బంగ్లాదేశ్‌లో హిందువులు తమను తాము రక్షించుకోవడానికి ఏం చేస్తున్నారు?

బంగ్లాదేశ్, హిందువులు, బౌద్ధులు, క్రైస్తవులు, మైనారిటీలపై దాడులు షేక్ హసీనా, భారత్ బంగ్లాదేశ్ సంబంధాలు
ఫొటో క్యాప్షన్, ప్రభుత్వం ఎన్ని రకాలుగా హామీలిచ్చినా బంగ్లాదేశ్‌లో మైనారిటీలు ఇప్పటికీ భయపడుతూ జీవిస్తున్నారు.
    • రచయిత, జుగల్ పురోహిత్,
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఒక హిందూ మహిళ, ఆమె భర్త తమ పేరు, గ్రామం గురించి బయటపెట్టకూడదనే షరతు మీద నాతో మాట్లాడారు. వారిని కలిసేందుకు ఉదయాన్నే ఢాకా నుంచి బయల్దేరాను. 200 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి మధ్యాహ్నం 2 గంటలకల్లా ఖుల్నా నగరానికి చేరుకున్నాను. ఆమె తన మొహాన్ని కప్పుకుని నా ఎదురుగా కూర్చున్నారు.

2 వేలకు పైగా జరిగిన హింసాత్మక ఘటనలను వివరిస్తూ బంగ్లాదేశ్ హిందూ బుద్ధిస్ట్ క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్ రూపొందించిన నివేదికలో ఆ మహిళకు, ఆమె కుటుంబ సభ్యులకు ఏం జరిగిందనే వివరాలు కూడా ఉన్నాయి.

ఈ జాబితాలో 9 హత్యలు కూడా ఉన్నాయి. ఆగస్టులో దేశవ్యాప్తంగా జరిగిన హింసాత్మక దాడుల్లో తాము టార్గెట్‌గా మారామని బంగ్లాదేశ్‌లో మైనారిటీ వర్గాలకు చెందినవారు చెబుతున్నారు.

2024 ఆగస్టు 5న బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా పదవికి రాజీనామా చేసి దేశం వదిలి పారిపోయి భారత్ వచ్చారు. అంతకు ముందు ఆమెకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. ఈ ఆందోళనల సమయంలో జరిగిన హింసలోనూ మైనారిటీలపై దాడులు జరిగాయి.

ఆమె తమ కుటుంబానికి ఎదురైన అనుభవాల గురించి నాతో వివరంగా మాట్లాడారు.

బీబీసీ న్యూస్ తెలుగు
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

‘‘ఆగస్టు 5న ప్రతీ రోజూలాగే మాకు సాధారణంగా తెల్లారింది. రాత్రి 8.45 గంటల సమయంలో 20-25 మంది మా ఇంట్లోకి వచ్చి, విధ్వంసం మొదలుపెట్టారు. నా భర్తేమో పిల్లలను తీసుకుని ఇల్లు వదిలి పారిపోయారు

మా అత్తగారు, నేను ఇంట్లోనే ఉన్నాం. ఆ గుంపులో ఇద్దరు, ముగ్గురు వ్యక్తులు నా దగ్గరకు వచ్చారు. వాళ్లు మా వంటగదిలో ఉన్న కత్తి తీసుకుని, నావైపు చూపిస్తూ నా నోరు మూశారు.

నేను చాలా భయపడ్డాను. ఒక్కమాట కూడా మాట్లాడలేకపోయాను. వాళ్లు నాతో ఎలా ప్రవర్తించారో కూడా నేను చెప్పలేను. అలాంటి వాళ్లను నేను ఎప్పుడూ చూడలేదు. వాళ్లు జంతువుల్లా ప్రవర్తించారు.

మీపై ఎందుకు దాడులు చేసి ఉంటారని ఆమెను అడిగినప్పుడు ‘ఎందుకంటే మేం హిందువులు కాబట్టి’’ అని ఆమె అన్నారు.

ఈ సంఘటన తర్వాత ఆ మహిళ, ఆమె భర్త పోలీసుల దగ్గరకు వెళ్లకూడదని అనుకున్నారు. అలా ఎందుకు చేశారని నేను అడిగాను. తాము అధికారులపై నమ్మకం కోల్పోయామని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని వారు చెప్పారు.

వారితో మాట్లాడటం పూర్తై తిరిగి బయల్దేరేటప్పుడు ఆమె భర్త ‘మేము భారత దేశంలో ఆశ్రయం పొందవచ్చా’ అని అడిగారు.

