డాల్ఫిన్లు: సముద్రంలో మత్స్యకారుల వేటకు ఎలా సాయపడుతున్నాయంటే..

డాల్ఫిన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గుజరాత్ మత్స్యకారులు డాల్ఫిన్‌లను పవిత్రంగా భావిస్తారు
    • రచయిత, లక్ష్మీ పటేల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

గుజరాత్‌లో కచ్ నుంచి భావ్‌నగర్ వరకు ఉన్న తీరాన్ని 'డాల్ఫిన్ల నిలయం' అని పిలుస్తారు. గుజరాత్‌లో డాల్ఫిన్ల సంఖ్య పెరిగిందని అక్కడి ప్రభుత్వం తెలిపింది.

సముద్రపు లోతుల్లో మత్స్యకారులకు చేపలను వేటాడేందుకు 'డాల్ఫిన్‌లు సాయంగా నిలుస్తాయి'. అందువల్ల, గుజరాత్ మత్స్యకారులు డాల్ఫిన్‌ల‌ను పట్టుకోవడం, హాని చేయడం లాంటి పనులు చేయరు. వాటిని పవిత్రంగా భావిస్తారు.

గుజరాత్ అటవీ శాఖ '2024 డాల్ఫిన్ సర్వే' డేటా ప్రకారం.. 4,087 చదరపు కిలోమీటర్ల తీర ప్రాంతంలో 680 డాల్ఫిన్లను గుర్తించారు. హిందూ మహాసముద్ర హంప్‌బ్యాక్ డాల్ఫిన్‌లు గుజరాత్ తీరంలో కూడా కనిపిస్తాయి.

డాల్ఫిన్‌ల సంఖ్యను పెంచేందుకు, మత్స్యకారులకు అవగాహన కల్పించడంతో సహా గుజరాత్ అటవీ శాఖ అనేక కార్యక్రమాలు చేపట్టింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
చేపల వేట

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, డాల్ఫిన్లు ఉన్న చోట వల వేస్తే బోలెడు చేపలు పడతాయి

డాల్ఫిన్లు ఎలా సాయపడతాయి?

మత్స్య పరిశ్రమలో ‘దర్యాలాల్ బోట్ అసోసియేషన్' ప్రెసిడెంట్ జెతాబాయ్ గోసియ 35 సంవత్సరాలుగా ఉన్నారు.

బీబీసీతో మాట్లాడిన జెతాబాయ్ "డాల్ఫిన్‌లను మత్స్యకారులు ఎంతో గౌరవిస్తారు. వారు సముద్రంలో చేపల వేటకు వెళ్లినప్పుడు డాల్ఫిన్‌లు చాలా ఉపయోగపడతాయి. డాల్ఫిన్‌లు ఒంటరిగా ప్రయాణించవు" అన్నారు.

"ఇతర చేపలు డాల్ఫిన్‌లతో కలిసి గుంపులుగా ప్రయాణిస్తాయి. కానీ, ఆ చేపలు సముద్రం ఉపరితలంపై కనిపించవు. డాల్ఫిన్లు ఆడుతూ సముద్ర ఉపరితలంపై దూకడం కనిపిస్తుంది. అక్కడ మత్స్యకారులు వలలు వేస్తారు. దీంతో ఎక్కువ చేపలు పడతాయి" అని జెతాబాయ్ చెప్పారు.

"ట్యూనా చేపలు (ట్యూనా) 50 నుంచి 60 కిలోల వరకు ఉంటాయి. ఆ చేపలు డాల్ఫిన్ల చుట్టూ తిరుగుతాయి" అని అన్నారు.

మత్స్యకారులు డాల్ఫిన్లతో జాగ్రత్తగా ఉంటారు. డాల్ఫిన్‌లకు పెద్ద రెక్కలు ఉంటాయి. అవి పడవకు తగిలితే, పెద్ద నష్టం జరుగుతుంది.

‘‘మాకు డాల్ఫిన్‌లంటే చాలా ఇష్టం. ప్రభుత్వం నిషేధం విధించక ముందు కూడా వాటిని పట్టుకోలేదు. పొరపాటున వలల్లో చిక్కుకున్నా వదిలేస్తాం. సముద్రంలో డాల్ఫిన్‌లు మాకు చాలా ముఖ్యం" అని సముద్రంలో చేపల వేటకు వెళ్లే మనుబాయి తాండెల్ చెప్పారు.

