మెకానిక్, కార్ డీలర్, న్యూస్ యాంకర్, వెయిట్రెస్.. అమెరికా ఎన్నికల బరిలో నిలిచిన సామాన్యులు ఎలాంటి పోటీ ఇస్తున్నారంటే..

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, శామ్ కాబ్‌రల్
- హోదా, బీబీసీ న్యూస్, వాషింగ్టన్
నవంబర్‌లో అమెరికా ఓటర్లు 47వ అధ్యక్షులు ఎవరన్నది తేల్చడంతో పాటు.. యూఎస్ కాంగ్రెస్ భవిష్యత్తునూ నిర్ణయించనున్నారు.
అమెరికా ప్రతినిధుల సభలోని 435 స్థానాలకు, సెనేట్‌లోని 33 స్థానాలకు నవంబర్ 5న ఎన్నికలు జరుగుతాయి.
ప్రస్తుతం ప్రతినిధుల సభలో రిపబ్లికన్లు ఎక్కువ మంది ఉండగా, సెనేట్‌పై డెమొక్రాట్లకు పట్టుంది. రెండు సభల్లో ఇరుపార్టీల సభ్యుల సంఖ్య మధ్య స్వల్ప వ్యత్యాసమే ఉంది.
కాంగ్రెస్‌లో భాగమయ్యేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నవారెవరు? అమెరికా రాజకీయాల్లో వారి గెలుపు చూపించే ప్రభావమేంటి?
మొంటానా, పశ్చిమ వర్జీనియా రాష్ట్రాల్లో విజయాలతో సెనేట్‌పై రిపబ్లికన్లు మళ్లీ నియంత్రణ సాధిస్తారని సర్వే సంస్థలు అంచనా వేస్తున్నాయి. అయితే, సంప్రదాయకంగా వారికి బాగా పట్టున్న నెబ్రాస్కాలో వెనకబడవచ్చన్న అంచనాలు రిపబ్లికన్లకు నిరుత్సాహం కలిగించవచ్చు.


ఫొటో సోర్స్, X/ Dan Osborn
గతంలో మెకానిక్
డాన్ ఆస్‌బాన్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. రెండుసార్లు రిపబ్లిక్ సెనేటర్‌గా గెలిచిన డెబ్ ఫిషర్‌తో ఆయన పోటీపడుతున్నారు. రిపబ్లికన్ సెనేటర్‌తో పోలిస్తే డాన్ ఆస్‌బాన్ రెండు పాయింట్ల ఆధిక్యంలో ఉన్నట్టు అంతర్గత సర్వేలో తేలింది.
49 ఏళ్ల ఆస్‌బాన్ అమెరికా నేవీలోనూ, నేషనల్ గార్డ్‌గానూ పనిచేశారు.
ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థ కెల్లాగ్స్‌కు చెందిన ఒమాహా ఫ్యాక్టరీలో డాన్ ఆస్‌బాన్ పారిశ్రామిక యంత్రాల మెకానిక్‌గా పనిచేశారు. అక్కడ స్థానిక యూనియన్‌కు నాయకత్వం వహించిన ఆయన 2021లో బయటకు వచ్చారు.
ప్రస్తుతం పైప్ ఫిట్టర్ నిపుణుడిగా పనిచేస్తున్న ఆస్‌బాన్ స్వతంత్రంగా పోటీ చేస్తున్నారు.
తమ అభ్యర్థిని నిలబెట్టకుండా డెమొక్రాట్లు ఆస్‌బాన్‌కు పరోక్షంగా మద్దతు ఇస్తున్నారు.
ఈ పోటీ కారణంగా ఫిషర్ ఊహించినదానికంటే కఠిన సవాళ్ళను ఎదుర్కోవడం జాతీయ రిపబ్లికన్లలో కూడా ఉత్కంఠ రేపుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
కార్ డీలర్
ఒహయోలో గెలిచి సెనేటర్ అయిన షెర్రడ్ బ్రౌన్‌కు ఇప్పుడు ప్రతికూల పరిస్థితులున్నాయి. ఇక్కడ సంప్రదాయవాదుల వైపు ఓటర్ల మొగ్గుచూపడం, ఆయన తిరిగి గెలిచే అవకాశాలను ప్రమాదంలోకి నెడుతోంది.
