తెలంగాణలో బీసీ కులాలు ఏవి? ఏ కులం ఏ కేటగిరీలో ఉంది? బీసీ రిజర్వేషన్లలో మార్పులొస్తాయా

రాట్నంపై నూలు వడుకుతున్న మహిళ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రాట్నంపై నూలు వడుకుతున్న మహిళ
    • రచయిత, బోడ నవీన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా నవంబర్ 6 నుంచి సమగ్ర కులగణన కార్యక్రమాన్ని చేపట్టింది.

తెలంగాణ ప్రభుత్వం ‘సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే’ పేరుతో ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది.

ఇంతకూ ఈ కులగణన ఎందుకు? ఈ గణనతో బీసీలకు లాభమేంటి?

లెక్కల అనంతరం బీసీ రిజర్వేషన్లలో మార్పులు వస్తాయా?

అసలు బీసీ జాబితాలో ఉన్న కులాలు ఏవి?

బీసీ కులాల్లో ఏ కులం ఏ కేటగిరీలో ఉంది?

తెలంగాణ ప్రభుత్వం, కులగణన, బీసీలు, బీసీల్లో ఉపకులాలు, హైదరాబాద్, రేవంత్ రెడ్డి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తెలంగాణలో కులగణన చేస్తున్న ఎన్యూమరేటర్లు

కులాలవారీగా లెక్కలు లేవా?

భారత్‌లో మొదటిసారి బ్రిటిష్ కాలంలో 1931లో కులగణన జరిగింది. జనాభాలో ఏ కులం వారు ఎందరు ఉన్నారనే లెక్కలు సేకరించారు.

ప్రస్తుత బంగ్లాదేశ్, పాకిస్తాన్ ప్రాంతాలను కలిపి ఆ లెక్కలుంటాయి.

కానీ ఆ తరువాత ఏ ప్రభుత్వమూ కులాల వారీగా జనాభాను లెక్కించలేదు. 1941 జనాభా లెక్కల నుంచే కులాలవారీ వివరాల సేకరణ ఆపేశారు.

దేశంలో కులాల లెక్కలు చాలా రాష్ట్రాల్లో సమగ్రంగా లేవు.

కేవలం ఎస్సీ, ఎస్టీల లెక్కలు మాత్రమే జనాభా లెక్కలలో భాగంగా సేకరిస్తారు.

దీంతో విద్య, ఉపాధి, రాజకీయ, సామాజిక తదితర అంశాల్లో రిజర్వేషన్లు సక్రమంగా అమలు కావాలంటే ఏ కులం వారు ఎందరు ఉన్నారన్న లెక్క కచ్చితంగా తెలియాలన్న వాదనలున్నాయి. సంక్షేమ పథకాల అమలులోనూ కులానిది కీలక పాత్ర.

బీబీసీ న్యూస్ తెలుగు
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
గొర్రెల కాపరులు

ఫొటో సోర్స్, Getty Images

కులగణన కోసం బీసీలే ఎందుకు పట్టుపడుతున్నారు?

గతంలో మండల్ కమిషన్ దేశవ్యాప్తంగా ఉన్న 3,743 కులాలను బీసీ కులాలుగా తేల్చింది. దేశ జనాభాలో దాదాపు 52 శాతం బీసీలు ఉన్నట్లు అప్పుడు తేలింది.

కానీ వారికి అందులో దాదాపు సగం అంటే, 27 శాతం రిజర్వేషన్ ఇచ్చారు.

కేంద్ర ప్రభుత్వ ఓబీసీ రిజర్వేషన్ లిస్టులో దేశవ్యాప్తంగా 2,479 కులాలు ఉన్నాయి.

కేంద్రం కాకుండా రాష్ట్రాల స్థాయిలో బీసీ రిజర్వేషన్లు తీసుకునే కులాలు మొత్తం 3,150 ఉన్నాయి.

పార్లమెంటులో, రాష్ట్రాల అసెంబ్లీలలో ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే రిజర్వేషన్ ఉంది. బీసీలకు ప్రత్యేకంగా లేదు. బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఉంది.

