కెనడా: ‘అవును..అమిత్‌ షా పేరు నేనే లీక్ చేశా’ కెనడా మంత్రి అంగీకారం

కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కెనడా డిప్యూటీ విదేశాంగ మంత్రి డేవిడ్ మోరిసన్

ఫొటో సోర్స్, FACEBOOK, HOUSE OF COMMONS, CANADA

ఫొటో క్యాప్షన్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కెనడా డిప్యూటీ విదేశాంగ మంత్రి డేవిడ్ మోరిసన్

కెనడా పౌరులను బెదిరించడానికి లేదా చంపడానికి భారత ప్రభుత్వానికి చెందిన సీనియర్ మంత్రి ఆమోదం తెలిపారని కెనడా డిప్యూటీ విదేశాంగ మంత్రి డేవిడ్ మోరిసన్ ఆ దేశ పౌర రక్షణ, జాతీయ భద్రతా కమిటీకి తెలిపారు.

కమిటీ ఉపాధ్యక్షురాలు, కన్జర్వేటివ్ ఎంపీ రాక్వెల్ డాంచో ఈ సందర్భంగా కెనడాలో పౌర, జాతీయ భద్రతపై ప్రశ్నలు వేశారు.

కెనడా ఎన్నికల్లో భారత ఏజెంట్ల జోక్యం, నేర కార్యకలాపాలపై మంగళవారం అక్కడి 'పౌర రక్షణ, జాతీయ భద్రతా స్టాండింగ్ కమిటీ' విచారణ జరిపింది.

ఆ సమావేశంలో కమిటీ వైస్-చైర్ పర్సన్, కన్జర్వేటివ్ ఎంపీ రాక్వెల్ డాంచో కెనడాలో భద్రతపై అధికారులను ప్రశ్నించారు.

వాంకోవర్ సమీపంలో గత ఏడాది జూన్‌లో 45 ఏళ్ల హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను తుపాకులతో కాల్చి చంపారు. ఈ హత్య వెనుక భారత్ హస్తం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో ఆరోపించారు.

కెనడాలో జరుగుతున్న నేరాల్లో భారత హోం మంత్రి ప్రమేయం ఉందని వాషింగ్టన్ పోస్ట్‌కు ప్రభుత్వం నుంచి ఎవరు సమాచారం ఇచ్చారని కెనడా జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) నథాలియా డ్రౌయిన్‌ను రాక్వెల్ డాంచో ప్రశ్నించారు.

అలాంటి సమాచారాన్ని ప్రభుత్వం జర్నలిస్టులతో పంచుకోలేదని నథాలియా చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
రాక్వెల్ డాంచో

ఫొటో సోర్స్, HOUSE OF COMMONS, CANADA

ఫొటో క్యాప్షన్, అక్టోబరు 14న వాషింగ్టన్ పోస్ట్‌లో ప్రచురితమైన కథనంపై రాక్వెల్ డాంచో ప్రశ్నలు వేశారు.

నేనే చెప్పాను: మోరిసన్

అక్టోబరు 14నఅమెరికన్ వార్తా పత్రిక వాషింగ్టన్ పోస్ట్‌లో ప్రచురితమైన కథనం పై రాక్వెల్ డాంచో ప్రశ్నలు వేశారు .

కెనడాలోని సిక్కు వేర్పాటువాదులకు వ్యతిరేక ప్రచారానికి భారత హోం మంత్రి అమిత్ షా ఆదేశించినట్టు కొందరిని ఉటంకిస్తూ వాషింగ్టన్ పోస్ట్ కథనం రాసింది.

‘మరి ఆ జర్నలిస్టుకు సమాచారం ఎవరు ఇచ్చారు?ఈ విషయం మీకు తెలియదా? మీరు ఈ సమాచారం ఇవ్వలేదు కదా?’ అని ఎంపీ డాంచో ప్రశ్నించారు.

కమిటీ విచారణలో కెనడా విదేశాంగ డిప్యూటీ మంత్రి డేవిడ్ మోరిసన్ కూడా పాల్గొన్నారు.

డాంచో, డేవిడ్ మారిసన్ వైపు తిరిగి "మిస్టర్ మోరిసన్ దీనిపై మీరేమైనా చెబుతారా,ఈ సమాచారాన్ని మీరేమైనా అందించారా?" అని అడిగారు.

