ఇజ్రాయెల్ దాడులు: ఇరాన్ ప్రతిస్పందన ఏంటి?

అక్టోబరు 1న ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇరాన్ క్షిపణులు(ప్రతీకాత్మక చిత్రం)

అక్టోబరు 1న ఇజ్రాయెల్‌పై ఇరాన్ జరిపిన క్షిపణి దాడులకు ఇజ్రాయెల్ నుంచి ఎప్పటికైనా ప్రతిస్పందన ఉంటుందని అందరూ అనుకున్నదే. ఇరాన్‌లోని కొన్ని సైనిక స్థావరాలపై శనివారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ వైమానిక దాడులకు దిగింది. కొంతసేపటికి వాటిని నిలిపివేసింది.

ఈ దాడుల వివరాలను ఇజ్రాయెల్ వెల్లడించింది.

ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా వైమానిక దాడులు చేశామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) ప్రకటించింది.ఇరాన్ క్షిపణి కేంద్రాలపై ఈ దాడులు చేసినట్టు ఇజ్రాయెల్ తెలిపింది. ఈ క్షిపణి కేంద్రాలలోనే ఇరాన్, ఇజ్రాయెల్‌పై దాడులు చేయడానికి కావాల్సిన మిస్సైళ్ళను తయారుచేసింది.

"మిస్సైల్ ప్లాంట్లతో పాటు,ఇరాన్ ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణులున్న కేంద్రాలను, దాని వైమానిక సామర్థ్యాలను కూడా లక్ష్యంగా చేసుకున్నామని’’ ఐడీఎఫ్ తన ప్రకటనలో తెలిపింది. ఇజ్రాయెల్‌ వైమానిక దాడుల సామర్థ్యాన్ని అడ్డుకునేందుకు ఇరాన్ ఉపయోగిస్తున్న స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నామని ఐడీఎఫ్ వెల్లడించింది.

ఏప్రిల్, అక్టోబర్‌లలో ఇరాన్, దాని మిత్రదేశాలు జరిపిన దాడులు పశ్చిమాసియా స్థిరత్వం,భద్రతకు హానికలిగించాయని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కూడా బలహీనపరిచాయని ఇజ్రాయెల్ మిలటరీ తెలిపింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
తెహ్రాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తెహ్రాన్‌లో ప్రజల నిరసన ప్రదర్శన

ఇజ్రాయెల్ దాడులను ధ్రువీకరించిన ఇరాన్

ఇజ్రాయెల్ దాడులను ఇరాన్ ధ్రువీకరించింది. తెహ్రాన్, ఖుజెస్తాన్, ఇలాం ప్రావిన్స్‌లలోని తమ సైనిక స్థావరాలపై దాడులు జరిగాయని ఇరాన్ వైమానిక దళం ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ దాడులను విజయవంతంగా ఎదుర్కొన్నామని ఇరాన్‌ ప్రకటించింది. కొన్ని ప్రాంతాల్లో స్వల్ప నష్టం జరిగిందని తెలిపింది.

ల్లాయిడ్ ఆస్టిన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అమెరికా రక్షణమంత్రి లాయిడ్ ఆస్టిన్ (ఫైల్ ఫోటో)

అమెరికా ఏం చెప్పింది..?

ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీర్చుకోవద్దని ఇరాన్‌ను అమెరికా కోరింది.

"మరోసారి ఇరాన్ దాడి చేస్తే, మేం సిద్ధంగా ఉన్నాం. పర్యవసానాలను ఇరాన్ ఎదుర్కోవాల్సి ఉంటుంది’’ అని బైడెన్ పాలనాయంత్రాంగంలో సీనియర్ అధికారి ఒకరు తన ప్రకటనలో హెచ్చరించారు.

అలాంటి పరిస్థితి తలెత్తాలని అమెరికా కోరుకోవడం లేదని ఆ ప్రకటనలో తెలిపారు.

"ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ప్రత్యక్ష దాడులు ఇంతటితో ముగిసిపోవాలి. లెబనాన్‌లో యుద్ధాన్ని ముగించడంతో పాటు గాజాలో శాంతి నెలకొల్పడానికి, హమాస్ ఆధీనంలో ఉన్న ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయించడానికి కావాల్సిన ప్రయత్నాలు చేయడానికి అమెరికా సిద్ధంగా ఉంది’’ అని ఆయన ఆ ప్రకటనలో చెప్పారు.

ఇజ్రాయెల్ దాడిని సమర్థించిన అమెరికా

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడిని ఆత్మరక్షణ చర్యగా అమెరికా పేర్కొంది

‘‘విద్యుత్,అణుప్లాంట్లపై దాడులు వద్దు’’

ఇజ్రాయెల్ ఇరాన్‌పై చేసిన దాడిని బీబీసీ పశ్చిమాసియా ప్రాంత సంపాదకుడు సెబాస్టియన్ ఉషర్ విశ్లేషించారు.

తెహ్రాన్ ఆకాశంలో మెరిసే వస్తువులు తేలియాడుతున్నట్టు ఇరాన్ నుంచి వస్తున్న వీడియోల్లో కనిపిస్తోంది. అలాగే పేలుళ్ల శబ్దాలు కూడా వినిపిస్తున్నాయి.

తెహ్రాన్ పశ్చిమ ప్రాంతాలను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకున్నట్టు ఇరాన్ మీడియా ధ్రువీకరించింది.అయితే దీని వల్ల స్వల్ప నష్టం మాత్రమే జరిగిందని తెలిపింది. మూడు దాడులు జరిపినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది.

ఇజ్రాయెల్ విస్తృత దాడులు చేసిందని సిరియా ప్రభుత్వ వార్తా సంస్థ కూడా ప్రకటించింది.

ఇరాన్ మద్దతుతోనే సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ సుదీర్ఘకాలంగా అధికారంలో కొనసాగుతున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.

దాడికి ముందు ఇజ్రాయెల్ తమకు సమాచారమిచ్చిందని అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ తెలిపింది. అయితే ఈ ఆపరేషన్‌లో అమెరికా ప్రమేయం లేదని చెప్పింది.

ఇరాన్‌లోని విద్యుత్, అణుప్లాంట్లపై ఇజ్రాయెల్ దాడి చేయలేదని అమెరికా అధికారి ఒకరు తెలిపారు.

ఈ లక్ష్యాలపై దాడి చేయవద్దని బైడెన్ పరిపాలన యంత్రాంగం ఇజ్రాయెల్‌ను కోరింది.

డేనియల్ హగర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇజ్రాయెల్ ఆర్మీ ప్రతినిధి

‘ఇది అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన’

ఇజ్రాయెల్ దాడిపై స్పందించాలా వద్దా అనేదానిపై ఇరాన్ నాయకత్వం నిర్ణయం తీసుకోవాలి.

తమను తాము రక్షించుకునే హక్కు, బాధ్యత ఇరాన్‌కు ఉందని, ఈ దాడి అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన అని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అభివర్ణించింది. ప్రాంతీయ శాంతి భద్రతలపై తెహ్రాన్ తన బాధ్యతలను గుర్తిస్తుందని తెలిపింది.

ఉద్రిక్తతలను పెంచేందుకు ఇరాన్ కొత్తదాడికి దిగితే... ప్రతీకారం తీర్చుకోవాల్సి వస్తుందని ఇజ్రాయెల్ సైన్యం ఇప్పటికే తెలిపింది.

ప్రపంచంలో సార్వభౌమదేశాల్లాగే ప్రతిస్పందన హక్కు, బాధ్యత ఇజ్రాయెల్‌కు కూడా ఉన్నాయని తమ దాడులను సమర్థించుకుంటూ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) ప్రకటించింది.

"మాకు రక్షణ, ఎదురుదాడి సామర్థ్యాలు చాలా ఉన్నాయి. ఇజ్రాయెల్ దేశాన్ని, ప్రజలను రక్షించడానికి ఏది అవసరమో అది మేం చేస్తాం’’ అని ఇజ్రాయెల్ ఆర్మీ ప్రతినిధి డేనియల్ హగర్ అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)