తమిళ నటి కస్తూరి హైదరాబాద్‌లో అరెస్ట్, అసలు వివాదం ఏంటి?

ఫొటో సోర్స్, FB/actresskasthuri
- రచయిత, గరికిపాటి ఉమాకాంత్
- హోదా, బీబీసీ కోసం
తమిళనటి కస్తూరిని చెన్నై పోలీసులు హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. గచ్చిబౌలిలో శనివారం (నవంబర్ 16) సాయంత్రం పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.
కొన్నిరోజుల కిందట తమిళనాడులో జరిగిన ఓ కార్యక్రమంలో తెలుగువారిని ఉద్దేశించి కస్తూరి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తమిళనాడులోని తెలుగు ప్రజలనుద్దేశించి ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
అయితే, డీఎంకే మద్దతుదారులు తన మాటలను వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని, తాను తెలుగువారి గురించి ఒక్కమాట కూడా తప్పుగా మాట్లాడలేదని కస్తూరి బీబీసీతో చెప్పారు.


ఫొటో సోర్స్, FB/actresskasthuri
కస్తూరి అసలేమన్నారు?
ఇటీవల తమిళనాడులోని బ్రాహ్మణ సంఘాల సమ్మేళనానికి హాజరైన సందర్భంగా ద్రావిడ వాదులను విమర్శిస్తూ తెలుగు వారి ప్రస్తావన తీసుకొచ్చారు కస్తూరి.
‘300 ఏళ్ల కిందట ఒక రాజు వద్ద అంతఃపుర మహిళలకు సేవ చేసేందుకు వచ్చిన తెలుగువాళ్లు.. ఇప్పుడు తమది కూడా తమిళ జాతేనని చెప్పుకుంటుంటే.. శతాబ్దాలకు పూర్వమే ఇక్కడకు వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదని చెప్పడానికి మీరెవరు?’’ అని పరోక్షంగా ద్రావిడవాదులను ఆమె ప్రశ్నించారు.
ప్రస్తుత తమిళనాడు సీఎం స్టాలిన్ కేబినెట్‌లో ఐదుగురు మంత్రులు తెలుగు మూలాలు ఉన్నవారేనని ఆమె అన్నారు.
’’ఇతరుల ఆస్తులను లూటీ చేయొద్దు, పరస్త్రీలపై మోజుపడొద్దు.. ఒకరి కంటే ఎక్కువ మందిని వివాహం చేసుకోవద్దు.. అని బ్రాహ్మణులు చెబుతున్నారు. అందుకే వారికి వ్యతిరేకంగా తమిళనాట ప్రచారం సాగుతోంది’’ అని కస్తూరి వ్యాఖ్యానించారు.
తమిళనాడు పాలకులు తెలుగు మాట్లాడే వారికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని కస్తూరి ఆరోపించారు.
కస్తూరి వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు కూడా ఆమె వ్యాఖ్యలను తప్పుబట్టారు.
అయితే, తాను తెలుగువారికి వ్యతిరేకంగా మాట్లాడలేదని, డీఎంకే అనుకూల వర్గాలు తన వ్యాఖ్యలను వక్రీకరించి ప్రచారం చేస్తున్నాయని కస్తూరి బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, FB/Bharatiya Janata Party
కస్తూరి వ్యాఖ్యలపై దుమారం..
కస్తూరి చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆమె వైఖరిని ఖండిస్తూ సోషల్ మీడియా హోరెత్తింది. ఆమె వ్యాఖ్యలను బీజేపీ తమిళనాడు ఇన్‌చార్జి పొంగులేటి సుధాకర్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు.
‘‘ఆమె ఏ ఉద్దేశంతో అన్నా సరే.. తెలుగు ప్రజలను కించపరిచే విధంగా ఆ వ్యాఖ్యలు ఉన్నాయి. వెంటనే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి’’ అని బీబీసీతో మాట్లాడుతూ డిమాండ్ చేశారు.
తమిళనాడులోని రెండు కోట్ల మంది తెలుగు ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా కస్తూరి వ్యాఖ్యలు ఉన్నాయని పొంగులేటి అభిప్రాయపడ్డారు.
‘‘డీఎంకేను విమర్శించే క్రమంలో తెలుగు ప్రజలను కించపరచకూడదు’’ అని ఆయన అన్నారు.
కస్తూరిపై చర్యలు తీసుకోవాలి: కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి
‘‘ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే నటి కస్తూరి, ఇప్పుడు ఏకంగా తెలుగు ప్రజలపై ఇంతటి దారుణమైన వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే ఆమెకు పిచ్చి పట్టిందేమోనని అనుమానంగా ఉంది’’ అని తమిళనాడు తెలుగు యువశక్తి సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు, సినీ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి విమర్శించారు.
ఆయన బీబీసీతో మాట్లాడుతూ.. కస్తూరిపై చర్యలు తీసుకోవాలని తమిళనాడు సీఎం స్టాలిన్‌కి లేఖ రాయడంతో పాటు ఆ రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
‘‘ఆంధ్ర ప్రాంతానికి చెందిన కరుణానిధి తంజావూరు రాజుల వద్ద పనిచేశారనే ప్రచారం ఉంది. ద్రావిడ సిద్ధాంత సృష్టికర్త పెరియార్ రామస్వామి తెలుగు వారనే వాదన ఉంది. ద్రావిడ సిద్ధాంతం వల్ల బ్రాహ్మణుల ఆధిపత్యం తగ్గిందనే అభిప్రాయాలున్నాయి. ఆమె విమర్శించాలనుకుంటే నేరుగా విమర్శిస్తే సరిపోయేది. కానీ, అక్కడి పార్టీలను విమర్శించే క్రమంలో ఆమె తెలుగువారందరిపై నీచమైన వ్యాఖ్యలు చేయడం దారుణం. ఆ పార్టీలతో వివాదముంటే సిద్ధాంతపరంగా పోరాడాలి తప్ప, ఇలా జాతుల మధ్య వైరం పెంచడం ఏమిటి?’’ అని జగదీశ్వర్ రెడ్డి ప్రశ్నించారు.
‘‘తమిళనాడులో ఐదుగురు తెలుగు మంత్రులు ఉన్నారని కస్తూరి అంటున్నారు, వాస్తవానికి ఏడు కోట్ల మంది ఉన్న తమిళనాడులో రెండు కోట్లకు పైగా తెలుగు వారున్నారు. ఈ లెక్కన పది మంది మంత్రులు ఉండాలి’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, FB/TammareddyBharadwajOfficial
‘కస్తూరి వ్యాఖ్యలను పట్టించుకోనక్కర్లేదు’
తమ్మారెడ్డి భరద్వాజ బీబీసీతో మాట్లాడుతూ.. ‘‘కస్తూరివి పిచ్చి వ్యాఖ్యలు. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచే హక్కు, అర్హత ఆమెకు ఏమున్నాయి? ఆమె కూడా తెలుగు సినిమాల్లో నటించారు. ఆమె ఎందుకిలా మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు’’ అని అన్నారు.