డాల్ఫిన్ చిత్రం.

ఫొటో సోర్స్, Gujarat government

ఫొటో క్యాప్షన్, డాల్ఫిన్ సర్వే సందర్భంగా గుజరాత్ అటవీ శాఖ బృందం తీసిన చిత్రం

ఎక్కడెక్కడ ఎన్నెన్ని డాల్ఫిన్లు ఉన్నాయి?

"కచ్ సముద్ర ప్రాంతంలో ఎక్కువగా లోతు ఉండదు. దీని కారణంగా డాల్ఫిన్‌లను వేటాడే పెద్ద చేపలు అక్కడికి రావు. అందువల్ల డాల్ఫిన్ల పునరుత్పత్తికి, వాటి పెంపకానికి ఈ ప్రాంతం అనుకూలంగా ఉంది" అని కచ్ వెస్ట్ డివిజన్ డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ యువరాజ్ సింగ్ ఝాలా బీబీసీతో అన్నారు.

డాల్ఫిన్‌లను సంరక్షించాలని, వాటి సంఖ్యను పెంచాలని అటవీశాఖ ప్రజలకు అవగాహన కల్పించిందని, వివిధ రకాల ప్రయత్నాల వల్ల డాల్ఫిన్‌ల సంఖ్య క్రమంగా పెరుగుతోందని ఆయన అన్నారు.

గుజరాత్ రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ ప్రెస్ నోట్‌లో అందించిన సమాచారం ప్రకారం.. సదరన్ గల్ఫ్ ఆఫ్ కచ్ భాగంలోని మెరైన్ నేషనల్ పార్క్, మెరైన్ అభయారణ్యంలోని 1,384 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో గరిష్ఠంగా 498 డాల్ఫిన్లు ఉన్నాయి. కచ్, ఓఖా నుంచి నవల్ఖి వరకు ఇవి విస్తరించి ఉన్నాయి.

గల్ఫ్ ఆఫ్ కచ్ ఉత్తర ప్రాంతంలో కచ్ సర్కిల్ పరిధిలోని 1,821 చదరపు కిలోమీటర్లలో 168 డాల్ఫిన్‌లు, భావ్‌నగర్‌లోని 494 చదరపు కిలోమీటర్ల తీరప్రాంతంలో 10 డాల్ఫిన్లు, 388 చదరపు కిలోమీటర్ల మోర్బీలో 4 డాల్ఫిన్‌లు కనిపిస్తుంటాయి. ఈ విధంగా మొత్తం 4,087 చదరపు కిలోమీటర్ల సముద్ర ప్రాంతంలో దాదాపు 680 డాల్ఫిన్‌లు కనిపిస్తాయి.

జాతీయ జలచరం

గుజరాత్ అటవీ, పర్యావరణ మంత్రి ముఖేష్ పటేల్ డాల్ఫిన్ల గురించి మరిన్ని వివరాలను తెలియజేస్తూ “హిందూ మహాసముద్రం హంప్‌బ్యాక్ డాల్ఫిన్లు గుజరాత్ తీరప్రాంత జలాల్లో కనిపిస్తాయి. డాల్ఫిన్లకు ఎక్కువగా స్నేహపూర్వక స్వభావం ఉంటుంది. తరచుగా అలల్లోకి దూకడం, ఆడుకోవడం కనిపిస్తుంది. దాని ఆకర్షణీయమైన శరీరం, 'సీసా' ఆకారంలో ఉన్న నోరు దానిని సులభంగా గుర్తించేలా చేస్తుంది’’ అని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం 2009 అక్టోబర్ 5న డాల్ఫిన్‌ను భారతదేశపు 'జాతీయ జలచరం'గా ప్రకటించింది.

“సముద్రంలో డాల్ఫిన్లను వెంబడిస్తాం. అవి బయటకు రాగానే ఇతర చేపల కోసం వల వేస్తాం. ట్యూనా చేపలు ఈ ఉచ్చులో పడతాయి’’ అని 'వెరావల్ బిడియా గర్వ సమాజ్ బోట్ అసోసియేషన్' అధ్యక్షుడు రమేష్‌భాయ్ దాల్కీ బీబీసీతో చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)