బంగ్లాదేశ్, హిందువులు, బౌద్ధులు, క్రైస్తవులు, మైనారిటీలపై దాడులు షేక్ హసీనా, భారత్ బంగ్లాదేశ్ సంబంధాలు
ఫొటో క్యాప్షన్, బాధిత మహిళతో బీబీసీ ప్రతినిధి జుగల్ పురోహిత్

రెండు వేల కేసులు

ఖుల్నాలో హింస ఎక్కువగా జరిగిందని మైనారిటీ వర్గాలకు చెందినవారు చెప్పారు.

వీరిపై 2 వేలకు పైగా హింసాత్మక ఘటనలు జరిగినట్లు తమ వద్ద సమాచారం ఉందని హిందూ, బౌద్ధ, క్రైస్తవ కౌన్సిల్ కార్యదర్శి దీపాంకర్ ఘోష్ చెప్పారు. ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చని ఆయన అన్నారు.

“దీంతోపాటు మరికొన్ని సంఘటనలు జరిగాయి. వాటిని మేము వెలుగులోకి తీసుకు రాలేకపోయాం. తమపై జరిగిన దాడుల గురించి మాట్లాడేందుకు చాలామంది భయపడ్డారు” అని ఆయన చెప్పారు.

జులై, ఆగస్టులలో దేశవ్యాప్తంగా జరిగిన హింసాత్మక ఘటనలపై దర్యాప్తు చేయాలని ఐక్యరాజ్య సమితిని ఆహ్వానించింది బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వం. ప్రస్తుతం ఆ దర్యాప్తు కొనసాగుతోంది.

ఇప్పటి వరకు 600లకు పైగా మరణాలు నమోదయ్యాయని ఐక్యరాజ్య సమితి తెలిపింది.

బంగ్లాదేశ్, హిందువులు, బౌద్ధులు, క్రైస్తవులు, మైనారిటీలపై దాడులు షేక్ హసీనా, భారత్ బంగ్లాదేశ్ సంబంధాలు

ఫొటో సోర్స్, wikipedia

ఫొటో క్యాప్షన్, చర్చలతో సమస్యలు పరిష్కారమవుతాయని మధ్యంతర ప్రభుత్వంలో సలహాదారు సయ్యద్ రిజ్వానా హసన్ అన్నారు.

భారతీయ వీసా నిబంధనలతో సమస్యలు

బిశ్వజిత్ సాధు 50ఏళ్లుగా ఖుల్నాలో వ్యాపారం చేస్తూ జీవిస్తున్నారు.

ఆయన తమకు ఎదురైన అనుభవాల గురించి చెప్పారు. హింస చెలరేగినప్పుడు తన దుకాణంతో పాటు ఇంటిపైనా దాడి జరిగిందని, ఆ రోజు దాడిలో జరిగిన విధ్వంసం ఇంకా కళ్ల ముందు కనిపిస్తూనే ఉందని అన్నారు.

ఆయన తన షాపులో కూర్చునే నాతో మాట్లాడారు.

“అనేకమంది హిందువులు వలస వెళ్లారు. తమ వద్ద ఏమీ లేనివారు, భూములు ఉన్నవారు మాత్రం ఉన్నారు. ప్రస్తుతం దోపిళ్లు, భూకబ్జాలు జరుగుతున్నాయి. భయం వల్ల తమపై జరుగుతున్న దాడుల గురించి ఎవరూ మాట్లాడటం లేదు” అని ఆయన చెప్పారు.

బంగ్లాదేశ్‌లో వీసాల జారీని తగ్గిస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

శాంతి భద్రతల దృష్ట్యా భారత ప్రభుత్వం వీసా జారీ కార్యాలయంలో సిబ్బందిని తగ్గించింది. ఈ నిర్ణయాన్ని ఇప్పటి వరకు సమీక్షించలేదు.

“భారత ప్రభుత్వం ప్రస్తుతం వీసాల జారీని పూర్తిగా నిలిపివేసింది. మేమంతా ప్రమాదంలో ఉన్నాం. భద్రత కోసం భారత దేశానికి వెళ్లాలని అనుకున్నా, కానీ అది సాధ్యం కాదు” అని ఆయన అన్నారు.

బంగ్లాదేశ్‌లో మైనారిటీ కమ్యూనిటీకి చెందిన వారు ఇప్పటికీ ఆందోళనలు నిర్వహిస్తున్నారు.

