రాక్షస బండలు: పల్నాడు జిల్లాలో దొరికిన ఈ ప్రాచీన మానవుల ఆనవాళ్ల కథ ఏంటి?

పల్నాడు, రాక్షస రాళ్లు, రాతి యుగం, ఇనుప యుగం, చరిత్రకారులు, పురావస్తు శాఖ, మెన్‌హిర్స్‌, ఆంధ్రప్రదేశ్
ఫొటో క్యాప్షన్, అచ్చమ్మకుంట తండాలో గూడు ఇల్లు మాదిరి సమాధి
    • రచయిత, గరికిపాటి ఉమాకాంత్
    • హోదా, బీబీసీ కోసం

కృష్ణానది ఒడ్డున, పల్నాడు పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలో ఇటీవల ఇనుప యుగపు ఆనవాళ్లను గుర్తించినట్లు పురావస్తు శాఖ అధికారులు తెలిపారు. వాటిలో నిలువురాళ్లు, బండల గుట్టలు వంటివి ఉన్నట్లు వెల్లడించారు.

క్రీస్తుపూర్వం 3,000 ఏళ్ల నాటి ఆదిమ మానవుడి జీవనానికి సంబంధించిన చరిత్ర ఇక్కడి కట్టడాలు, సమాధుల రూపంలో నిక్షిప్తమైందని వారు తెలిపారు.

అడవుల్లో ఉన్న ఈ రాళ్లను సమీప గ్రామాల్లోని ప్రజలు రాక్షస బండలని పిలుస్తున్నారు. పరిశోధకులు వాటిని ‘మెన్‌హిర్స్‌’ అని అంటున్నారు.

దేశంలోనే కాదు, ప్రపంచంలో ఆదిమ మానవుని నాగరికత విలసిల్లిన ప్రతిచోటా ఇలాంటి మెన్‌హిర్స్‌ బయటపడుతూనే ఉన్నాయి.

అయితే, పల్నాడులో ఉన్నట్టుగా ఇంత పెద్దఎత్తున ప్రాచీన కాలపు సమాధులు ఎక్కడా లేవని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్‌ ఇండియా ఫౌండేషన్‌ సీఈవో డాక్టర్‌ ఈమని శివనాగిరెడ్డి చెబుతున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
పల్నాడు, రాక్షస రాళ్లు, రాతి యుగం, ఇనుప యుగం, చరిత్రకారులు, పురావస్తు శాఖ, మెన్‌హిర్స్‌, ఆంధ్రప్రదేశ్
ఫొటో క్యాప్షన్, గంగలకుంట గ్రామ సమీపంలోని అడవిలో ఉన్న నిలువురాళ్లు

ఎక్కడ బయటపడ్డాయంటే..

పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గంగల కుంట గ్రామానికి నైరుతి దిక్కున, కృష్ణానది కుడి గట్టుపైన ఉన్న ముగ్గుదిన్నె కాలువ పక్కన.. నల్లమల అటవీ ప్రాంతంలో దాదాపు పది కిలోమీటర్ల పరిధిలో ఇనుపయుగపు స్మారక కట్టడాలు కనిపిస్తాయి.

కొత్తపుల్లారెడ్డి గూడెంతో పాటు మాచర్ల మండలం అచ్చమ్మకుంట గ్రామ పరిసర ప్రాంతాల్లోనూ ఇళ్ల మాదిరి నిర్మించిన సమాధులు దర్శనమిస్తున్నాయి.

వాటి నిర్మాణం కూడా భిన్నంగా ఉంది.

5 నుంచి10 మీటర్ల వ్యాసార్థంతో 2 మీటర్ల ఎత్తులో పెద్ద పెద్ద నాపరాళ్లను నలువైపులా స్వస్తిక్‌ ఆకారంలో పేర్చి గది మాదిరిగా తయారు చేశారు.

గది చుట్టూ, పైన గులకరాళ్ళతో ఉబ్బెత్తుగా అమర్చారు.

భూమి లోపల కొంత, ఉపరితలంపై కొంత భాగం కనపడే విధంగా నిర్మించారు.

ఈ నిర్మాణానికి ఉత్తరాన 10 నుంచి 25 అడుగుల ఎత్తు, 3 నుంచి 5 అడుగుల వెడల్పు, ఆరు అంగుళాల మందంతో నిలువురాళ్లను ఏర్పాటు చేశారు.

