‘డిజిటల్ అరెస్ట్‌ మోసాల బారిన పడకుండా ఉండేందుకు ఈ మూడు స్టెప్స్‌ ఫాలో అవ్వండి’- ప్రధాని మోదీ

ప్రధాని మోదీ, నరేంద్ర మోదీ, డిజిటల్ అరెస్ట్

ఫొటో సోర్స్, Reuters

    • రచయిత, అన్బరసన్ ఎతిరాజన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఈ మధ్య కాలంలో పెరిగిపోతున్న ‘డిజిటల్ అరెస్ట్‌’ ఆన్‌లైన్ మోసాలపై దేశ ప్రజలను ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు.

మోసగాళ్లు తాము పోలీసులం, ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులమంటూ వీడియో కాల్స్ చేసి, నకిలీ కేసులు నమోదు చేశామంటూ బెదిరించి తమ నుంచి లక్షల రూపాయలు లాగేసుకున్నారని అనేక మంది బాధితులు రిపోర్ట్ చేస్తున్నారు.

బాధితులను ఆ మోసగాళ్లు ఎలా బెదిరిస్తారంటే... ‘మీపై కేసు బుక్ చేశాం. ఇంట్లోనే ఒక దగ్గర కూర్చోండి, ఎటూ కదలొద్దు, ఎవరికీ కాల్ చేయొద్దు’ అంటూ ఆదేశాలు ఇస్తారు.

భారతీయ చట్టాల్లో ‘డిజిటల్ అరెస్ట్’ అనే ప్రస్తావనే లేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. అదంతా మోసగాళ్ల పని అని అన్నారు. భారత్‌లోని ఏ దర్యాప్తు సంస్థ కూడా ప్రజల వ్యక్తిగత వివరాలను ఫోన్ లేదా వీడియో కాల్ ద్వారా అడగదని ప్రధాని తెలిపారు.

బీబీసీ న్యూస్ తెలుగు, వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
సైబర్ నేరాలు

ఫొటో సోర్స్, Getty Images

“పోలీసులు, సీబీఐ, నార్కోటిక్స్, ఆర్బీఐ అధికారుల్లా ఆ మోసగాళ్లు నటిస్తుంటారు” అని ప్రధాని మోదీ అన్నారు.

పోలీస్ స్టేషన్ లేదా ఏదైనా దర్యాప్తు సంస్థ కార్యాలయం వంటి సెటప్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఏర్పాటు చేసుకుని, అవి వీడియోలో కనిపించేలా మోసగాళ్లు చూసుకుంటారు. అచ్చం నిజమైన యూనిఫామ్స్ లాంటివి ధరిస్తారు. అలాగే, నకిలీ ఐడీ కార్డు కూడా చూపెడతారు.

మీరు పంపిన పార్సిల్‌లో డ్రగ్స్ ఉన్నాయని లేదా మీ ఫోన్ ద్వారా చట్ట వ్యతిరేక పనులు చేస్తున్నారని బాధితులను మోసగాళ్లు బెదిరిస్తుంటారు. ఈ మోసాల్లో భాగంగా డీప్ ఫేక్ వీడియోలు, నకిలీ అరెస్ట్ వారెంట్‌లను కూడా తయారు చేస్తుంటారు.

ఈ మధ్య కాలంలో డిజిటల్ అరెస్ట్ కేసుల సంఖ్య భారీగా పెరిగింది.

ఓ బాధితుడు ఈ తరహా మోసం వల్ల దాదాపు 20 లక్షల రూపాయలు నష్టపోయారు. ఆయన ఫిర్యాదు మేరకు ఈ ఏడాది ఆగస్టులో కొంతమంది మోసగాళ్లను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు.

బాధితుడి ఇంటి అడ్రస్‌తో ఉన్న ఓ ప్యాకేజీలో ఎండీఎంఏ(MDMA) డ్రగ్ ఉందని, దానిని పోలీసులు సీజ్ చేసినట్లు మోసగాళ్లు చెప్పారు. ఒకవేళ దీనిని సెటిల్ చేసుకోకపోతే, చట్టపరంగా కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని బాధితుడిని వాట్సాప్ కాల్ ద్వారా బెదిరించారు.

ఈ నెల (అక్టోబర్)లో తాను కూడా ఈ తరహా మోసానికి గురైనట్లు మలయాళ నటి మాల పార్వతి తెలిపారు.

కొన్ని మీడియా సంస్థల కథనాల ప్రకారం, మోసగాళ్లు తాము ముంబయి పోలీసులమని ఫేక్ ఐడీ కార్డులను నటి మాల పార్వతికి చూపించారు. ‘‘తైవాన్‌కు అక్రమంగా డ్రగ్స్ తరలిస్తున్న కేసులో మిమ్మల్ని వర్చువల్‌గా అరెస్ట్ చేస్తున్నాం. అందులో భాగంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం’’ అని బెదిరించారు.

అయితే, డబ్బు లావాదేవీలు ఏం జరగకముందే ఇది మోసమని ఆమె గుర్తించారు.

వీడియో క్యాప్షన్, డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి? ఈ మోసాల బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి?

ఈ మోసాల బారిన పడకుండా ఉండేందుకు ఏం చేయాలంటే..

ఈ పరిస్థితుల్లో డిజిటల్ అరెస్ట్ మోసాల బారిన పడకుండా ఉండేందుకు ‘మూడు స్టెప్స్’ అనుసరించాలని ప్రధాని మోదీ సూచించారు.

“మొదటగా ప్రశాంతంగా ఉండండి, భయపడవద్దు. వీలైతే స్క్రీన్ రికార్డ్ లేదా వీడియో రికార్డ్ చేయాలి. రెండవది, ప్రభుత్వానికి చెందిన ఏ దర్యాప్తు సంస్థ కూడా ఆన్‌లైన్ ద్వారా బెదిరించదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మూడవది, నేషనల్ సైబర్‌క్రైమ్ హెల్ప్‌లైన్‌ నంబర్‌కు కాల్ చేయాలి. అలాగే, పోలీసులకు ఫిర్యాదు చేయాలి” అని ప్రధాని మోదీ దేశ ప్రజలకు సూచించారు.

నేషనల్ సైబర్‌క్రైమ్ హెల్ప్‌లైన్‌ నంబర్‌ 1930. కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో ఈ హెల్ప్‌లైన్ నడుస్తోంది.

ఆన్‌లైన్ మోసాలకు సంబంధించిన ఫిర్యాదులను నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌ https://cybercrime.gov.in/లో నమోదు చేయవచ్చు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)