మైనారిటీలు చేస్తున్న ఆందోళనలను బంగ్లాదేశ్‌లోని మధ్యంతర ప్రభుత్వం ఎలాంటి దృష్టితో చూస్తోందని ఆ ప్రభుత్వంలో సలహాదారుగా పని చేస్తున్న సయ్యద్ రిజ్వానా హసన్‌ను అడిగాను. ఈ ఆందోళనలు ప్రస్తుత బంగ్లాదేశ్‌ను ప్రపంచానికి ఎలా చూపిస్తాయని ప్రశ్నించాను.

“బంగ్లాదేశ్ ఇప్పటికీ, ఎప్పటికీ మత సామరస్యాన్ని పాటించే దేశమే. చర్చలకు మేము ఎప్పుడూ తలుపు తెరిచి ఉంచుతాం. వాళ్లు వీధుల్లో ఆందోళన చేస్తున్నారంటే మనం చర్చించాల్సిన అంశాలు ఇంకా మిగిలి ఉన్నాయని అనుకోవాలి” అని రిజ్వానా చెప్పారు.

“ఈ ఏడాది దుర్గా పూజ ఎలా చేసుకున్నారో మీరు చూడండి. ప్రభుత్వంలో సలహాదారులంతా వివిధ ఆలయాలకు వెళ్లి పూజలు చేసి వేడుకల్లో పాల్గొన్నాం. చర్చల ద్వారా ఎలాంటి డిమాండ్లనైనా అంగీకరించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉంది” అని ఆమె చెప్పారు.

అయితే ఇలాంటి హామీలతో మైనారిటీ వర్గాలకు చెందిన ప్రజలు సంతృప్తిగా ఉన్నట్లు కనిపించలేదు.

బంగ్లాదేశ్, హిందువులు, బౌద్ధులు, క్రైస్తవులు, మైనారిటీలపై దాడులు షేక్ హసీనా, భారత్ బంగ్లాదేశ్ సంబంధాలు
ఫొటో క్యాప్షన్, అవసరమైతే బంగ్లాదేశ్‌లో హిందువులు, బౌద్ధులు, క్రైస్తవులంతా కలిసి కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తారని మణీంద్ర కుమార్ నాథ్ చెప్పారు.

ప్రభుత్వం హమీ ఇచ్చినా తగ్గని భయం

హిందూ బుద్దిస్ట్ క్రిస్టియన్ కౌన్సిల్‌కు మణీంద్ర కుమార్ నాథ్ ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్నారు.

“మధ్యంతర ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు గడిచింది. దేశంలోని మైనారిటీ వర్గాలపై దాడులు జరుగుతున్న సంఘటనలు ఇంకా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. దురదృష్టవశాత్తు వీటిని అరికట్టేందుకు ప్రభుత్వం తరపు నుంచి ఎలాంటి చర్యలు లేవు. కొన్ని పార్టీలైతే ఈ ఘటనలు జరుగుతున్నాయని అంగీకరించేందుకు కూడా సిద్ధంగా లేవు

ఈ దేశంలో సనాతన ధర్మాన్ని పాటించే ప్రజలు, విద్యార్థులు ఇళ్లలో నుంచి బయటకు రావడాన్ని మీరు చూడవచ్చు. చిట్టగాంగ్‌లో సాధువులు, సంతులు ప్రదర్శన చేశారు. తమ సమస్యలు చెప్పుకునేందుకు వేలమంది హిందువులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. నవంబర్ 2న బంగ్లాదేశ్‌ అంతటా సమావేశాలు ఏర్పాటు చేయాలని, ప్రదర్శనలు నిర్వహించాలని మేము విజ్ఞప్తి చేశాం” అని మణీంద్ర అన్నారు.

మైనారిటీలు క్షేత్రస్థాయిలో ఆందోళనల్ని కొనసాగిస్తూనే, బంగ్లాదేశ్‌లో మైనారిటీ సమూహాల పరిస్థితుల గురించి విదేశాల్లోనూ గొంతెత్తున్నారు.

బంగ్లాదేశ్‌లో పరిస్థితుల గురించి భారత్, అమెరికా అనేక సందర్భాల్లో బహిరంగ ప్రకటనలు జారీ చేశాయి.

అనేక హిందూ సంస్థలు కూడా ఈ అంశం గురించి గట్టిగా మాట్లాడుతున్నాయి. “హిందువుల ఊచకోత ఆపండి లేకుంటే బంగ్లాదేశ్‌ను ఆర్థికంగా బహిష్కరించండి’’ అని కొన్ని సంస్థలు పిలుపునిచ్చాయి.

