యాదగిరి గుట్ట యాదాద్రి ఎలా అయ్యింది, మళ్లీ పాత పేరుతోనే పిలవాలని రేవంత్ ప్రభుత్వం ఎందుకు అంటోంది?

ఫొటో సోర్స్, https://yadagiriguttatemple.telangana.gov.in
- రచయిత, బళ్ళ సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
తెలంగాణలో లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం ఉన్న యాదాద్రి ఆధ్యాత్మిక క్షేత్రాన్ని ఇకపై పాత పద్ధతిలో యాదగిరి గుట్ట పేరుతోనే పిలవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు.
అయితే వాస్తవానికి ఆ ఊరి పేరును ఎన్నడూ యాదాద్రిగా అధికారికంగా మార్చలేదు. అయినా, ఈ యాదాద్రి – యాదగిరి అనే గొడవ ఎందుకొచ్చింది?
దేవాలయ క్షేత్ర మహిమ చెప్పే క్రమంలో, యాద మహర్షి లేదా యాదర్షి అనే ఒక రుషి పేరు మీద ఈ క్షేత్రం యాదగిరి అయిందని చెబుతారు.
ఇది హిందువుల విశ్వాసానికి సంబంధించినది. చారిత్రక ఆధారాలు లేవు.
స్థానికులు వ్యవహారంలో యాదగిరి గుట్ట లేదా సంక్షిప్తంగా గుట్ట అని పిలిచేవారు. గుట్ట దేవుడు, గుట్ట స్వామి అని యాదగిరి గుట్ట మీద ఉండే దేవుడిని తెలంగాణలో చాలామంది పిలుస్తుంటారు.
పుణ్యక్షేత్రాల పేర్లు హిందువులకు పెట్టుకునే ఆచారంలో భాగంగా, యాదగిరి అనే పేరు తెలంగాణలోని పలువురు పెట్టుకోవడం కూడా కనిపిస్తుంది.
ఇక గిరి అనే సంస్కృత పదం, గుట్ట అనే తెలుగు పదం రెండూ ఒకే అర్థాన్ని ఇస్తాయి. దక్షిణ తెలంగాణలో గుట్టకెళుతున్నాం అని చెప్పారంటే యాదగిరి గుట్టకు వెళుతున్నారనే అనుకుంటారు.
అందుకే, గిరి అని పిలిచినా, గుట్ట అని పిలిచినా వాటి అర్థం ఒక్కటే. అయినప్పటికీ వాడుకలో రెండు పదాలూ కలిపే ఈ క్షేత్రాన్ని యాదగిరి గుట్టగా పిలుస్తారు.

యాదగిరి గుట్ట పేరు మార్చారా?
తెలంగాణలో కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తరువాత శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయాన్ని సమూలంగా మార్చేశారు. వందల కోట్ల ప్రభుత్వ సొమ్ముతో పునర్నిర్మించారు.
ఆ కార్యక్రమాలకు మార్గదర్శనం చేసిన శ్రీవైష్ణవ మఠాధిపతి త్రిదండి శ్రీమన్నారాయణ చిన్న జీయర్ స్వామి, యాదగిరి గుట్ట పేరును కూడా మార్చాలని సూచించారు.
అప్పట్లో ఆయన మాట తు.చ తప్పక పాటించే సీఎం కేసీఆర్, జీయర్ సూచించిన కొత్త పేరును వ్యవహారికంలో వాడారు. అలా యాదాద్రి అయ్యింది.
యాదగిరిగుట్టే కాకుండా, భద్రాచలానికి కూడా భద్రాద్రి అనే పేరు పెట్టారు.
పాత, కొత్త పదాలు అన్నిటికీ కొండ అనే అర్థం వస్తుంది. గిరి (యాదగిరి), గుట్ట, అద్రి (యాదాద్రి), అచలం (భద్రాచలం) – ఈ నాలుగు పదాలకూ కొండ, గుట్ట అనే తెలుగులో అర్థం.
యాదగిరి గుట్ట ఆలయం పునర్నిర్మాణం పూర్తై భక్తులకు అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి అందరూ యాదాద్రి దేవాలయం అనే పిలవడం మొదలుపెట్టారు.
అప్పుడే కొత్తగా ఏర్పాటు చేసిన భువనగిరి జిల్లాకు కూడా ఈ క్షేత్రం పేరు కలిసేలా యాదాద్రి భువనగిరి అని పేరు పెట్టారు.
ఆ ఊరికి దగ్గరలోని రాయగిరి రైల్వే స్టేషన్ పేరు కూడా యాదాద్రి స్టేషన్ అని మార్చారు.

