మందు కొడితే ప్రమాదమేనా? మితంగా తాగితే ఏమీ కాదన్న మాట నిజం కాదా?

ఫొటో సోర్స్, Getty Images
- కొద్దిపాటి మద్యం తీసుకోవడం కూడా ఆరోగ్యానికి హానికరమే.
- ఆరోగ్యానికి చేటు చేయని మద్యం అంటూ ఏదీ లేదు.
- మొదటి చుక్కనుంచే ఆరోగ్యం చెడిపోవడం మొదలవుతుంది.
- మద్యం తాగేవాళ్ల ఆయుర్దాయం క్రమంగా తగ్గిపోతుంటుంది.
- మద్యం మానేయాలనుకోవడం మంచి నిర్ణయం
- మందు తాగడం మానేయలేనివాళ్లు జాగ్రత్తగా వ్యవహరించాలి.
ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో మద్యం లేకుండా చేసుకునే పార్టీ చాలామందికి అసంపూర్ణంగా అనిపిస్తాయి. కొందరికి ఒక గ్లాసు వైన్ తాగడం అపరిచితులతో సంభాషణను ప్రారంభించడానికి గొప్ప మార్గం.
ఆల్కహాల్ అనేది సామాజికంగా కలిసిపోవడానికి ఒక సాధనంగా ఉపయోగపడుతోంది.
రెడ్ వైన్ వంటి కొన్ని మద్యపానీయాలను మోడరేట్(మితం)గా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని గతంలో చేసిన కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి.
కానీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం మీ ఆరోగ్యానికి సురక్షితమైన మద్యం అంటూ ఏదీ లేదని స్పష్టం చేసింది.
మద్యం సేవించడం వల్ల కలిగే లాభనష్టాలపై బీబీసీ కథనం.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో సోర్స్, Getty Images
క్యాన్సర్, మరణాలు
డబ్ల్యూహెచ్ఓ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం...మద్యపానం ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి 26 లక్షల మరణాలకు కారణమవుతోంది.
పేగు, రొమ్ము క్యాన్సర్ సహా కనీసం ఏడు రకాల క్యాన్సర్‌లకు మద్యమే కారణం.
1.5 లీటర్ల కంటే తక్కువ వైన్ లేదా 3.5 లీటర్ల కంటే తక్కువ బీర్ లేదా 450 మిల్లీ లీటర్ల కంటే తక్కువ స్పిరిట్‌ల శాతం ఉండే మద్యాన్ని అప్పుడప్పుడు మాత్రమే సేవించినా కూడా ప్రమాదకరమని డబ్ల్యూహెచ్ఓ చేసిన ఒక వివరణాత్మక అధ్యయనం కనుగొంది.
ఆల్కహాల్‌ని పరిమిత మొత్తంలో (మోడరేట్‌గా) తీసుకుంటే ఆరోగ్యానికి ఏమీకాదనడానికి
ఆధారాల్లేవని తేల్చి చెప్పింది.
‘‘మద్యం సేవించేవారి ఆరోగ్యం చెడిపోవడం మొదటి మద్యం చుక్క తాగినప్పటి నుంచే మొదలవుతుంది.’’ అని డబ్ల్యూహెచ్ఓ కొత్త మార్గదర్శకాలు చెబుతున్నాయి.
వినియోగంలో తగ్గుదల
ప్రపంచవ్యాప్తంగా తలసరి మద్యం వినియోగం 2010లో 5.7లీటర్ల నుండి 2019లో 5.5 లీటర్లకు కొద్దిగా తగ్గింది. పురుషుల్లో ఎక్కువగా మద్యం సేవించేవారు, అప్పుడప్పుడూ సేవించేవారితో కలిపి సగటున 8.2 లీటర్ల మద్యాన్ని సేవిస్తున్నారు.
ఒక సంవత్సరంలో మహిళలు 2.2 లీటర్ల మద్యాన్ని పుచ్చుకుంటారని డబ్ల్యూహెచ్ఓ డేటా వెల్లడిస్తోంది.
ఇంగ్లండ్‌లోని బెర్క్‌షైర్‌లో నివసిస్తున్న 44 ఏళ్ల అనా టెయిట్ వంటి కొందరు మద్య పానానికి పూర్తిగా దూరమయ్యారు.
