‘మా కులం పేరు మార్చండి’

తాడుపై నడుస్తూ ప్రదర్శన ఇస్తున్న యువతి

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ప్రవీణ్ శుభం
    • హోదా, బీబీసీ కోసం

తెలంగాణలో కుల గణన ప్రారంభమైంది. బీసీల జనాభా లెక్కించడం ఈ సర్వే లక్ష్యాల్లో ఒకటని ప్రభుత్వం చెబుతోంది.

సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే (సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే) పేరుతో ఈ సర్వే చేపట్టారు.

కుల గణన నేపథ్యంలో గత కొద్ది రోజులుగా తెలంగాణలో పర్యటిస్తున్న బీసీ కమిషన్‌కు పలు వినతులు వచ్చాయి. అందులో కొందరు తమ కులాల పేరు మార్చాలని కోరినట్టు బీసీ కమిషన్ చెప్పింది.

“చాలా రకాల విజ్ఞప్తులు వస్తున్నాయి. ఎప్పుడూ వినని కొన్ని కులాల పేర్లు మా దృష్టికి వచ్చాయి. కొత్త విషయాలు తెలుస్తున్నాయి. అవమానకరంగా ఉన్న తమ కులం పేర్లు మార్చాలని కొన్ని కులాలు కోరుతున్నాయి” అని తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ కరీంనగర్ జిల్లా పర్యటనలో అన్నారు.

కొన్ని కులాల వారు తమ కులం పేర్లు పలకడానికి అభ్యంతరకరంగా ఉన్నాయంటూ వాటిని మార్చాలని కమిషన్‌కు అర్జీ పెట్టుకున్నారని ఆయన చెప్పారు.

దొమ్మర, పిచ్చిగుంట్ల, వీరముష్టి కులాల పేర్లతో పాటు వారి సామాజిక, ఆర్థిక స్థితిగతులను మార్చేలా చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నుంచి ఉంది. ఇందులో రెండు కులాలు... పిచ్చిగుంట్ల, వీరముష్టి పేర్లు ఇప్పటికే మార్చారు. అయితే క్షేత్రస్థాయిలో కుల ధ్రువీకరణ పత్రాలను పొందడంలో వారికి కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

చరిత్రను పరిశీలిస్తే గతంలో ఈ కులాలు ఊరూరూ తిరిగి తమ జానపద కళారూపాలను ప్రదర్శిస్తూ యాచక వృత్తిలో కొనసాగాయి. కాలక్రమంలో కులవృత్తి స్థానంలో పొట్టకూటికి ఇతర వృత్తులు చేపట్టారు.

తెలుగు రంగస్థల, సినిమా నటుడు డాక్టర్ మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి తన ‘తెలుగువారి జానపద కళారూపాలు’ పుస్తకంలో ఈ కులాల పూర్వాపరాలు వివరించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
బీసీ కమిషన్‌కు విజ్ఞప్తి

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, ప్రత్యేక రిజర్వేషన్ కేటాయించాలని విజ్ఞప్తి

వీరముష్టి కులం పేరు వీరభద్రీయగా మార్పు

వీరశైవ మత ప్రభావం ఎక్కువగా కనిపించే వీరముష్టులు శైవ వాఙ్మయ గేయాలు, గాథలు, కన్యకా పరమేశ్వరి కథలను చెబుతారు.

జంగాలు, వైశ్యుల వద్ద ఎక్కువగా యాచిస్తారు. మారెమ్మ, ముత్యాలమ్మ, పోచమ్మ గ్రామదేవతల ఆరాధన కూడా వీరిలో కనిపిస్తుందని మిక్కిలినేని తన పుస్తకంలో రాశారు.

‘శంఖం, తప్పెట వాయిస్తూ భిక్షమెత్తుతారు. కర్రసాము, కత్తి సాము ప్రదర్శనలిస్తారు. ఈ కులంలో స్త్రీలు చాపలు అల్లడం, పచ్చబొట్లు పొడవడం లాంటి పనులు చేస్తారు’ అని ఆయన రాశారు.

‘ముష్టి’ అంటే పిడికిలి అని అర్థమని ప్రముఖ జానపద పరిశోధకులు ప్రొఫెసర్ బిరుదరాజు రామరాజు తన జానపద గేయ సాహిత్యం పుస్తకంలో వివరించారు.

తమ కులం పేరును ‘వీరభద్రీయ’గా మార్చాలన్న వీరి విజ్ఞప్తిపై ఉమ్మడి ఏపీలో జీవో జారీ అయ్యింది. తెలంగాణలో ప్రస్తుతం అదే పేరుతో వీరు క్యాస్ట్ సర్టిఫికెట్‌ను పొందుతున్నారు.

“మా కులం పేరు మార్పు కోసం దశాబ్దాలుగా పోరాడాం. 1996లో జీవో వచ్చినా సంవత్సరాల తరబడి కుల సర్టిఫికెట్ కోసం మండల రెవెన్యూ అధికారుల కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చింది’’ అని పెద్దపల్లి జిల్లా గుండారం గ్రామానికి చెందిన కడారి రవి బీబీసీతో అన్నారు.

