తెలంగాణ: కేసీఆర్ చేయించిన సమగ్ర సర్వే ఏమైంది, రెండోసారి కులగణన ఎందుకు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, బళ్ల సతీష్
- హోదా, బీబీసీ ప్రతినిధి
తెలంగాణ ఏర్పడ్డాక రెండోసారి కుల గణన చేస్తున్నారు. కర్ణాటక, బిహార్ వంటి రాష్ట్రాలు ఒకసారి కులం లెక్కలు తీయడానికే ఎన్నో ఇబ్బందులు పడితే, తెలంగాణలో రెండుసార్లు కులగణన ఎందుకు చేస్తున్నారు? అసలు మొదటి విడతలో కేసీఆర్ చేసిన సమగ్ర కుటుంబ సర్వే సమాచారం ఏమైంది? అంత హడావుడి చేసి చేపట్టిన ఆ సర్వే ఫలితాలు ఎందుకు బహిర్గతం చేయడం లేదు?
2014 ఆగస్టు 19న తెలంగాణలో ఒక సందడి వాతావరణం ఏర్పడింది. ఆరోజు తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే కోసం దేశ విదేశాల్లో స్థిరపడ్డ తెలంగాణ వారంతా పల్లెలకు వచ్చారు.
పెట్రోలు బంకులు వంటి నిత్యావసర వ్యాపారాలు కూడా మూసేశారు. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు సెలవులు పెట్టారు. టిక్కెట్లు దొరకని, డబ్బు పెట్టుకోలేని వారు మహారాష్ట్ర నుంచి సైకిల్ తొక్కుకుంటూ తెలంగాణ వచ్చి సర్వేల్లో పాల్గొన్నారు. లండన్, గల్ఫ్ దేశాల నుంచి విమానాల్లో వచ్చి మరీ సర్వేలో పాల్గొన్నారు.
ఆ రోజు సర్వే సమయానికి ఇంట్లో లేకపోతే మనం తెలంగాణ వాళ్లం కాకుండా పోతాం అనేంతగా దాని గురించి ప్రచారం జరిగింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ వెంటనే ప్రజల సామాజిక, ఆర్థిక, విద్య, భూ యాజమాన్య, వృత్తి సంబంధ అంశాలకు సంబంధించిన కచ్చితమైన సమాచారం కావాలని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.
దీంతో 3.85 లక్షల మంది ప్రభుత్వ సిబ్బందిని ఉపయోగించి, కోటీ ఆరు లక్షల ఫారాలు ప్రింట్ చేసి, తెలంగాణలో ఎవరూ సర్వే మిస్ కాకూడదంటూ భారీ ఎత్తున ప్రచారం చేసి, 8 అంశాలపై 94 ప్రశ్నలతో విస్తృతంగా చేసిన సర్వే అది.
ఆ సర్వేలో కోటి మూడు లక్షల కుటుంబాలు పాల్గొన్నాయని అంచనా. దీని కోసం ప్రత్యేక సాఫ్ట్ వేర్ రూపొందించి, దాదాపు 25 వేల మంది డేటా ఎంట్రీ సిబ్బందిని ఉపయోగించి, మనుషులకున్న భూముల నుంచి రోగాల వరకూ సమాచారం సేకరించి, క్రోడీకరించి, వాడుకోవడానికి వీలుగా భద్రపరిచారు.


ఫొటో సోర్స్, TelanganaCMO/FB
సర్వే కోసం ఎంత ఖర్చయింది?
భారతదేశ చరిత్రలో ఎక్కడా ఇంత పకడ్బందీగా, ఇంత విస్తృతంగా, ఒకేరోజు సర్వే జరగలేదని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ) తమ శిక్షణా తరగతుల్లో చెప్పేంతగా జరిగిన సర్వే అది. లిమ్కా బుక్ రికార్డులకూ ఎక్కిన సర్వే అది. ప్రభుత్వ రంగ సాఫ్ట్ వేర్, డేటా ఇన్ఫర్మేటిక్స్ విభాగం వారికి అయితే అదొక కేస్ స్టడీ.
ఈ సర్వేపై కోర్టుల్లో పదుల సంఖ్యలో కేసులు కూడా వేశారు.
