కిమ్ జోంగ్ ఉన్: నిషేధిత మిసైల్‌ను ప్రయోగించిన ఉత్తర కొరియా, టార్గెట్ ఎవరు?

ఉత్తర కొరియా, మిసైల్ ప్రయోగం, దక్షిణ కొరియా

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఉత్తర కొరియా చేపట్టిన మిసైల్ ప్రయోగం ఫైల్ ఫొటో
    • రచయిత, కెల్లీ ఎన్‌జీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణిని ఉత్తర కొరియా ప్రయోగించింది. ఆ మిసైల్ 86 నిమిషాల పాటు ప్రయాణించింది. వెయ్యి కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించిన క్షిపణుల్లో ఇదే ఇప్పటి వరకు అత్యధిక రికార్డు.

ఆ క్షిపణి ఉత్తర కొరియా తూర్పు తీరం వైపు సముద్రంలో పడిపోయినట్లు జపాన్, దక్షిణ కొరియాలు ప్రకటించాయి.

ఒక నిర్దిష్టమైన కోణంలో ఐసీబీఎమ్ ను ప్రయోగించగా అది సుమారు 7వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. దీనిని బట్టి ఏం అర్థమవుతుందంటే, ఒకవేళ దీనిని అడ్డంగా ప్రయోగిస్తే ఆ ప్రయాణ దూరం మరింతగా పెరుగుతుంది.

రెండు కొరియా దేశాల మధ్య సంబంధాలు క్షీణిస్తున్న తరుణంలో సోల్ (దక్షిణ కొరియా రాజధాని నగరం) పట్ల దూకుడుగా వ్యవహరిస్తున్న ప్యాంగ్యాంగ్‌ గురువారం ఈ ప్రయోగం చేపట్టింది.

అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్నవేళ ఉత్తర కొరియా తన ఐసీబీఎమ్‌ను ప్రయోగించేందుకు సిద్ధమవుతోందని దక్షిణ కొరియా బుధవారమే హెచ్చరించింది.

బీబీసీ న్యూస్ తెలుగు, వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఎక్కువ దూరం ప్రయాణిస్తూ, విధ్వంస తీవ్రతను అధికం చేసే ఆయుధాలను తయారు చేయడమే లక్ష్యంగా ఉత్తర కొరియా ఈ ప్రయోగం చేపట్టినట్లు దక్షిణ కొరియ రక్షణ శాఖ తెలిపింది.

ఈ ప్రయోగం చేపట్టినందుకుగానూ ఉత్తర కొరియాపై మరిన్ని ఆంక్షలు విధించనున్నట్లు దక్షిణ కొరియా స్పష్టం చేసింది.

ఈ ప్రయోగం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి చేసిన అనేక తీర్మానాలను ఉల్లంఘిస్తున్నట్లు అమెరికా ఆరోపించింది.

“ఈ ప్రయోగాలను చూస్తుంటే, తమ దేశ ప్రజల శ్రేయస్సు కంటే భారీ విధ్వంసాన్ని సృష్టించే చట్ట విరుద్ధమైన ఆయుధాల తయారీ, బాలిస్టిక్ మిసైల్స్ ప్రయోగాలపైనే ఉత్తర కొరియా ఎక్కువగా దృష్టి పెడుతున్నట్లు అర్థమవుతోంది” అని వైట్‌హౌస్ జాతీయ భద్రతా మండలి ప్రతినిధి సీన్ సావెట్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఐక్యరాజ్యసమితి దీర్ఘకాలంగా విధించిన ఆంక్షలను ధిక్కరిస్తూ ప్యాంగ్యాంగ్‌ చివరిసారిగా 2023లో ఐసీబీఎమ్‌ను ప్రయోగించింది. ఆ క్షిపణి 73 నిమిషాల పాటు ప్రయాణించి, సుమారు వెయ్యి కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేసింది.

