అమెరికా ఎన్నికలు 2024 : డోనల్డ్ ట్రంప్‌కు అరబ్ అమెరికన్ ముస్లింలు ఓటేస్తారా,ట్రంప్ వారికి ఎలాంటి హామీ ఇచ్చారు?

ఫొటో సోర్స్, Getty Images
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ శనివారం మిషిగాన్‌లో నిర్వహించే తన ఎన్నికల ర్యాలీకి పలువురు ముస్లిం నేతలను ఆహ్వానించారు.
ఇజ్రాయెల్, గాజాలో అమెరికా విదేశాంగ విధానం పట్ల అరబ్ అమెరికన్, ముస్లిం ఓటర్లు నిరాశ, కోపంతో ఉన్నారని ట్రంప్ అన్నారు.
"ఇక్కడి అరబ్ ముస్లిం ఓటర్లు అమెరికా ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపగలరు" అని ట్రంప్ శనివారం డెట్రాయిట్ శివారు నోవి ర్యాలీలో చెప్పారు. అక్కడి నుంచి 30 నిమిషాల ప్రయాణం చేసేంత దూరంలోనే డియర్‌బోర్న్ ప్రాంతం ఉంది.
అమెరికాలో అత్యధిక ముస్లిం జనాభా ఉన్న నగరంగా డియర్‌బోర్న్ గత సంవత్సరం మారింది. వీరిలో అరబ్ అమెరికన్లు మెజార్టీగా ఉన్నారు. ఇక్కడి జనాభాలో 55 శాతంమంది మిడిల్‌ఈస్ట్ లేదా నార్త్ ఆఫ్రికాకు చెందినవారున్నారు.అమెరికా జనాభాలో ముస్లింలు దాదాపు 1.1 శాతం మంది ఉన్నారు .
ఈ ర్యాలీకి ముందు తాను మిషిగాన్ ముస్లిం నేతలను కలిశానని ట్రంప్ చెప్పారు. వేదికపై కొందరు ముస్లిం నాయకులూ ఉన్నారు, ట్రంప్ వారిని మిషిగాన్ ప్రముఖ నాయకులుగా పేర్కొన్నారు. ఈ నాయకులలో ఇమామ్ బెలాల్ అల్జుహైరీ కూడా ఉన్నారు. ట్రంప్‌ను శాంతికి మద్దతుదారుగా అల్జుహైరీ అభివర్ణించారు.
"ముస్లిం ఓటర్లుగా మేం ట్రంప్‌తో ఉన్నాం. శాంతిని నెలకొల్పుతామని, యుద్ధం వద్దని ట్రంప్ హామీ ఇచ్చారు. మిడిల్ ఈస్ట్, యుక్రెయిన్‌లో యుద్ధం ముగింపునకు హామీ ఇవ్వడంతో డోనల్డ్ ట్రంప్‌కు మద్దతు ఇస్తున్నాం" అని అల్జుహైరీ అన్నారు.


ఫొటో సోర్స్, Getty Images
ట్రంప్‌పై ముస్లింల ఆశలు
గాజాలో ఇజ్రాయెల్ యుద్ధాన్ని ట్రంప్ బహిరంగంగా విమర్శించడం లేదు. అయితే, యుద్ధాన్ని త్వరగా ముగించాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో పాటు, అక్కడి సైన్యానికి ట్రంప్ సూచించారు.
అంతేకాకుండా అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్, వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ ఇజ్రాయెల్‌కు తగినంత మద్దతు ఇవ్వడం లేదని విమర్శించారు. అయితే, బైడెన్ ప్రభుత్వం ఇజ్రాయెల్‌ను విమర్శించడం లేదు, ఆయుధాల సరఫరాను ఆపడమూ లేదు.
హమాస్ గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై దాడి చేసి వందలాది మందిని చంపేసింది. చాలామంది ఇప్పటికీ హమాస్ చేతిలో బందీలుగా ఉన్నారు. ఈ దాడి జరిగి ఏడాది అయిన సందర్భంగా ట్రంప్ కన్జర్వేటివ్ రేడియో హోస్ట్ హ్యూ హెవిట్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో ఆయన గాజాను ‘స్థిరాస్తి’ దృక్పథంతో చూశారు. గాజాలో దాదాపు 20 లక్షల మంది పాలస్తీనియన్లు నివసిస్తున్నారు.
