బీబీసీ కరస్పాండెంట్: ‘గాజా నుంచి బయటపడ్డా, కానీ తప్పు చేశాననిపిస్తోంది’

ఫొటో సోర్స్, REUTERS/Ibraheem Abu Mustafa
- రచయిత, రుష్దీ అబూ అలూఫ్
- హోదా, బీబీసీ గాజా ప్రతినిధి, ఇస్తాంబుల్, కైరోల నుంచి...
నా కుటుంబం గాజాను విడిచిపెట్టి పది నెలలు అవుతోంది. అయినా, ఇంకా మేం ఆ బాధ, భయం, యుద్ధ ప్రభావాలతోనే బతుకుతున్నాం.
గాజాలో యుద్ధం ప్రారంభమై ఏడాది అవుతోంది. గత ఏడాది అక్టోబర్ 7న హమాస్ ఫైటర్లు ఇజ్రాయెల్‌పై దాడి చేశారు. ఆ తర్వాత నుంచి ఇజ్రాయెల్ గాజాపై దాడులు చేయడం ప్రారంభించింది . ఇప్పటికీ ఈ దాడులు ఆగలేదు.
యుద్ధం మొదలై తొలి ఏడాది పూర్తవడానికి కొద్దిగా ముందు, ఒక రోజు ఎనిమిది గంటల పాటు నరకం అనుభవించాం.
గాజాలో నివసించే నా భార్య కజిన్లు ఒక వీడియో పంపించారు. దానిలో వారు, ‘‘మమ్మల్ని ట్యాంకులు చుట్టుముట్టాయి. మావైపు కాల్పులు జరుపుతున్నారు. మాకు ఇవే చివరి క్షణాలు ’’ అని చెప్పారు.
వారి కోసం రోజంతా ప్రార్థిస్తూనే ఉన్నాం. దేవుడా నువ్వు చేయగలిగిందేమన్నా ఉంటే, వారిని కాపాడటానికి ఏదో ఒకటి చేయి అని మొక్కుతూనే ఉన్నాం.
ఆ వీడియో చూసిన తర్వాత నా భార్య స్పృహతప్పి పడిపోయింది. ఆమె అత్తామామలు, చిన్నాన్న చిన్నమ్మలు, ఆమె కుటుంబంలోని మొత్తం 26 మందిపై దాడి జరిగింది.
హమాస్ ఫైటర్లను లక్ష్యంగా చేసుకుని గాజా నగరాల్లో, గ్రామాల్లో ఇజ్రాయెల్ సైనిక చర్యలకు దిగింది.
మేం ఆ వీడియో చూసిన కొన్నిగంటలవరకు అక్కడ ఏం జరిగిందనే విషయంపై మాకెటువంటి సమాచారం రాలేదు.
ఆ సమయంలో అక్కడ బాంబుదాడులు నిరాఘాటంగా సాగుతూనే ఉన్నాయి.

ఎట్టకేలకు ఆడియో మెసేజ్
చివరికు వారి దగ్గర నుంచి ఒక ఆడియో మెసేజ్ వచ్చింది. ‘‘నలుగురికి గాయాలయ్యాయి. వాఫా ఆంటీ తీవ్రంగా గాయపడ్డారు. ఆమె పరిస్థితి విషమంగా ఉంది’’ అని తెలిసింది.
పాలస్తీనా రెడ్ క్రాస్‌కు ఎన్నిసార్లు ఫోన్ చేశానో లెక్కలేదు.
ఎవరైనా సాయం చేస్తారేమోనని కాల్స్ చేస్తూనే ఉన్నా.
ఎనిమిది గంటల తర్వాత, క్షతగాత్రులను అక్కడి నుంచి తరలించేందుకు ఇజ్రాయెల్ ఆర్మీ వారికి అవకాశం ఇచ్చింది.
కానీ, అప్పటికే ఆలస్యమైంది. ఆస్పత్రికి చేరుకున్న కొద్ది క్షణాల్లోనే వాఫా ఆంటీ ప్రాణాలు విడిచారు.
గాజాలో ఇంకా మా బంధువులు చాలా మందే ఉన్నారు. నాన్న అక్కడే ఉన్నారు. ఖాన్ యూనిస్‌లో ఒక టెంట్ వేసుకుని ఉంటున్నారు. ఈ వారంలో మళ్లీ అక్కడ బాంబులు వేశారు.

