వలసదారులు లేకపోతే అమెరికా పరిస్థితి ఏంటి?

సారాంశం
  • అమెరికన్ జనాభాలో 14.3 శాతం మంది వలసదారులే.
  • అత్యధిక మంది మెక్సికో నుంచి వస్తున్నారు. తర్వాతి స్థానంలో భారత్ ఉంది.
  • 2040 నాటికి అమెరికాలో జననాల సంఖ్యను మరణాల సంఖ్య దాటిపోతుందని అంచనా
  • వలసదారులు లేకపోతే అమెరికా ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బ తింటుందని నిపుణులు చెబుతున్నారు
    • రచయిత, అలిసన్ జీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి
అమెరికా, అధ్యక్ష ఎన్నికలు, వలసదారులు, మెక్సికో, ఆఫ్రికన్లు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అమెరికాలోని వ్యవసాయ క్షేత్రాల్లో పని చేసేవారిలో 70 శాతం మంది కార్మికులు వలసవచ్చిన వారేనని అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

నవంబర్ 5న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వలసవాదం అతిపెద్ద అంశం. మెక్సికో సరిహద్దుల గుండా అక్రమంగా దేశంలోకి ప్రవేశిస్తున్న వారికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరాన్ని డెమొక్రాట్, రిపబ్లికన్ పార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో ప్రస్తావిస్తున్నారు.

సరైన పత్రాలు లేకుండా వచ్చే వారిని, సామూహికంగా వారి సొంత దేశాలకు పంపిస్తామని డోనల్డ్ ట్రంప్ పదే పదే హెచ్చరిస్తున్నారు. ఆయన ప్రత్యర్థి కమలా హారిస్ మాత్రం మాజీ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ “వలసదారుల మధ్య చిచ్చు పెట్టి భయాలను, విద్వేషాలను పెంచుతున్నారని” ఆరోపించారు. అయితే, సరిహద్దు భద్రత బిల్లుకు మద్దతు ఇచ్చే విషయంలో ఆమె ఏమీ చెప్పలేదు. ఈ బిల్లుకు ఆమోదం తెలిపితే సరిహద్దుల్లో గోడ నిర్మించేందుకు లక్షల డాలర్లను ఖర్చు చేయాల్సి వస్తుంది.

ప్రపంచంలోనే అత్యధికంగా వలసదారుల జనాభా అమెరికాలోనే ఉంది. వలసదారులు అమెరికాలో ఎలాంటి పాత్ర పోషిస్తున్నారు? ఇమ్మిగ్రెంట్స్ లేకపోతే అమెరికా పరిస్థితి ఏంటి?

అమెరికా, అధ్యక్ష ఎన్నికలు, వలసదారులు, మెక్సికో, ఆఫ్రికన్లు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2023 చివర్లో మెక్సికో నుంచి వలసదారులు రికార్డు స్థాయిలో అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించారు

జనాభా

వలసదారులు లేకపోతే అమెరికాలో జనాభా చాలా తక్కువగా ఉండేది. విదేశాల్లో పుట్టి అమెరికాలో జీవిస్తున్న వారి సంఖ్య 2023 నాటికి 4 కోట్ల 70 లక్షలకు చేరుకుంది. ఇది అమెరికన్ జనాభాలో 14.3 శాతం. ఇందులో ఎక్కువ మంది మెక్సికో నుంచి వచ్చినవారే ఉన్నారు. అమెరికాలో నివసిస్తున్న మెక్సికన్ల సంఖ్య కోటి 6 లక్షలు. ఆ తర్వాతి స్థానాల్లో 28 లక్షల మందితో భారత్, 25 లక్షల మందితో చైనా ఉన్నాయి.

వలసదారుల సంఖ్య రికార్డు స్థాయిలో అధికంగా ఉండగా, అమెరికాలో జననాల రేటు తగ్గడం వల్ల మొత్తంగా ఆ దేశ జనాభా వృద్ధిరేటు తక్కువగా ఉంది.

1930ల తర్వాత అమెరికాలో 2010-2020 మధ్య అతితక్కువ జనాభా వృద్ధి రేటు నమోదైంది. 1929లో వచ్చిన ప్రపంచ ఆర్థిక మాంద్యం సమయంలో అమెరికాలో జనాభా వృద్ధి రేటు చరిత్రలో ఎన్నడూ లేనంత తక్కువ స్థాయికి పడిపోయింది.

మిగతా దేశాల మాదిరిగానే అమెరికాలోనూ వృద్ధుల జనాభా పెరగడం వల్ల వైద్య సేవల ఖర్చులు పెరగడం, పని చేసే వారి సంఖ్య తగ్గిపోవడం లాంటి సవాళ్లను ఆ దేశం ఎదుర్కొంటోంది.