ఆ సర్వేల ఫారాల ప్రింటింగుకే 6 కోట్లరూపాయలు ఖర్చయింది. డేటా ఎంట్రీకి కాలేజీల గదులు వాడుకున్నారు. సర్వే చేసిన వారంతా ప్రభుత్వ సిబ్బంది కాబట్టి అదనపు ఖర్చు లేదు. సిబ్బంది జీతాలు, డేటా స్టోరేజీ, డేటా ఎంట్రీలు మినహా మొత్తంమ్మీద 34 కోట్ల వరకూ ఖర్చు అయిందని ఎంసీఆర్ హెచ్ఆర్‌డీ అంచనా.
అయితే, ఈ సర్వే కోసం ఎంత ఖర్చు చేశారో ప్రభుత్వం ఇంతవరకూ వెల్లడించలేదు.
పాత నివేదిక ఏమైంది?
పాత నివేదిక ఎక్కడనే ప్రశ్నకు సమాధానం ఎవరికీ తెలియదు.
‘‘ఆ సర్వేపై కోర్టులో కేసులు ఉండటం వల్లనే బీఆర్ఎస్ పార్టీ బయట పెట్టలేదు. కోర్టులే సమాచారాన్ని గోప్యంగా ఉంచాలని చెప్పాయి. కానీ ఆ సమాచారాన్ని ప్రభుత్వం తన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కోసం విస్తృతంగా ఉపయోగించింది. దేశంలో ఎవరూ పెట్టనన్ని పథకాలు తెలంగాణలో ప్రారంభం కావడానికి అదే కారణం. గొర్లు, బర్లు నుంచి రైతు బంధు వరకూ పథకాలన్నీ ఆ సర్వే వల్లనే వచ్చాయి. దానివల్లే తెలంగాణలో తలసరి ఆదాయం పెరిగింది’’ అని బీఆర్ఎస్ నాయకుడు దాసోజు శ్రవణ్ బీబీసీతో చెప్పారు.
అప్పటి కేసీఆర్ ప్రభుత్వం కాని, ఇప్పటి రేవంత్ ప్రభుత్వం కాని ఆ సర్వే సమాచారం బయట పెట్టలేదు. గతంలో ఆ సర్వే గురించి ఎన్నోసార్లు మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పడు దాని గురించి మాట్లాడటం మానేసి, మళ్లీ అలాంటి సర్వేనే మొదలు పెట్టారు.
ఇదంతా ప్రజలను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న హడావుడి అని బీజేపీ నాయకులువిమర్శిస్తున్నారు.
‘‘కేసీఆర్ పాలనలో సమగ్ర సర్వే పేరుతో ఒకటి చేయించారు. ఆ రిపోర్ట్ ఏమైంది? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆ రిపోర్టును బయటపెట్టవచ్చు కదా. ఒక రిపోర్ట్ ఉండగా మళ్లీ బీసీ గణన ఎందుకు, కులాలు మారతాయా? ఇదంతా టైమ్ పాస్ వ్యవహారం’’ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు .

ఫొటో సోర్స్, Anumula Revanth Reddy/FB
‘బీసీలకు న్యాయం చేస్తాం’
సర్వే విషయంలో ఎన్ని విమర్శలు వచ్చినా కాంగ్రెస్ మాత్రం ముందుకు వెళ్ళాలని నిర్ణయించింది. అంతే కాదు, ప్రభుత్వ కార్యక్రమం అయినప్పటికీ, పార్టీ పరంగా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని పనిచేయడం ప్రారంభించింది. స్వయంగా రాహుల్ గాంధీ హైదరాబాద్ వచ్చి, ఈ కార్యక్రమంపై దేశవ్యాప్తంగా చర్చ జరిగేలా చేశారు.
ప్రభుత్వ విధానాల కోసమే సర్వే అని అప్పట్లో కేసీఆర్ చెబితే, స్థానిక సంస్థల రిజర్వేషన్లు తేల్చడం కోసం సర్వే అని ఇప్పుడు రేవంత్ చెబుతున్నారు.
స్థానిక సంస్థల రిజర్వేషన్లపై హైకోర్టు కేసులు, గతంలో దీనిపై కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, జాతీయ స్థాయిలో కులగణనపై కాంగ్రెస్ పార్టీ విధానం అన్నీ కలగలసి కొత్త సర్వే ప్రారంభించేలా చేశాయి.
