడులు ఉండవని వాళ్లు చెప్పారు.

బోట్లు, లైఫ్ జాకెట్లు, నిఘా, ఫ్రెంచ్ తీరం

ఫొటో సోర్స్, Gareth Fuller/PA Wire

ఫొటో క్యాప్షన్, చానల్ దాటడానికి వలసదారులు ఉపయోగించే బోట్లు

చైనా టు తుర్కియే

తమ వస్తువులను కలైస్ ప్రాంతానికి 3,4 గంటల్లో చేర్చగలమా అన్న విషయంపై స్మగ్లర్లు మాట్లాడుకుంటున్నారు. దానిని బట్టి ఏం అర్థం అవుతుందంటే వాళ్లు రోడ్డు కంటే నీటి ప్రయాణానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.

సరిహద్దులు దాటేందుకు అనువైన వాతావారణ పరిస్థితుల మేరకు ఎస్సేన్ ప్రాంతంలో ఉదయం లేదా మధ్యాహ్నంలోపు బోట్లు డెలివరీ చేయొచ్చు.

అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరాలకు వ్యతిరేకంగా గ్లోబల్ ఇనిషియేటివ్ చేసిన పరిశోధన ప్రకారం.. “జర్మనీ, బెల్జియం లేదా నెదర్లాండ్స్ నుంచి బోట్లను వ్యాన్లు లేదా కార్ల ద్వారా ఫ్రెంచ్ తీరానికి తరలిస్తారు. వీటిల్లో జర్మనీ ఓ ముఖ్యమైన రవాణ కేంద్రం.”

చాలా వరకు ఆ బోట్లను చైనాలో తయారు చేసి కంటైనర్‌ల ద్వారా తుర్కియేకు పంపుతున్నారు. అక్కడి నుంచి ఐరోపాకు వస్తున్నాయి.

అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ఫ్రాన్స్‌లో కఠినమైన చర్యలు తీసుకోవడంతో వ్యవస్థీకృత ముఠాలు చేసే నేరాలకు జర్మనీ కేంద్రంగా మారిందని రచయిత ట్యూస్‌డే రైటానో చెప్పారు.

తమ సరిహద్దుల్లో అదేమీ పెద్ద సమస్య కాదు కాబట్టి దీనిని జర్మనీ అధికారులు పెద్దగా పట్టించుకోవట్లేదని ఆమె నమ్ముతున్నారు.

ఇన్వెస్టిగేటివ్ రిపోర్టింగ్, సీక్రెట్ కెెమెరా, జర్మనీ చట్టాలు
ఫొటో క్యాప్షన్, కేఫ్‌లో స్మగ్లర్లతో మాట్లాడుతున్నప్పుడు సీక్రెట్ కెమెరాతో వీడియో రికార్డు చేశారు

ఒక్కో ప్యాకేజీ ఒక్కో తీరు...

ఇక కేఫ్ విషయానికొస్తే, ఇదంతా చట్టబద్ధమని హంజా నమ్మి, డబ్బుల గురించి మాట్లాడటంపై ఖల్ సంతృప్తి చెందారు.

15,000 యూరోల విలువైన ప్యాకేజీని హంజా తీసుకోవాలన్నది ఆయన కోరిక.

ఈ ప్యాకేజీలో భాగంగా బోటు, ఇంజిన్, ఇంధనం, పంపుతో పాటు 60 లైఫ్ జాకెట్లు కలే ప్రాంతానికి సమీపంలో ఇస్తారు. ఇందులో హంజాకు కావాల్సిన దానికంటే ఎక్కువ సౌకర్యాలు ఇస్తున్నారు. కానీ, వలసదారులను ఆకర్షించడానికి వాళ్లు పెట్టుకున్న స్థిరమైన ప్యాకేజీ అది.

ఉదాహరణకు పెద్దవాళ్లు ఒక్కొక్కరికి 2,000 యూరోలు (1,82,134 రూపాయలు) వసూలు చేయడం, ఒకే ట్రిప్‌లో అనేక మందిని పంపడం వల్ల స్మగ్లర్లు భారీ స్థాయిలోనే లాభాలు పొందుతున్నారని గ్లోబల్ ఇనిషియేటివ్ పేర్కొంది.

ఒక వేళ ఈ డీల్ కుదిరితే ఫ్రెంచ్ తీర ప్రాంతానికి కేవలం 200 మీటర్ల దూరంలో బోటు రేపటిలోగా లభిస్తుందని ఖల్ తెలిపారు.

