అమెరికా ప్రెసిడెంట్‌కు జీతమెంత, భత్యమెంత?

ఫొటో సోర్స్, Getty Images
అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ప్రపంచమంతా చర్చ జరుగుతోంది. రిపబ్లికన్ పార్టీ తరఫున డొనల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ పార్టీ తరఫున కమలా హారిస్ నవంబరు 5న జరగబోయే ఎన్నికల్లో తలపడుతున్నారు.
ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన దేశంగా ఎక్కువమంది భావించే అమెరికా, ఈసారి తొలి మహిళా అధ్యక్షురాలిని ఎన్నుకుంటుందా లేక...డొనల్డ్ ట్రంప్‌కు మళ్లీ అవకాశమిస్తుందా అన్నదానిపై అంతటా ఆసక్తి నెలకొంది.
ఫలితాలు ఈ నెలలోనే వెలువడతాయి. ఈ ఎన్నికల్లో గెలిచిన వారు 2025 జనవరి 20న అమెరికా ప్రెసిడెంట్ బాధ్యతలు స్వీకరించి నాలుగేళ్లపాటు అధికారంలో ఉంటారు.
ఈ నేపథ్యంలో అసలు అమెరికా అధ్యక్షుల జీతభత్యాలెంత ? ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పదవిగా భావించే అమెరికా ప్రెసిడెంట్, తాను నిర్వర్తించే విధులకు ఎంత ప్రతిఫలం సంపాదిస్తారు వంటి విషయాలు తెలుసుకుందాం...


ఫొటో సోర్స్, Getty Images
అమెరికా ప్రెసిడెంట్‌కు ఎలాంటి సౌకర్యాలు ఉంటాయి? జీతం ఎంత వస్తుంది?
అమెరికా అధ్యక్షుల సంపాదనెంత అన్నది చాలామందిలో కలిగే సందేహం. అదే సమయంలో కోట్లాది రూపాయల జీతం ఉంటుందన్న అభిప్రాయం కూడా చాలా మందికి ఉంటుంది. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాత్రల్లో అమెరికా అధ్యక్ష పదవి ఒకటిగా భావిస్తుంటారు కాబట్టి జీతం గురించి ఇలాంటి అంచనా ఉండడం సహజం.
అయితే ఇక్కడే ఓ విషయం తెలుసుకోవాలి. అమెరికా అధ్యక్షులంటే ప్రభుత్వ ఉద్యోగి. అధ్యక్ష హోదాలో ఉన్న వ్యక్తి ప్రజలు చెల్లించే పన్నులకు జవాబుదారీగా వ్యవహరించాలి.
ప్రస్తుత అధ్యక్షుని విషయానికొస్తే జో బైడెన్ వేతనం ఏడాదికి 4 లక్షల డాలర్లు. భారతీయ కరెన్సీ ప్రకారం దాని విలువ రూ. 3.40 కోట్లు. ఇది కాకుండా అధ్యక్షుని ఖర్చులకు మరో 50 వేల డాలర్లు( రూ. 42లక్షలు) అదనంగా చెల్లిస్తారు.
అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్. అమెరికా అధ్యక్షులయ్యే ప్రతి ఒక్కరూ ఆ భవనంలో ఉచితంగా నివసించొచ్చు. అలాగే అధ్యక్షులుగా గెలుపొందిన తర్వాత...తొలిసారి వైట్‌హౌస్ భవనంలోకి వెళ్లేటప్పుడు తమ అవసరాలకు,అభిరుచికి తగ్గట్టుగా రీమోడలింగ్ చేసుకునేందుకు లక్ష డాలర్ల ( సుమారు రూ. 84లక్షలు)కు పైగా చెల్లిస్తారు.
వినోదం కోసం, సిబ్బంది, నౌకర్లు, వంటవాళ్ల కోసం అధ్యక్షులకు ఏడాదికి 19 వేల డాలర్లు (సుమారు రూ. 16 లక్షలు) ఇస్తారు.
ఇతర చెల్లింపులు, సేవలు
ఇక ప్రెసిడెంట్‌కు ఉచిత ఆరోగ్య సేవలు లభిస్తాయి.
లిమౌ కార్, మెరైన్ హెలికాప్టర్, ఎయిర్ ఫోర్స్ వన్‌లో ప్రయాణించే సౌకర్యం ఉంటుంది.
ప్రయాణ ఖర్చుల కోసం 1 లక్ష డాలర్లు( రూ. 84లక్షలు) నాన్ ట్యాక్సబుల్ పేమెంట్స్ ఉంటాయి.
లిమౌ కారులో ప్రపంచంలోనే అత్యాధునిక సాంకేతిక భద్రత, కమ్యూనికేషన్ వ్యవస్థ ఉంటుంది. అధ్యక్షుల అభిరుచులకు తగ్గట్టుగా కాలానుగుణంగా ఈ కారులో మార్పులు జరిగాయి.
ప్రపంచంలో ఎక్కడికైనా సౌకర్యంగా, సురక్షితంగా వెళ్లేందుకు అధ్యక్షులు 4,000 చదరపు అడుగుల ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో ప్రయాణిసారు.
ఈ విమానంలో ప్రెసిడెంట్‌తోపాటు వారి సహచరులు, సిబ్బంది కలపి దాదాపు వందమంది వరకు ప్రయాణించవచ్చు.
అధ్యక్షులు వాషింగ్టన్ నగరం నుంచి ఆండ్రూస్ ఎయిర్ ఫోర్స్ బేస్‌కు వెళ్లేందుకు మెరైన్ వన్ హెలికాప్టర్ ఉపయోగిస్తారు. అక్కడినుంచి ఎయిర్ ఫోర్స్ వన్‌లో ప్రయాణిస్తారని జార్జిబుష్ లైబ్రరీ వెబ్‌సైట్ పేర్కొంది.

