ఆంధ్రప్రదేశ్: ఉత్తరాంధ్రలో గంజాయి సాగు తగ్గిందా? మరి పట్టుబడుతున్నది ఎక్కడి నుంచి వస్తోంది?

గంజాయి, విశాఖ ఏజన్సీ, బిహార్, అల్లూరి జిల్లా, విశాఖపట్నం, చింతపల్లి
ఫొటో క్యాప్షన్, గాలిపాడులో గంజాయి తోటలు (ఫైల్ ఫొటో)
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

గంజాయి సాగు ద్వారా లక్షకి ఐదు లక్షల రూపాయలు లాభం వస్తుంటే తామెందుకు సంపాదించకూడదంటూ అల్లూరి జిల్లాలోని చింతపల్లి మండలం గాలిపాడు గ్రామంలోని గిరిజనులు కొండల దిగువన గంజాయి తోటలను విరివిగా పెంచారు.

అనుకున్నట్లుగానే బాగా డబ్బులు సంపాదించామని 2021 అక్టోబరులో బీబీసీ అక్కడికి వెళ్లినప్పుడు గాలిపాడు గ్రామస్థులు బీబీసీతో చెప్పారు.

అప్పట్లో ఆ గ్రామంలో అమ్మకానికి సిద్ధంగా ఉన్న గంజాయి తోటలు చాలా చోట్ల కనిపించాయి.

మళ్లీ, 2024 అక్టోబర్ లో అదే గ్రామానికి బీబీసీ వెళ్లింది.

ఇప్పుడు ఆ గ్రామంలో ఎక్కడా గంజాయి తోటలు కనిపించలేదు. అన్నీ వరి పొలాలే కనిపించాయి.

గాలిపాడుతో పాటు గంజాయి తోటలకు పేరు పొందిన జి. మాడుగుల, పెదబయలు, ముంచింగిపుట్టు మండలాలలో కూడా గంజాయి సాగు జరగడం లేదు. ఈ ప్రాంతాల్లో కూడా బీబీసీ పర్యటించింది.

ఒకవైపు గంజాయి సాగు మన్యంలో దాదాపుగా లేదు. కానీ, విశాఖ, నర్సీపట్నం, అనకాపల్లి, హైదరాబాద్ ఇలా అనేక చోట్ల గంజాయి పోలీసులకు దొరుకుతూనే ఉంది.

మరి పట్టుబడుతున్నఈ గంజాయి ఎక్కడి నుంచి వస్తోంది? పోలీసులు ఏమంటున్నారు? గిరిజనులు గంజాయి తోటల నుంచి వరి పంట వైపు మళ్లేలా చేసింది ఏంటి?

బీబీసీ న్యూస్ తెలుగు
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
గంజాయి, విశాఖ ఏజన్సీ, బిహార్, అల్లూరి జిల్లా, విశాఖపట్నం, చింతపల్లి
ఫొటో క్యాప్షన్, మూడేళ్ల క్రితం ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో 10వేలకు పైగా ఎకరాల్లో గంజాయి సాగైనట్లు పోలీసులు చెప్పారు.

మన్యంలో మూడేళ్ల కిందట గంజాయి ఏ స్థాయిలో ఉండేదంటే...

2021 నాటికి పోలీసుల దగ్గరున్న లెక్కల ప్రకారం ఏవోబీలో 10 వేల ఎకరాలకు పైనే గంజాయి సాగవుతుండగా...అనధికారిక లెక్కల ప్రకారం అది 15 వేల ఎకరాలు ఉంటుందని అంచనా. ఏజెన్సీలోని ఏ గ్రామానికి వెళ్లినా గంజాయి తోటలే కనిపించేవి.

ఏడాదిలో రెండు దఫాలుగా గంజాయి పండించేవాళ్లమని, ఏడాదిలో గంజాయి తోటలపై రూ. 5 లక్షలు పెట్టుబడి పెడితే అది రూ. 50 లక్షల సరుకుగా మారుతుందని గంజాయిని సాగు చేసిన గాలిపాడు గ్రామస్థుడు రాంబాబు బీబీసీతో అన్నారు.

“మాకు దగ్గర్లోని కిల్లోకోట గ్రామం వాళ్లు గంజాయి సాగు చేస్తూ బాగా సంపాదిస్తూ దర్జాగా బతికేవాళ్లు. వాళ్లని చూసి మేం కూడా డబ్బు సంపాదించాలని గంజాయి వేశాం.” అని రాంబాబు తెలిపారు.