ఫొటో సోర్స్, FB/vishnumanchu
అవి రాజకీయ వ్యాఖ్యలు: మంచు విష్ణు
‘‘కస్తూరి ఏం మాట్లాడారో నాకు పూర్తిగా తెలియదు. నేను ఆ వీడియో చూడలేదు. చూసిన తర్వాత స్పందిస్తా’’ అని మూవీ ఆర్టిస్ట్ ఆసోసియేషన్ (మా) అధ్యక్షుడు, సినీహీరో మంచు విష్ణు బీబీసీతో అన్నారు.
ఆ తర్వాత ఆయన తిరిగి స్పందిస్తూ.. ‘‘ఆమెవి రాజకీయ వ్యాఖ్యలు. వాటిపై మేం కామెంట్ చేయం’’ అని వ్యాఖ్యానించారు.
ఇది డీఎంకే నాపై చేసిన కుట్ర: బీబీసీతో కస్తూరి
తన వ్యాఖ్యలపై వివాదం చెలరేగిన సమయంలో కస్తూరి బీబీసీతో మాట్లాడారు.
‘‘తమిళనాడులో బ్రాహ్మణుల పట్ల డీఎంకే ప్రభుత్వం చూపిస్తున్న వివక్షను, చిన్నచూపును ఎత్తిచూపుతూ నేను చేసిన వ్యాఖ్యలను తెలుగువారికి ఆపాదిస్తూ డీఎంకే నీచమైన కుట్రకు పాల్పడింది. డీఎంకే దుష్టశక్తులు మొదటి నుంచీ నా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ చాలా దారుణమైన ప్రచారాలు చేస్తూ వచ్చాయి. వాటిని తట్టుకుని నిలబడిన నాపై చివరికి తెలుగు ప్రజలను రెచ్చగొట్టేలా నా మాటలను వక్రీకరించాయి. నేను బ్రాహ్మణులకు జరిగిన అన్యాయంపై మాట్లాడుతూ ఎక్కడి నుంచో తమిళనాడుకు వచ్చిన డీఎంకే నేతలను ఉద్దేశించి మాట్లాడానే తప్ప తెలుగువారిని ఒక్క మాట కూడా అనలేదు. మెట్టినిల్లుగా నన్ను ఎంతో ఆదరించిన తెలుగు గడ్డను ఎలా విమర్శిస్తాను? తెలుగువారిని విమర్శిస్తే నన్ను నేను విమర్శించినట్టే. వారిని తక్కువ చేస్తే నన్ను తక్కువ చేసుకున్నట్టే’’ అని కస్తూరి బీబీసీతో అన్నారు.
‘‘సనాతన ధర్మం గురించి ఎవరు మాట్లాడినా డీఎంకే దుష్టశక్తులు ఇలానే కుట్రలు చేస్తుంటాయి. మొన్న పవన్ కళ్యాణ్‌పై కూడా ఇదే విధంగా విమర్శలు చేయడాన్ని మనం చూడొచ్చు. తాను పొరపాటున కూడా తెలుగు ప్రజల గురించి ఒక్క మాట కూడా తప్పుగా మాట్లాడలేదు'' అని కస్తూరి అన్నారు.
అంతకు ముందు ఆమె ‘ఎక్స్’ వేదికగా స్పందించారు.
‘‘తమిళుల మధ్య విభజన తెచ్చే రాజకీయాలు చేసే ద్రావిడ వలసవాదుల ద్వంద్వ ప్రమాణాలను నేను బయటపెట్టాను. తెలుగు వారిపట్ల నా విధేయతపై ఇవాళ డీఎంకే తప్పుడు ప్రచారం చేస్తూ నన్ను బెదిరించే ప్రయత్నం చేస్తోంది. నేను తెలుగువారికి వ్యతిరేకంగా మాట్లాడాను అంటూ ఫేక్ న్యూస్ ట్రెండ్ చేస్తోంది’’ అని కస్తూరి పేర్కొన్నారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