కానీ, ఆ రిజర్వేషన్ల ఖరారు విషయంలోనూ తరచూ వివాదాలు తలెత్తుతుంటాయి.

ఈ క్రమంలో కులాల వారీగా లెక్క తేల్చేందుకే తెలంగాణ ప్రభుత్వం కులగణనను చేపట్టింది.

తెలంగాణ ప్రభుత్వం, కులగణన, బీసీలు, బీసీల్లో ఉపకులాలు, హైదరాబాద్, రేవంత్ రెడ్డి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కేంద్ర ప్రభుత్వ ఓబీసీ రిజర్వేషన్ లిస్టులో దేశవ్యాప్తంగా 2,479 కులాలు ఉన్నాయి.

తెలంగాణలో ఏఏ కులాలు బీసీలు

తెలంగాణలో బీసీల్లో అనేక కులాలు ఉన్నాయి. ఈ కులాలను బీసీ - ఏ, బీ, సీ, డీ, ఈ గ్రూపులుగా విభజించారు.

గ్రూప్-ఏ లో సంచార తెగలు తదితర కులాలకు చెందిన వాళ్లు ఉంటారు.

గ్రూప్-బీ లో వృత్తిపరమైన సమూహాలు ఉంటాయి.

గ్రూప్-సీ లో క్రైస్తవమతంలోకి మారిన ఎస్సీలు ఉంటారు.

గ్రూప్-డీ లో ఇతర కులాలు ఉన్నాయి.

గ్రూప్-ఈ లో సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన ముస్లిం కులాలు ఉంటాయి.

‘గ్రూప్-ఏ’లో ఉన్న కులాలు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత, బీసీ సంక్షేమశాఖ 2020లో అప్‌డేట్ చేసిన వివరాల ప్రకారం...

గ్రూప్-ఏలో 43, గ్రూప్-బీలో 23, గ్రూప్-సీలో ఒకటి, గ్రూప్-డీలో 31, గ్రూప్-ఈలో 14 కులాలు ఉన్నాయి. తెలంగాణలో మొత్తంగా వెనుకబడిన వర్గాల్లో 112 కులాలు ఉన్నాయి.

గ్రూప్-ఏ జాబితా:-

అగ్నికుల క్షత్రియ, పల్లి, వాడబలిజ, బెస్త, జాలరి, గంగవర్, గంగపుత్ర, గోండ్ల, వన్యకుల క్షత్రియ (వన్నెకాపు, వన్నెరెడ్డి, పల్లికాపు, పల్లిరెడ్డి), నెయ్యాల, పట్టపు.

బాల సంతు, బుడబుక్కల, రజక (చాకలి, వన్నార్), దాసరి, దొమ్మర, గంగిరెడ్లవారు, జంగం, జోగి, కాటిపాపల, మేదరి లేదా మహేంద్ర.

మొండిరేవు, మొండిబండ, బండ, నాయీ బ్రాహ్మణ (మంగలి), మంగల, భజంత్రీ.

వంశరాజ్/పిచ్చగుంట్ల, పాముల, పార్థి (నిర్షికరి), పంబల.

దమ్మలి/దమ్మల/దమ్ముల/దమల, పెద్దమ్మవాండ్లు, దేవరవాండ్లు, ఎల్లమ్మవాండ్లు, ముల్యాలమ్మవాండ్లు, వీరముష్టి (నెట్టికోటల), వీరభద్రేయ

వాల్మీకిబోయ (బోయ, బేదర్, కిరాటక, నిషాది, ఎల్లపి, ఎల్లపు, పెద్దబోయ).

గుడాల, కంజర-భట్ట, కెప్మారే లేదా రెడ్డిక, మొండిపట్ట, నొక్కర్, పారికి మొగ్గుల, యాట, చోపేమరి, కైకడి, జోషినందివాలాస్, వడ్డె (వడ్డీలు, వడ్డి, వడ్డెలు), మండుల, మెహతార్ (ముస్లిం), కునపులి, పాత్ర, పాల-ఈకరి, ఈకిల, వ్యాకుల, ఈకిరి, నాయనివారు, పాలేగారు, తోలగరి, కావలి, రాజన్నల, రాజన్నలు

బుక్కఅయ్యవారు, గోత్రాల, కాసికాపడి/కాసికాపుడి, సిద్ధుల

సిక్లిగర్/సైకల్‌గర్, పూసల.