"నేను బాగా తాగుతానని చెప్పను. కానీ ప్రతి శుక్రవారం చాలా ఎక్కువే తాగుతాను. పని తర్వాత రెండు బీర్లు, రెండు జిన్‌లు, ఆపై నా భర్తతో వైన్ బాటిల్‌ను పంచుకోవడానికి ఎదురు చూసేదాన్ని" అని టెయిట్ అన్నారు.
శనివారం కూడా అదే పద్ధతి పునరావృతమైంది. గురు, ఆదివారాలు కూడా తాను తాగుతున్నట్లు టెయిట్ గ్రహించారు. అయితే, ఈ సంవత్సరం ప్రారంభంలో మారథాన్ కోసం ప్రాక్టీస్ చేయడం ప్రారంభించారామె. మద్యం అలవాటును మానేయాలని ఆమె కోచ్ చెప్పారు. ఆమె భర్త కూడా ఎనర్జీ మెరుగుపడడం కోసం శిక్షణ పొందుతున్నారు. దాంతో ఇద్దరూ మద్యపానీయాలు సేవించడం తగ్గించారు.
“ఇది చాలా పెద్ద మార్పు. దాన్ని నేను బలమైనదిగా భావిస్తున్నాను" అని టెయిట్ అన్నారు.
అయితే, ఈ విషయం విన్న వారి స్నేహితులు కాస్త నిరాశ చెందారు.
జర్మనీలోని బవేరియాకు చెందిన 22 ఏళ్ల అమేలీ హౌన్‌స్టెయిన్‌కు మద్యం అలవాటు మానేయడంలో స్నేహితులు సాయం చేశారు.
‘‘మద్యం సేవించినప్పుడు పార్టీని ఎంజాయ్ చేయలేకపోతున్నాని నాకు అర్ధమయ్యింది’’ అని హౌన్‌స్టెయిన్ అన్నారు.
శనివారం పార్టీ చేసుకుని ఆదివారం ఉదయమే లేచాక రాత్రి ఎలా ప్రవర్తించామో గుర్తులేకుండా, తలంతా భారంగా ఉండడం నచ్చడం లేదంటారు హౌన్ స్టెయిన్.
తను తీసుకున్న నిర్ణయంపట్ల చాలా సంతోషంగా ఉన్నారు హౌన్‌స్టెయిన్.

ఫొటో సోర్స్, Getty Images
సైన్స్ తప్పు చేసిందా?
ఈ ఇద్దరు మహిళల అనుభవం మద్యపానాన్ని విడిచిపెట్టడం వల్ల చేకూరే ప్రయోజనాన్ని స్పష్టం చేస్తోంది.
కెనెడియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సబ్‌స్టాన్స్ యూజ్ రీసెర్చ్ (సీఐఎస్‌యుఆర్) డైరెక్టర్ డాక్టర్ టిమ్ స్టాక్‌వెల్ కూడా డబ్ల్యూహెచ్ఓ హెచ్చరికతో ఏకీభవిస్తున్నారు.
"మద్యం కచ్చితంగా ప్రమాదకర పదార్థం. దానిని తాగడం మొదలుపెట్టిన మరుక్షణం నుంచే మీ ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది" అని ఆయన అన్నారు.
తక్కువ స్థాయిలో మద్య సేవించడానికి, మరణాలకు గల సంబంధాన్ని కనుక్కోవడానికి ఆయన నూట ఏడు సైంటిఫిక్ రీసెర్చ్ పేపర్లను విశ్లేషించారు.
వందమందిలో ఒకరు దీనివల్ల చనిపోతే దానిని మోడరేట్‌గా భావించవచ్చని, అదే వెయ్యిమందిలో ఒకరు చనిపోతే దానిని లోరిస్క్‌గా చెప్పాలని బ్రిటీష్ మెడికల్ జర్నల్ చెబుతోంది.
లో రిస్క్ మద్యపానం, మోడరేట్ మద్యపానం అనేది ఒక్కో దేశంలో ఒక్కో విధంగా ఉంటుంది.
వారానికి పద్నాలుగు యూనిట్ల కంటే ఎక్కువ తాగకూడదని యూకే ప్రభుత్వం చెబుతోంది. అంటే ఆరు మీడియం సైజు గ్లాసుల వైన్ లేదా 500 మిల్లీ లీటర్ల కన్నా తక్కువ బీర్ అన్నమాట.