"అవును, జర్నలిస్ట్ నాకు ఫోన్ చేసి అడిగారు. నేను ఆ జర్నలిస్టుకు ఆ వ్యక్తి గురించి సమాచారం ఇచ్చాను"అని డేవిడ్ బదులిచ్చారు.

"ఆ ఘటన గురించి ఆ జర్నలిస్టు ఇదివరకు చాలా రాశారు. జర్నలిస్టులకు చాలా చోట్ల నుంచి సమాచారం వస్తుంది. ఆ వ్యక్తి గురించి ధ్రువీకరించాలని జర్నలిస్టు అడిగారు. నేను ధ్రువీకరించాను"అని చెప్పారు.

అయితే డేవిడ్ భారత హోంమంత్రి గురించి అంతకుమించి వివరాలు పంచుకోలేదు. మంగళవారం వెలుగులోకి వచ్చిన ఈ పరిణామాలపై కెనడాలోని భారత హైకమిషన్, భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇంకా స్పందించలేదు. అయితే కెనడా చేసిన ఈ ఆరోపణలు నిరాధారమైనవిగా గతంలోనే భారత్ కొట్టిపారేసింది.

రణధీర్ జైస్వాల్

ఫొటో సోర్స్, THING

ఫొటో క్యాప్షన్, భారత విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్

అవి నిరాధార ఆరోపణలు: భారత్

నిజ్జర్ హత్య వార్త వాషింగ్టన్ పోస్ట్ లో మొదట ప్రచురితమైనప్పుడు, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖస్పందించింది. దీనిపై ఒక ప్రకటన విడుదల చేసింది. "ఈ కథనం ఓ తీవ్రమైన విషయంపై అన్యాయమైన, నిరాధారమైన ఆరోపణలు చేస్తోంది" అని పేర్కొంది.

‘‘వ్యవస్థీకృత నేరగాళ్లు, టెర్రరిస్టుల నెట్‌వర్క్ గురించి అమెరికా ప్రభుత్వం పంచుకున్న భదత్రాపరమైన ఆందోళనల నేపథ్యంలో భారత ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తోంది. దీని గురించి ఊహాగానాలు చేయడం, బాధ్యతారహితమైన ప్రకటనలు చేయడం వల్ల ప్రయోజనం ఉండదని’’ ఆ ప్రకటనలో తెలిపింది.

తమ దేశంలో జరుగుతున్న నేరాల్లో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రభుత్వం చెప్పింది. ఆ నేరాలలో హత్య, దోపిడీ, బెదిరింపులు ఉన్నాయని తెలిపింది.

కెనడాలో పెద్ద ఎత్తున జరుగుతున్న నేరాలకు భారత ప్రభుత్వ ఏజెంట్లు సహకరిస్తున్నారంటూ రెండు వారాల క్రితం కెనడా పోలీసులు (ఆర్సీఎంపీ) చేసిన వాదనపై కూడా కమిటీలోని ఎంపీలు ప్రశ్నలు లేవనెత్తారు.

రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ చీఫ్ మైక్ డుహెమ్ మంగళవారం కమిటీ ముందు వాంగ్మూలం ఇచ్చారు.

భారత దౌత్యవేత్తలు, హైకమిషన్ సిబ్బంది భారత ప్రభుత్వం కోసం సమాచారాన్ని సేకరించినట్లు పోలీసు ఆధారాలు చెబుతున్నాయని ఆయన అన్నారు.

కెనడాలో హింసాత్మక చర్యలకు పాల్పడాల్సిందిగా క్రిమినల్ సంస్థలను ఆదేశించడానికి ఆ సమాచారాన్ని ఉపయోగించారని చెప్పారు.

ఇటీవల కెనడా ప్రభుత్వ వార్తా ఛానెల్ సీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మైక్ డుహెమ్ మాట్లాడుతూ ఈ కేసులో (నిజ్జర్ హత్య) భారత్ కు ఉన్నత స్థాయి పాత్ర ఉందనడానికి తమ వద్ద బలమైన ఆధారాలు ఉన్నాయని చెప్పారు.

సెప్టెంబర్ 2023 నుంచి 13 మంది కెనడా పౌరులకు భారత ఏజెంట్ల నుంచి ముప్పు పొంచి ఉందని పోలీసులు హెచ్చరించారని డుహెమ్ తెలిపారు.

జస్టిన్ ట్రూడో

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, జస్టిన్ ట్రూడో

ఆమాటపైనే ఉన్నాం: కెనడా

హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఇప్పటికీ చెబుతూనే ఉన్నారు.

