ఇస్రో: ప్రపంచదేశాల కంటే తక్కువ ఖర్చుతో భారత్ ఇక్కడ ఎలా ప్రయోగాలు చేయగలుగుతోంది?
- అంతరిక్ష ప్రయోగాల కోసం అతి పెద్ద బడ్జెట్‌ను ప్రకటించిన భారత్
- అయినా, మిగతా దేశాలతో పోలిస్తే ఈ బడ్జెట్ తక్కువే
- తక్కువ ఖర్చుతో భారత్ ప్రయోగాలు చేయడంపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి
- చంద్రయాన్-3 పంపిన చిత్రాలను ఆసక్తిగా గమనిస్తున్న పరిశోధకులు
- ఈ ఏడాది ఇస్రో బడ్జెట్ రూ.13 వేల కోట్లు మాత్రమే.
- కానీ, నాసా బడ్జెట్ రూ. 2.41 లక్షల కోట్లు
- ఆది నుంచి తక్కువ ఖర్చుతో ప్రయోగాలవైపు భారత్ మొగ్గు
- ప్రపంచ దేశాలు సహకరించకపోవడంతో సొంత టెక్నాలజీని తయారు చేసుకున్న భారత్
- ప్రైవేట్ సంస్థలకు అవకాశమిస్తే ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుందంటున్న నిపుణులు
- రచయిత, గీతా పాండే
- హోదా, బీబీసీ ప్రతినిధి

ఫొటో సోర్స్, Isro
భారత్ ఇటీవల అంతరిక్ష ప్రయోగాల కోసం రూ. 22.7 వేల కోట్ల బడ్జెట్‌తో భారీ ప్రణాళికను ప్రకటించింది. దీనిలో చంద్రుడిపై జరిగే ప్రయోగంలో తదుపరి దశ, శుక్రుడి అధ్యయనానికి ఆర్బిటర్‌ను పంపడం, భారతీయ అంతరిక్ష కేంద్రం మొదటి భాగాన్ని నిర్మించడం, ఉపగ్రహాలను ప్రయోగించడానికి పునర్వినియోగ రాకెట్‌ను అభివృద్ధి చేయడం వంటివి ఉన్నాయి.
అంతరిక్ష ప్రాజెక్టుల కోసం ఒక్కసారి భారత్ కేటాయించిన అతి పెద్ద బడ్జెట్ ఇదే. కానీ, ఈ మిషన్లను పరిశీలిస్తే బడ్జెట్ చాలా తక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇవన్నీ జరిగితే ఇతర దేశాలతో పోల్చినప్పుడు మరోసారి తక్కువ బడ్జెట్‌లో అద్భుతమైన ఫలితాలను సాధించిన భారతీయ స్పేస్ ప్రోగ్రామ్‌గా ఇది నిలుస్తుంది.
అంతరిక్ష యాత్రలను భారత్ తక్కువ ఖర్చుతో నిర్వహిస్తుండటంపై ప్రపంచవ్యాప్తంగా నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) మంగళ్‌యాన్ ప్రాజెక్టును కేవలం రూ. 622 కోట్ల ఖర్చుతో చేయగలిగింది.
గత సంవత్సరం చంద్రయాన్-3 కోసం దాదాపు రూ. 630 కోట్లు ఖర్చు చేసింది. అప్పట్లో గ్రావిటీ అనే హాలీవుడ్ సినిమాకు ఇంతకన్నా ఎక్కువ బడ్జెట్ (రూ. 841 కోట్లు) పెట్టినట్లు ప్రచారం జరిగింది.
నాసా తయారు చేసిన మావెన్ ఆర్బిటర్ ఖరీదు సుమారు రూ. 4,800 కోట్లు. చంద్రయాన్-3 సక్సెస్‌ఫుల్ ల్యాండింగ్‌కు ముందు, క్రాష్ అయిన రష్యా లూనా-25 మిషన్ ఖర్చు దాదాపు రూ. 1,118 కోట్లు.
భారత్ చాలా తక్కువ ఖర్చుతోనే ఎంతో విలువైన వర్క్ చేస్తోందని శాస్త్రవేత్తలు అంటున్నారు. చంద్రునిపై నీటి జాడల కోసం చంద్రయాన్-1 చేపట్టగా, అంగారకుడి వాతావరణంలో మీథేన్‌ను మంగళ్‌యాన్ అధ్యయనం చేసింది. ఇక చంద్రయాన్-3 పంపిన చిత్రాలను, డేటాను అంతరిక్ష పరిశోధకులు నిశితంగా పరిశీలిస్తున్నారు.


ఫొటో సోర్స్, Screenshot from Doordarshan
ఇంత తక్కువ ఖర్చుతో ఎలా?