తాను కూడా ఏటా రూ. లక్ష పెట్టుబడి పెట్టి రూ. 5 లక్షలు సంపాదించేవాడినని, అలా మూడేళ్ల పాటు చేశానని చెప్పారు.

ప్రస్తుతం గంజాయి తోటల జోలికి పోకుండా...పసుపు పంట వేసుకుని జీవనం సాగిస్తున్నట్లు రాంబాబు తెలిపారు.

“వరి, పసుపు, అపరాలు వంటి పంటలు సాగుచేస్తూ వాటితో పాటు గంజాయి మొక్కలను పెంచేవాళ్లం. అయితే పోలీసు కేసులు ఎక్కువ కావడం, సేట్లు(వ్యాపారులు) డబ్బులు ఇవ్వకుండా మోసం చేయడంతో గంజాయి సాగు మానేశా.” అని రాంబాబు వివరించారు.

గాలిపాడు గ్రామంలోని కేసుబాబు, నూకరాజు, సుబ్బారావు, ఉదయ్, భగవాన్, కృష్ణమూర్తి ఇలా బీబీసీతో మాట్లాడిన వారందరూ కూడా గతంలో తాము గంజాయి సాగు చేశామని చెప్పారు.

గంజాయి, విశాఖ ఏజన్సీ, బిహార్, అల్లూరి జిల్లా, విశాఖపట్నం, చింతపల్లి
ఫొటో క్యాప్షన్, గంజాయి సాగుకు వ్యతిరేకంగా 'పరివర్తన' పేరుతో అధికారులు కార్యక్రమాన్ని చేపట్టారు.

‘పరివర్తన’ వచ్చిందా...?

మన్యంలో గంజాయి విచ్చలవిడిగా సాగు జరుగుతుండటం, అది రోజురోజుకు పెరుగుతుండటంతో దీనిని ఆరికట్టేందుకు పోలీసులు వివిధ కార్యక్రమాలు చేపట్టారు.

“ గిరిజనులు తమ గ్రామాల్లో ఉన్న గంజాయి సాగును ధ్వంసం చేసేలా ‘పరివర్తన’ పేరుతో పోలీసులు, వ్యవసాయ శాఖ, రెవెన్యూ విభాగం అధికారులతో కలిసి గంజాయి సాగు వలన కలిగే నష్టాలను వివరించాం. గిరిజనానికి వ్యాపారాలు చేసుకునేందుకు బ్యాంకు రుణాలు ఏర్పాటు చేశాం. గంజాయి సాగును మానేసిన వారికి సన్మానాలు కూడా చేశాం. అలా క్రమంగా గిరిజనుల్లో మార్పును తీసుకురాగలిగాం.” అని అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ బీబీసీతో అన్నారు.

మూడేళ్లలో వాటి ఫలితాలు చూస్తున్నామని, ఏజెన్సీలో ఎక్కడా గంజాయి తోటలు కనిపించడం లేదన్నారాయన. పరివర్తన కార్యక్రమం ద్వారా 2023లో 348 ఎకరాల గంజాయి తోటలను గిరిజనులే ధ్వంసం చేశారని ఎస్పీ అమిత్ బర్దార్ తెలిపారు.

“చింతపల్లి, డుంబ్రిగూడ, జి. మాడుగుల, జీకే వీధి, హుకుంపేట, కొయ్యూరు, ముంచింగిపుట్టు, పాడేరు, పెదబయలు, మంప మండలాల పరిధిలోని 135 గ్రామాల్లో గంజాయి తోటల కోసం గత వంద రోజుల్లో 3200 ఎకరాల్లో సెర్చ్ చేశాం. అందులో 80 గ్రామాల్లో డ్రోన్ కెమెరాలతో పరిశీలించాం. కానీ ఎక్కడా గంజాయి ఆనవాళ్లు కనిపించలేదు.” అని అక్టోబర్ 22న అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ బీబీసీతో చెప్పారు.

గంజాయి, విశాఖ ఏజన్సీ, బిహార్, అల్లూరి జిల్లా, విశాఖపట్నం, చింతపల్లి
ఫొటో క్యాప్షన్, గాలిపాడు గ్రామంలో గతంలో గంజాయి సాగు చేసిన పొలాల్లో ప్రస్తుతం వరి సాగు చేపట్టారు.

ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే...

గాలిపాడు గ్రామంలోకి ప్రవేశిస్తుండగానే పచ్చని వరి పొలాలు పలకరించాయి.

ఊరిలోని దారిపొడవునా ఇలాగే కనిపించింది. ఇక గతంలో గంజాయి మొక్కలు వేసిన కొండ దిగువ ప్రాంతానికి కూడా బీబీసీ వెళ్లింది.

