హిజ్బుల్లా: కొత్త నాయకుడిగా నయీం ఖాసీం, ఈయన కూడా ఎక్కువ కాలం ఉండబోరన్న ఇజ్రాయెల్

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, జాక్వెలిన్ హోవార్డ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఇప్పటి వరకు గ్రూప్ డిప్యూటీ జనరల్ సెక్రటరీగా పని చేసిన నయీం ఖాసీం తమ కొత్త నాయకుడని హిజ్బుల్లా ప్రకటించింది.
బేరూత్‌లో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ఆ సంస్థ నాయకుడు హసన్ నస్రల్లా మరణించడంతో ఆయన స్థానంలో నయీం ఖాసీం నియమితులయ్యారు.
వరుస దాడులతో హిజ్బుల్లా నాయకులను ఇజ్రాయెల్ హతమార్చుతున్న తరుణంలో... జీవించి ఉన్న ఆ సంస్థ సీనియర్ నాయకుల్లో ఖాసీం ఒకరు.
లెబనాన్‌లో ఘర్షణలు గత కొన్ని వారాలుగా తీవ్రరూపం దాల్చుతున్న తరుణంలో ఈ నియామకం జరిగింది.

నయీం ఖాసీం ఎవరు?
30 ఏళ్లకుపైగా హిజ్బుల్లా డిప్యూటీ సెక్రటరీ జనరల్‌గా నయీం ఖాసీం పని చేస్తున్నారు. ఆ సంస్థకు చెందిన అత్యంత గుర్తింపు కలిగిన నాయకుల్లో ఈయన ఒకరు.
తమ సంస్థ నియమ నిబంధనల ప్రకారం నూతన నాయకుడు షురా కౌన్సిల్ ద్వారా ఎన్నికైనట్లు హిజ్బుల్లా తెలిపింది. అయితే, నయీం ఖాసీం ఎక్కడున్నారనేది మాత్రం స్పష్టంగా తెలియదు.
హిజ్బుల్లాకు ప్రధాన మద్దతుదారైన ఇరాన్‌లో ఆయన తలదాచుకుంటున్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి.
1953లో బేరూత్‌లో లెబనాన్ దక్షిణ ప్రాంతంలో ఖాసీం జన్మించారు. హిజ్బుల్లా సంస్థ వ్యవస్థాపకుల్లో ఈయన ఒకరు. హసన్ నస్రల్లా మరణం తరువాత మూడుసార్లు టీవీలో కనిపించి ప్రసంగించారు.
ఇజ్రాయెల్ తమ పౌరులను వెనక్కి రప్పించుకోవాలంటే 'కాల్పుల విరమణ' ఒక్కటే మార్గమని నయీం ఖాసీం ఒక ప్రసంగంలో అన్నారు.
“ఈ పవిత్ర యుద్ధంలో ఆయన మమ్మల్ని ముందుండి నడిపిస్తారు.’’ అని ఖాసీం నాయకత్వం గురించి ప్రకటిస్తున్న సందర్భంలో హిజ్బుల్లా వెల్లడించింది.
ఆ ప్రకటనలో ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన నస్రల్లాతో పాటు ఇతర సభ్యులకు సంతాపం తెలిపింది.
హిజ్బుల్లా నూతన నాయకత్వాన్ని మతాధికారి హషీమ్ సఫీద్దీన్‌కు అప్పగిస్తారనే ప్రచారం జరిగింది. కానీ, మూడు వారాల కిందట ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో సఫీద్దీన్ మరణించినట్లు అక్టోబర్ 22న తెలిపింది.
ఈ నియామకంపై ఇజ్రాయెల్ స్పందన ఏంటి?
“అది తాత్కాలిక నియామకం మాత్రమే” అని ఇజ్రాయెల్ రక్షణశాఖ మంత్రి యేవ్ గల్లంట్ అన్నారు. హిజ్బుల్లా నూతన నాయకుడి ప్రకటనపై ఆయన సోషల్ మీడియాలో ఇలా స్పందించారు.
కొన్ని వారాలుగా లెబనాన్ అంతటా ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేస్తోంది. అందులో భాగంగా హిజ్బుల్లా సభ్యులు, ఆ సంస్థకు సంబంధించిన భవనాలను, ఆయుధ సంపత్తిని లక్ష్యాలుగా చేసుకుంది.
హిజ్బుల్లాకు గట్టి పట్టున్న లెబనాన్ తూర్పు బెకా వ్యాలీలో సోమవారం రాత్రి ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులు చేసింది.
ఈ దాడుల్లో కనీసం 60 మంది చనిపోయారని, 50 మందికిపైగా గాయపడ్డారని లెబనాన్ ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.
అయితే, ఈ దాడిపై ఇజ్రాయెల్ సైన్యం ఇంకా స్పందించలేదు.
గాజాలో యుద్ధం మొదలైన ఏడాది తరువాత హిజ్బుల్లాపై ఇజ్రాయెల్ భీకర దాడులకు పాల్పడుతోంది. తద్వారా, హిజ్బుల్లా దాడుల కారణంగా సరిహద్దుల్లో నిరాశ్రయులైన స్థానికులు సురక్షితంగా తిరిగి రావొచ్చనే సంకేతాలు పంపించాలనుకుంటోంది ఇజ్రాయెల్.
లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం దాడుల కారణంగా వారి దేశంలో ఏడాది కాలంలో 2,700 మందికిపైగా చనిపోగా, 12,500 మందికిపైగా గాయపడ్డారు.
ఇదే సమయంలో హిజ్బుల్లా కూడా వేలాది రాకెట్లు, డ్రోన్లతో ఇజ్రాయెల్‌పై దాడులు చేసింది. ఈ దాడుల్లో ఉత్తర ఇజ్రాయెల్, ఆక్రమిత గోలన్ హైట్స్ ప్రాంతాల్లో కనీసం 59 మంది మరణించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