ఇస్రో పొదుపు విధానం 1960ల నాటిదని, ఆ సమయంలోనే శాస్త్రవేత్తలు అంతరిక్ష కార్యక్రమాన్ని ప్రభుత్వానికి ప్రతిపాదించారని రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి శిశిర్ కుమార్ దాస్ చెప్పారు. ఆయన ఇస్రో ఆర్థిక వ్యవహారాలను రెండు దశాబ్దాలకు పైగా పర్యవేక్షించారు.
బ్రిటీష్ పాలన నుంచి స్వాతంత్య్రం పొందిన భారత్ ఆ సమయంలో ప్రజలకు ఆహారం అందించడం, స్కూళ్లు, ఆసుపత్రులను నిర్మించడంలో బిజీగా ఉంది.
‘’అంతరిక్ష కార్యక్రమం ఖరీదైన వ్యవహారమనీ, పేద దేశానికి తగదనే వాదనలు సరైనవి కాదని ప్రభుత్వానికి ఇస్రో వ్యవస్థాపక శాస్త్రవేత్త విక్రమ్ సారాభాయ్ నచ్చజెప్పాల్సి వచ్చింది. ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు ఉపగ్రహాలు దోహదపడతాయని ఆయన ప్రభుత్వానికి చెప్పి ఒప్పించారు.’’ అని చెప్పారు దాస్.
దేశంలో వివిధ అవసరాలు, డిమాండ్ల దృష్ట్యా భారత అంతరిక్ష కార్యక్రమం పరిమిత బడ్జెట్‌లోనే పని చేయాల్సి వచ్చింది. 1960, 70ల నాటి ఫోటోలను చూస్తే, శాస్త్రవేత్తలు సైకిళ్లు, ఎద్దుల బండ్లపై రాకెట్లు, ఉపగ్రహాలను మోసుకెళుతుండటం గమనించవచ్చు.
అనేక విజయవంతమైన అంతరిక్ష యాత్రల తర్వాత కూడా ఇస్రో బడ్జెట్ తక్కువగానే ఉంది. ఈ సంవత్సరం భారత్ అంతరిక్ష కార్యక్రమాల బడ్జెట్ దాదాపు రూ.13 వేల కోట్లు కాగా, నాసా బడ్జెట్ దాదాపు రూ. 2.1 లక్ష కోట్లు.
ఇస్రో మిషన్లు చాలా తక్కువ ధరలో ఉండటానికి ఒక ప్రధాన కారణం వాటి టెక్నాలజీ, మెషినరీ అంతా భారత్‌లో తయారు కావడమేనని దాస్ తెలిపారు.

ఫొటో సోర్స్, Isro
కీలక మలుపు అదే..
1974లో భారత్ మొదటి అణు పరీక్ష చేసింది. దీంతో పాశ్చాత్య దేశాలు భారత్‌తో సాంకేతికతను పంచుకోవడాన్ని నిషేధించాయి. అయితే, ఈ నిషేధమే భారత అంతరిక్ష కార్యక్రమానికి సహాయపడింది.
"మన శాస్త్రవేత్తలు దీనిని సొంత టెక్నాలజీని సృష్టించేందుకు మంచి అవకాశంగా భావించారు" అని దాస్ చెప్పారు.
"అవసరమైన అన్ని పరికరాలను దేశంలో తయారు చేశారు. ఇక్కడ జీతాలు, లేబర్ ఖర్చులు అమెరికా లేదా యూరప్‌లతో పోలిస్తే చాలా తక్కువ" అని ఆయన అన్నారు.
"నాసా ప్రైవేట్ కంపెనీల ద్వారా ఉపగ్రహాలను తయారుచేస్తోంది. బీమా కూడా చేస్తుంది. ఇది వారి ఖర్చులను పెంచుతుంది.ఇస్రో అలా చేయదు.’’ అని సైన్స్ రచయిత పల్లవ బాగ్లా అన్నారు.
‘’ప్రయోగానికి ముందు మిషన్ టెస్టింగ్ కోసం నాసా ఇంజనీరింగ్ మోడల్స్ తయారు చేస్తుంటుంది. అయితే ఇస్రో కేవలం ఒకే మోడల్ తయారు చేస్తుంది. అది కూడా నేరుగా ఎగిరిపోయేదే. అయితే, ఇది చాలా రిస్క్. ఎందుకంటే ప్రయోగం విఫలమయ్యే అవకాశం కూడా ఉంది. అయితే ఇది ప్రభుత్వ కార్యక్రమం కాబట్టి ఇస్రో ఈ రిస్క్ తీసుకుంటుంది.’’ అని పల్లవ అన్నారు.