కల్లుగీత కార్మికుడు

ఫొటో సోర్స్, Getty Images

‘గ్రూప్-బీ’లో కులాలు

ఆర్య క్షత్రియ, చిత్తారి, గినియార్, చిత్రకార, నఖాస్, దేవాంగ

గౌడ్ (ఈడిగ, గౌడ (గమ్మల), కలాలి, గుండ్ల, శ్రీశయన(సెగిడి))

దూదేకుల, లద్దాఫ్, పింజరి లేదా నూర్‌బాషా, గాండల తెలికుల, దేవతిలకుల, జాండ్ర, కుమ్మర లేదా కులాల, శాలివాహన.

కిరకలభక్తుల, కైకోలన్ లేదా కైకల (సేన్‌గుండం లేదా సేన్‌గుంతర్), కర్ణభక్తులు, కురుబ లేదా కురుమ, నీలకాంతి, పట్కర్ (ఖత్రి).

పెరిక (పెరిక బలిజ, పురగిరి క్షత్రియ), నెస్సి లేదా కుర్ణి, పద్మశాలి (శాలి, శాలివన్, పట్టుశాలి, సేనాపతులు, తొగట శాలి).

స్వాకులశాలి, తొగటి/ తొగటన వీరక్షత్రియ, స్వకులసాలి, తొగట, తొగటి లేదా తొగట వీర క్షత్రియ.

విశ్వబ్రాహ్మణ (ఔసుల, కంసాలి, కమ్మరి, కంచరి, వడ్ల (వడ్ర, వడ్రంగి, శిల్పి), విశ్వకర్మ.

లోధ్, లోధి, లోధా, బోంధిలి, ఆరె మరాఠీ, మరాఠా (బ్రాహ్మణేతరులు), ఆరాకలీస్, సురభి నాటకాలవాళ్లు.

నీలి, బుడుభుంజల/భుంజ్వా/భద్‌భుంజా.

‘గ్రూప్-సీ, గ్రూప్-డీ’లో ఉన్న కులాలు

క్రైస్తవ మతాన్ని స్వీకరించిన షెడ్యూల్‌ కులాలకు చెందినవారు.

గ్రూప్-డీ:

ఆరెకటిక, కటిక, ఆరె సూర్యవంశి, భట్రాజులు, చిప్పొళ్లు (మెర)

హట్కర్, జింగర్, కచి, సూర్యబలిజ (కళావంతుల) గానిక, కృష్ణ బలిజ (దాసరి, బుక్క), మాతుర, మాలి (బారె, బారియ, మారార్, తాంబోలి).

ముదిరాజ్, ముత్తరాశి, తెనుగోళ్లు, మున్నురు కాపు,

లక్కమారికాపు, పస్సి, రంగ్రేజ్/భవసారక్షత్రియ, సాధుచెట్టి, సాతాని (చాత్తాదశ్రీవైష్ణవ), తమ్మలి (బ్రాహ్మణేతరులు), శూద్రకులం.

ఉప్పర లేదా సగర, వంజర (వంజరి), యాదవ (గొల్ల), ఆరె, ఆరెవాళ్లు, ఆరోళ్లు, అయ్యరక, నగరలు, అఘముడియన్, అఘముడియర్, అఘముడి వెల్లాలర్, అఘముడి ముడాలియర్.

సొండి/సుండి, వరాల, శిష్టకరణం, వీరశైవలింగాయత్/ లింగబలిజ, కురిమి, అహిర్/అహిర్ యాదవ్, గోవిలి/గౌలి, కుల్లకడగి/కుల్లెకడిగి/చిట్టెపు, సారోల్లు/సోమ వంశ క్షిత్రయ

‘గ్రూప్-ఈ’లో ఉన్నదెవరు?