అయితే, ఫ్రెంచ్ అధికారుల నిఘా తక్కువగా ఉండే కొత్త క్రాసింగ్ పాయింట్‌ను ఖల్, సహర్‌లు సూచిస్తున్నారు. కానీ, ఆ ప్రాంతం పేరు హంజాకు చెప్పట్లేదు.

హంజా కోసం వారు ఇంకో చౌకైన ఆఫర్ కూడా ఇచ్చారు.

8,000 యూరోలు (7,28,536 రూపాయలు) ఇస్తే ఎస్సేన్‌లోని గోదాము నుంచి బోటును ఉత్తర ఫ్రెంచ్ తీరానికి తానే స్వయంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది.

ఇది హంజా స్వతంత్రంగానే చేయాలి. ఈ క్రమంలో పట్టుపడితే స్మగ్లర్లకు సంబంధం ఉండదు.

మరి, హంజా ఏ ప్కాకేజీకి ఒప్పుకుంటారన్న చర్చలు జరుగుతున్నాయి.

అయితే, తుర్కియేలో డబ్బులు చెల్లించాలని ఖల్ కోరుకుంటున్నాడు. ఎందుకంటే, అతడికి కావాల్సిన వస్తువులన్నీ అక్కడి నుంచే వస్తాయి.

అయితే, డబ్బులు ఆన్‌లైన్, బ్యాంకుల ద్వారా కాకుండా హవాలా రూపంలో కావాలని డిమాండ్ చేశారు.తరువాత, హంజాకు వాట్సాప్‌లో ఓ అకౌంట్ వివరాలు వచ్చాయి.

కేఫ్ మీటింగ్ తరువాత అరబిక్‌ భాషలో వాయిస్ నోట్స్, మెసేజులు పంపించారు. అలాగే, ఔట్‌బోర్డు మోటర్స్ బ్రాండ్స్ వివరాలు కూడా సహర్ పంపించారు. అయితే, హంజాకు మెర్కురీ అంటే ఇష్టం. అయినప్పటికీ, అక్కడ ‘యమహా’ ఉంటే అదే కావాలని హంజా చెప్పాడు.

‘డిమాండ్ ఎక్కువగా ఉంది’

మా దగ్గర స్టాక్ తక్కువగా ఉంది. కొనుగోలుదారులేమో చాలా ఎక్కువమంది ఉన్నారని స్మగ్లర్లు హంజాకు చెప్పారు. ఆయన వెంటనే ప్యాకేజీ తీసుకోవడానికి ఇదో వ్యుహం కావొచ్చు.

ఈ విషయాలలో ఖల్ చాలా జాగ్రత్తగా ఉంటాడు. సహర్ ఫార్వర్డ్ చేసిన వాయిస్ నోట్‌లో “నీ స్నేహితుడు నాకెందుకో సరిగ్గా అనిపించట్లేదు” అని ఖల్ చెప్పినట్లు ఉంది.

అయినప్పటికీ, హంజా బోట్ కొనాలనుకుంటున్నాడా లేదా అన్నది రెండు మూడు గంటల్లో తెలుసుకుని చెప్పాలని సహర్‌కు ఖల్ చెప్పాడు.

అయితే,కావాలనే తాను ఈ డీల్‌తో ముందుకు వెళ్లలేనని హంజా వాళ్లకు చెప్పారు.

ఈ వ్యక్తులకు బీబీసీ డబ్బులు చెల్లించలేదు. వారి నిజమైన గుర్తింపులను మేం నిర్థరించలేకపోయాం.

బోట్ల గురించి మేము అందుకున్న ఫుటేజీని నేషనల్ ఇండిపెండెంట్ లైఫ్ బోట్ అసోసియేషన్ చైర్మన్ నీల్ డాల్టన్‌కు చూపించాం. తానైతే ఇలాంటి బోట్లలో సముద్రంలో ప్రయాణించనని చెప్పారు.

దీనిని మరణ ఉచ్చుగా ఆయన అభివర్ణించారు. చానల్ దాటడానికి ఈ బోటులో డజన్ల కొద్ది ప్రయాణించడం ప్రమాదకరమని, ఆ బోట్లు చాలా నాసిరకంగా ఉన్నాయని తెలిపారు.

అదే సమయంలో, ఈ ముఠాలను ఎదుర్కోవడంలో జర్మనీ, యూకేల మధ్య సహకారం మెరుగుపడాలని దౌత్యవేత్తలు నొక్కిచెబుతున్నారు.

ఇతర దేశాల భాగస్వామ్యంతో జర్మనీలో అరెస్టులు, గోదాములపై దాడులు జరిగాయి.