అక్కడ కూడా వరిపొలాల పచ్చదనం పరుచుకుని కనిపించింది.

“గంజాయి కేసులో ఎవరో మీ పేరు చెప్పారంటూ మమ్మల్ని తీసుకుని వెళ్లిపోతున్నారు. 2021లో అయితే తెలంగాణ నుంచి పోలీసులు వచ్చి ఇక్కడ కాల్పులు కూడా జరిపారు.” అని గాలిపాడు గ్రామానికి చెందిన కేసుబాబు బీబీసీకి చెప్పారు.

“గంజాయి సాగు మానేయడం వలన ప్రశాంతంగా బతుకుతున్నాం. కానీ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఎవరో సేట్లు వచ్చి గంజాయి నర్సీపట్నం దాటించు బాగా డబ్బులిస్తామంటూ మాకు ఆశ చూపేవారు. ఒక లక్ష రూపాయలు ఇస్తామని చెప్పి...పది వేలు, ఇరవై వేలు ఇచ్చేవారంతే. మళ్లీ కనిపించేవారు కాదు. ఇక ఇలాంటి పరిస్థితిలో గంజాయి కంటే మాకు అలవాటైన సంప్రదాయపంటలే మేలని గంజాయి సాగును వదిలేశాం” అని సప్పర్ల గ్రామానికి చెందిన భగవాన్ చెప్పారు.

గంజాయి, విశాఖ ఏజన్సీ, బిహార్, అల్లూరి జిల్లా, విశాఖపట్నం, చింతపల్లి
ఫొటో క్యాప్షన్, ఏవోబీకి సమీపంలోని కొన్ని ప్రాంతాల్లో గంజాయి విరివిగా పండుతున్నట్లు సమాచారం ఉందని పోలీసులు చెబుతున్నారు.

మరి దొరుకుతున్న గంజాయి ఎక్కడిది?

ప్రస్తుతం గంజాయికి పేరు పొందిన ఏజెన్సీ మండలాల్లోని ఏ గ్రామానికి వెళ్లినా గంజాయి తోటలు కనిపించలేదు. మరి, తరచూ మైదాన ప్రాంతాల్లో పోలీసులకు దొరుకుతున్న గంజాయి ఎక్కడి నుంచి వస్తున్నది? ఎవరు పండిస్తున్నారు?

జీకే వీధి, జి. మాడుగుల, పెదబయలు, ముంచింగి పుట్టు ఈ ప్రాంతాలు ఒడిశాకు దగ్గరగా ఉన్నాయి. దీంతో ఏవోబీకి సమీపంలో ఉన్న ఒడిశాలోని కొన్ని ప్రాంతాల్లో గంజాయి విరివిగా పండిస్తున్నట్లు తమకు అక్కడి పోలీసుల నుంచి సమాచారం ఉందని అల్లూరి జిల్లా పోలీసులు అంటున్నారు.

“ఒడిశాలో పండిన గంజాయిని జి. మాడుగుల, పెదబయలు వంటి ప్రాంతాల నుంచే తీసుకుని వెళ్లాలి. దీంతో మన వద్ద గంజాయి సాగు లేకున్నా...ఒడిశాలో పండిస్తున్న గంజాయి రవాణా సమయంలో మన వద్ద పట్టుబడుతోంది.” అని అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ చెప్పారు.

గాలిపాడు, గంగవరం, సప్పర్ల గిరిజనులను గంజాయి ఏ ప్రాంతం నుంచి వస్తుందనే ప్రశ్న అడిగినప్పుడు...

“ఒడిశా నుంచే వస్తుంది. ఇక్కడ కొంతమంది గంజాయి వ్యాపారం చేసే వాళ్లు ఉన్నారు. ఆంధ్రా నుంచి వెళ్లి గంజాయిని అక్కడ నుంచి పట్టుకుని వస్తున్నారు” అని గాలిపాడుకు చెందిన సుబ్బారావు బీబీసీతో చెప్పారు.

“ఒడిశా నుంచి గంజాయి రావాలంటే మా సరిహద్దు నుండే రావాలి. గంజాయి ఏ ప్రాంతంలో పండించినా అది వెళ్లేదారి మాత్రం ఇదే.” అని గంగవరానికి చెందిన రాము అన్నారు.

గంజాయి, విశాఖ ఏజన్సీ, బిహార్, అల్లూరి జిల్లా, విశాఖపట్నం, చింతపల్లి
ఫొటో క్యాప్షన్, అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్

డ్రోన్లతో సర్వే...

