తెలంగాణ: ఇంట్లో మందు పార్టీ చేసుకోవాలంటే ప్రభుత్వ అనుమతి కావాలా, ఎక్సైజ్ శాఖ నిబంధనలు ఏం చెబుతున్నాయి?

మందు పార్టీ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ప్రవీణ్ శుభం
    • హోదా, బీబీసీ కోసం

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిది(పాకాల రాజేంద్రప్రసాద్)కి చెందిన జన్వాడ ఫామ్‌హౌస్‌లో మందు పార్టీ(దావత్) వ్యవహారంపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పరస్పర విమర్శలు చేసుకుంటున్నాయి.

ఫామ్‌హౌస్‌లో అక్రమ విదేశీ మద్యం, డ్రగ్స్‌తో రేవ్ పార్టీ జరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అయితే అది కుటుంబ సభ్యులంతా కలిసి చేసుకున్న దావత్ అని, ఇంట్లో పార్టీ చేసుకునే అవకాశం కూడా లేదా అని బీఆర్ఎస్ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.

ఈ రాజకీయ వివాదం నేపథ్యంలో ‘’ఒక కుటుంబంలో నలుగురైదుగురు కలిసి చేసుకునే మందు పార్టీకి మినహాయింపు ఉంటుంది. మంది ఎక్కువైనప్పుడు చట్టప్రకారం అనుమతులు తీసుకోవాలి’’ అని మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ట్రోల్స్ కొనసాగాయి.

‘తెలంగాణ వాసి’ పేరుతో మంత్రి పొన్నంను ఉద్దేశిస్తూ రాసిన ఒక లేఖ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ‘ప్రతి ఆదివారం నేను, నా స్నేహితులుచేసుకునే పార్టీకి ఎవరి వద్ద అనుమతి తీసుకోవాలి ’ అని ఆ లేఖలో ప్రశ్నించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
మందు పార్టీ

ఫొటో సోర్స్, Getty Images

నిబంధనలు ఏం చెబుతున్నాయి...?

భారత రాజ్యాంగం ప్రకారం మద్యం సరఫరా, అమ్మకాలు రాష్ట్రాల పరిధిలోని అంశం.

తెలంగాణ ఎక్సైజ్ యాక్ట్-1968 ( ఉమ్మడి రాష్ట్రంలోని ఏపి ఎక్సైజ్ యాక్ట్ -1968 నే తెలంగాణ అనుసరిస్తోంది) ప్రకారం రాష్ట్రంలో మద్యం తయారీ, నియంత్రణ, అమ్మకాలను ఎక్సైజ్ శాఖ పర్యవేక్షిస్తుంది.

ఎక్సైజ్ శాఖ నిబంధనల ప్రకారం.. ఒక వ్యక్తి ఆరు ఫుల్ బాటిళ్ల మద్యం( 4.5 లీటర్లు), 12 బీర్లు కలిగి ఉండొచ్చు. ఈ నిబంధన ప్రకారం ఒక కుటుంబంలో మందు పార్టీ చేసుకోవడానికి 6 బాటిళ్ల కంటే ఎక్కువ మద్యం కొనుగోలుచేయాల్సివస్తే, ఆ పార్టీ ఇచ్చే వ్యక్తి (హోస్ట్) ఎక్సైజ్ శాఖ నుంచి పర్మిట్ (అనుమతి) పొందాలి.

సోషల్, ఫ్యామిలీ, గెట్ టు గెదర్ ఈవెంట్‌లకు ఎక్సైజ్ శాఖ పర్మిట్‌లను జారీ చేస్తుంది.

పర్మిట్‌ల కోసం ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి.

సంబంధిత ఎక్సైజ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఈ దరఖాస్తులను పరిశీలిస్తారు.

జిల్లా స్థాయి అధికారి పర్మిట్లు జారీ చేస్తారు.

ఎక్సైజ్ యాక్ట్ రూల్-11 ప్రకారం…పార్టీల స్వభావం, అవి నిర్వహించే ప్రాంతాన్ని బట్టి రోజుకు ఇంత అని నిర్దేశించిన మొత్తాన్ని చలాన్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది.

ఎక్సైజ్ శాఖ నిబంధనలు

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, మందు పార్టీలకు ఎంతెంత చెల్లించాలో చెబుతున్న ఎక్సైజ్ శాఖ నిబంధనలు

ఎంత చెల్లించాలి.....?

జీహెచ్ ఎంసీ‌తో పాటు 5 కిలోమీటర్ల పరిధిలో ఒక రోజుకు 12 వేల రూపాయలు చెల్లించాలి. ఫోర్ స్టార్ , అంతకు పై స్థాయి హోటళ్లలో పార్టీ నిర్వహిస్తే 20 వేల రూపాయలు చెల్లించాలి.

రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో అయితే 9వేల రూపాయలు, అదే హోటళ్లలో (4 స్టార్, అంతకు మించిన) నిర్వహిస్తే 12 వేల రూపాయలు చెల్లించాలి.

క్రీడా, వాణిజ్య, వినోద కార్యక్రమాలకు హాజరయ్యే వారి సంఖ్యను బట్టి వేరువేరుగా చలాన్ రుసుము ఉంది.

వెయ్యి మంది వరకు హాజరయ్యే ఈవెంట్‌కు 50 వేల రూపాయలు, ఐదు వేల మంది హాజరయ్యే ఈవెంట్‌కు లక్ష రూపాయలు, స్టేడియం, బహిరంగ ప్రదేశాలు, ఆడిటోరియంలలో ఐదు వేలకు మించి హాజరయ్యే ఈవెంట్‌లకు రూ.2.5 లక్షలు చెల్లించాలి.

ఈవెంట్ ప్రదేశాల్లో మద్యం సేవించేందుకు ఉన్న ప్రత్యేక ఏర్పాట్లు, సాధారణ జనజీవనానికి ఆటంకం కలగకపోవడం వంటి అంశాలను పరిశీలించి స్థానిక ఎక్సైజ్ సిబ్బంది ఇచ్చే నివేదిక ఆధారంగా అనుమతి జారీ అవుతుంది.

“నగరాలు, పట్టణాల్లో ఈవెంట్లకు పర్మిట్లు తీసుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ. ఫంక్షన్ హాల్ యజమానులు, ఈవెంట్ మేనేజర్లకు మద్యం పర్మిట్ల విషయంలో అవగాహన కల్పించాం. దీంతో వారే కస్టమర్లకు పర్మిట్లు తెచ్చుకోవాలని సూచిస్తారు. నిబంధనల ప్రకారం జాతర్లలో మద్యం అమ్మకాలకు కూడా పర్మిట్లు తీసుకోవాలి’’ అని తెలంగాణ ఎక్సైజ్ శాఖ అధికారి ఒకరు బీబీసీతో చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)