ఆస్ట్రేలియా: 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా వద్దని ఎందుకు చెబుతోంది?

సోషల్ మీడియా

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, హన్నా రిచీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

పదహారేళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వాడకాన్ని నిషేధిస్తూ చట్టం తీసుకురానున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోని ఆల్బనీస్ తెలిపారు.

సామాజిక మాధ్యమాల దుష్ప్రభావాల నుంచి ఆస్ట్రేలియా పిల్లలను రక్షించడంలో భాగంగా ఈ ప్రతిపాదిత చట్టాలను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్టు ఆయన చెప్పారు.

‘‘ఇది నాలాగా ఆన్‌లైన్‌లో పిల్లల భద్రత గురించి కలత చెందుతున్న తల్లిదండ్రుల కోసం తీసుకొస్తున్న చట్టం. ఆస్ట్రేలియాలోని కుటుంబాలకు ప్రభుత్వం తోడుగా ఉందని చెప్పాలనుకుంటున్నాను.’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ చట్టంలోని అనేక అంశాలపై చర్చించాల్సి ఉన్నప్పటికీ, ఇప్పటికే సామాజిక మాధ్యమాలలో ఉన్న పిల్లలకు కూడా ఇది వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

తల్లిదండ్రుల అనుమతి ఉన్న పిల్లలకు కూడా వయోపరిమితిపై ఎలాంటి మినహాయింపులు ఇవ్వలేదు. సామాజిక మాధ్యమాల్లోకి పిల్లల ప్రవేశాన్ని నిరోధించడానికి తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఆయా సామాజిక మాధ్యమాల ఫ్లాట్‌పామ్‌లపై ఉందని ప్రభుత్వం చెబుతోంది.

అయితే యూజర్లకు ఎటువంటి జరిమానాలు ఉండవని, కానీ చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ఆస్ట్రేలియా ఆన్‌లైన్ నియంత్రణ సంస్థ ఈ-సేఫ్టీ కమిషనర్ పై ఉందని ఆల్బనీస్ చెప్పారు.

ప్రవేశపెట్టిన 12 నెలల తరువాత నుంచి ఈ చట్టం అమల్లోకి వస్తుందని, దీని అమలు సమీక్షకు లోబడి ఉంటుందని తెలిపారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

కౌమారదశలో ఉన్న పిల్లల మానసిక ఆరోగ్యంపై సామాజిక మాధ్యమాలు దుష్ప్రభావం చూపుతున్నమాట నిజమేనని అనేకమంది నిపుణులు అంగీకరిస్తున్నప్పటికీ, ఆన్‌లైన్‌లో సామూహిక నిషేధం విధించే ఈ చట్టం పనితీరు ఎలా ఉంటుందోనన్న సందేహాలు కొందరిలో ఉన్నాయి.

ఆన్‌లైన్ లాంటి సంక్లిష్ట వాతావరణంలో పిల్లలు ఎలా ఉండాలో నేర్పించకుండా ఇలాంటి చట్టాలను ప్రవేశపెట్టడం వల్ల వారికి టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి యాప్స్ ఆలస్యంగా పరిచయంకావడం తప్ప మరేమీ జరగదని అంటున్నారు.

గతంలో యూరోపియన్ యూనియన్ సహా పలుచోట్ల జరిగిన ఇలాంటి ప్రయత్నాలు చాలాచోట్ల విఫలమవడమే కాక, టెక్ కంపెనీల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొన్నాయి.

పైగా ఏజ్ ప్రూఫ్‌లను ఆన్‌లైన్‌లో సులువుగా తారుమారు చేయగలిగే సాధనాలు అందుబాటులో ఉన్నప్పుడు ఈ నిషేధం సమర్ధవంతంగా ఎలా అమలవుతుందని కొందరు ప్రశ్నిస్తున్నారు.

ఈ నిషేధం ద్వారా సమస్యకు అసలు కారణాన్ని ప్రభుత్వం విస్మరిస్తోందని ఆస్ట్రేలియాలో పిల్లల హక్కుల కోసం పోరాడే అతిపెద్ద సంస్థల్లో ఒకటి విమర్శించింది.

