స్పెయిన్ రాజుపై రాళ్లేసిన ప్రజలు

ఫొటో సోర్స్, Getty Images
- స్పెయిన్‌లోని వాలెన్సియాలో భీకర వరదలు
- 200 మందికి పైగా మృతి
- సహాయకచర్యలు చేపట్టేందుకు ఒక్కరోజే ముందుకొచ్చిన 15 వేల మంది వలంటీర్లు
- సహాయక చర్యల కోసం బలగాలను పెంచుతున్న ప్రభుత్వం
- వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన రాజుపై బురదకొట్టిన స్థానికులు
- రచయిత, మార్క్ లోవెన్, ఆండ్రే రోడెన్-పాల్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
వరదలతో జరిగిన పెను విధ్వంసంతో స్పెయిన్ ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు వచ్చిన రాజు ఫెలిపె 6కు వ్యతిరేకంగా ప్రజలు నినాదాలు చేశారు. ఓ వీధిలో నడుస్తూ వస్తున్న రాజుకు వ్యతిరేకంగా ఓ గుంపు ‘హంతకుడు’ అంటూ నినాదాలు చేసింది. కొందరు నిరసనకారులు రాజుపైకి కొన్ని వస్తువులను, బురదను విసిరారు. ఇవన్నీ వీడియోలలో కనిపించాయి. వరదలతో తీవ్ర ప్రభావితమైన వాలెన్సియాలోని పైపోర్టా పట్టణంలో ఈ ఘటన జరిగింది.
పైపోర్టా ప్రాంతంలో ఈ దాడి జరగడంతో మరో వరద ప్రభావిత ప్రాంతమైన చివాలో తమ పర్యటనను రాజు ఫెలిపే 6, రాణి లెటిజియా రద్దుచేసుకున్నారు.


ఫొటో సోర్స్, Getty Images
భీకర వరదలతో ప్రజల్లో పెరిగిన ఐక్యత, సహాయక చర్యల్లో వేలాదిమంది
స్పెయిన్‌లోని వాలెన్సియా నగరంలో పెను విధ్వంసం సృష్టించిన వరదలు అక్కడి ప్రజల్లో ఐక్యతను పెంచుతున్నాయి.
భారీ వరదలతో తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాలకు వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొంటామంటూ వేల మంది వలంటీర్లు సిటీ సెంటర్‌లోని మ్యూజియం బిల్డింగ్ వద్దకు చేరుకున్నారు.
బకెట్లు, ఆహారం, మంచినీరు వంటివి వరద ప్రభావిత ప్రాంతాలకు తీసుకెళ్లేందుకు అక్కడ వారు వేచిచూస్తున్నారు.
ఈ వారం ప్రారంభంలో స్పెయిన్‌లోని వాలెన్సియా నగరాన్ని వరద ముంచెత్తింది. ఈ వరద కారణంగా 200 మందికి పైగా మరణించగా, చాలా మంది గల్లంతయ్యారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాలు చేపట్టేందుకు ఒక్క రోజే 15 వేల మంది వలంటీర్లు ముందుకు వచ్చారని, ప్రభుత్వ సిబ్బంది సేవలు అందించలేకపోతున్న ప్రాంతాల్లో ప్రజలకు సాయం అందించేందుకు వీరు ముందుకొచ్చారని అధికారులు చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters
ముందస్తు హెచ్చరికలు చేయలేదని ఆగ్రహం
16 ఏళ్ల పెడ్రో ఫ్రాన్సిస్కో వరద బాధితులకు సాయం చేయడం కోసం తన తల్లిదండ్రులతో కలిసి నాలుగు గంటల పాటు క్యూలో వేచి ఉన్నారు.
తన స్నేహితురాలి తాతయ్య వరదలో కొట్టుకుపోయారని, ఇప్పటికీ ఆయన ఆచూకీ దొరకలేదని పెడ్రో ఫ్రాన్సిస్కో చెప్పారు.
‘‘మేం చేయగలిగినంత సాయం చేస్తాం’’ అని పెడ్రో అన్నారు. జరిగింది చూస్తే చాలా భయంగా ఉందన్నారు.
అలాగే, అదే క్యూ లైన్‌లో ఆస్కార్ మార్టినెజ్, ఆయన భార్య, కొడుకు వేచిచూస్తున్నారు.
‘‘నాకు కోపం వస్తోంది. ఇది తప్పించుకోలేని విషాదం. స్థానిక ప్రభుత్వాలు ఈ వరదలకు సంబంధించి ముందస్తుగా మాకు హెచ్చరికలు చేస్తే బాగుండేది’’ అని వారు అన్నారు.
ఈ వరదల్లో ఇప్పటివరకు 211 మంది చనిపోయినట్టు అధికారులు ధ్రువీకరించారు. ఈ మరణాల్లో అత్యధికం వాలెన్సియా, దాని పరిసర ప్రాంతాల్లోనే చోటు చేసుకున్నాయి.
మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు.
సోమవారం కురిసిన భారీ వర్షాలతో వరదలు విధ్వంసం సృష్టించాయి. వంతెనలు దెబ్బతిన్నాయి. ప్రజలకు ఆహారం, మంచినీరు దొరకని పరిస్థితులు ఏర్పడ్డాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
భద్రతా, అత్యవసర సేవల విభాగాలకు చెందిన వేల మంది సిబ్బంది వరద వల్ల పేరుకుపోయిన బురదను, శిథిలాలను తొలగించే పనుల్లో నిమగ్నమయ్యారు. బురద కింద చిక్కుకుపోయిన మృతదేహాలను వెలికితీస్తున్నారు.
యూరప్‌లో తీవ్రస్థాయిలో విధ్వంసం సృష్టించిన రెండో భీకర వరద ఇదేనని స్పానిష్ ప్రభుత్వం చెబుతోంది.