ఉత్తర కొరియా లక్ష్యం అమెరికా?

శత్రువుల దాడులను తిప్పికొట్టేందుకు మనకున్న సంకల్పాన్ని ఈ ప్రయోగం ప్రతిబింబిస్తుందని ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జోంగ్ ఉన్ అన్నారని ఆ దేశ జాతీయ మీడియా పేర్కొంది. అలాగే, దీనిని సరైన సైనిక చర్యగా ఆయన అభివర్ణించినట్లు తెలిపింది.

ఈ సందర్భంగా, తమ అణ్వాయుధ సంపత్తి బలోపేతానికి చేపడుతున్న విధానాలను ఉత్తర కొరియా ఎప్పటికీ మార్చుకోదని కిమ్ స్పష్టం చేశారు.

మిసైల్ ‘పేలోడ్’ సామర్థ్యాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా ఈ ప్రయోగం చేపట్టారని ఉత్తర కొరియా నిపుణులు అంచనా వేస్తున్నారు.

“భారీ వార్‌హెడ్స్‌ను సైతం మోస్తూ, అమెరికా భూభాగంలోకి ప్రవేశించగల మిసైల్స్‌ను ప్యాంగ్యాంగ్ అభివృద్ధి చేస్తోంది” అని అసిస్టెంట్ ప్రొఫెసర్ కిమ్ డాంగ్-యుప్ చెప్పారు. ఈయన యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కొరియన్‌ స్టడీస్‌లో పని చేస్తున్నారు.

గురువారం జరిగిన ఈ ప్రయోగాన్ని తాము నిశితంగా గమనించినట్లు జపాన్ తెలిపింది.

ఈ ప్రయోగ అనంతరం దక్షిణ కొరియా, అమెరికా అధికారులు సమావేశమయ్యారు. ఈ ప్రయోగానికి ప్రతిస్పందనగా ఉత్తర కొరియాపై కఠిన చర్యలకు రెండు దేశాలు అంగీకారం తెలిపాయని దక్షిణ కొరియా మిలిటరీ ఒక ప్రకటనలో తెలిపింది.

ఉత్తర కొరియా చేపట్టిన బాలిస్టిక్ మిసైల్ ప్రయోగ సమాచారాన్ని జపాన్, అమెరికా దేశాలతో తాము షేర్ చేసుకున్నామని దక్షిణ కొరియా సైన్యం తెలిపింది.

కిమ్ జోంగ్ ఉన్, పుతిన్, రష్యా, ఉక్రెయిన్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, పుతిన్, కిమ్ బంధంపై అమెరికా ఆందోళన

రష్యాలో ఉత్తర కొరియా సైనికులకు శిక్షణ?

మెరుగైన శిక్షణ కోసం తూర్పు రష్యాలో దాదాపు 10వేలమంది తమ సైనికులను ఉత్తర కొరియా మోహరించినట్లు పెంటగాన్ అంచనా వేస్తోంది.

కొంత మంది సైనికుల బృందాన్ని రష్యా పశ్చిమ ప్రాంతంలోఉన్న కుర్క్స్‌కు పంపించారు. అంతేకాదు, ఇంకా వేల మంది సైనికులు ఇదే బాటలో పయనించడానికి సిద్ధంగా ఉన్నారని ఈ వారం మొదట్లో అమెరికా తెలిపింది.

పుతిన్, కిమ్‌ల మధ్య సంబంధాలు మరింత బలోపతం కావడానికి ఈ సైనికుల శిక్షణ దోహదం చేస్తుందనే ఆందోళనలు మొదలయ్యాయి.

ఈ ఆరోపణలను రష్యా, ఉత్తర కొరియా దేశాలు ధ్రువీకరించలేదు. అలా అని ఖండించనూ లేదు.

(సోల్ నుంచి హోసు లీ, జేక్ క్వాన్‌ల అదనపు రిపోర్టింగ్ )

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)