వైఎస్ జగన్: సరస్వతి పవర్ సంస్థ భూములపై సర్వే ఎందుకు, వాటిల్లో అటవీ, ప్రభుత్వ భూములు ఉన్నాయా?

ఫొటో సోర్స్, FB/YS Jagan/Bhushanapu Chennaiah
- రచయిత, గరికిపాటి ఉమాకాంత్
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన సోదరి ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మధ్య ఆస్తి పంపకాలపై విభేదాల నేపథ్యంలో సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్‌కు చెందిన భూముల వివాదం తెరపైకి వచ్చింది.
గతంలో సరస్వతి పవర్ కంపెనీ షేర్లు తన తల్లి విజయ లక్ష్మి, చెల్లెలు షర్మిలకు ఇచ్చిన జగన్.. ఇప్పుడు ఆ షేర్లన్నీ తనకే చెందాలంటూ ఎన్‌సీఎల్‌టీలో పిటిషన్ వేశారు.
దీంతో అసలు సరస్వతి పవర్ ప్రాజెక్టు ఎక్కడుంది? దానికి సంబంధించి ఎన్ని ఎకరాల భూములున్నాయి? ఆ ప్రాజెక్టు కార్యరూపం దాల్చిందా? అనే విషయాలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.
సరస్వతి పవర్ ఆస్తుల్లో అటవీ భూములు ఉన్నాయో లేదో పరిశీలించాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు. దీంతో అటవీ, రెవెన్యూ శాఖాధికారులు నాలుగు రోజులుగా ఆ భూముల్లో సర్వే చేస్తున్నారు.
ఆ సర్వేలో ఇప్పటివరకు తేలిందేమిటి? ఈ భూముల పూర్వాపరాలు ఏమిటి?


ఫొటో సోర్స్, facebook/ysjaganmohanreddy
‘సిమెంట్ ఫ్యాక్టరీ కడతామని చెప్పారు’
డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2009లో రెండోసారి ముఖ్యమంత్రి అయిన తొలినాళ్లలోనే గుంటూరు జిల్లా, ప్రస్తుత పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గ పరిధిలోని దాచేపల్లి, మాచవరం మండలాల పరిధిలోని 1,515.93 ఎకరాల్లో సున్నపురాయి తవ్వకాల నిమిత్తం సరస్వతి పవర్ సంస్థకు అనుమతులిచ్చారు.
అంతకుముందే, అంటే 2008లోనే సరస్వతి పవర్ పేరిట సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు నిమిత్తం ఆ సంస్థ రైతుల నుంచి భూముల కొనుగోళ్లు ప్రారంభించింది.
ఎకరాకి 3 నుంచి 8 లక్షల రూపాయల చొప్పున రైతులకిచ్చి పట్టాభూములను రాయించుకున్నారని పల్నాడుకి చెందిన సీనియర్ జర్నలిస్ట్ షేక్ సిలార్ తెలిపారు.
మొత్తంగా ఆ ప్రాంతంలో కొనుగోలు చేసిన భూముల్లోనే సున్నపురాళ్ల మైనింగ్‌కు నాటి ప్రభుత్వం అనుమతులిచ్చింది.
సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ద్వారా అక్కడ ఏర్పాటు చేయాలనుకుంటున్న సిమెంట్ కర్మాగారంలో రూ.3,257 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్లు 2010లో ప్రభుత్వానికి సమర్పించిన పర్యావరణ ప్రభావ నివేదికలో వైఎస్ జగన్ పేర్కొన్నారని షేక్ సిలార్ బీబీసీతో చెప్పారు.
ఈ వివరాలను బీబీసీ స్వతంత్రంగా ధ్రువీకరించలేదు.

ఫొటో సోర్స్, Telugudesamparty/X
లీజు రద్దు చేసిన టీడీపీ సర్కార్
రైతుల నుంచి భూములు సేకరించిన సరస్వతి పవర్ ప్రాజెక్టు రెండేళ్లు దాటినా పనులు మొదలు పెట్టలేదు. దీంతో లీజు గడువు ముగిసినట్టుగా ప్రకటించాలని 2011 ఆగస్టు 10న అప్పటి గనుల శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు. కానీ నాటి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు.