ఇనుప యుగ మానవుడు

చనిపోయిన వారి గుర్తుగా ఇలా పెద్ద పెద్ద శిలలను నిలబెట్టినట్టు అర్ధమవుతోందని మాచర్లకు చెందిన పరిశోధకుడు పావులూరి సతీశ్ బాబు బీబీసీకి తెలిపారు.

ఈ నిలువురాళ్లపై కొన్నిచోట్ల మనిషి ఆకృతితో పాటు ఎద్దు, ముగ్గు బొమ్మలు కూడా ఉన్నట్లు గుర్తించవచ్చని ఆయన వివరించారు.

ఇక్కడ గూడు సమాధులు(సిస్ట్‌ బరియల్స్‌)తో పాటు సామూహిక సమాధులు (డాల్మెన్‌లు– నాలుగైదు మృతదేహాలను కలిపి) ఉన్నాయని పురావస్తు పరిశోధకుడు, పాములపాటి శ్రీనాథ్‌ రెడ్డి బీబీసీకి తెలిపారు.

మృతదేహాన్ని ఖననం మాత్రమే చేసేవారని, నదీ తీరంలో సమాధులన్నింటికి దక్షిణం వైపు ద్వారం ఉండేలా నిర్మించడం గమనించాల్సిన అంశమని ఆయన చెప్పారు.

ప్రతి సమాధి చుట్టూ ప్రహరీ గోడ ఉంది.

దేశంలో అనేక చోట్ల ఇలాంటి నిలువురాళ్లు ఉన్నప్పటికీ, దేశంలోనే అతి పొడవైనవిగా, దాదాపు 25 అడుగుల ఎత్తుగల నిలువురాళ్లు ఇక్కడ పదుల సంఖ్యలో ఉండటం చారిత్రకంగా పల్నాటి ప్రాంత విశిష్టత అని ఆయన చెప్పారు.

పల్నాడు, రాక్షస రాళ్లు, రాతి యుగం, ఇనుప యుగం, చరిత్రకారులు, పురావస్తు శాఖ, మెన్‌హిర్స్‌, ఆంధ్రప్రదేశ్
ఫొటో క్యాప్షన్, ఇనుప యుగం నాటి సమాధి చూడటానికి ఇల్లులా కనిపిస్తుంది.

రాక్షస బండలు అని ఎందుకంటారు?

ఈ సమాధులు పెద్ద బండరాళ్లతో ఉండటం, అక్కడ లభించే మట్టి పాత్రలు, అస్థి పంజరాలను చూసి ఇవి సామాన్య మానవులవి కావనే ఉద్దేశంతో వీటిని రాక్షస గుండ్లు, రాక్షస బండలు అని స్థానికులు పిలుస్తుంటారని మాచర్లకు చెందిన పాత్రికేయులు కిరణ్‌ తెలిపారు.

"మేం గొర్రెలు మేపేందుకు అడవికి వెళ్తుంటాం..వింతగా ఉన్న వీటిని ఎప్పుడూ చూస్తునే ఉంటాం. రాక్షస బండలని అంటుంటాం. ఇవి సమాధులని చెబుతుంటే ఆశ్చర్యంగా ఉంది’’ అని గంగలకుంట గ్రామానికి చెందిన గొర్రెల కాపరి శివయ్య, ఆయన తండ్రి పుల్లయ్య అన్నారు.

"రాతియుగంలో మానవుడు మృతదేహాలను ప్రకృతికే వదిలేశాడు. నవీన యుగానికి వచ్చేసరికి మృతదేహాన్ని క్రమపద్ధతిలో పాతి పెట్టడం నేర్చుకున్నాడు. బృహత్‌ రాతి యుగంలో మానవ మృతదేహాన్ని జంతువులు తినకుండా సామాగ్రిని పాడు చేయకుండా పెద్దపెద్ద రాళ్లతో సమాధులు నిర్మించాడు. మృతదేహంతో పాటు మృతులు ఉపయోగించిన వ్యవసాయ సామాగ్రిని, మట్టి పాత్రలను సమాధి చేసేవారు. ఈ సమాధుల చుట్టూ బండరాళ్లను పేర్చేవారు. వీటి ఆనవాళ్లు దేశమంతటా ఉన్నాయి. కానీ ప్రహరీగోడలతో వాస్తుపరంగా ఇళ్ల మాదిరి సమాధులు ఉండటం పల్నాడు ప్రాంతంలోనే కనిపిస్తుంది. చరిత్రకు సాక్ష్యాలైన ఆనాటి ఆనవాళ్ల (మెన్‌హిర్స్‌)ను సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. ఇక్కడి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు చెబుతున్న సమాచారం ప్రకారం.. ఒకప్పుడు కృష్ణా తీరం వెంట 300కు పైగా ఉన్న ఈ నిలువు రాళ్లు ధ్వంసం అయిపోయి కేవలం పదుల సంఖ్యలో మాత్రమే కనిపిస్తున్నాయి.’’ అని ఈమని శివనాగిరెడ్డి బీబీసీతో చెప్పారు