ట్రంప్ ఈ ఇంటర్వ్యూలో "మీరు గాజాను డెవలపర్‌గా చూస్తే, చాలా అందమైన ప్రదేశం అవ్వొచ్చు. అది నీరు లేదా వాతావరణం పరంగా కూడా కావచ్చు. చాలా అందంగా ఉంటుంది" అని అన్నారు.
2017లో ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యాక తన మొదటి నెలలోనే ఇరాక్, సిరియా, ఇరాన్, లిబియా, సోమాలియా, సూడాన్, యెమెన్ వంటి ముస్లిం మెజారిటీ దేశాల నుంచి ప్రజలను అమెరికాకు రాకుండా నిషేధం విధించారు.
సిరియా శరణార్థుల ప్రవేశంపై నిరవధిక నిషేధం, మిగతా శరణార్థులందరి ప్రవేశంపై నాలుగు నెలల నిషేధం విధించారు ట్రంప్. 2021లో బైడెన్ అధికారంలోకి రాగానే ఆ నిషేధాన్ని ఎత్తివేశారు.

ఫొటో సోర్స్, Getty Images
బైడెన్‌పై ముస్లింల ఆగ్రహం
ఇజ్రాయెల్‌కు అమెరికా నుంచి అందుతున్న సహాయంపై అమెరికాలోని అరబ్ అమెరికన్, ముస్లిం ఓటర్లలో ఆగ్రహం ఉంది. దీనిని అనుకూలంగా మలుచుకోవాలని ట్రంప్ భావిస్తున్నారు.
బైడెన్‌తో పాటు కమలా హారిస్ తీరుపై అరబ్ అమెరికన్, ముస్లిం ఓటర్లు నిరాశకు లోనయ్యారని ట్రంప్ ప్రచారం చేస్తున్నారు. తక్షణం యుద్ధాన్ని ఆపాలనుకునే ఓటర్లు తనతో కలిసి రావాలని పిలుపునిస్తున్నారు.
అదే సమయంలో బైడెన్ ప్రభుత్వం ఇజ్రాయెల్‌కు సరిగ్గా సహాయం చేయడం లేదని ఇజ్రాయెల్ మద్దతుదారులు భావిస్తున్నారు. మరోవైపు ఎన్నికల్లో తాను ఓడిపోతే యూదులు భారీ మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని ట్రంప్ హెచ్చరించారు.
కమలా హారిస్ గాజాలో కాల్పుల విరమణను ప్రతిపాదిస్తున్నారు, ఆమె పాలస్తీనియన్ల కోసం ప్రత్యేక దేశానికి మద్దతు ఇస్తున్నారు. పాలస్తీనా మద్దతుదారులు, యుద్ధ వ్యతిరేక కార్యకర్తలు కమలా హారిస్ లక్ష్యంగా ప్రశ్నలు సంధిస్తున్నారు. ‘మిడిల్ ఈస్ట్‌లో ఇజ్రాయెల్‌కు సంబంధించి బైడెన్ ప్రభుత్వ విధానాలకు భిన్నంగా.. మీ విధానం ఎలా ఉంటుంది?’ అని కమలా హారిస్‌ను అడుగుతున్నారు.
"మిషిగాన్‌తో సహా దేశవ్యాప్తంగా ఉన్న ముస్లిం, అరబ్ అమెరికన్ ఓటర్లు మిడిల్ ఈస్ట్‌లో యుద్ధానికి ముగింపు పలకాలని కోరుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ శాంతి, స్థిరత్వం తిరిగి రావాలనుకుంటున్నారు" అని మిషిగాన్‌లో జరిగిన ర్యాలీలో ట్రంప్ అన్నారు.