2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గనుల లీజును రద్దు చేస్తూ అదే ఏడాది అక్టోబర్ 9న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని గనుల శాఖకు చెందిన ఓ అధికారి బీబీసీకి తెలిపారు.

ఫొటో సోర్స్, election commission of india
జగన్ సీఎం అయ్యాక లీజు పునరుద్ధరణ
2019లో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే ఏడాది డిసెంబర్‌లో సరస్వతి పవర్‌కి గతంలో కేటాయించిన గనులన్నీ పునరుద్ధరించడంతోపాటు లీజు కాల పరిమితిని 50 ఏళ్లకు పెంచారు. ఆ పరిశ్రమకు 0.0689 టీఎంసీల కృష్ణా జలాలను కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
కానీ వైఎస్ జగన్ ఐదేళ్ల హయాంలోనూ అక్కడ పనులు మొదలు కాలేదని, దాంతో అక్కడి పొలాలన్నీ బీడువారాయని జర్నలిస్టు సిలార్ తెలిపారు.
ఈ పదిహేనేళ్ల కాలంలో అప్పుడప్పుడు రైతులు అక్కడ సాగు చేసుకుందామని ప్రయత్నించినా సరస్వతి సంస్థ ప్రతినిధులొచ్చి అడ్డుకునే వారని, దాంతో రైతులు ఇక ఆ ప్రయత్నాలను పూర్తిగా విరమించుకున్నారని సిలార్ చెప్పారు.
సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో వైఎస్ జగన్‌కు రూ.26.4 కోట్ల విలువైన వాటాలు, ఆయన భార్య భారతికి రూ.13.8 కోట్ల విలువైన వాటాలు ఉన్నట్లు జగన్ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్‌తో పాటు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Bhushanapu Chennaiah
అభివృద్ధి జరుగుతుందనుకున్నాం కానీ..
తమ పొలాల అమ్మకం గురించి గాని, సాగు చేసుకునే ప్రయత్నాల గురించి గాని మాట్లాడటానికి ఈ ప్రాంత రైతులెవరూ ముందుకు రాలేదు. కానీ రైతుల తరఫున దాచేపల్లి మాజీ జడ్పీటీసీ భూషణం చెన్నయ్య, తంగెడ సాగునీటి సంఘం మాజీ అధ్యక్షుడు చింతపల్లి హసన్ మధు బీబీసీతో మాట్లాడారు.
తంగెడ గ్రామంలోని చాలామంది రైతుల పొలాలను తానే దగ్గరుండి ఆ సంస్థకు అమ్మేలా చేశానని హసన్ చెప్పారు.
సిమెంట్ ఫ్యాక్టరీ వస్తే ప్రాంతం బాగుపడుతుందనుకున్నాం, కానీ ఇప్పటివరకు ఏ పనీ మొదలు పెట్టలేదని.. కనీసం ఆ భూముల్లో సాగు చేసుకునేందుకు కూడా అవకాశం ఇవ్వడం లేదని చెన్నయ్య ఆవేదన వ్యక్తం చేశారు.
పట్టాలిచ్చిన రైతుల పరిస్థితి అలా ఉంటే, ఆ సంస్థ సేకరించిన భూముల సరిహద్దు పొలాల యజమానుల గోడు మరోలా ఉంది.
“తంగెడ రెవెన్యూ గ్రామ పరిధిలో సర్వే నంబర్ 209లో మాకు 3 ఎకరాల 80 సెంట్ల స్థలముంది. దాని పక్కనే సరస్వతి పవర్ భూములున్నాయి. దీంతో ఎవరూ మా భూములు కొనుగోలు చేయడం లేదు. మైనింగ్‌కు కేటాయించిన భూములకు పక్కనే మీ భూములు ఉన్నాయంటూ కొన్నిసార్లు బ్యాంకులు లోన్ కూడా ఇవ్వడం లేదు. కనీసం మార్ట్‌గేజ్ కూడా చేయనివ్వడం లేదు. పోనీ ఆ భూములను సదరు సంస్థను కొనుగోలు చేయమంటుంటే.. వాళ్లూ కొనడం లేదు’’ అని తంగెడ మాజీ సర్పంచ్ వీరవల్లి భారతీ రెడ్డి బీబీసీకి చెప్పారు.
