డోనల్డ్ ట్రంప్ గెలుపు: బిట్ కాయిన్ల ధరలు ఎందుకు పెరిగాయి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జోవో దా సిల్వా, షార్లెట్ ఎడ్వర్డ్స్
- హోదా, బిజినెస్ రిపోర్టర్లు, బీబీసీ న్యూస్
రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనల్డ్ ట్రంప్ మరోసారి అమెరికా అధ్యక్షుడిగా గెలవడంతో అమెరికా డాలర్ విలువ ఒక్కసారిగా పెరిగింది. క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ సైతం రికార్డు స్థాయిలో గరిష్ఠాన్ని చేరుకుంది.
ట్రంప్ రెండోసారి పాలనలో ద్రవ్యోల్బణం పెరుగుతుందని, పన్నుకోతలు ఉంటాయని ట్రేడర్లు పందాలు వేసుకున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై అమెరికా అధ్యక్ష ఎన్నికలు భారీ ప్రభావాన్ని చూపనున్నాయని అంచనాలున్నాయి.
సెనేట్ నియంత్రణ కూడా రిపబ్లికన్ల చేతుల్లోకి వెళ్లనుంది.
ఒకవైపు ఫలితాలు వస్తుండగానే.. మరోవైపు డాలర్ విలువ పెరగడం మొదలైంది. పౌండ్, యూరో, జపనీస్ యెన్ వంటి ఇతర కరెన్సీలతో పోలిస్తే డాలర్ విలువ సుమారు 1.5 శాతం పెరిగింది.
జపాన్‌లో బెంచ్‌మార్క్ నిక్కీ 225 స్టాక్ ఇండెక్స్ కూడా 2.6 శాతం లాభంతో ముగిసింది. ఆస్ట్రేలియా ఏఎస్ఎక్స్ 200 సూచీ 0.8 శాతం లాభపడింది.
అలాగే, భారత స్టాక్ మార్కెట్లు సైతం బుధవారం లాభాల్లో కొనసాగాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 900 పాయింట్లు పెరిగి 80,378.13 వద్ద ముగిసింది. అలాగే, నిఫ్టీ 270 పాయింట్లు లాభపడి 24,484 వద్దకు చేరుకుంది.
ప్రధాన అమెరికా స్టాక్ సూచీలు కూడా లాభాల్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మంగళవారం డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్, ఎస్ అండ్ పీ 500, నాస్‌డాక్‌లు 1 శాతానికి పైగా పెరిగాయి.

బిట్‌కాయిన్ ఎందుకు పెరిగింది?
అమెరికాను ‘‘బిట్‌కాయిన్, క్రిప్టోకరెన్సీకి ప్రపంచ రాజధాని’’ గా మారుస్తానని ట్రంప్ వాగ్దానం చేశారు.
బిట్‌కాయిన్ విలువ 6000 డాలర్లు పెరిగి రికార్డు స్థాయిలో 75,371.69 డాలర్లకు(రూ.63,55,778) చేరుకుంది.
ఈ ఏడాది మార్చిలో 73,797.98 డాలర్ల(రూ.62,23,073)ను చేరుకుని ఈ కరెన్సీ రికార్డు స్థాయిలను అందుకుంది. ఆ స్థాయిని ప్రస్తుతం అధిగమించింది.
ప్రభుత్వ వృధా ఖర్చులను ఆడిట్ చేసేందుకు బిలియనీర్ ఎలాన్ మస్క్‌ను నియమించాలని ఆలోచిస్తున్నట్టు ట్రంప్ అంతకుముందు చెప్పారు.
మస్క్ చాలా కాలంగా క్రిప్టోకరెన్సీలకు అనుకూలంగా ఉంటున్నారు. ఈ డిజిటల్ కరెన్సీ ధరల్లో తీవ్ర ఒడిదుడుకులు ఉంటున్నప్పటికీ, 2021లో బిట్‌కాయిన్‌లో ఆయన కంపెనీ టెస్లా 1.5 బిలియన్ డాలర్లను(రూ.12,649 కోట్లను) పెట్టుబడిగా పెట్టింది.
టెస్లా షేర్లు కూడా పెరుగుతున్నాయి. టెస్లా టాప్ షేర్‌హోల్డర్ అయిన మస్క్ ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌కు మద్దతు ఇచ్చారు.

ఫొటో సోర్స్, Reuters
ఆర్థిక వ్యవస్థ కోసం ట్రంప్ తీసుకునే ప్రణాళికలు, ఆర్థిక మార్కెట్లు ఒడిదుడుకులకు లోను కావచ్చని నిపుణులు భావిస్తున్నారు.
‘‘ఆయన నిర్ణయాల్లో చాలా వరకు ద్రవ్యోల్బణాన్ని పెంచే విధంగా ఉంటాయి. దీంతో బాండ్ల నుంచి వచ్చే ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఇది వడ్డీ రేట్లను తగ్గించాలని భావిస్తున్న ఫెడరల్ రిజర్వ్‌పై ఒత్తిడి పెంచుతుంది’’ అని క్విల్టర్ ఇన్వెస్టర్స్‌కు చెందిన ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ లిండ్సే జేమ్స్ అభిప్రాయపడ్డారు.
తాను అమెరికాకు తదుపరి అధ్యక్షుడిని అయితే, ముఖ్యంగా చైనాపై వాణిజ్య సుంకాలను పెంచుతానని డోనల్డ్ ట్రంప్ ప్రకటించారు.
ప్రపంచ సూచీలన్నీ ట్రంప్ గెలుపుపై పాజిటివ్‌గా స్పందించలేదు. చైనాలోని షాంఘై కాంపోజిట్ ఇండెక్స్ 0.1 శాతం, హాంకాంగ్ హ్యాంగ్ సెంగ్ 2.23 శాతం తగ్గాయి.
అలాగే, ట్రంప్ పన్నుల కోత ఏజెండాను పెద్ద పెద్ద అమెరికా కంపెనీలు స్వాగతించాయి.
‘‘ఒకవేళ ట్రంప్ ఎన్నికైతే వ్యాపార అనుకూల విధానాలు, వడ్డీ రేట్ల కోతను ఆశించొచ్చు. దీంతో ద్రవ్యోల్బణం పెరిగి, వడ్డీ రేట్లలో పెద్దగా కోత ఉండకపోవచ్చు’’ అని ట్రైబెకా ఇన్వెస్ట్ మెంట్ పార్ట్ నర్స్ లో పోర్టిఫోలియో మేనేజర్ జున్ బే లియూ అన్నారు.
ఈ వారం మార్కెట్లను ప్రభావితం చేసే మరికొన్ని కీలక అంశాలు కూడా ఉన్నాయి.
గురువారం ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్లపై తన నిర్ణయాన్ని ప్రకటించనుంది. ఫెడ్ అధినేత జెరోమ్ పావెల్ ప్రకటనలపై కూడా మార్కెట్లలో ఆసక్తి నెలకొంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