ఫొటో సోర్స్, REUTERS/Ibraheem Abu Mustafa
‘తప్పు చేశాననిపిస్తోంది’
నా భార్య, ఇద్దరు పిల్లలతో నేను ఇస్తాంబుల్ వచ్చేశాను. అందుకే గాజాలోని నా కుటుంబసభ్యులకు ఫోన్ చేసినప్పుడల్లా నేనేదో తప్పు చేశాననిపిస్తుంటుంది.
నాలాగా చాలామంది తుర్కియే, ఈజిప్ట్, అమెరికా, బ్రిటన్, యూరప్ వంటి ప్రపంచంలోని చాలా ప్రాంతాలకి ప్రాణాలు కాపాడుకునేందుకు తరలి వెళ్లారు.
అయితే, ప్రతి ఒక్కరూ గాజా నుంచి బయటికి రాలేకపోయారు. ప్రయాణ ఖర్చులు భరించే స్తోమత ఉన్నవారు. ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లగలిగేవారు మాత్రమే గాజా నుంచి బయటపడగలిగారు.
ఈజిప్ట్‌కు గత ఏడాది నవంబర్ నుంచి లక్ష మందికి పైగా గాజా నుంచి తరలి వెళ్లారు.
దీనివల్ల వారు ఇజ్రాయెల్ వైమానిక దాడుల ప్రభావం నుంచి వారు బయటపడ్డారు. కానీ, వారి కుటుంబాలకు ఆహారం, పిల్లలకు చదువు, ఉండేందుకు కనీస వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
సంప్రదాయ గీతాలను వింటూ..
కైరో నాస్ర్ నగరంలోని ఒక ఓపెన్ ఎయిర్ కేఫ్‌లో చిన్న చిన్న బృందాలుగా పదుల సంఖ్యలో శరణార్థులు సమావేశమయ్యారు. వారు ఇక్కడ తమ బాధలను ఇతరులతో పంచుకుంటున్నారు.
మరొకరితో తమ బాధలను పంచుకోవడం ద్వారా, తమతో లేని వారి జ్ఞాపకాల బరువును తగ్గించుకుంటున్నారు.
వీరంతా త్వరలో యుద్ధం ముగుస్తుందని, వాళ్ల ఇళ్లకు తిరిగి వెళతారని ఆశిస్తున్నారు. కానీ, పరిస్థితి చూస్తేనేమో ఇంకా ప్రమాదకరంగానే కనిపిస్తోంది.
సంప్రదాయ పాలస్తీనియన్ల పాటను పాడుకుంటూ వారు తమ బాధలను మరిచిపోయే ప్రయత్నం చేస్తున్నారు.
కొన్నేళ్ల కిందట అరబ్ ఐడల్ పోటీల్లో విజయం సాధించిన పాలస్తీనా గాయకుడు మొహమ్మద్ ఆసఫ్ పాటను వారు పాడుకుంటున్నారు.
‘‘గాజా గుండా వెళ్లండి, ఆ నేలను ముద్దాడండి. అక్కడి ప్రజలు ధైర్యవంతులు, సాహసవంతులు’’ అనే అర్థం వచ్చే పాట అది.

ఫొటో సోర్స్, EPA
‘హృదయం ముక్కలవుతోంది’
అక్కడున్న వారితో కూర్చున్న 58 ఏళ్ల అబు అనాస్ అయ్యద్ ఆ పాటను ఎంతో శ్రద్ధగా వింటున్నారు. ఆయన గాజాలో ‘కింగ్ ఆఫ్ గ్రావెల్’గా ప్రసిద్ధి పొందిన వ్యాపారి. గాజాలో నిర్మించే భవనాలకు కావాల్సిన సామాగ్రిని ఆయనే సరఫరా చేసేవారు.
తన కుటుంబం, పిల్లలతో సహా ఆయన గాజా తరలి వచ్చారు.
‘‘గాజాలో భవనాలను క్షిపణులు తాకిన ప్రతిసారి, నా హృదయం ముక్కలవుతున్నట్లే అనిపిస్తుంది. నా కుటుంబం, స్నేహితులు అక్కడే ఉన్నారు’’ అని ఆయన చెప్పారు.
గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెలీలపై హమాస్ జరిపిన దాడి గురించి ఆయన చింతిస్తున్నారు. దాని తర్వాతి పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గాజాపై ఆయనకు ఎంతో ప్రేమ ఉన్నప్పటికీ, హమాస్ అధికారంలో ఉన్నంత వరకు వారు తిరిగి అక్కడకు వెళ్లాలనుకోవడం లేదు.
ఇరాన్ ప్రయోజనాల కోసం నిర్లక్ష్యపూర్వకంగా వ్యవహరించే నాయకుల ఆటల్లో తన పిల్లల్ని కీలుబొమ్మలు చేయాలనుకోవడం లేదని అబు అనాస్ అన్నారు.