2040లో జననాల సంఖ్యను మరణాల సంఖ్య దాటిపోయినప్పుడు ఇది పెను మార్పుకు దారి తీస్తుంది. ఆ తర్వాత వలసదారుల వల్లే అమెరికన్ జనాభా పెరుగుతుందని ఆ దేశ కాంగ్రెస్ బడ్జెట్ ఆఫీస్ అంచనాలు చెబుతున్నాయి.

దీని ఫలితంగా, అమెరికా ఆర్థిక అవసరాలు తీరాలంటే, ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో పనులు జరగాలంటే వలసలను అంగీకరించాలని కొంతమంది ఆర్థికవేత్తలు, వలసవాద అనుకూల సంస్థలు వాదిస్తున్నాయి.

బీబీసీ న్యూస్ తెలుగు
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
అమెరికా, అధ్యక్ష ఎన్నికలు, వలసదారులు, మెక్సికో, ఆఫ్రికన్లు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, డోనల్డ్ ట్రంప్, కమలా హారిస్ మధ్య జరిగిన తొలి అధ్యక్ష అభ్యర్థుల డిబేట్‌ను టిజువానాలోని జువంటెడ్ 2000 వలసదారుల శిబిరంలో ప్రదర్శించారు.

ఆర్థిక వ్యవస్థపై ప్రభావం

వలసదారులు లేకపోతే అమెరికా ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బ తింటుందని బోస్టన్ యూనివర్సిటీలో ఎకనమిక్స్ అసోసియేట్ ప్రొఫెసర్ తారెక్ హసన్ చెప్పారు.

“మీరు వలసదారులందర్నీ పంపించేస్తే, తలసరి జీడీపీ ఐదు నుంచి 10 శాతం తగ్గిపోతుంది. దీనర్థం వ్యక్తుల సంపద తగ్గుతుందని. కొద్ది మంది ప్రజలే ఉండటం వల్ల మొత్తంగా జీడీపీ తగ్గుతుంది” అని ఆయన అన్నారు.

“వలస వచ్చినవారి వల్ల ఆవిష్కరణలు పెరిగినట్లు పరిశోధనల్లో తేలింది. దీని వల్ల ఉత్పత్తి పెరిగింది. ఇది ఒక రంగానికే పరిమితం కాలేదు. దీని వల్ల మొత్తంగానే అమెరికా ఆర్థిక వ్యవస్థ ఆవిష్కరణల సామర్థ్యాన్ని పెంచింది” అని హసన్ చెప్పారు.

వలస వచ్చినవారిలో ఎక్కువ మంది పని చేసే వయసులో ఉన్నారు. 3 కోట్ల 10 లక్షల మంది కార్మికుల్లో వలసదారులు 19 శాతం మంది ఉన్నారు. అమెరికాలో పుట్టి పెరిగిన వారి కంటే వలసవచ్చిన కార్మిక శక్తి ఎక్కువని అమెరికా ప్రభుత్వంలో భాగమైన కార్మిక గణాంకాల విభాగం వెల్లడించింది.

అమెరికాకు వలస వస్తున్న వారిలో 91శాతం మంది 16 ఏళ్ల వయసు వారు. అధిక వయసు విషయానికొస్తే 2022-2023 మధ్య వచ్చిన వారిలో ఎక్కువ మంది 55 ఏళ్ల లోపు వారే. అంటే, వారంతా పనిచేయగల వయసులో ఉన్నవారే.

అమెరికా ఆర్థిక వ్యవస్థలో అనేక రంగాలు, ప్రత్యేకంగా వ్యవసాయం ఎక్కువగా వలస కూలీల మీదనే ఆధారపడి ఉంది.

వ్యవసాయ క్షేత్రాల్లో పని చేస్తున్న వారిలో అనేక మంది సరైన పత్రాలు లేకుండా అమెరికాకు వచ్చిన వారిలో 70 శాతం మంది వ్యవసాయ రంగంలో పని చేస్తున్నారని అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ లేబర్‌కు చెందిన నేషనల్ అగ్రికల్చరల్ వర్కర్స్ సర్వే తెలిపింది.