పదిహేను రోజుల కిందట దౌత్యవేత్తల బహిష్కరణ అంశం తీవ్రమైన సందర్భంలో ట్రూడో తన ఆరోపణలకు కట్టుబడి ఉన్నట్టు చెప్పారు.

కానీ ఆయన వద్ద 'నిర్ణయాత్మక ఆధారాలు' లేవు. ఈ విషయంపై తొలిసారి బహిరంగంగా ఆరోపణలు చేసినప్పుడు ఆయనకు ఇంటెలిజెన్స్ సమాచారం మాత్రమే ఉంది.

ఫారిన్ ఇంటర్‌ఫియరెన్స్ కమిషన్ ముందు సాక్ష్యమిచ్చిన ఆయన కెనడా భారత్ తో ఎలాంటి సాక్ష్యాధారాలను పంచుకోలేదని, కలిసి పనిచేయాలని మాత్రమే కోరుకుంటోందని, భారత్ సాక్ష్యాలను అడుగుతూనే ఉందని అంగీకరించారు.

‘‘మా సమాధానం సరే... సాక్ష్యం మీ భద్రతా సంస్థల వద్దే ఉంది’ అని ఆయన చెప్పారు.

కెనడా సార్వభౌమత్వాన్ని భారత్ ఉల్లంఘించినట్లు స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయని ఇద్దరు కన్జర్వేటివ్ ఎంపీలపై నిఘాను దర్యాప్తు చేస్తున్న విచారణ కమిటీకి తెలిపారు.

హర్‌దీప్ సింగ్ నిజ్జర్

ఫొటో సోర్స్, FB/Virsa Singh Valtoha

ఫొటో క్యాప్షన్, కెనడాలో జూన్ 18, 2023న హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను కాల్చి చంపారు

వివాదం ఎలా మొదలైంది?

2023 జూన్‌లో నిజ్జర్ హత్య తర్వాత భారత్, కెనడాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. 2023 జూన్ 18న సాయంత్రం, కెనడాలోని సర్రేలో గురుద్వారా వద్ద ఖలిస్తాన్ అనుకూల నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను ముసుగు ధరించిన సాయుధులు కాల్చి చంపేశారు.

భారత ఏజెంట్లే నిజ్జర్‌ను హత్య చేశారనే ఆరోపణలు వచ్చాయి. నిజ్జర్ హత్యలో భారత ప్రమేయం ఉందని కెనడా ప్రధాని ట్రూడో గత ఏడాది సెప్టెంబర్ 18న ఆరోపించగా, దానిని భారత్ ఖండించింది. కెనడా నుంచి రుజువులను కోరింది.

2024 అక్టోబర్ రెండో వారంలో నిజ్జర్ హత్య కేసులో భారతీయ దౌత్యవేత్తలు, ఇతర హైకమిషన్ అధికారులను 'పర్సన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్'గా కెనడా చేసిన ప్రకటన, ఇరు దేశాల దౌత్యవేత్తల బహిష్కరణకు దారి తీశాయి. కెనడాలో 'పర్సన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్' అంటే నేరానికి సంబంధించిన కీలక సమాచారం ఉందని విచారణ అధికారులు భావించే వ్యక్తులు.

ట్రూడో ప్రభుత్వం తమ అధికారులపై చేసిన ఆరోపణలను రుజువు చేసే ఒక్క ఆధారం కూడా చూపించలేదని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అక్టోబర్ 14న స్పష్టంచేసింది.

కెనడా ఆరోపణలు ట్రూడో ‘రాజకీయ అజెండా’లో భాగమని విమర్శించింది. అనంతరం, కెనడాలోని దౌత్యవేత్తలను వెనక్కి రప్పిస్తున్నట్లు భారత్ తెలిపింది. అయితే సంజయ్ కుమార్ వర్మ సహా ఆరుగురు భారతీయ దౌత్యవేత్తలు, కాన్సులర్ అధికారులను బహిష్కరించినట్లు కెనడా ప్రకటించింది.

భారత్‌, భారత దౌత్యవేత్తలపై కెనడా చేసిన తీవ్రమైన ఆరోపణలకు మద్దతుగా ఎలాంటి సాక్ష్యాధారాలు తమకు అందించలేదని విదేశాంగ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఒక ప్రకటనలో తెలిపారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)