ఫొటో సోర్స్, Reuters
2001 నుంచి పెరగని జీతం
అమెరికా ప్రెసిడెంట్ వేతనం అమెరికాలో అత్యధిక జీతం పొందే ఒక శాతం వ్యక్తులతో పోలిస్తే చాలా తక్కువ.
అమెరికాలో మొదటి 1% ధనికులు ఏడాదికి సగటున 7,88,000 డాలర్లు ( సుమారు రూ. 66 కోట్లు ) సంపాదిస్తున్నారు.
వీళ్లలో స్పేస్ x, టెస్లా వ్యవస్థాపకులు ఎలాన్ మస్క్, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్, ఫేసుబుక్ వ్యవస్థాపకులు మార్క్ జుకెర్‌బర్గ్ తదితరులున్నారు.
అమెరికా అధ్యక్షుని జీతంలో 2001నుంచి పెరుగుదల లేదు. జార్జ్ డబ్ల్యూ.బుష్ పదవీ బాధ్యతలు స్వీకరించే ముందు 2001లో అధ్యక్షుడి జీతం చివరిసారిగా పెరిగింది.
అయితే సాధారణ అమెరికన్ సగటు జీతంతో పోలిస్తే ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ వేతనం ఆరు రెట్ల కన్నా ఎక్కువ.
సగటు అమెరికన్ల వార్షిక జీతం 63,795 డాలర్లు (సుమారు రూ. 53 లక్షలు)
అమెరికా మొదటి అధ్యక్షుడు జార్జి వాషింగ్టన్ సంపన్న రైతు అయినప్పటికీ రెండు వేల డాలర్ల (సుమారు రూ. 1.68 లక్షలు) జీతం తీసుకున్నారు. 1789లో అది చాలా పెద్ద మొత్తం.
సంపన్న అధ్యక్షులైన జాన్ ఎఫ్. కెన్నడీ, హెర్బర్ట్ హూవర్, డోనల్డ్ ట్రంప్ తమ వేతనాలను చారిటీకి ఇచ్చారు.
అమెరికా ప్రెసిడెంట్ పదవీ విరమణ చేసిన తర్వాత వారికి వార్షిక పెన్షన్ లభిస్తుంది. ప్రస్తుతం అది 240 వేల డాలర్ల కన్నా( సుమారు రూ. 2 కోట్లు ) కన్నా ఎక్కువగా ఉంది. ప్రెసిడెంట్‌కు ఈ పెన్షన్ జీవితకాలం లభిస్తుంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)