ఆయన పక్కనే మహమూద్ అల్ ఖోజోదర్ కూర్చుని ఉన్నారు.
యుద్ధం ప్రారంభం కావడానికి ముందు, ఆయన గాజాలో తమ కుటుంబానికి చెందిన ఒక తినుబండారాల దుకాణాన్ని నడిపేవారు. ఆ దుకాణంలో లభించే తినుబండారాల కోసం సెలబ్రిటీలు కూడా వచ్చేవారు. పాలస్తీనా దివంగత అధ్యక్షుడు యాసర్ అరాఫత్ తరచూ అక్కడకు వచ్చేవారు.
తన ఫోన్‌లో తానున్న ఇల్లు, షాపు ఫోటోలు చూపించారు మహమూద్ . కానీ, ఇప్పుడు ఆయన కేవలం రెండు గదుల చిన్న అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు. ఆయన పిల్లలు బడికి వెళ్లడం లేదు.
‘‘ఇది చాలా దుర్భరమైన జీవితం. ప్రతిదీ మేం కోల్పోయాం. కానీ, మళ్లీ ఎదగాలనుకుంటున్నాం. మా పిల్లలకు ఆహారం కావాలి. ఇంకా గాజాలోనే ఉండిపోయిన వారికి సాయం చేయాలనుకుంటున్నాం’’ అని ఆయన చెప్పారు.
‘ఈజిప్ట్‌లో జీవనం ఈజీ కాదు’
ఈజిప్ట్‌లో వలసదారులుగా జీవించడం అంత తేలికైన విషయం కాదు. పాలస్తీనియన్లను ఆ దేశంలో తాత్కాలికంగా నివసించేందుకు మాత్రమే అక్కడ అధికారులు అనుమతి ఇచ్చారు.
అధికారికంగా మేం ఇక్కడ నివసించడానికి అనుమతి లేదు. విద్యా, నిత్యావసరాలకు సంబంధించి పరిమితమైన యాక్సెస్ మాత్రమే ఉంది.
ఇక్కడ నివసించే చాలా మంది గాజా ప్రజలు అక్కడే చిక్కుకుపోయిన తమ కుటుంబాలకు డబ్బులు పంపిస్తున్నారు. కానీ, డబ్బులు పంపించేందుకు చెల్లించే ఫీజులు చాలా ఎక్కువగా ఉన్నాయి. దీనిపై 30 శాతం వరకు కమిషన్ తీసుకుంటున్నారు.
‘‘మా కుటుంబ సభ్యుల పడుతున్న ఇబ్బందుల నుంచి వారు లాభాలు సంపాదించడం చూస్తుంటే చాలా హృదయవిదారకరంగా ఉంది’’ అని మహమూద్ సఖ్ర్ చెప్పారు. ఆయనకు గాజాలో ఓ ఎలక్ట్రానిక్ స్టోర్ ఉంది.
డబ్బులు పంపినప్పుడు ఎలాంటి రశీదు ఇవ్వరు, డబ్బులు అందాక వారి నుంచి ఒక మెసేజ్ వస్తుంది.
‘‘దీనిలో చాలా ప్రమాదం ఉంటుంది. ఈ లావాదేవీల్లో ఎవరి ప్రమేయం ఉంటుందో తెలియదు. కానీ, మాకు మరో దారి లేదు’’ అని ఆ వ్యక్తి అన్నారు.
తుర్కియేలో నివసించే తన కుటుంబానికి ప్రశాంతమైన వాతావరణం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాను.
రెస్టారెంట్‌కు వెళ్లిన ప్రతీసారి, పిల్లలు గాజాలోని ఇష్టమైన ప్రదేశాలను గుర్తు చేసుకుంటున్నారు.
గాజాలో ఉన్న పెద్ద ఇంటిని, స్పోర్ట్స్ స్టోర్‌ను, హార్స్ క్లబ్, స్కూల్‌లోని వారి స్నేహితులను గుర్తు తెచ్చుకుని బాధపడుతున్నారు.
ఇజ్రాయెల్ వైమానిక దాడులతో వారి క్లాస్‌మేట్స్‌లో కొందరు చనిపోయారు. ఇంకా ఈ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.
గత ఏడాది అక్టోబర్ 7 తర్వాత మొదలైన దాడులు, ఈ రోజుకి కొనసాగుతూనే ఉన్నాయి.
ప్రాణాలతో అక్కడ నుంచి బయటపడ్డాం కానీ, మా మనసు అక్కడే ఉంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