ఇస్రోలో తక్కువ మంది ఉద్యోగులు ఉన్నారని, తక్కువ జీతాలు చెల్లిస్తున్నారని ఇది భారతీయ ప్రాజెక్టులు ప్రపంచంతో పోటీ పడటంలో సహాయపడుతోందని మైలస్వామి అన్నాదురై చెప్పారు. ఆయన చంద్రయాన్ 1, 2, మార్స్ మిషన్లకు నాయకత్వం వహించారు.
తన దగ్గర పనిచేసిన వారు పని పట్ల మక్కువతో ఎక్కువ గంటలు పనిచేశారని, అదనపు జీతం కూడా తీసుకోలేదని అన్నాదురై అన్నారు. ప్రాజెక్టులకు బడ్జెట్ అంతగా లేకుంటే ఉద్యోగులను సృజనాత్మకంగా, కొత్త ఆలోచనలతో ముందుకు వచ్చేలా ప్రోత్సహిస్తామని చెప్పారు.
చంద్రయాన్-1 బడ్జెట్ దాదాపు రూ. 748 కోట్లు. ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఈ నిధులు సరిపోతాయి. కానీ తరువాత ప్రాజెక్టులో మూన్ ఇంపాక్ట్ ప్రోబ్‌ను చేర్చాలని నిర్ణయించుకున్నారు. అంటే రాకెట్‌లో అదనంగా 35 కిలోలు చేర్చడం. శాస్త్రవేత్తలకు అప్పుడు రెండు ఆప్షన్లు ఉన్నాయి. అదనపు బరువును మోయడానికి పెద్ద, ఖరీదైన రాకెట్‌ను ఉపయోగించడం లేదా తేలికగా చేయడానికి కొన్ని పరికరాలను తీసివేయడం.
‘’వారు రెండో ఆప్షన్ ఎంచుకున్నారు. థ్రస్టర్‌ల సంఖ్యను 16 నుంచి 8 కి తగ్గించారు. ప్రెజర్ ట్యాంకులు, బ్యాటరీలను రెండు నుంచి ఒకటికి తగ్గించారు’’ అని అన్నాదురై అన్నారు.
చంద్రయాన్-2 ఆలస్యం కావడంతో దాని కోసం రూపొందించిన హార్డ్‌వేర్‌లో చాలా భాగం మంగళ్‌యాన్ కోసం ఉపయోగించామని, అందుకే ఆ ప్రాజెక్టు ఖర్చు తక్కువైందని ఆయన తెలిపారు.
ఇంత తక్కువ ఖర్చుతో ప్రాజెక్టు పూర్తి చేయడం "అద్భుతమైన ఫీట్" అని బాగ్లా అన్నారు. అయితే, భారత్ తన అంతరిక్ష కార్యక్రమాలను విస్తరిస్తున్నందున ఖర్చులు పెరుగుతాయని ఆయన చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
చంద్రునిపైకి భారతీయులు
భారత్ ఇప్పుడు చిన్న రాకెట్ లాంచర్లను ఉపయోగిస్తుంది. ఎందుకంటే పెద్దవి తయారుచేయలేదు. అందుకే అవి గమ్యానికి చేరడానికి ఎక్కువ సమయం పడుతుంది.
చంద్రయాన్-3 ప్రయోగంలో అది చంద్రుని చేరుకోవడం కోసం భూమి చుట్టూ చాలాసార్లు కక్ష్యలో తిరిగింది. కాగా, రష్యా లూనా -25 మాత్రం భూ గురుత్వాకర్షణ నుంచి చాలా త్వరగా బయటకు వచ్చేసింది.
భారత్ 2040 నాటికి చంద్రునిపైకి వ్యోమగాములను పంపే యోచనలో ఉందని, వారు అక్కడికి వేగంగా చేరుకోవడానికి భారీ రాకెట్ అవసరమవుతుందని బాగ్లా పేర్కొన్నారు.
నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ (ఎన్జీఎల్వీ) అని పిలిచే ఈ కొత్త రాకెట్ పనిని ప్రభుత్వం ఇప్పటికే ఆమోదించింది. దీన్ని 2032 నాటికి సిద్ధం చేయాలి. ఈ కొత్త రాకెట్ మరింత బరువును మోసుకెళ్లగలదు, కానీ ఖరీదైనది కూడా.
అదనంగా ప్రైవేట్ కంపెనీలను ఆహ్వానిస్తూ భారత అంతరిక్ష రంగం తలుపులు తెరుస్తోందని, తర్వాత ఖర్చులు ఇంత తక్కువగా ఉండే అవకాశం లేదని బాగ్లా అభిప్రాయపడ్డారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