మానవ చరిత్రను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనీ, వారసత్వ కట్టడాలు అంటే కేవలం రాజులు, రాజ్యాల గుర్తులే కాకుండా ఆది మానవుల పురా చరిత్ర ఆనవాళ్లు కూడా భాగమన్న విషయాన్ని ప్రజలకు అవగాహన కలిగించాలని శివనాగిరెడ్డి పేర్కొన్నారు.

పల్నాడు, రాక్షస రాళ్లు, రాతి యుగం, ఇనుప యుగం, చరిత్రకారులు, పురావస్తు శాఖ, మెన్‌హిర్స్‌, ఆంధ్రప్రదేశ్
ఫొటో క్యాప్షన్, పురావస్తు శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ స్వామినాయక్‌

ఇనుప యుగం అంటే

ఇనుము వాడకం మొదలు పెట్టిన కాలాన్ని ఇనుపయుగం అని చరిత్రకారులు చెబుతుంటారు.

క్రీస్తుపూర్వం 1000 నుంచి ఇనుపయుగంగా పేర్కొంటారని పురావస్తు శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ స్వామి నాయక్ తెలిపారు.

‘‘నాటి మానవుల జీవనం ప్రధానంగా సేద్యంపైనే ఆధారపడి ఉండేది.. నాటి సమాధుల నిర్మాణ శైలిని పరిశీలిస్తే వాళ్లు పక్కాగా వాస్తును పాటించేవారని అర్థమవుతోంది. అయితే 1000 బీసీ నాటికి మనదేశంలో డబ్బు వినిమయం మొదలు కాలేదని తెలుస్తోంది. కేవలం వస్తు మార్పిడి ద్వారానే వాళ్లు వ్యాపారం చేసే వారిని అర్థమవుతుంది. ఈ ఇనుప యుగపు ఆనవాళ్లు మన రాష్ట్రంలో ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో గతంలో బయటపడ్డాయి. కానీ ఇంత పెద్ద స్థాయిలో మెన్‌హిర్‌లు పల్నాడు జిల్లాలోనే ఉన్నాయి’’ అని ఆయన వివరించారు.

ఇనుప యుగం

రెండు మూడేళ్లుగా పురావస్తు శాఖ తరపున పల్నాడు ప్రాంతంలో పర్యటిస్తున్నామని, ఇంత పెద్ద ఎత్తున నిలువురాళ్ల సమాధులు ఇటీవల కాలంలోనే బయటపడ్డాయని స్వామి నాయక్ తెలిపారు

మాచర్ల, వెల్దుర్తి మండలాల్లో కృష్ణాతీరం వెంబడి అటవీ ప్రాంతంలో బయటపడిన రాక్షస బండలు ఇనుప యుగపు మెగాలితిక్ కల్చర్‌కి ప్రతీకలని ఆయన అన్నారు.

తాను కూడా గతంలో వాటిని పరిశీలించి పరిశోధన చేశాననీ, శాఖాపరంగా తమ అధికారుల బృందం త్వరలోనే అక్కడ పర్యటించి పూర్తి స్థాయి నివేదికను రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర పురావస్తు శాఖకు అందిస్తుందని ఆయన బీబీసీకి చెప్పారు.

నాగరికత విలసిల్లిన ప్రపంచమంతటా మెన్‌హిర్‌లు ఉన్నా వాస్తు శైలితో ఇంత పెద్ద నిర్మాణాలు మాత్రం పల్నాటి కృష్ణా తీరంలోనే చూడగలమని నాయక్‌ చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)