పిల్లలు, సామాజిక మాధ్యమాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కౌమారదశలో ఉన్న పిల్లల మానసిక ఆరోగ్యంపై సామాజిక మాధ్యమాలు దుష్ప్రభావాన్ని చూపుతున్నాయని నిపుణులు చెబుతున్నారు

ఆన్‌లైన్ సేఫ్టీ ముఖ్యం

నిషేధిస్తూ చట్టాలు తీసుకురావడం కంటే ఆస్ట్రేలియా పిల్లల హక్కుల టాస్క్‌ఫోర్స్ సామాజిక మాధ్యమాల వేదికలపై ‘భద్రతా ప్రమాణాలు’ను పాటించేలా చూడటం మంచిదని అక్టోబరులో ఆల్బనీస్ ప్రభుత్వానికి వందమందికిపైగా విద్యావేత్తలు, 20 పౌరసంస్థలు రాసిన బహిరంగ లేఖలో కోరాయి.

‘‘ఆయా దేశాలు సోషల్ మీడియా వాడకాన్ని నియంత్రించడానికి రూపొందించే విధానాలు పిల్లలు సోషల్ మీడియా వాడకం నుంచి లబ్ది పొందే అవకాశం కల్పించేలా ఉండటంతోపాటు, వారికి భద్రత కల్పించేలా ఉండాలి.’’ అనే ఐక్య రాజ్య సమితి ఇచ్చిన సలహాను కూడా ఆ లేఖలో ప్రస్తావించారు.

అయితే, సామాజిక మాధ్యమాలలోని హానికరమైన కంటెంట్, తప్పుడు సమాచారం, వేధింపులతోపాటు ఇతర సామాజిక ఒత్తిళ్ల నుంచి పిల్లలను రక్షించడానికి ఈ నిషేధం తప్పనిసరని పిల్లల కోసం క్షేత్రస్థాయిలో పనిచేసే సంస్థలు ఆస్ట్రేలియా ప్రభుత్వాన్ని ఒప్పించాయి.

పిల్లలకు కనీసం 16 ఏళ్లు వచ్చేవరకు ఆన్‌లైన్ నెట్‌వర్క్‌లను సురక్షితంగా ఉపయోగించుకునే సమర్ధత ఉండదని, మితిమీరిన సామాజిక మాధ్యమాల వినియోగం వారి మానసిక పరిణతిపై ప్రభావం చూపుతోందని, మానసిక అనారోగ్యాలకు కారణమవుతోందని 36మంత్స్ ఇనిషియేటివ్ అనే సంస్థ అన్నది. ఈ సంస్థ లక్షా 25 వేలమంది సంతకాలతో ఓ పిటిషన్‌ను కూడా ప్రభుత్వానికి సమర్పించింది.

పిల్లలకు ఇంటర్నెట్ వాడకం వల్ల కలిగే ప్రమాదాలు, ప్రయోజనాలపై అవగాహన కలిగించే దిశగా విస్తృతమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందా అనే ప్రశ్నకు ఆంటోనీ స్పందిస్తూ, అలాంటిదానిని ఒక అసంపూర్ణమైన మార్గంగా భావిస్తానని, ఎందుకంటే పిల్లలకు ఆధునిక ఆన్‌లైన్ వ్యూహాలను ఎదుర్కొనే శక్తియుక్తులు ఉంటాయని తాను అనుకోవడం లేదని చెప్పారు.

‘‘మీ సంగతి నాకు తెలియదు. కానీ నేను చూడకూడదనుకునే విషయాలు కూడా నా కంప్యూటర్ తెరపై ప్రత్యక్షమవుతుంటాయి. నా సంగతే ఇలా ఉంటే.. మరి ఓ 14 ఏళ్ల అమాయక పిల్లాడి సంగతి ఎలా ఉంటుంది.’’ అని గురువారం విలేఖరులకు చెప్పారు.

‘‘ఈ టెక్ కంపెనీలు అత్యంతశక్తిమంతమైనవి. యాప్స్‌లోని ఆల్గరిథమ్స్ ప్రజలు కొన్ని ప్రత్యేక ప్రవర్తనలకు అలవాటుపడేలా చేస్తాయి.’’ అని ఆయన చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)