జన్వాడ: కేటీఆర్ బావమరిది‌ ఫామ్‌హౌస్‌లో రేవ్ పార్టీ జరిగిందా, పోలీసులు ఏం చెబుతున్నారు?

జన్వాడలోని కేటీఆర్ బావమరిది ఇంటిపై పోలీసుల దాడి

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, జన్వాడలోని కేటీఆర్ బావమరిది ఫామ్‌హౌస్‌లో జరిగిన పార్టీపై పోలీసులు దాడి చేశారు.
    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

హైదరాబాద్ శివారులోని జన్వాడలో ఉన్న కేటీఆర్ బావమరిది ఫామ్‌హౌస్‌లో జరిగిన పార్టీపై పోలీసులు దాడి చేయడం తెలంగాణలో రాజకీయ దుమారాన్ని రేపింది.

అక్కడ జరిగింది రేవ్ పార్టీ అని, డ్రగ్స్ వినియోగించారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది.

అది ఫామ్‌హౌస్‌ కాదని, కొత్త ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి పార్టీ చేసుకోవడాన్ని రేవ్ పార్టీగా చెబుతూ, డ్రగ్స్ వాడారనే ఆరోపణలు చేయడం దారుణమని బీఆర్ఎస్ చెబుతోంది.

పోలీసులు, ఎక్సైజ్ శాఖాధికారుల దాడులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు.

ఈ వ్యవహారం తెలంగాణలో అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ యుద్ధానికి దారి తీసింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
జన్వాడలో పోలీసుల దాడులు

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, అనుమతి లేకుండా మద్యం పార్టీ చేసుకుంటున్నారని ఎక్సైజ్ పోలీసులు తెలిపారు.

జన్వాడలో అసలు ఏం జరిగింది?

మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు బావమరిది పాకాల రాజేంద్రప్రసాద్ అలియాస్ రాజ్ పాకాలకు హైదరాబాద్ శివారు శంకర్‌పల్లి మండలం జన్వాడలో సర్వే నంబరు 691, 692లో శ్రీ మాత్రే ప్రాపర్టీస్‌లో ప్రాపర్టీ ఉంది.

అది ఫామ్‌హౌస్‌ అని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతుండగా, అది ఇల్లు అని బీఆర్ఎస్ అంటోంది. పోలీసులు తమ ఎఫ్ఐఆర్‌లో అది కొత్తగా కట్టిన ఇల్లుగా పేర్కొన్నారు.

రాజ్ పాకాల ఈటీజీ అనే సాఫ్ట్‌వేర్ కంపెనీని నిర్వహిస్తున్నారు.

అక్టోబరు 26వ తేదీ సాయంత్రం దివాలీ పేరుతో పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. ఈ పార్టీ జరుగుతున్న సమయంలో శనివారం రాత్రి మోకిల పోలీసులు, సైబరాబాద్ ఎస్ఓటీ (స్పెషల్ ఆపరేషన్ టీం), ఎక్సైజ్ పోలీసులు దాడులు చేశారు.

మోకిల పోలీస్ స్టేషన్‌లో 311-2024 నంబరుతో కేసు కూడా నమోదు చేశారు.

రాజ్ పాకాల, ఆయన స్నేహితుడు విజయ్ మద్దూరిపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్‌స్టెన్సెస్ యాక్ట్-1985 సెక్షన్ 25, 27, 29, తెలంగాణ గేమింగ్ యాక్ట్ సెక్షన్ 3, 4 ప్రకారం కేసులు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు.

FIR COPY

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, మోకిల పోలీసు స్టేషన్‌లో 311-2024 నెంబరుతో కేసు నమోదు చేశారు.

ఎఫ్ఐఆర్‌లో ఏముంది?

ఈ కేసు ఎఫ్ఐఆర్‌ను బీబీసీ సేకరించి, పరిశీలించింది. దాని ప్రకారం...