అచ్చుకట్టలవాండ్లు, సింగలి, సింగంవాళ్లు, అచ్చుపానీవాళ్లు, అచ్చుకట్టువారు, అచ్చుకట్లవాండ్లు

అత్తర్‌సాయెబులు, అత్తరోల్లు, ధోబీ ముస్లిం/ముస్లిం ధోబీ/ధోబీ ముసల్మాన్, తురకచాకల లేదా తురకసాకల, తురకచాకలి.

తుళుక్కవన్నన్, సాకల, సాకల లేదా చాకలస్, ముస్లిం రజక

ఫఖీర్, ఫఖీర్ బుడబుక్కి, ఘంటి ఫకీర్, ఘంటా ఫకీర్లు, తురక.

బుడబుక్కి, దర్వేష్, ఫకీర్, గారడీ ముస్లిం, గారడీ సాయెబులు, పాములవాళ్లు, కాణి/కట్టువాళ్లు, గారడోళ్లు, గారడిగా.

గోసంగి ముస్లిం, ఫకీర్ సాయెబులు, గుడ్డిఎలుగువాళ్లు, ఎలుగుబంటువాళ్లు, ముసల్మాన్ కీలు గుర్రాలవాళ్లు, హజ్జాం, నాయి, నాయి ముస్లిం, నవీద్.

లబ్బి, లబ్బై, లబ్బన్, లబ్బా, ఫకీర్ల, బోర్‌వాలే, డీరఫకీర్లు, బొంతల,

ఖురేషి, కురేషి/ఖురేషి, ఖసాబ్, మరాఠీ ఖసాబ్, ముస్లిం కటిక, ఖటిక్ ముస్లిం.

షేక్/ షైక్, సిద్ది, యాబా, హబ్షి, జాసి, తురకకాశ, కక్కుకొట్టే జింకసాయెబులు, చక్కిటకానేవాలే, తెరుగాడుగొంతలవారు, తిరుగటిగంట్ల, పత్థర్‌పోడ్లు, చక్కెటకారే, తురకకాశ.

నోట్ : పైన పేర్కొన్న కొన్ని కులాలు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వెనుకబడిన తరగతులుగా గుర్తించారు.

తెలంగాణ ప్రభుత్వం, కులగణన, బీసీలు, బీసీల్లో ఉపకులాలు, హైదరాబాద్, రేవంత్ రెడ్డి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తెలంగాణలో బీసీలను బీసీ - ఏ, బీ, సీ, డీ, ఈ గ్రూపులుగా విభజించారు.

కులగణన తరువాత రిజర్వేషన్లలో మార్పులు వస్తాయా?

ప్రస్తుతం తెలంగాణలో బీసీలకు 29శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నారు. గ్రూప్‌-ఏ 7 శాతం, గ్రూప్‌-బీ 10శాతం, గ్రూప్‌-సీ 1 శాతం, గ్రూప్-డీ 7 శాతం, గ్రూప్-ఈ 4శాతంగా కేటాయించారు.

ప్రస్తుత కులగణన తరువాత ఆయా కులాల సామాజిక, ఆర్థిక, జనాభా, విద్య, ఉపాధి తదితర అంశాలను బేరీజు వేసుకున్న తరువాత ఈ రిజర్వేషన్లలో రాష్ట్ర సర్కార్ మార్పులు తీసుకువచ్చే అవకాశం ఉంది.

ఇప్పటికే స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసింది. దీనికి చైర్మన్‌గా విశ్రాంత ఐఏఎస్ అధికారి బూసాని వెంకటేశ్వరరావును నియమించింది.

స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల్లో భాగంగా చెప్పింది. కులగణన తరువాత ఏం చేస్తారనేది వేచి చూడాలి.

అంతేకాదు, ఆయా కులాల జీవన స్థితిగతుల ఆధారంగా ఒక గ్రూప్‌లో ఉన్న కులాలను ఇంకొక గ్రూప్‌లోకి కూడా మార్చే అవకాశం ఉంది. బీసీ కమిషన్ సూచనల మేరకు ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంటుంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)