వలసదారుల్ని వదులుకోవడం అంటే “అనేక మంది వ్యవసాయ క్షేత్రాల యజమానులు పంటలు పండించేందుకు అవసరమైన కూలీలను లేకుండా చేయడమే. వలస కార్మికులు లేకుండా పండ్లు, కూరగాయలు పండించడం, గిరాకీ ఉన్న సమయాల్లో పండించిన వాటిని వినియోగదారులకు చేర్చడం అసాధ్యం” అని అమెరికన్ ఇమ్మిగ్రేషన్ కౌన్సిల్‌లో రీసర్చ్ డైరెక్టర్ నన్ వు చెప్పారు.

వేతనాల విషయంలోనూ వలసదారుల వల్ల ఉపయోగం ఎక్కువని, స్థానికులతో పోలిస్తే వారు తక్కువ వేతనాలకు పని చేయడానికి సిద్ధంగా ఉంటారని విమర్శకులు వాదిస్తున్నారు.

అయితే, 2014లో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా సమీక్షలో ఆర్థిక వ్యవస్థ మీద వలసదారుల ప్రభావం గురించి జరిపిన 27 అధ్యయనాల్లో తేలిందేంటంటే.. వలసదారులకు తక్కువ వేతనాలు ఇచ్చినప్పటికీ, స్థానికుల మీద ఎలాంటి ప్రభావం చూపలేదు.

“వలసదారుల సంఖ్య పెరగడం సానుకూల సంకేతమే. అయితే గణాంకాల ప్రకారం చూస్తే జీతాల పెరుగుదల మీద అంతగా ప్రభావం చూపలేదు” అని ఈస్టర్న్ ఇల్లినాయిస్ యూనివర్సిటీ తాజా అధ్యయనంలో తేలింది.

అమెరికా, అధ్యక్ష ఎన్నికలు, వలసదారులు, మెక్సికో, ఆఫ్రికన్లు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మొత్తం వలసదారుల్లో ఎలాంటి పత్రాలు లేకుండా అనధికారికంగా అమెరికాలో ఉంటున్న వారి వాటా 23 శాతం.

పన్నులు

మరి, పన్నుల ఆదాయం మీద ఎలాంటి ప్రభావం ఉంది?

వలస వచ్చిన కుటుంబాలు మొత్తం పన్నుల వసూళ్లలో ఆరింట ఒక వంతు సమకూరుస్తున్నాయి. వలస వచ్చిన కుటుంబాలు 2022లో 580 బిలియన్ డాలర్ల మేర పన్నులు చెల్లించినట్లు ఏఐసీ విశ్లేషించింది.

ఇదంతా కేవలం అధికారికంగా వచ్చిన వలసదారులు చెల్లించిన పన్నులు మాత్రమే కాదని నన్ వు చెప్పారు.

అమెరికాలో ఉంటున్న వలసదారుల్లో అనధికారికంగా వచ్చి పని చేస్తున్న వారు 23 శాతం మంది ఉన్నారు. వీరి సంఖ్య దాదాపు కోటి పది లక్షలు ఉండవచ్చని అంచనా. వీరిలో 40 లక్షల మంది మెక్సికో నుంచి వచ్చినవారేనని ప్యూ రీసర్చ్ సెంటర్ థింక్ ట్యాంక్ విశ్లేషించింది.

అనధికారిక వలసదారులు దాదాపు 100 బిలియన్ డాలర్లను పన్నుల రూపంలో చెల్లిస్తున్నారని ఇన్‌స్టిట్‌ట్యూట్ ఆఫ్ టాక్సేషన్ అండ్ ఎకనామిక్ పాలసీ అధ్యయనంలో తేలింది.

“జాతీయ స్థాయిలో చూస్తే వలసల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు లాభదాయకంగా ఉంది. అయితే కొన్ని రాష్ట్రాల్లో నష్టాలు కూడా ఉన్నాయి. అది కూడా స్వల్ప కాలం ఉండి వెళ్లే వారి విషయంలో” అని ఎకనమిక్ పాలసీ ఇన్‌స్టిట్‌ట్యూట్‌లో ఇమ్మిగ్రేషన్ లా అండ్ పాలసీ రీసర్చ్ డైరెక్టర్ డేనియల్ కోస్టా చెప్పారు.

డేనియల్ కోస్టా నిర్వహించిన తాజా అధ్యయనంలో ఆయన, ఆయన బృందం ఎక్కువ మంది వలసదారులు తక్కువ జీతాలకు పని చేస్తున్న ఉదాహరణలను చూపించారు.

జాతీయ, రాష్ట్రాల స్థాయిలో నిధుల పునర్విభజన చేయాలని, దాంతో వలసదారులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎదురయ్యే సమస్యల్ని అధిగమించడానికి అధిక నిధులు కేటాయించే అవకాశం ఉంటుందని డేనియల్ కోస్టా వాదించారు.