అక్టోబరు 26న రాజ్ పాకాల ఆధ్వర్యంలో పార్టీ జరుగుతున్న ఇంటికి మోకిల పోలీస్ స్టేషన్ పోలీసులు, సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు, ఎక్సైజ్ సిబ్బంది రాత్రి 11.30 గంటలకు చేరుకున్నారు. యూరిన్ టెస్ట్ కిట్లనూ వెంట తీసుకెళ్లారు.

మోకిల ఇన్‌స్పెక్టర్ బి.వీరబాబు, ఎస్‌ఓటీ ఇన్‌స్పెక్టర్ రామరెడ్డి, ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ ఈ దాడుల్లో పాల్గొన్నారు.

‘‘పోలీసులు దాడి చేసిన సమయంలో 16 మంది మహిళలు, 22 మంది పురుషులు వేర్వేరు గ్రూపులుగా ఉన్నారు. కొంతమంది ఆల్కహాల్ తాగుతూ కనిపించారు. పోలీసులను చూసి కొందరు అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. వారిని ఎక్సైజ్, ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. ఆ తర్వాత డ్రగ్ శాంపిల్ కిట్ సాయంతో యూరిన్ (మూత్రం) పరీక్ష నిర్వహించారు. ఇందులో మద్దూరి విజయ్ అనే వ్యక్తికి కొకైన్ పాజిటివ్ వచ్చింది’’ అని పోలీసులు ఎఫ్ఐఆర్‌లో చెప్పారు.

మద్దూరి విజయ్ వయసు 56 ఏళ్లని, జూబ్లీహిల్స్ రోడ్డు నం.41లో నివాసం ఉంటారని చెప్పిన పోలీసులు, ఆయన నుంచి వాంగ్మూలం నమోదు చేశారు.

‘‘రాజ్ పాకాల నిర్వహిస్తున్న ఈటీజీ సాఫ్ట్‌వేర్ కంపెనీకి సీఈవోగా ఉన్నాను. నాకు ఫ్యూజన్ ఎయిక్స్ అనే సాఫ్ట్‌వేర్ కంపెనీ ఉంది. మా ఇద్దరి మధ్య ఐదేళ్లుగా పరిచయం ఉంది. వారాంతాల్లో రాజ్, నేను కలిసి పార్టీ చేసుకుంటాం. కొన్ని సార్లు డ్రగ్స్ తీసుకున్నాం. రాజ్ కొత్త ఇల్లు కట్టుకుని దివాలీ పార్టీ ఇస్తున్నానంటూ ఆహ్వానించడంతో వచ్చాను. అక్కడ రాజ్ వద్ద ఉన్న కొకైన్ నాకు ఇవ్వడంతో దాన్ని తీసుకున్నాను’’ అని మద్దూరి విజయ్ వాంగ్మూలం ఇచ్చారని ఎఫ్ఐఆర్‌లో పోలీసులు పేర్కొన్నారు.

మహిళలకు డ్రగ్ టెస్టు నిర్వహించేందుకు ప్రయత్నించగా అందుకు వారు సహకరించలేదని ఎఫ్ఐఆర్‌లో పోలీసులు చెప్పారు.

విజయ్‌కు డ్రగ్ టెస్ట్ నిర్వహించి, మొబైల్‌ను సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఇంట్లో సోదాలు చేసి మూడు అల్యూమినియం బాక్సులు సీజ్ చేశామని, బ్లూ, రెడ్, వైట్, బ్లాక్, గ్రీన్ కాయిన్స్, నాలుగు సెట్ల ప్లేయింగ్ కార్డులనూ స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.

ఎక్సైజ్ పోలీసుల పంచనామాలో ఏముంది?

అక్టోబరు 27వతేదీ తెల్లవారుజామున (అక్టోబరు 26వ తేదీ అర్ధరాత్రి) రెండు గంటల సమయంలో రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఎక్సైజ్ శాఖాధికారి బి.ప్రవీణ్ కుమార్ ఒక పంచనామా చేశారు.

నాన్-డ్యూటీ పెయిడ్ (సుంకం చెల్లించని) మద్యం ఉండటంతోపాటు, అనుమతి లేకుండా మద్యం పార్టీ చేసుకుంటున్నట్లు తేలిందని అందులో పేర్కొన్నారు.