రిపబ్లికన్లు సెనేట్‌లో తిరిగి గెలుపొందడానికి కేవలం రెండు స్థానాలు దక్కించుకుంటే చాలు. ఒహయోలో బ్రౌన్‌ను తమ అభ్యర్థి బెర్నీ మొరెనో ఓడిస్తారని రిపబ్లికన్లు నమ్మకంతో ఉన్నారు.
కొలంబియాలోని బొగోటాలో పుట్టిన మొరెనో ఐదేళ్ల వయసులో అమెరికా వచ్చారు. దాదాపు రెండు దశాబ్దాల్లో ఆయన అమెరికాలో అతిపెద్ద కారు డీలర్‌షిప్ గ్రూపు ఏర్పాటు చేసుకున్నారు. ఇటీవలి కాలంలో ఆయన బ్లాక్‌చైన్ టెక్నాలజీలో కూడా పెట్టుబడి పెట్టారు.
ఈ ఎన్నికల్లో డోనల్డ్ ట్రంప్ ఆమోదముద్ర లభించిన మొదటి నామినీ ఆయనే. తాను కాంగ్రెస్‌కు ఎన్నికైతే సహజ వ్యాపారసూత్రాలు ప్రవేశపెడతానని మొరెనో చెబుతున్నారు. ట్రంప్ కాలంలో ఇతర రిపబ్లికన్లు ఇదే మాట చెప్పేవారు.
రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న మైనార్టీ అభ్యర్థుల్లో 57 ఏళ్ల మొరెనో ఒకరు. ఒకవేళ ఆయన ఎన్నికయితే ఒహయోకు మొదటి లాటిన్ సెనేటర్ అవుతారు.

ఫొటో సోర్స్, Getty Images
న్యూస్ యాంకర్
అమెరికా లాంటి దేశంలో ఓ జిల్లాపై బాగా పట్టున్న నేతను ఓడించడం అంత సులువు కాదు. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జన్నెల్ స్టెల్‌సన్ ఆ పని చేసేలా కనిపిస్తున్నారు.
స్టెల్‌సన్ 1986 నుంచి పెన్సిల్వేనియాలోని స్థానిక టెలివిజన్‌లో పనిచేస్తున్నారు. అలా ఆమె అందరికీ పరిచయమే. ఎన్నికల్లో ఆమె తొలిసారి పోటీ చేస్తున్నారు.
చాలా కాలంగా న్యూస్ ప్రెజెంటర్లుగా ఉన్న అరిజోనాకు చెందిన కరి లేక్, న్యూయార్క్‌కు చెందిన జాన్ అవ్లాన్ కూడా ఈ ఏడాది కాంగ్రెస్‌కు పోటీ చేస్తున్నారు. అయితే వారిద్దరిలో ఎవరూ స్టెల్‌సన్‌లా బలమైన పోటీదారులుగా లేరు. ఇప్పటిదాకా ఆరుసార్లు గెలిచిన రిపబ్లికన్ స్కాట్ పెర్రీని ఓడించాలని స్టెల్‌సన్ పట్టుదలగా ఉన్నారు.
పెర్రీ మితవాద హౌస్ ఫ్రీడమ్ కాకస్ మాజీ చైర్మన్. 2020 ఎన్నికలు ట్రంప్‌కు అనుకూలంగా మారేలా ప్రచార కార్యక్రమాలను నిర్వహించిన వారిలో కీలక వ్యక్తి.
గత ఏడాది వరకు స్టెల్‌సన్ రిపబ్లికన్. ఆమె పెర్రీని ఎన్నికల వ్యతిరేకిగా చెప్పేవారు. అయితే ఇప్పుడు ప్రచారంలో మాత్రం ఆమె దానిపై దృష్టిపెట్టడం లేదు.
ఎన్నికల వ్యతిరేకత అనేది పాతదైపోయిందన్నది డెమొక్రాట్ల అభిప్రాయం.
దానికి బదులు ఆమె పెర్రీ ఓటింగ్ రికార్డు, అబార్షన్లపై పెర్రీ వ్యవహార శైలి వంటివాటిపై ప్రచారం చేస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
యుద్ధ హీరో
నెవాడా రిపబ్లికన్ పార్టీ సెనేట్ నామినీ సామ్ బ్రౌన్ పరిస్థితి.. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మిగిలిన అభ్యర్థులతో పోలిస్తే భిన్నమైనది.