‘‘సామాజిక, ఆర్ధిక, రాజకీయ, విద్య, ఉద్యోగ, ఉపాధి, కుల గణన సర్వే ప్రభుత్వం బాధ్యతగా భావించింది.మా చిత్తశుద్ధికి ఇది నిదర్శనం. దేశానికి రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను అమలు చేయడం మన కర్తవ్యం. కులగణన పూర్తి చేసి బీసీలకు న్యాయంగా అందాల్సిన రిజర్వేషన్లు అందిస్తాం. కులగణనను 2025 జనగణనలో పరిగణనలోకి తీసుకోవాలని ఈ వేదికపై తీర్మానం చేస్తున్నాం’’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
'వలసలపై సమాచారం లేదు'
‘‘గతంలో చేసిన సర్వేని ఈ ప్రభుత్వం వాడుకోవచ్చు. కానీ అలా చేస్తే కేసీఆర్‌కు పేరు వస్తుందని రేవంత్ భయం. రిజర్వేషన్ కేసుల విషయంలో కోర్టులకు కేసీఆర్ చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే డేటా ఇస్తే సరిపోతుంది. కానీ కేసీఆర్ హయాంలో వచ్చిన డేటా ఆధారంగా తాను నిర్ణయాలు తీసుకోకూడదన్న కారణంతోనే కొత్త సర్వే చేపట్టారు. ఈ సర్వే లోపభూయిష్టమైనది. ఇది కోర్టుల్లో నిలబడని సర్వే’’ అని దాసోజు శ్రవణ్ ఆరోపించారు.
‘‘రేపు కోర్టులో కేసు వేస్తే ఈ సర్వే ఫలితాలు కూడా కోల్డ్ స్టోరేజీలో పెట్టవలసి వస్తుంది. 1930ల నాటి కుల గణన ఆధారంగా బీసీ రిజర్వేషన్ 27 శాతం అని 1990లలో మండల్ కమిషన్ ఖరారు చేసిందని, అదేవిధంగా 2014 లెక్కల ఆధారంగా 2024లో రిజర్వేషన్లు ఖరారు చేయలేరా? ఇది కేవలం కంటి తుడుపు సర్వే. బీసీలను మభ్య పెట్టడానికి తప్ప, వారికి లాభం చేకూర్చడానికి కాదు’’ అన్నారు శ్రవణ్.
ఈ తాజా సర్వేకు కూడా కోర్టు తీర్పు ముప్పు ఉందని, లీగల్‌గా అంత పకడ్బందీగా లేదని బీజేపీ నాయకులు కూడా అంటున్నారు.
‘‘గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ కుటుంబానికి ప్రయోజనం చేకూరేలా సమగ్ర కుటుంబ సర్వే పేరిట వివరాలు సేకరించారు. ఆ వివరాలు నాడు కేసీఆర్ బయటపెట్టలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కుటుంబానికి ప్రయోజనం చేకూర్చేందుకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాత్రమే సంక్షేమ పథకాలు వర్తింపజేసేలా సర్వే చేపడుతున్నట్లుగా కనిపిస్తోంది. కుల గణన సర్వే రిపోర్టుకు సంబంధించి కోర్టులో ఇబ్బందులు తలెత్తితే దోషులు కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి మాత్రమే’’ అని బీజేపీ నాయకుడు కాసం వేంకటేశ్వర్లు అన్నారు.
అయితే బీసీల సామాజిక స్థితిని అంచనా వేయడంలో ఈ రెండూ సర్వేలూ వృథా ప్రయాసే అంటున్నారు విశ్లేషకులు.
‘‘బీఆర్ఎస్ సర్వే సమాచారం బయట పెట్టకపోవడానికి హైకోర్టు కేసు ఒక సాకు మాత్రమే, అనధికారికంగా ఆ సమాచారం చాలా మందికి ఇచ్చారు. పైగా అది అశాస్త్రీయ సమాచారం. ఇక రేవంత్ చేపడుతున్న సర్వేలో ప్రశ్నలు కూడా అశాస్త్రీయమే. బీసీల్లో ఏ తరం వారు ఎందరు చదువుకున్నారు? అనే సమాచారం అందులో లేదు. ఎందరు వలస పోతున్నారు అనే సమాచారం కూడా అందులో లేదు. హడావుడిగా చేస్తున్నారు. ఈ రెండు సర్వేలతో బీసీల నిజమైన స్థితిగతులు తేలవు. ఇందులో ఉపకులం ప్రస్తావన లేదు. రాహుల్ చెప్పారని చేస్తున్నారు తప్ప రేవంత్‌కి చిత్తశుద్ధి లేదు’’ అని సీనియర్ పాత్రికేయుడు దుర్గం రవీందర్ బీబీసీతో అన్నారు .
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