అటవీ భూములున్నాయా?
ఇప్పటివరకు చేసిన సర్వేలను బట్టి చూస్తే సరస్వతి పవర్ భూముల్లో అటవీ భూములు లేవని గుంటూరు సర్కిల్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ కాశీ విశ్వనాథ రాజు బీబీసీకి తెలిపారు.
ఇంకా సర్వే పూర్తి కాలేదని, రెవెన్యూ అధికారులతో కలిసి సమగ్రంగా సర్వే చేసిన తర్వాతే పూర్తి వివరాలు తెలుస్తాయని ఆయన చెప్పారు.
దాచేపల్లి, మాచవరం మండలాల్లో రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు నిశితంగా సర్వే చేస్తున్నారని, ఆ సర్వే పూర్తయితేనే అసలు వివరాలు వెల్లడవుతాయని పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు బీబీసీకి తెలిపారు.
త్వరలోనే ఆ భూములపై సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందిస్తామని చెప్పారు.

అధికారులు ఏమంటున్నారు?
మాచవరంలో సరస్వతి పవర్ ప్రాజెక్టు సేకరించిన భూముల్లో అటవీ, చెరువు భూములు లేనప్పటికీ 4.31 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్లు ప్రాథమికంగా వెల్లడైందని మాచవరం తహశీల్దార్ క్షమారాణి బీబీసీకి తెలిపారు.
మండలంలోని పిన్నెల్లి గ్రామంలో 2.87 ఎకరాలు, వేమవరం గ్రామంలో 1.44 ఎకరాల ప్రభుత్వ భూమి ఆ సంస్థ భూముల్లో కలిసిపోయిందని చెప్పారు. అలాగే ప్రభుత్వ రికార్డులకెక్కని భూములు 255.94 ఎకరాలు ఉన్నాయని, అవి ఆన్‌లైన్ చేయాల్సి ఉందని తెలిపారు. సర్వే తర్వాత ఈ భూముల వివరాలు తెలుస్తాయని చెప్పారు.
దాచేపల్లి తహశీల్దార్ కుటుంబరావు బీబీసీతో మాట్లాడుతూ.. దాచేపల్లి మండల పరిధిలోని ఆ ప్రాజెక్టు భూముల్లో ప్రభుత్వ, అటవీ భూములున్నట్టు ప్రాథమికంగా నిర్ధరణ కాలేదని వెల్లడించారు.
దాచేపల్లి మండలం తంగెడలో 657.32 ఎకరాలు, మాచవరం మండలం చెన్నాయపాలెంలో 358.81 ఎకరాలు, వేమవరంలో 499.77 ఎకరాల్లో సరస్వతి పవర్ ప్రాజెక్టు మైనింగ్ అనుమతులు పొందిందని దాచేపల్లి డివిజన్ మైనింగ్ ఏడీ ప్రకాశ్ కుమార్ బీబీసీకి తెలిపారు.
అయితే ఇంకా తవ్వకాలు ప్రారంభించలేదు కాబట్టి అందులో ఎన్ని ఎకరాలను సరస్వతి పవర్ కొనుగోలు చేసిందో పూర్తి వివరాలు తమ వద్ద ఉండవని ఆయనన్నారు.
ఈ భూముల్లో మరోసారి సర్వే చేసి మైనింగ్ ఉన్నతాధికారులకు, రెవెన్యూ ఉన్నతాధికారులకు నివేదిక పంపుతామని, ఇప్పటికైతే తమ సర్వేలో ఆయా భూముల్లో అటవీ భూములు లేవని తెలిసిందని ప్రకాశ్ స్పష్టం చేశారు.
ఆ 331 ఎకరాలు కొనుగోలు చేయలేదా?
అంటే మైనింగ్ నిమిత్తం సరస్వతి పవర్‌కు అప్పట్లో మాచవరం, దాచేపల్లి మండలాల్లో కేటాయించిన 1,515 ఎకరాల భూమి అంతటినీ ఆ సంస్థ సేకరించలేదా? ప్రస్తుతం ఆ రెండు మండలాల తహశీల్దార్‌లు చేస్తున్న సర్వేల్లో ప్రాథమికంగా ఇదే తేలిందా?