2008లో అఫ్గానిస్తాన్‌లోని కాందహార్‌లో మోహరించిన అమెరికా బలగాల్లో సామ్ ఒకరు. అఫ్గాన్‌కు వెళ్లిన నాలుగు నెలల తర్వాత ఆయన వాహనంపై బాంబు దాడి జరిగింది. ముఖంతో సహా ఆయన శరీరం మూడో వంతు తీవ్రంగా కాలిపోయింది. దీంతో ఆయన బలవంతపు రిటైర్‌మెంట్ తీసుకోవాల్సి వచ్చింది. తర్వాత మూడేళ్లపాటు చికిత్స తీసుకున్నారు.
కాలిన గాయాలకు చికిత్స అందించే యూనిట్‌లో పనిచేసే డైటీషియన్‌ను ఆయన పెళ్లిచేసుకున్నారు. ఇప్పుడు వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఎంబీఏ పూర్తిచేశారు. అత్యవసర చికిత్స అందించే చిన్న వ్యాపారం ప్రారంభించారు.
ఈ నేపథ్యంలో 41 ఏళ్ల బ్రౌన్, నెవాడా డెమొక్రాట్ సెనేటర్ జాకీ రోజన్‌కు గట్టి పోటీ ఇస్తారని అంతా భావించారు. కానీ రోజన్‌తో పోలిస్తే బ్రౌన్ వెనకబడి ఉన్నారని సర్వేల్లో తేలింది. రోజన్ గెలుపు ఖాయమన్న అభిప్రాయం వినిపిస్తోంది.
అబార్షన్ అంశం తీవ్రమైన ప్రభావం చూపిస్తోంది. అబార్షన్ నిబంధనలకు అనుకూలంగా బ్రౌన్ మరో ఓటు వేస్తారని రోజన్, ఆమె అనుచరులు ప్రచారం చేస్తున్నారు.
మైనార్టీ నాయకుడు మిచ్ మెక్‌కాన్నల్ వంటి ఎంతో మంది రిపబ్లికన్ల మద్దతు బ్రౌన్‌కు ఉన్నప్పటికీ ట్రంప్ వింగ్‌లోని నేతల మద్దతు తక్కువగా ఉంది. బ్రౌన్ అభ్యర్థిత్వాన్ని ఆమోదించడానికి ట్రంప్ చాలా సమయం తీసుకున్నారు.

ఫొటో సోర్స్, X/ Rebecca Cooke
వెయిట్రెస్
అమెరికాలోని ఓ చిన్నపట్ణంలో గెలుపు కోసం డెమొక్రాట్లు బాగా కష్టపడుతున్నారు. గ్రామీణ ఓటర్లు ఎక్కువమంది రిపబ్లికన్ పార్టీవైపు మళ్లుతున్నారు. అయితే వివాదాస్పద వ్యక్తులపై తమ గెలుపు ఖాయమని డెమొక్రాట్ల అభ్యర్థులు అంటున్నారు.
విస్కాన్సిన్‌లో 36 ఏళ్ల రెబెక్కా కుక్, రిపబ్లికన్ నేత డెర్రిక్ వాన్ ఆర్డన్ ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానంలో గెలుపొందాలని భావిస్తున్నారు.
డెయిరీ ఫామ్‌లో కుక్ పుట్టిపెరిగారు. ధరల తగ్గింపు, హెల్త్ కేర్ సదుపాయాన్ని మరింత మందికి విస్తరించడం, తుపాకీ చట్టాల ఆమోదం వంటివి ప్రచారం చేస్తున్నారు.
గతంలో లాభాపేక్ష లేని ఓ చిన్న వ్యాపారాన్ని నడిపించిన కుక్ వెయిట్రెస్‌గా కూడా పనిచేశారు. చట్టపరమైన బాధ్యతలను నెరవేర్చడంపై కాకుండా ఇతర విషయాలపై వాన్ ఆర్డన్ దృష్టిపెట్టారని కుక్ ఆరోపిస్తున్నారు.
మితవాద నాయకునిపై రెండేళ్ల క్రితం గ్రామీణ వాషింగ్టన్‌లో గెలిచిన మారీ గ్లుసెన్‌కాంప్ పెరెజ్‌ను కుక్ గుర్తు చేస్తున్నారు.