‘చదువుకునే రోజుల్లో మా కులం పేరుతో చాలా అవమానాలకు గురయ్యాం. కులవృత్తి పోయింది. ఉపాధి కోసం ఇప్పుడు ఊరూరూ తిరుగుతూ అల్యూమినియం వంట పాత్రలను అమ్ముతున్నాం. మహిళలు చాపల అల్లికలు, పచ్చబొట్లు పొడవడం, విభూతి ఉండలు అమ్ముతూ ఉపాధి పొందుతున్నారు’’ అని ఆయన అన్నారు.

తెలంగాణలో వీరభద్రీయ కులంవారు బీసీ-ఏ(23) గ్రూపులో ఉన్నారు.

“పెద్దగా ప్రాచుర్యం లేని కులం మాది. మా కులం పేరు చెప్పడానికి ఇబ్బంది పడ్డాం. సంచార జీవితం వదిలి ఈమధ్యే స్థిర నివాసం ఏర్పాటుచేసుకుంటున్నాం. మా పిల్లలకు ఎలాంటి ప్రవేశపరీక్షలూ లేకుండా నేరుగా ప్రభుత్వ రెసిడెన్షియల్, మోడల్ స్కూళ్లలో అడ్మిషన్లు ఇవ్వాలి. కుల గణనలో పాత పేర్లు (వీరముష్టి, నెత్తికోతల) కాకుండా వీరభద్రీయ అనే నమోదు చేయాలి.

రాజకీయంగా మాకు పెద్దగా అవకాశాలు లేవు. తెలంగాణలో మా కులం నుంచి ఇప్పటివరకు ఒక్కరే సర్పంచ్ కాగలిగారు’’ అని వీరభద్రీయ సంఘం తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కర్నె శివ కుమార్ బీబీసీతో అన్నారు.

సర్కస్‌కు ఆద్యులు

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, సామాజికంగా, ఆర్థికంగా వెనకబడిన దొమ్మర కులంవారి ప్రదర్శన

దొమ్మర - సర్కస్ ఆటకు ఆద్యులు

దొమ్మరులు తెలంగాణ రాష్ట్ర బీసీ కులాల జాబితాలో ‘ఏ’ గ్రూపులో ఉన్నారు. తమ కులం పేరును తిట్టు పదంగా వాడుతున్నారని, చులకనగా చూస్తున్నారని, ఆ పేరును మార్చాలని చాలా కాలంగా వీరు కోరుతున్నారు. గతంలో బీసీ కమిషన్ ఈ కులం పేరు మార్చాలని ప్రభుత్వానికి తన నివేదికలో సిఫార్సు చేసింది. అది పెండింగులో ఉంది.

13వ శతాబ్దానికి చెందిన పాల్కురికి సోమనాథ పండితారాధ్య చరిత్రలో దొమ్మరాటల ప్రస్తావన ఉందని మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి తన గ్రంథంలో వివరించారు. విజయనగర రాజుల కాలంలో మహర్నవమి ఉత్సవాల్లో ఏనుగులు, పులులు, సింహాలతో వీరు ప్రదర్శనలిచ్చేవారని ఆధునిక సర్కస్‌లకు ఈ ఆటలే ఆధారం అని ఆయన అభిప్రాయపడ్డారు.

వెదురు గడల సహాయంతో తాడుపై నడుస్తూ చేసే విన్యాసాలు వ్యాయామ విద్యను తలపిస్తాయని, తెలుగు రాష్ట్రాల్లో ప్రాచుర్యం పొందిన కళారూపం ఇదని ఆయన వివరించారు.

“మా కులం పేరును ‘గడ వంశ’ అని మార్చాలని ఏళ్ల తరబడి కోరుతున్నాం. తిట్టు పదాలుగా మా కులం పేరు వాడటం బాధకలిగిస్తుంది. సమాజంలో మాపై చిన్నచూపు ఉంది. బతుకు దెరువు కోసం పందుల వ్యాపారం, ఆటో డ్రైవర్లుగా మాలో చాలా మంది పనిచేస్తున్నారు’’ అని కరీంనగర్ జిల్లా రామడుగుకు చెందిన అనిల్ అన్నారు.

‘’కులం పేరు మార్చాలని గతంలో చేసిన మా విజ్ఞప్తిపై కాలాయాపన చేస్తున్నారు. ఇతర కులాల పేర్లు మార్చారు. గతంలో ఊరి చివరన మా ఇళ్లు ఉండేవి. నివాసాలు పెరిగి మా ఇండ్లవరకు కాలనీలు విస్తరించాయి. ఇప్పుడు మా మధ్య మీరు ఉండొద్దు వెళ్లిపోవాలంటున్నారు. మా కులానికి చెందిన ఒక ప్రభుత్వ ఉద్యోగి ఇల్లు కడితే మిగతా కాలనీవాసులు అభ్యంతరం చెప్పారు. మా కులంతో ఎలాంటి ఇబ్బందీ ఉండదని వారికి బాండ్ పేపర్ రాసి ఇస్తే కానీ ఒప్పుకోలేదు’’ అని తెలంగాణ దొమ్మర కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆరె రాములు బీబీసీతో అన్నారు.