మాచవరం తహశీల్దార్ క్షమారాణి బీబీసీతో మాట్లాడుతూ.. “మా మండలంలో 1,077.38 ఎకరాల భూములను ప్రజలు ఫ్యాక్టరీ యాజమాన్యానికి విక్రయించారు. చెన్నాయపాలెంలో 272.96 ఎకరాలు, పిన్నెల్లి గ్రామంలో 93.79 ఎకరాలు, వేమవరంలో 710.63 ఎకరాల భూములను సంస్థ కొనుగోలు చేసినట్టు ఇప్పటివరకు తమ సర్వేలో తేలింది” అన్నారు.
మరోవైపు దాచేపల్లి తహశీల్దార్ కుటుంబరావు మాట్లాడుతూ.. తమ మండలంలోని తంగెడలో 107.36 ఎకరాలను మాత్రమే ఆ సంస్థ సేకరించినట్టు తమ సర్వేలో తేలిందని, ఈ మేరకు కలెక్టరేట్‌కు సమాచారం పంపామని తెలిపారు.
మొత్తంగా రెండు మండలాల్లో కలిపి 1,184.74 ఎకరాలను సంస్థ కొనుగోలు చేసినట్టు ఇప్పటివరకు సర్వేల్లో తేలిందని ఆ తహశీల్దార్లు తెలిపారు.
ప్రభుత్వం మైనింగ్‌కు 1,515.93 ఎకరాలు కేటాయించగా, సర్వేల్లో తేలిన లెక్క 1,184.74 మినహాయిస్తే.. మిగిలిన 331.19 ఎకరాల భూమి ఏమైందనే లెక్కపై సరస్వతి పవర్ ప్రాజెక్టు ప్రతినిధి, 2008 నుంచి రైతుల నుంచి భూముల కొనుగోళ్ల వ్యవహారాలు చూసిన బాలు అనే వ్యక్తి స్పందించారు.
“నేను ఆ సంస్థలో 20 ఏళ్లుగా పని చేస్తున్నా. సరస్వతి పవర్ సంస్థ తరఫున రైతుల వద్దకు వెళ్లి, నేనే మాట్లాడేవాడిని. సంస్థ 2 వేల ఎకరాల్లో మైనింగ్ లీజుకు అనుమతులు అడగ్గా, ప్రభుత్వం 1,515 ఎకరాల్లో అనుమతిచ్చింది. మేం 2008 నుంచి 2011 మధ్య దాదాపు 1,200 ఎకరాలను కొనుగోలు చేశాం. ఎక్కడా ఒక్క రైతును కూడా ఇబ్బంది పెట్టలేదు, డబ్బులు చెల్లించాం. ఇప్పుడు వస్తున్నవన్నీ అపోహలే” అని బాలు బీబీసీతో అన్నారు.
రైతులను అక్కడ సాగు చేయకుండా ఎవరూ అడ్డుకోవడం లేదని, చాలామంది రైతులు సాగు చేసుకుంటున్నారని ఆయన చెప్పారు.
ఇన్నేళ్లయినా పనులెందుకు మొదలు కాలేదనే ప్రశ్నకు బాలు సమాధానం దాటవేశారు. ఇంతకు మించి తనకు సమాచారం తెలియదని చెప్పారు.
15 ఏళ్లయినా పట్టించుకోకపోవడం అన్యాయం
15 ఏళ్లు గడిచినా కనీసం శంకుస్థాపన కూడా చేయకపోవడం అన్యాయమని జర్నలిస్ట్ సిలార్ అన్నారు.
“పల్నాడులో సిమెంట్ ఫ్యాక్టరీ వస్తే ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, తద్వారా ఇక్కడి ప్రాంతం పారిశ్రామికంగా అభివద్ధి చెందుతుందని ఎంతో ఆశించాం. వందల ఎకరాలు బీడు భూములుగా మారిపోయాయి. ఇప్పటికైనా పాలకులు ఈ వ్యవహారంపై దృష్టి పెట్టి పరిశ్రమ వచ్చేటట్లు చూడాలి. లేదంటే రైతులు ఆ భూముల్లో సాగు చేసుకునే అవకాశమైనా కల్పించాలి” అని షేక్ సిలార్ అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