ప్రతి రోజూ గంజాయిపై నిఘా కోసం డ్రోన్ కెమెరాలతో సర్వే చేస్తున్నాం. గతంలో ఏజెన్సీలోని గంజాయి పండించిన గ్రామాల్లో కూడా వీటితో సర్వే చేస్తున్నామని ఎస్పీ అమిత్ బర్దార్ చెప్పారు.

డ్రోన్ల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి సాగు దాదాపుగా కనిపించడం లేదనీ, అక్కడక్కడా గంజాయి మొక్కలు పెంచుతున్నట్లు సమాచారం అందుతున్నా అవి డ్రోన్ కెమెరాలకు చిక్కడం లేదంటున్నారు అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్.

“డ్రోన్ సర్వేలో ఒక సమస్య ఉంది. గంజాయి మొక్కలు ఒక నిర్దిష్టమైన ఎత్తుకు ఎదిగితే తప్ప డ్రోన్లు గుర్తించడం లేదు. రెండున్నర, మూడు అడుగుల కంటే తక్కువ హైట్ ఉంటే అవి గంజాయి మొక్కల్లా కాకుండా వేరే మొక్కల్లా కనపడుతున్నాయి. దీనిని అధిగమిస్తే... ఏజెన్సీలో 100 శాతం గంజాయి రహిత ప్రాంతంగా ప్రకటించగలుగుతాం” అని ఎస్పీ అమిత్ బర్దార్ అన్నారు.

గంజాయి, విశాఖ ఏజన్సీ, బిహార్, అల్లూరి జిల్లా, విశాఖపట్నం, చింతపల్లి
ఫొటో క్యాప్షన్, గాలిపాడు గ్రామం

గంజాయిపై తాజా రిపోర్ట్ ఇది...

గత వంద రోజుల్లో (అక్టోబర్ 22 నాటికి) 93 కేసులు నమోదు చేసి 6782 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నాం. 247 మందిని అరెస్ట్ చేశాం. ఒకసారి గంజాయి కేసులో అరెస్టైనా, మళ్లీ మళ్లీ అదే నేరం చేస్తున్న 19 మందిపై పీడీ యాక్ట్ పెట్టేందుకు ప్రోసీడ్ అవుతున్నామని జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ తెలిపారు.

“పోలీసు శాఖ చేపట్టిన పరివర్తన, సంకల్పం, స్ఫూర్తి కార్యక్రమాల ద్వారా గంజాయి సాగుని నియంత్రించడం, ఇతర పంటల వైపు మొగ్గు చూపటం, ఇతర ఉపాధి మార్గాలను చూపడం ద్వారా గంజాయి సాగుని ఆంధ్రా ఏజెన్సీ ప్రాంతంలో దాదాపుగా అరికట్టగలిగాం” అని ఆయన బీబీసీతో చెప్పారు.

గంజాయి, విశాఖ ఏజన్సీ, బిహార్, అల్లూరి జిల్లా, విశాఖపట్నం, చింతపల్లి
ఫొటో క్యాప్షన్, సెప్టెంబర్ 29న విశాఖలోని క్రాంతి థియేటర్ సమీపంలోని ఒక బడ్డీలో ఈ గంజాయి చాక్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

గంజాయి చాక్లెట్లు...

గంజాయి రవాణాలో కొత్త మార్గాలతో పాటు గంజాయి రూపం కూడా మారుస్తూ పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు పెడ్లర్లు.

గంజాయిని ఆకుల రూపంలోనే రవాణా చేయడం సంప్రదాయ పద్ధతి.

ఇప్పుడు గంజాయిని లిక్విడ్ రూపంలో మార్చి సీసాలతో రవాణా చేస్తున్నారు. తాజాగా చాకెట్ల రూపంలో కూడా గంజాయి మార్కెట్లోకి వచ్చింది.

సెప్టెంబర్ 29న విశాఖలోని క్రాంతి థియేటర్ సమీపంలోని ఒక బడ్డీలో ఈ గంజాయి చాక్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

“చాక్లెట్ రూపంలో రవాణా అవుతున్నది బిహార్ నుంచి వచ్చింది. ఈ రూపంలో సాధారణంగా గంజాయి కంటే ఓపియం‌ను ఎక్కువగా రవాణా చేస్తుంటారు. ఇప్పుడు గంజాయిని కూడా ఈ పద్ధతిలో అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారు.” అని ఎస్పీ అమిత్ బర్దార్ చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)