బీఆర్ఎస్ హయాంలో అసలు ఊరి పేరు మార్చలేదా?
రైల్వే స్టేషన్, కొత్తగా ఏర్పడిన జిల్లా పేరు తప్ప, మరెక్కడా అధికారికంగా యాదాద్రి పేరు మార్చలేదు.
కేసీఆర్ హయాంలోనే 2018 ఆగస్టులో ఈ యాదగిరిగుట్ట గ్రామాన్ని మున్సిపాలిటీగా మార్చారు. అప్పుడు కొత్త మున్సిపాలిటీకి కూడా యాదగిరిగుట్ట మున్సిపల్ కౌన్సిల్ అనే పేరునే ఉంచారు.
అంతేకాదు, ఆ గుడి అభివృద్ధి చేయడం కోసం ఏర్పాటు చేసిన వైటీడీఏ పేరు కూడా యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ అనే ఉంది తప్ప, యాదాద్రి టెంపుల్ అని అధికారికంగా మార్చలేదు.
కాకపోతే ఉత్తరాలలో, కొన్ని పత్రాల్లో మాత్రం యాదాద్రి అనే పేరు వాడేవారు. ఆ ఊరి పోలీస్ స్టేషన్, రెవెన్యూ కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయం, బస్టాండ్ అన్నీ యాదగిరిగుట్ట అనే పేరుతోనే ఉన్నాయి.
కేసీఆర్ సీఎంగా ఉన్నంత కాలం, అధికారికంగా, చట్ట ప్రకారం ఊరి పేరు కానీ, దేవస్థానం అభివృద్ధి బోర్డు పేరు కానీ మార్చకుండా వ్యవహారికంలో మాత్రమే యాదాద్రిగా వాడే వారు.
‘‘మా మున్సిపాలిటీ పేరు ముందు నుంచీ రికార్డుల ప్రకారం యాదగిరి గుట్ట అనే ఉంది. ఈ ఊరి పేరు యాదాద్రి అని ఎప్పుడూ లేదు.’’ అని యాదగిరిగుట్ట మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ బీబీసీతో చెప్పారు.
‘‘జీయర్ స్వామి సలహాతో యాదాద్రి అనే పేరు వ్యవహారంలోకి వచ్చింది తప్ప, దానిపై ప్రత్యేకమైన జీవో ఏమీ లేదు. ప్రభుత్వ సూచనతో ఆ పేరు వాడుకలో ఉండేది. కొత్త ప్రభుత్వం వచ్చాక పాత పేరు కొనసాగించడం ప్రారంభించాం. వైటీడీఏ పేరులో కూడా ఎప్పుడూ యాదగిరిగుట్ట అనే ఉంది తప్ప యాదాద్రి అని లేదు.’’ అని వైటీడీఏ అధికారి కిషన్ రావు బీబీసీతో అన్నారు.

ఫొటో సోర్స్, https://yadagiriguttatemple.telangana.gov.in
యాదగిరి గుట్ట పేరు మార్పుని ఇష్టపడని కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక యాదాద్రి పేరు స్థానంలో మళ్లీ యాదగిరిగుట్ట అనే పేరు వాడుకలో పుంజుకుంది.
2024 మార్చి నుంచే ఈ పేరు మార్పుపై సంకేతాలిచ్చారు కాంగ్రెస్ నాయకులు. ‘యాదగిరిగుట్ట అనే పాత పేరునే పెడతాం’ అని అదే కొండపై ప్రకటించారు స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే అయిలయ్య.
‘‘పూర్వం నుంచీ ఉన్న పేరు మార్చడం సరికాదు’’ అని మీడియాతో అన్నారాయన. అదే ప్రాంతానికి చెందిన మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి కూడా పేరు మార్పు గురించి ప్రకటించారు.
‘‘కాంగ్రెస్ వచ్చాక లడ్డూ కవర్లపై యాదగిరి గుట్ట అనే ముద్రించడం మొదలుపెట్టారు. స్థానికుల్లో చాలా మందికి కూడా యాదగిరిగుట్ట అన్న పేరే ఇష్టం.’’ అని కొందరు స్థానికులు బీబీసీతో అన్నారు.
బీఆర్ఎస్ హయాంలో గుడి వెబ్ సైట్, సోషల్ అకౌంట్లలో యాదాద్రి టెంపుల్ అని ఉండగా, ఇప్పుడు యాదగిరిగుట్ట టెంపుల్ అని మార్చారు.

ఫొటో సోర్స్, https://x.com/iamkondasurekha/status
యాదగిరి పేరుతో ఇతర ఊళ్ళు
‘ఎగువ యాదగిరి దిగువ జొన్నవాడ’ అని నెల్లూరు, తిరుపతి ప్రాంతాల్లో ఒక జానపద గేయం ఉంది.
జొన్నవాడ అంటే కామాక్షి అమ్మ ఆలయం. యాదగిరి అంటే ఇప్పటి నెల్లూరు దగ్గర వేదగిరి.
ఇక తెలంగాణలో యాదగిరి పేరుతో కొన్ని ఊళ్ళు ఉన్నాయి. కర్ణాటకలో కూడా యాదగిరి(యాద్గిర్) పేరుతో ఒక జిల్లా ఉంది.
‘‘యాదగిరి గుట్టలో లక్ష్మీ నరసింహ స్వామి గుడి చరిత్ర గరిష్టంగా 400 ఏళ్ల వరకూ అందుబాటులో ఉంది’’ అని తెలుగు చరిత్రపై సోషల్ అకౌంట్స్ నిర్వహిస్తోన్న తెలుగు జంబూద్వీపం అనే సోషల్ మీడియా సంస్థ తన ఎక్స్ హ్యాండిల్‌లో పేర్కొంది.
విశ్వాసాల ప్రకారం యాద మహర్షి పేరుతో ఊరి పేరు ఏర్పడిందని చెబుతున్నా, చరిత్ర ప్రకారం యాదగిరి అనే పేరు ఎలా వచ్చింది అన్నదానిపై స్పష్టమైన సమాచారం లేదు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










