ఆ దీవిలో చిట్టెలుకలు ఉన్నాయని పర్యావరణవేత్తలు ఎందుకు భయపడుతున్నారు?

- రచయిత, జాక్ సిల్వర్
- హోదా, బీబీసీ న్యూస్
బ్రిటన్ ప్రధాన భూభాగానికి 28 మైళ్ల దూరంలో ఉన్న ఓ దీవిలో చిట్టెలుకలు ఉండొచ్చనే సంకేతాలు వెలువడుతుండటంపై పర్యావరణ పరిరక్షకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
యూకేలో స్ట్రామ్ పెట్రెల్స్ అనే సముద్ర పక్షులు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి. వీటి జనాభాను రక్షించేందుకు , వాటి ఆవాసానికి నెలవైన ఐల్స్ ఆఫ్ సిలీ దీవుల్లోని సెయింట్ ఆగ్నెస్ దీవి నుంచి ఎలుకలను, చిట్టెలుకలను పూర్తిగా తొలగించారు.

చిట్టెలుకల మల మూత్ర విసర్జనలను గుర్తించడం ద్వారా వాటి ఉనికి అక్కడ ఉండొచ్చని ఐల్స్ ఆఫ్ సిలీ వైల్డ్‌లైఫ్ ట్రస్ట్ పేర్కొంది. బహుశా ఇతర జంతువుల దాణా ద్వారా అవి ఇక్కడకు వచ్చి ఉండొచ్చని భావిస్తున్నారు.
ఎలుకలను దీవుల నుంచి తొలగించేందుకు గత పదేళ్లుగా రాయల్ సొసైటీ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ బర్డ్స్(ఆర్‌ఎస్‌పీబీ), ట్రస్ట్ విజయవంతంగా ఓ కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. దీనివల్ల పెట్రెల్స్ పక్షుల సంఖ్య పెరిగినట్టు ట్రస్ట్ పేర్కొంది.

‘‘దీవి అంతటా ఎలుకల కోసం ఉచ్చులు ఏర్పాటు చేసి, వాటిల్లో విషాన్ని పెట్టాం. ఆ తర్వాత ఆ ఉచ్చులను తరచూ పరిశీలించాం. ఈ పద్ధతి బాగా పనిచేసింది. దీంతో, ఎలుకలను పూర్తిగా తొలగించగలిగాం’’ అని ఆర్‌ఎస్‌పీబీకి చెందిన టోనీ వైట్‌హెడ్ అన్నారు.
ఒకవేళ ఈ దీవిలో ఎలుకలు ఉంటే అవి స్టార్మ్స్ పెట్రెల్స్, మాంక్స్ షీర్‌వాటర్స్ అనే పక్షులు గుడ్లను తినే అవకాశం ఉందని చెప్పారు. దీంతో ఈ పక్షుల జనాభా ప్రమాదంలోకి పడినట్టు అవుతుందన్నారు.
గత గురువారం చిట్టెలుకలకు చెందిన మలమూత్రాలను స్థానిక కమ్యూనిటీకి చెందిన ఓ వ్యక్తి గుర్తించారని వైట్‌హెడ్ తెలిపారు.
ఈ దీవిలోని ప్రజలు ఎలుకల నిర్మూలనకు తమకు ఎంతో సాయపడ్డారని వైట్‌హెడ్ చెప్పారు.
అయితే దీవిలో ఎలుకల కోసం ఏర్పాటుచేసిన ఉచ్చుల గురించి ప్రజలకు తెలిసేలా అంతటా హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేసినట్టు వైల్డ్‌లైఫ్ ట్రస్ట్ తెలిపింది.
ఐల్స్ ఆఫ్ సిలీలో జనావాసాలున్న ఐదు దీవుల్లో సెయింట్ ఆగ్నెస్ ఒకటి. 2011 జన గణనలో అక్కడ జనాభా 85గా నమోదైంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