అమెరికాలో పుట్టిన వారి సంఖ్య పెరిగినప్పుడు వలస వచ్చిన వారిపై గతంలో మాదిరిగానే ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ప్రముఖ ఆర్థికవేత్త ప్రొఫెసర్ యోవన్నీ పెరీ చెప్పారు.

అమెరికా, అధ్యక్ష ఎన్నికలు, వలసదారులు, మెక్సికో, ఆఫ్రికన్లు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అమెరికాలోని ప్రముఖ కంపెనీల్లో ఒకటైన యాపిల్‌ను స్థాపించిన స్టీవ్ జాబ్స్ సిరియా నుంచి వలస వచ్చిన వ్యక్తి కుమారుడు.

ఆవిష్కరణలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు

వలసదారుల్లో ఒక భాగం లేదా వారి పిల్లలు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదిగారు.

అమెరికాలోని 500 అతి పెద్ద కంపెనీల జాబితా ఫార్చ్యూన్ 500లో 45 శాతం కంపెనీలు వలసదారులు లేదా వారి పిల్లలు స్థాపించినవే. అమెరికాలో బిలియన్ డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ మార్కెట్ విలువ కలిగిన స్టార్టప్‌లలో 55 శాతం వలసదారులు ప్రారంభించినవే.

ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని కొత్త పుంతలు తొక్కించడంలో వలసదారులు ప్రత్యేక పాత్ర పోషించారు. వీరిలో అనేక మంది అమెరికాకు విద్యార్థులుగా వచ్చినవారే.

2022-2023 విద్యా సంవత్సరంలో అమెరికాలో చదువుకునేందుకు విదేశాల నుంచి వచ్చిన విద్యార్థులు అమెరికన్ ఆర్థిక వ్యవస్థకు 40 బిలియన్ డాలర్ల ఆదాయం సమకూర్చారని అసోసియేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేటర్స్ తెలిపింది.

అమెరికా, అధ్యక్ష ఎన్నికలు, వలసదారులు, మెక్సికో, ఆఫ్రికన్లు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అమెరికాలో వలసదారుల సంఖ్య తగ్గాలని ఇటీవలి ప్రజాభిప్రాయసేకరణలో వెల్లడైంది.

ప్రజాభిప్రాయం

అమెరికాలో వలసదారుల పాత్ర కీలకంగా ఉన్నప్పటికీ, వారి సంఖ్య తగ్గాలని 55 శాతం అమెరికన్లు కోరుకుంటున్నట్లు ఇటీవలి ప్రజాభిప్రాయ సర్వేలో తేలింది. వలసలను నియంత్రించాలనే దానిపై విస్తృత రాజకీయ ఏకాభిప్రాయం ఉంది. ఇందులోనూ మెక్సికో సరిహద్దుల వద్ద అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించేవారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని భావిస్తున్నారు.

అమెరికా ఆర్థిక వ్యవస్థపై వలసల విస్తృత ప్రభావం గురించి కాకుండా కొంతమంది రాజకీయ నాయకులు, పత్రికలు వలసలంటే సరిహద్దుల్లో సంఘర్షణలు, దేశంలోకి అక్రమ ప్రవేశాలు అని ప్రచారం చేస్తున్నట్లు ప్రొఫెసర్ పెరి చెప్పారు.

“దక్షిణ సరిహద్దుల నుంచి వలసదారుల వరదలా వచ్చి పడుతున్నారని ప్రజలు తరచూ వింటున్నారు. అందుకే వారు ఇది దేశానికి ప్రమాదకరమని, వలసదారుల సంఖ్య పెరుగుతోందని భావిస్తారు” అని ఆయన చెప్పారు. దీనికి బదులుగా ఆర్థిక వ్యవస్థలో వలసదారుల పాత్ర, తగ్గుతున్న అమెరికా జనాభాను భర్తీ చెయ్యడం గురించి మాట్లాడితే బావుండేదని ఆయన అన్నారు.

“రెండు దశాబ్దాలుగా అమెరికాలోకి వలసలు పెరుగుతున్నాయి. దీని వల్ల కొత్తగా వచ్చిన వారిని ఏకీకృతం చేసే సామాజిక సామర్థ్యం దెబ్బ తింటోంది” అని బోస్టన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ తరెక్ హస్సన్ చెప్పారు.

“వలసలు ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో సానుకూల ప్రభావం చూపిస్తున్నప్పటికీ, స్థానిక ప్రజలు వారి పట్ల అంత సానుకూలంగా లేని అంశాలు కూడా ఉండవచ్చు” అని ఆయన అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)