అధికారంలోకి వస్తే యుద్ధాన్ని ఆపుతానని ట్రంప్ హామీ ఇస్తున్నారు. ఇంతకుముందు ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నంతకాలం కొత్త యుద్ధంలోకి తీసుకెళ్లలేదని గుర్తుచేస్తున్నారు. దీంతో అరబ్ అమెరికన్, ముస్లిం ఓటర్ల ముందు ట్రంప్ మంచి ఆప్షన్‌గా కనిపిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ట్రంప్ ట్రావెల్ బ్యాన్
కమలా హారిస్‌కు మద్దతు ఇస్తున్న ముస్లింలను గతవారం ట్రంప్ ప్రశ్నించారు. కమలా హారిస్‌కు అమెరికా మాజీ ఎంపీ లిజ్ చెనీ మద్దతుపై ట్రంప్ స్పందిస్తూ "ముస్లింలను ద్వేషించే లిజ్ చెనీని కమలా హారిస్ కౌగిలించుకుంటున్నారు. మిడిల్ ఈస్ట్‌లో ఎవరి తండ్రి యుద్ధం అమలు చేశారు?" అని ప్రశ్నించారు.
అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు డిక్ చెనీ కుమార్తె లిజ్ చెనీ. 2003లో ఇరాక్‌పై అమెరికా దాడి చేసినప్పుడు ఆయనే వైస్ ప్రెసిడెంట్. ఇరాక్‌పై దాడికి ఆయన మద్దతు ఇచ్చారు.
అయితే, కొన్ని ముస్లిం మెజారిటీ దేశాల పౌరులు అమెరికాకు రాకుండా నిషేధించాలనే తన డిమాండ్‌ను ట్రంప్ మళ్లీ ఎత్తుకున్నారు. 2023 అక్టోబరు 28న రిపబ్లికన్ యూదు సమ్మిట్‌లో ట్రంప్ మాట్లాడుతూ.. ‘ట్రావెల్ బ్యాన్ గుర్తుందా? మళ్లీ అధికారంలోకి రాగానే మళ్లీ ట్రావెల్ బ్యాన్ విధిస్తాను. మా దేశాన్ని నాశనం చేయాలనుకునే వేరే దేశాల వాళ్లు మాకొద్దు’ అని అన్నారు.
తన నాలుగేళ్ల పాలనలో ఇలాంటి ఒక్క ఘటన కూడా జరగలేదని, అలాంటి వారిని దేశంలోకి రానివ్వలేదని ట్రంప్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ట్రంప్ తరచుగా తనను తాను యుద్ధ వ్యతిరేక అధ్యక్షుడిగా ప్రచారం చేసుకుంటారు. తన హయాంలో అమెరికా ఎలాంటి కొత్త యుద్ధాల్లో పాల్గొనలేదని ట్రంప్ చెప్పారు. మిడిల్ ఈస్ట్ నుంచి కొంతమంది అమెరికన్ దళాలను వెనక్కి పిలిపించి, అఫ్గానిస్తాన్‌లో యుద్ధాన్ని ముగించినట్లు ఆయన ప్రకటించారు.
2019 మార్చిలో ఇస్లామిక్ స్టేట్ ఓడిపోయిందని ట్రంప్ ప్రకటించారు, ఆ ఏడాది అక్టోబర్‌లో ఐఎస్ నాయకుడు అబూ బకర్ అల్-బాగ్దాదీని అమెరికా సైన్యం చంపేసింది. ఇది కాకుండా 2020 జనవరి 3న ట్రంప్ ప్రభుత్వ హయాంలోనే ఇరాన్ సీనియర్ జనరల్ ఖాసిం సులేమానీని ఇరాక్‌లో అమెరికా చంపింది.
కొత్త యుద్ధాన్ని ప్రారంభించనందుకు ట్రంప్‌కు క్రెడిట్ ఇవ్వవచ్చని చాలామంది నిపుణులు చెబుతున్నారు. అయితే యుద్ధం జరిగే ప్రమాదం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఆయుధాలను విక్రయించడానికి ట్రంప్ ఒప్పందాలు కుదుర్చుకున్నారు.
ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత తొలిసారిగా సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లడం గమనార్హం. సౌదీ అరేబియా ఆ సమయంలో యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులపై యుద్ధం చేస్తోంది. ఈ పర్యటన సందర్భంగా సౌదీ అరేబియాతో దాదాపు రూ. 9.24 లక్షల కోట్లు (110 బిలియన్ డాలర్ల) విలువైన ఆయుధ ఒప్పందంపై ట్రంప్ సంతకం చేశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