పెరెజ్ మరోసారి గెలవడంతోపాటు కుక్ గెలుపు హౌస్‌లో రిపబ్లికన్లు మెజార్టీ సాధించడంలో కీలకమవుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
నాస్కార్ డ్రైవర్
ఇంధనం, పర్యావరణం వంటి విషయాల్లో సొంతపార్టీ అయినా తరచుగా ప్రశ్నిస్తూ.. డెమొక్రాట్ జరెడ్ గోల్డెన్ వాషింగ్టన్‌లో రాజకీయ నేతగా ఎదిగారు.
అయితే, ఐదోసారి గెలవాలనుకుంటున్న జరెడ్ గోల్డెన్‌కు, కాంగ్రెస్ సభ్యుడు, మాజీ స్టాక్ కార్ డ్రైవర్ ఆస్టిన్ థెరియాల్ట్ నుంచి సవాళ్లు ఎదురవుతున్నాయి.
30 ఏళ్ల థెరియాల్ట్ వ్యవసాయ కుటుంబంలో పుట్టిపెరిగారు.
13 ఏళ్ల నుంచే రేసింగ్‌లో శిక్షణ పొందిన థెరియాల్ట్ 2017లో నాస్కార్ లెజెండ్ కెన్నీ స్క్రాడర్‌పై రేసులో గెలిచి రికార్డులు బద్ధలు కొట్టారు. ఆటోమొబైల్ రేసింగ్ క్లబ్ అమెరికా మెనార్డ్స్ సిరీస్ చాంపియన్‌గా నిలిచారు.
మరో ప్రొఫెషనల్ అథ్లెట్ కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. గతంలో జాతీయ ఫుట్‌బాల్ లీగ్ టెన్నెసీ టైటాన్స్ తరఫున ఆడిన కోలిన్ అల్‌రెడ్.. టెక్సాస్‌లో డెమొక్రాట్ల ఓటమికి, ఫైర్‌బ్రాండ్ రిపబ్లికన్ సెనేటర్ టెడ్ క్రూజ్ రాజకీయ జీవితానికి ముగింపు పలకాలని భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, X/ Amish Shah
డాక్టర్
రెండేళ్ల కిందట సుప్రీంకోర్టులో రో వర్సెస్ వేడ్ అబార్షన్ చట్టంపై చేసిన పోరాటం డెమొక్రాట్లకు కొత్త ఉత్సాహాన్ని కలిగించింది.
అరిజోనాలో పోటీ చేస్తున్న అమీష్ షా కూడా అబార్షన్ నిబంధనల గురించి మాట్లాడుతున్నారు. అబార్షన్ నిబంధనలకు మద్దతిస్తున్న రిపబ్లికన్లు డాక్టర్లను ఒత్తిడిలోకి నెట్టివేస్తున్నారని ఆరోపించారు. రోగికి ఇచ్చిన మాట నెరవేర్చడం లేదా జైలుకు వెళ్లడం రెండింటిలో ఏదో ఒకటి ఎంచుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు.
భారతీయ అమెరికన్ అయిన అమిష్ షా మూడుసార్లు ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. సామాజిక సేవతో గుర్తింపు పొందారు.
అత్యవసర సేవలు అందించే వైద్యునిగా అనుభవం ఉన్న అమిష్ షా ఇప్పుడు ఏడుసార్లు గెలిచిన రిపబ్లిక్ అభ్యర్థి డేవిడ్ స్వైకర్ట్‌ని ఓడించగలరని భావిస్తున్నారు.
అమిష్ షా అబార్షన్ నిషేధాన్ని వ్యతిరేకిస్తున్నారని స్వైకర్ట్ ప్రచారం చేస్తున్నారు.
అబార్షన్ పరిమితులపై అరిజోనా రాష్ట్రంలో ఆందోళనలు ఎక్కువగా జరుగుతున్నాయి. మహిళల ప్రాణానికి ముప్పు ఉంటే తప్పితే అబార్షన్లు నేరమని 2022లో అమెరికా సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.
అబార్షన్ హక్కును రాజ్యాంగంలో ఉంచాలా లేదా అన్నదానిపై ఓటర్ల అభిప్రాయం తీసుకునే రాష్ట్రాల్లో ఆరిజోనా ఒకటి.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