‘‘అనుమతి లేకుండా డ్యూటీ ఫ్రీ విదేశీ మద్యం, నాన్-డ్యూటీ పెయిడ్ మద్యం, ఐఎంఎఫ్ఎల్, బీరులతో పార్టీ చేసుకుంటున్నారు. బార్ కౌంటర్ ఏర్పాటు చేసి మద్యం ఉంచారు. పార్టీకి కరణ్ కోట కార్తీక్ మేనేజర్‌గా వ్యవహరించారు. డ్యూటీ ఫ్రీ మద్యంతో పాటు దిల్లీ, మహరాష్ట్ర, తెలంగాణలో తయారైన మద్యం ఉన్నట్లు గుర్తించాం’’ అని ఎక్సైజ్ పోలీసులు పంచనామాలో తెలిపారు.

దాడుల్లో 6.45 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ పోలీసులు పేర్కొన్నారు.

సుంకం చెల్లించని మద్యం కలిగి ఉన్నందుకు ఏ1గా ఈవెంట్ మేనేజర్, ఫాంహౌస్ సూపర్ వైజర్ కార్తీక్, ఏ2గా రాజ్ పాకాలపై చేవెళ్ల ఎక్సైజ్ పోలీసులు కేసులు నమోదు చేశారు.

అనుమతి లేకుండా పార్టీ నిర్వహిస్తున్నారనే సమాచారంతోనే దాడులు చేసినట్లు చేవెళ్ల ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ శ్రీలత మీడియాకు చెప్పారు. సోదాల్లో డ్రగ్స్ లభించలేదని ఆమె స్పష్టంచేశారు.

విజయ్ మద్దూరి

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, విజయ్ మద్దూరి

‘నేను చెప్పని మాటలను చెప్పినట్లుగా రాశారు’

ఈ వ్యవహారం తర్వాత మద్దూరి విజయ్ మీడియాకు ఒక సెల్ఫీ వీడియో విడుదల చేశారు.

‘‘నా మిత్రుడు రాజ్ పాకాల దివాలీ పార్టీకి కుటుంబ సమేతంగా ఆహ్వానించారు. అక్కడ ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలూ జరగలేదు. మమ్మల్ని లక్ష్యంగా చేసుకుని పోలీసులు చేస్తున్న ఆరోపణలు చాలా అన్యాయం. నేను చెప్పని మాటలు కూడా చెప్పినట్లుగా ఎఫ్ఐఆర్‌లో రాశారు. ఇది నాకు, నా కుటుంబానికి, అలాగే రాజ్, ఆయన కుటుంబానికి తీరని అన్యాయం చేయడమే. ప్రజలెవరూ పోలీసులు రాసిన మాటలు నమ్మకండి. నేను అమెరికాలోనూ వ్యాపారాలు చేశాను. నాకు అమెరికా పౌరసత్వం ఉంది. ఎక్కడా మచ్చలేని కెరియర్ నాది. నా గురించి తప్పుడు ప్రచారం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. నిజాలు త్వరలోనే బయటకు వస్తాయి’’ అని ఆ సెల్ఫీ వీడియోలో చెప్పారు.

ఈ విషయంపై రాజ్ పాకాలను ఫోన్‌లో సంప్రదించేందుకు బీబీసీ ప్రయత్నించింది. ఆయన అందుబాటులోకి రాలేదు.

రాజ్ పాకాల

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, రాజ్ పాకాల

హైకోర్టులో రాజ్ పాకాల పిటిషన్

ఈ వ్యవహారంపై రాజ్ పాకాల తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు అక్రమంగా అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన అందులో ఆరోపించారు.

‘రాజ్ పాకాల కు సోమవారం ఉదయం 9:30 నోటీసు ఇచ్చి ఉదయం 11 గంటలకు విచారణకు రమ్మన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే కేసులు పెట్టారు.’’ అని పిటిషనర్ తరఫున న్యాయవాది వాదించారు.