బంగ్లాదేశ్‌ ప్రభుత్వం హిందువులను రక్షించాలని రాసిన బ్యానర్‌ను న్యూయార్క్‌లో ఒక విమానం సాయంతో ఎగరవేసింది హిందూ బుద్ధిస్ట్ క్రిస్టియన్ కౌన్సిల్.

ఈ సంస్థ నిర్వహిస్తున్న వెబ్‌సైట్‌కు బీబీసీ కొన్ని ప్రశ్నలు పంపించింది. వాటి గురించి పదే పదే అడిగినప్పటికీ ఎలాంటి సమాధానం రాలేదు.

ఈ సంస్థ వెబ్‌సైట్ విశ్వ హిందూ పరిషత్ కార్యక్రమాల గురించి ప్రస్తావించింది. విశ్వహిందూ పరిషత్ సంస్థ బీజేపీలాగే సంఘ్ పరివార్‌ సంస్థల్లో ఒకటి.

బంగ్లాదేశ్, హిందువులు, బౌద్ధులు, క్రైస్తవులు, మైనారిటీలపై దాడులు షేక్ హసీనా, భారత్ బంగ్లాదేశ్ సంబంధాలు

బంగ్లాదేశ్‌లో పరిస్థితులపై అమెరికాలో హిందూ సంస్థల ఆందోళనలు

వాషింగ్టన్ కేంద్రంగా హిందూ అమెరికన్ ఫౌండేషన్ నడుస్తోంది. బంగ్లాదేశ్‌లో మైనారిటీల మీద జరుగుతున్న హింసాత్మక సంఘటనలకు నిరసనగా ఈ సంస్థ అమెరికాలో ప్రదర్శనలు నిర్వహిస్తోంది.

హిందూ అమెరికన్ ఫౌండేషన్‌కు భారత ప్రభుత్వం, భారతదేశంలోని హిందూ సంస్థల నుంచి నిధులు అందుతున్నాయని చెబుతారు.

ఈ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సమీర్ కల్రా మాత్రం ఈ వాదనను తిరస్కరించారు. తమకు భారత ప్రభుత్వంతో ఎలాంటి సంబంధాలు లేవని చెప్పారు.

“మాది స్వతంత్ర సంస్థ. మేము ఏ ప్రభుత్వంతోనూ కలిసి పని చెయ్యడం లేదు” అని ఆయన నాతో వీడియోకాల్‌లో చెప్పారు.

“మేం బంగ్లాదేశ్ హిందూ బుద్ధిస్ట్ క్రిస్టియన్ కౌన్సిల్‌తో కలిసి పని చేస్తున్నాం. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి వారు రూపొందిస్తున్న నివేదికలే మాకు ఆధారం. అమెరికాలోని నాయకులు బంగ్లాదేశ్‌లోని హింసను అర్థం చేసుకునేలా మేము మా ప్రయత్నాలు చేస్తున్నాం. బంగ్లాదేశ్‌లో మైనారిటీల భద్రత కోసం ఆ దేశ మధ్యంతర ప్రభుత్వంపై అమెరికా ఒత్తిడి తేవాలి” అని సమీర్ కల్రా అన్నారు.

హింస, భయం, అనిశ్చితి లాంటి పరిస్థితుల మధ్య నేను స్వరూప్ దత్తాను కలిశాను. ఆయన ఢాకాలో పని చేస్తున్నారు.

‘బంగ్లాదేశ్‌లో ఒక హిందువుగా ఎలాంటి భవిష్యత్ ఉంటుందని అనుకుంటున్నారు’ అని నేను ఆయన్ను అడిగాను.

“మా గొంతు వినిపించేందుకు నిరసన ప్రదర్శనలు ఒక్కటే మాకున్న మార్గం” అని ఆయన చెప్పారు. ఆందోళనలకు తాను మద్దతిస్తానని అన్నారు.

ప్రశాంత, లౌకిక బంగ్లాదేశ్ అనేది అంత తేలికైన వ్యవహారం కాదని ఆయన గుర్తించారు.

“నేను ఆశావాదిని. ఇది అందమైన దేశం. ఇక్కడి ప్రజలు స్నేహపూర్వకంగా ఉంటారు. శాంతిని కోరుకుంటారు. 99శాతం మంది ప్రజలు బెంగాలీ మాట్లాడతారు. దీన్ని మెరుగైన ప్రాంతంగా ఎందుకు మార్చుకోకూడదు? అది సాధ్యమేనని నేను అనుకుంటున్నాను” అని స్వరూప్ దత్తా అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)