ఆ ప్రభుత్వోద్యోగి విజ్ఞప్తి మేరకు ఆయన వివరాలు గోప్యంగా ఉంచుతున్నాం.

“గతంలో ఎస్టీ జాబితాలో ఉన్న మా కులాన్ని బీసీల్లో చేర్చారు. తిరిగి ఎస్టీల్లో కలపాలని కోరుతున్నాం. మా కులం పేరును తిట్టు పదంగా వాడే వారిపై అట్రాసిటీ కేసు పెట్టేలా చట్టం తేవాలి. మా పిల్లలు ఈ కులం పేరును నామోషీగా భావిస్తున్నారు. ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి మా కులం సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులపై అధ్యయనం చేయాలి. రాజకీయ అవకాశాలు ఇవ్వాలి’’ అని రాములు అన్నారు.

కులగణన సర్వే

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, తెలంగాణలో కులగణన సర్వే

పిచ్చిగుంట్ల పేరు వంశరాజ్‌గా మార్పు

‘తెలుగువారి జానపద కళారూపాలు’ గ్రంథంలో మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి ఈ కులం గురించి ఇలా ప్రస్తావించారు.

‘‘వీరు కమ్మ, కాపు, యాదవుల గోత్రాలను చెబుతూ యాచించే వారు. వీరు ప్రదర్శించే పిచ్చుకుంటుల కథ కళారూపం చిరకాలంగా ఆంధ్రదేశంలో ప్రచారంలో ఉంది. పల్నాటి వీరచరిత్ర, బాలనాగమ్మ, కాటమరాజు, హరిశ్చంద్ర, సదాశివ రెడ్డి కథలు వీరి ప్రదర్శనల్లో ప్రముఖమైనవి’’ అని ఆయన రాశారు.

పిచ్చిగుంటలాళ్లు, పిచ్చుకకుంటల, పిచ్చుకుంటల ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు. వీరి కథలకు ఆదరణ తగ్గడం వల్ల వేర్వేరు వృత్తుల్లో ఉపాధి చూసుకుంటున్నారని ఆయన వివరించారు.

ఈ కులం వారి విజ్ఞప్తి మేరకు వీరిని ‘వంశరాజ్’గా పేరు మార్చారు. తెలంగాణ బీసీ కులాల జాబితాలో వీరు బీసీ-ఏ (18) గ్రూపులో ఉన్నారు.

కరీంనగర్ భగత్ నగర్ కు చెందిన ‘వంశరాజ్’ జిల్లా అధ్యక్షుడు లింగయ్య మాట్లాడుతూ “గత మూడేళ్లుగా ‘వంశరాజ్’ అనే పేరుతో కులం సర్టిఫికెట్లు ఇస్తున్నారు. అయితే, జీవో కాపీ వచ్చినా మొదట్లో అధికారులు పట్టించుకోలేదు. బీసీ కార్పొరేషన్ రుణాలు అందడం లేదు. మా కులవృత్తి స్థానంలో చీపుర్లు, ముగ్గు అమ్మకంతో ఉపాధి పొందుతున్నాం” అని అన్నారు.

ఎస్టీలుగా మార్చాలని విజ్ఞప్తి

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, బీసీ కమిషన్‌కు విజ్ఞప్తులు

సిఫారసు మాత్రమే చేయగలం

తీసుకోవాల్సిన చర్యలను కమిషన్ సిఫారసు మాత్రమే చేయగలదు, వాటిని ఆమోదించి, అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర మంత్రివర్గానిదే అని తెలంగాణ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ బీఎస్ రాములు బీబీసీతో అన్నారు.

“కులాల పేరు మార్పు కోసం ప్రభుత్వం జీవో ఇస్తే సరిపోతుంది. ఈ మార్పులపై కింది స్థాయి అధికారులకు అవగాహన లేకపోవడంతో మార్చిన పేర్లతో కులం సర్టిఫికెట్లు పొందడానికి క్షేత్రస్థాయిలో చాలామంది ఇబ్బందులు పడ్డారు. కొన్ని కులాలకు ఆర్డీఓ కార్యాలయం నుండి సర్టిఫికెట్లు పొందాలన్నారు. తక్కువ సంఖ్యలో ఉండే ఇలాంటి వారు అక్కడికి ఎలా పోతారు?

ఇలాంటి కులాల్లో వలసలు ఒక సమస్యగా ఉన్నాయి. కులం సర్టిఫికెట్ కోసం పోయినప్పుడు వారు వీరే అని అధికారులు కచ్చితంగా నిర్ధరణకు రాలేని సందర్భాలు తలెత్తాయి.

దొమ్మర కులం పేరు మార్పుపై గత ప్రభుత్వానికి రికమండ్ చేశాం. అయితే ఆ ఫైల్ పైస్థాయిలో పెండింగులో ఉంది. మా హయాంలో 17 కులాలను బీసీల్లో చేర్చాం. ప్రతి పదేళ్లకు కులాల స్థితి గతులపై రివ్యూ జరగాలి’’ అని రాములు అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)