దీనిపై అదనపు అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్ స్పందిస్తూ.. ‘‘రాజ్ పాకాలను అరెస్ట్ చేస్తామని ఎక్కడా చెప్పలేదు. ఇప్పటి వరకు ఈ కేసులో ఎవరినీ అరెస్ట్ చేయలేదు.. ఇందులో రాజకీయ ప్రమేయం లేదు.’’ అని హైకోర్టుకు తెలిపారు.

రాజ్ పాకాల కు నిబంధనల ప్రకారమే 41ఎ నోటీసులు ఇచ్చామని చెప్పారు.

అనంతరం రాజ్ పాకాలకు పోలీసులు ముందు హాజరు కావడానికి రెండు రోజుల సమయం ఇస్తున్నట్లు హైకోర్టు చెప్పింది.

‘మోతాదును బట్టి ప్రభావం’

డ్రగ్స్ వంటివి తీసుకున్నప్పుడు దాని మోతాదును బట్టి మనిషి శరీరంపై వాటి ప్రభావం ఉంటుందని అపోలో ఆసుపత్రి ప్రొఫెసర్ డాక్టర్ సుజిత్ చెప్పారు .

‘‘కొకైన్ లాంటివి తీసుకున్నప్పుడు, వాటి అవశేషాలు యూరిన్‌లో 48 గంటల వరకు ఉంటాయి. చెమటలో నాలుగు రోజుల వరకు ఉంటుంది. అది తీసుకునే మోతాదుపై ఇది ఆధారపడి ఉంటుంది. అందువల్ల టెస్టులో పాజిటివ్ అంటే ఆ నిర్ణీత సమయంలో ఎప్పుడైనా తీసుకుని ఉండొచ్చు’’ అని డాక్టర్ సుజిత్ వివరించారు.

తనిఖీల్లో ఏం దొరికాయి?

రాయదుర్గంలోని ఓరియంట్ విల్లాస్‌‌లోని రాజ్ పాకాల, రాజ్ సోదరుడు శైలేంద్ర నివాసాల్లో ఆదివారం ఎక్సైజ్ అధికారులు, పోలీసులు తనిఖీలకు యత్నించారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, పల్లా రాజేశ్వరరెడ్డి, మాగంటి గోపినాథ్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, గండ్ర వెంకట రమణారెడ్డి తదితరులు అక్కడికి చేరుకొని, ఆందోళనకు దిగారు.

సెర్చ్ వారెంట్ లేకుండా ఎలా తనిఖీ చేస్తారని ప్రశ్నించారు. దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఎక్సైజ్ శాఖ జాయింట్ కమిషనర్ ఖురేషీ సెర్చ్ వారెంట్‌తో తొలుత శైలేంద్ర, తర్వాత రాజ్ పాకాల ఇళ్లలో తనిఖీలు చేశారు.

ఈ సందర్భంగా రాజ్ పాకాల ఇంట్లో 22 విదేశీ మద్యం సీసాలు లభించాయని, వాటిల్లో 17 ఖాళీ సీసాలు కాగా, మరో ఐదు ఫుల్ బాటిల్స్ ఉన్నాయని ఖురేషీ మీడియాకు చెప్పారు.

పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న సుజాత

ఫొటో సోర్స్, TPCC

ఫొటో క్యాప్షన్, జన్వాడ్ ఫామ్‌హౌస్ ఘటనపై సమగ్ర విచారణ చేయాలని సైబరాబాద్ ఏసీపీకి ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ సుజాత ఫిర్యాదు చేశారు.

పరస్పర విమర్శలు

ఈ వ్యవహారంపై తెలంగాణలో రాజకీయ పార్టీలు పరస్పర విమర్శలు చేసుకున్నాయి.

పోలీసులు, ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేస్తున్నారన్న సమాచారంతో బీఆర్ఎస్ నాయకులు జన్వాడలో ఆందోళనకు దిగారు.

ఈ విషయంపై సమగ్ర విచారణ చేయాలని సైబరాబాద్ ఏసీపీకి ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ సుజాత ఫిర్యాదు చేశారు.