మోడరేట్ మద్యపానం మంచిదనే ఆలోచన ఒక పేలవమైన పరిశోధనా విధానం కారణంగా పుట్టుకొచ్చిందని స్టాక్‌వెల్ అంటారు.
‘‘ఆ పరిశోధన కోసం వారు ఉపయోగించిన ప్రశ్నలు ఆధునికమైనవి కావు. గతంలో ఉన్న మద్యపాన సేవనం అలవాటు గురించి పరిశోధకులు అస్సలు ప్రశ్నలు అడగలేదు. కొన్ని కీలకమైన అంశాలను వదిలేశారు’’ అని స్టాక్ వెల్ అన్నారు.
"సాధారణంగా మితమైన మద్యపానం చేసేవారు మంచి ఆదాయాన్ని కలిగి ఉంటారు. మెరుగైన ఆహారం తీసుకుంటారు. వ్యాయామం, ఆరోగ్య సంరక్షణపై దృష్టి పెడతారు. వారికి దృఢమైన దంతాలు, సన్నని నడుము ఉంటాయి" అని స్టాక్‌వెల్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో సోర్స్, Getty Images
లాభనష్టాలు
కానీ మద్యంసేవించడం వల్ల కలిగే పరిణామాలు ఆందోళన కలిగిస్తాయని చాలామంది ఆలోచించరు.
"రోజుకు ఒకటి, రెండు పానీయాలు తాగడం వల్ల కలిగే నష్టాలను అర్థం చేసుకోవడానికే చాలామంది ఎందుకు ప్రయత్నిస్తున్నారో నాకు నిజంగా అర్థం కావడంలేదు’’ అని ప్రొఫెసర్ సర్ డేవిడ్ స్పీగెల్ హాల్టే అన్నారు.
ఆయన బ్రిటన్‌లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో స్టాటిస్టిక్స్ ఎమెరిటస్ ప్రొఫెసర్. మద్యపానం వల్ల కలిగే ప్రమాదాన్ని ఎలా అర్థం చేసుకోవాలో ఆయన వివరించారు.
"మద్యం తాగాక కారు సరిగ్గా నడపలేము. అలాగే జీవితాన్ని కూడా. కానీ, తాగుడుకు దూరంగా ఉండమని ఎవరూ సిఫారసు చేయరు. మనం ఇందులోని లాభాలను అలాగే నష్టాలనూ చూడాలి.’’ అని డేవిడ్ అన్నారు.
"మద్యపానం వల్ల కలిగే మత్తులో మునిగి తేలడానికి చాలామంది ఇష్టపడతారు. దీనిని అందరూ అంగీకరిస్తారని నేను అనుకుంటున్నా’’ అన్నారాయన.
తాను మద్యపానానికి అనుకూలం కాదని, అలాగని వ్యతిరేకం కాదని చెబుతూ, మితంగా మద్యపానం సేవించడాన్ని తాను ఎందుకు ఇష్టపడతారో బీబీసీకి వివరించారు పీగెల్ హాల్టే.
"మద్యపానం వల్ల అతి పెద్ద ప్రమాదం అది సగటు ఆయుర్దాయాన్ని ఒక శాతం తగ్గిస్తుంది" అని ఆయన అన్నారు.
‘‘రోజూ కొద్దికొద్దిగా అలా యాభై సంవత్సరాల పాటు మద్యం సేవిస్తే, మీ జీవితంలో ఆరు నెలలు లేదా రోజుకు 15 నిమిషాల ఆయుర్దాయం తగ్గిపోతుంది." అని వివరించారు పీగెల్ హాల్టే.
బుద్ధి వికాసం కలిగిన వ్యక్తులు తమకు ఏది మంచిదో వారే నిర్ణయించుకోవాలని ఆయన సూచిస్తున్నారు.
డాక్టర్ టిమ్ స్టాక్‌వెల్ కూడా మద్యం తాగడాన్ని ఆస్వాదిస్తున్నారు. మద్యానికి దూరంగా ఉండమని చెప్పడం లేదు.
"మీరు మద్యం సేవించడం అద్భుతమైన ఆహ్లాదకరమైన విషయం అనుకుంటే, మీ ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపకుండా దానిని బ్యాలన్స్ చేసుకోవాలి" అని ఆయన అభిప్రాయపడ్డారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