మూడు రోజులు బయటి ప్రపంచంతో సంబంధం లేదు
అంపారో ఎస్టేవె అనే యువతి వాలెన్సియాలోని తురియా నదిపై ఉన్న పాదచారుల వంతెనను దాటేటప్పుడు బీబీసీతో మాట్లాడారు.
వరదల కారణంగా రోడ్లన్నీ మూతపడటంతో తన సొంత పట్టణం పైపోర్టాకు నడుచుకుంటూ వెళ్లాలనుకున్నట్లు ఆమె చెప్పారు. తన పొరుగింటివారికి సాయం చేయాలనుకున్నట్లు తెలిపారు.
ఒక్కసారిగా వరదలు ముంచెత్తినప్పుడు, తన పక్కింటివారు ఎంత వీలైతే అంత వేగంగా పరిగెత్తమని తనకు చెప్పారని ఆమె గుర్తు చేసుకున్నారు.
వరద దూసుకొస్తుంటే, చాలా వేగంగా పెరుగెత్తి తప్పించుకున్నానని ఆమె తెలిపారు.
‘‘నీరు, కరెంటు, ఫోన్ సహా చేతిలో ఏమీ లేకుండా మూడు రోజుల పాటు గదిలోనే ఉండిపోయాను’’ అని ఆమె చెప్పారు.
అమ్మకు ఫోన్ చేసి తాను బాగానే ఉన్నానని చెప్పలేకపోయానని, తమకు తాగడానికి నీళ్లు, తినడానికి ఆహారం ఏమీ లేవన్నారు.
తమకు ఎవరూ సాయం చేయడం లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంపారో ప్రస్తుతం తన తాతయ్య వాళ్ల ఇంట్లో ఉంటున్నారు.

ఫొటో సోర్స్, Reuters
స్పెయిన్ చరిత్రలో అతిపెద్ద సహాయక ఆపరేషన్
వరద ముంచెత్తిన ప్రాంతంలో కొందరు దోపిడీలకు పాల్పడటంతో అభద్రత పెరిగిందని ప్రభుత్వం తెలిపింది. ఇలాంటి ఘటనలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షిస్తామని ప్రభుత్వం హెచ్చరించింది.
వాలెన్సియా నగర శివారు ప్రాంతమైన పికాన్యలో సృష్టించిన వరద బీభత్సం తనని పూర్తిగా నిరాశ్రయురాలిగా మార్చినట్లు అనిపించిందని ఒక దుకాణం యజమాని ఎమిలియా అన్నారు.
ఈ ప్రాంతంలో చాలా మంది సాయం కోసం ఎదురుచూస్తున్నారని ఆమె వార్తా సంస్థ రాయిటర్స్‌తో చెప్పారు. కనీసం తమ దుస్తులను కూడా ఉతుక్కోలేకపోతున్నామని, స్నానం చేయలేకపోతున్నామని అన్నారు.
సహాయక చర్యల కోసం బలగాలను పెంచుతున్నట్లు స్పెయిన్ ప్రధానమంత్రి పెడ్రో సాంచెజ్ ప్రకటించారు. గల్లంతైన వారి కోసం వెతికేందుకు 5 వేల మంది సిబ్బందిని వరద ప్రభావిత ప్రాంతాలకు పంపుతున్నట్లు తెలిపారు.
మట్టిని, బురదను తొలగించేందుకు మరో 2,500 మందిని పంపినట్లు చెప్పారు. స్పెయిన్‌లో సాయుధ దళాలు చేపట్టిన అతిపెద్ద ఆపరేషన్ ఇదేనన్నారు.

ఫొటో సోర్స్, Reuters
బురదతో నిండిపోయిన పట్టణాలు
మరో 5 వేల మంది పోలీసు అధికారులు, సివిల్ గార్డులను కూడా పంపుతామన్నారు.
వరదలో చిక్కుకుపోయిన 4,800 మందిని రక్షించామని, 30 వేల మందికి సాయం చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.
కానీ, వరదలకు ముందు హెచ్చరికలు సరిగ్గా చేయలేదని అధికారులపై ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి.
‘‘మేం అందిస్తున్న సేవలు సరిపోవడం లేదని తెలుసు. చాలా సమస్యలున్నాయి. పట్టణాలన్నీ బురదతో కొట్టుమిట్టాడుతున్నాయి. మృతదేహాల కోసం బంధువులు తీవ్రంగా గాలిస్తున్నారు. సహాయక చర్యలను మరింత మెరుగుపరచాల్సి ఉంది’’ అని సాంచెజ్ అన్నారు.
అదనపు సమాచారం వాలెన్సియా నుంచి బెథనీ బెల్ అందించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