ఈ ఫిబ్రవరిలో పోలీసులు దాడులు చేసి బోట్లు, ఇంజిన్లు, లైఫ్ జాకెట్స్ వంటివి స్వాధీనం చేసుకున్నారు. ఈ సోదాల్లో భాగంగా 19 మందిని అరెస్ట్ చేశారు. కానీ, అవి బెల్జియం, ఫ్రెంచ్ న్యాయపరమైన ఆదేశాల మేరకు జరిగాయి. 2022లోనూ ఇదే తరహా ఆపరేషన్‌కు సంబంధించి ఫ్రాన్స్‌లో ప్రత్యేక విచారణ జరుగుతోంది.

ఫ్రెంచ్ తీరం, నేరాలు, అంతర్జాతీయ నేరాలు
ఫొటో క్యాప్షన్, ఫ్రెంచ్ తీరంలో పడి ఉన్న రబ్బరు బోట్లు

జోరుగా అక్రమ వ్యాపారం

ఇలా అక్రమ రవాణాకు సహకరిస్తున్న ముఠాలను నాశనం చేసేందుకు జర్మనీ సహా ఇతర దేశాలతో కలిసి పని చేయడం పెరిగిందని యూకే హోం మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి బీబీసీతో చెప్పారు. అయితే, ఇంకా కలిసి చేయాల్సినవి చాలానే ఉన్నాయన్నారు.

దీనికి ఫ్రెంచ్ ప్రభుత్వం కూడా మద్దతుగా నిలుస్తోంది.

“మా తీర ప్రాంతంలో ఈ బోట్లకు నేరాలతో సంబంధం ఉందని జర్మనీకి చూపడం ముఖ్యం. దీనివల్ల వారు ఇందులో జోక్యం చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది’’అని ఉత్తర ఫ్రాన్స్‌లోని ప్రాసిక్యూటర్ పాస్కల్ మార్కాన్‌విల్లే ఈ నెల(అక్టోబర్) ప్రారంభంలో బీబీసీకి చెప్పారు.

ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బాగున్నాయని బెర్లిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ బీబీసీతో చెప్పింది. అలాగే, యూకే ప్రభుత్వం వినతి మేరకు జర్మనీ అధికారులు చర్యలు తీసుకుంటారని స్పష్టం చేసింది.

జర్మనీ నుంచి యూకేకు వెళుతున్న వలసదారుల అక్రమ రవాణాకు సాయం చేయడం చట్టవిరుద్ధం కాకపోయినప్పటికీ, చానల్ క్రాసింగ్ ద్వారా బెల్జియం లేదా ఫ్రాన్స్‌కు రవాణా చేయడం చట్ట విరుద్ధమని ఓ అధికార ప్రతినిధి చెప్పారు.

ఈ సమస్య పరిష్కారానికి మేం ఏదైతే చేయాలనుకుంటున్నామో దానిని బీబీసీ ఇన్వెస్టిగేషన్ హైలైట్ చేస్తోందని డౌనింగ్ స్ట్రీట్ చెప్పింది.

ఈ వలసదారుల అక్రమ రవాణాను కట్టడి చేయడానికి జర్మనీ ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టాల్సిన అవసరముందా? అని బీబీసీ అడిగిప్పుడు.... “ఈ కట్టడి చర్యల అమలుపై వేగం పెంచడం ముఖ్యం. ఇతర దేశాలకు కూడా ఇది వర్తిస్తుంది” అని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ అధికార ప్రతినిధి సమాధానమిచ్చారు.

“వారి కదలికలపై మనం క్రమం తప్పకుండా దృష్టిపెట్టాలి. ఇందుకోసం, మేము జర్మనీతో పాటు ఇతర దేశాలతో కలిసి పని చేస్తున్నాం” అని ఆ అధికార ప్రతినిధి చెప్పారు.

నేషనల్ క్రైమ్ ఏజెన్సీ వివరాల ప్రకారం.. ఈశాన్య ఫ్రాాన్స్ తీరాల వెంబడి, సరిహద్దులు దాటేందుకు ప్రయత్నించి విఫలమైన బోట్ల అవశేషాలు మనం చూడొచ్చు.

ఈ బీచ్‌లలో గాలి తీసిన రబ్బరు పడవలు, వాడి పారేసిన లైఫ్ జాకెట్స్‌ కనిపిస్తాయి.

అయితే, తమ మెరుగైన జీవితం కోసం ఇదో మార్గం అని వలసదారులు భారీ మొత్తాల్లో చెల్లించి ఉంటారు.

నిరాశ, బాధ, శోకం, మరణాలతో కూడిన ఈ వాణిజ్యం ఐరోపాలో క్రమంగా వృద్ధి చెందుతోంది.

అదనపు రిపోర్టింగ్ : కోస్టాస్ కల్లెర్గిస్

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)