‘‘కేటీఆర్ బావమరిది ఫామ్‌హౌస్‌లో రేవ్ పార్టీ చేసుకుంటూ కొందరు డ్రగ్స్ తీసుకుంటుండగా స్వయంగా పోలీసులు పట్టుకున్నారు. ఈ పార్టీలో కేటీఆర్ భార్య కూడా ఉన్నారు. ఆమె పేరును కూడా నేను ఫిర్యాదులో పేర్కొన్నాను. ఈ విషయంపై సమగ్ర విచారణ చేసి ఎవరు ఉన్నా అరెస్టు చేయాలి’’ అని సుజాత డిమాండ్ చేశారు.

ఈ వ్యవహారంపై కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు.

‘‘ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో డ్రగ్స్ లేకుండా చేయాలని అహర్నిశలు కృషి చేస్తున్నారు. కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల తన ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్, విదేశీ మద్యంతో పార్టీ ఇచ్చారు. ఈ డ్రగ్స్ పార్టీలో ఎంత పెద్ద వారు ఉన్నా వదిలిపెట్టం’’ అని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.

కుటుంబ ఫంక్షన్ అయితే అక్కడ క్యాసినో కాయిన్స్ ఎందుకు ఉన్నాయని ఎంపీ, కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. దీనిపై ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

‘‘కేటీఆర్ బావమరిది ఫంక్షన్‌కు కేటీఆర్ సహా మరో ఇద్దరు ఎమ్మెల్యేలు వెళ్లింది నిజమా, కాదా?’’ అని ఆయన ప్రశ్నించారు.

కేటీఆర్

ఫొటో సోర్స్, BRS

ఫొటో క్యాప్షన్, పోలీసులు, ఎక్సైజ్ శాఖాధికారుల దాడులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు

‘దీపావళికి దావత్ చేసుకోవడం తప్పా’?

ఈ వ్యవహారంపై మాజీ మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.

‘‘ఒక ప్రహసనం మాదిరి మాపై కుట్ర నడిపే ప్రయత్నం చేస్తున్నారు. ఒక కుటుంబం దీపావళికి ఇంట్లో దావత్ చేసుకోవడం తప్పా? దాని కోసం కూడా అనుమతి తీసుకోవాలా? రాజ్ పాకాల ఇల్లు కట్టుకొని గృహ ప్రవేశం చేశారు. దాని కోసం ఆయన కుటుంబ సభ్యులు, మిత్రులతో ఫ్యామిలీ ఫంక్షన్ చేసుకున్నారు. అలాంటి కుటుంబ కార్యక్రమాన్ని రేవ్ పార్టీ అంటూ కొంతమంది పైశాచిక ఆనందం పొందుతున్నారు.’’ అని కేటీఆర్ చెప్పారు.

‘‘నేను అక్కడ లేకపోయినా నా పేరుతో అడ్డగోలుగా వార్తలు ప్రచారం చేస్తున్నారు.అది ఫామ్‌హౌస్ కాదు, రాజ్ పాకాల ఇల్లు. కుటుంబ సభ్యులను పురుషులు, మహిళలు అంటూ చెప్పి అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. 21 గంటలు తనిఖీలు చేసి పట్టుకున్నది ఏంటి? అక్కడ డ్రగ్స్ దొరకలేదని చెప్పారు’’ అని అన్నారు కేటీఆర్.

పోలీసుల దాడులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కె.పి. వివేకానంద, కె.సంజయ్ మీడియాతో మాట్లాడారు.

‘‘కేటీఆర్‌కు ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక ఆరోపణలు చేస్తున్నారు. కేటీఆర్ బావమరిది సొంత ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. రాజ్ పాకాల కుటుంబ సభ్యులను పోలీసులు ఇబ్బంది పెట్టారు. సొంత ఇంట్లో పార్టీలు చేసుకోవడం తప్పా? ఆ ఇంట్లో కేటీఆర్, ఆయన సతీమణి లేరు. కేటీఆర్‌ను మానసికంగా దెబ్బతీయాలని చూస్తున్నారు’’ అని బీఆర్ఎస్ నాయకులు అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)