‘‘సూడాన్‌లో అత్యాచారానికి గురైన అనేక మంది మహిళలు ఆత్మహత్య చేసుకున్నారు’’ - హక్కుల సంస్థల ఆందోళన

సూడాన్ అంతర్యుద్ధం

ఫొటో సోర్స్, AFP

    • రచయిత, ఇయాన్ వఫులా
    • హోదా, బీబీసీ ప్రతినిధి

గమనిక: ఈ కథనంలో కొన్ని కలచివేసే అంశాలున్నాయి

సూడాన్‌లో చెలరేగిన అంతర్యుద్ధంలో సెంట్రల్ జెజిరా రాష్ట్రంలో పారా మిలటరీ బలగాలకు చెందిన ఫైటర్లు అనేక మంది మహిళల్ని రేప్ చేశారని, అత్యాచారానికి గురైన అనేక మంది మహిళలు తమ ప్రాణాలను తీసుకున్నారని హక్కుల సంస్థలు, సామాజిక కార్యకర్తలు చెబుతున్నారు.

పారా మిలటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (ఆర్ఎస్‌ఎఫ్).. సామూహిక హత్యలతో సహా “క్రూరమైన నేరాలకు” పాల్పడినట్లు ఐక్యరాజ్య సమితి ఆరోపించిన తర్వాత గతవారం ఈ నివేదిక బయటకు వచ్చింది.

ఆర్ఎస్‌ఎఫ్ ఫైటర్లు ముందంజ వేస్తూ ఉండటంతో, వారు తమను లైంగికంగా వేధించి, అత్యాచారం చేస్తారనే భయంతో ప్రాణాలు తీసుకోవాలని భావిస్తున్న ఆరుగురు మహిళలతో తాము మాట్లాడుతున్నామని స్థానిక హక్కుల సంస్థ బీబీసీకి చెప్పింది.

అయితే, ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ చేస్తున్న పోరాటంలో భాగంగా లైంగిక హింసకు పాల్పడుతోందని ఆరోపిస్తూ ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన తాజా నివేదికను ఆర్ఎస్ఎఫ్ తిరస్కరించింది. “అవన్నీ నిరాధారమైనవి” అని బీబీసీకి చెప్పింది.

సూడాన్‌లో అధికారం కోసం సైన్యం, ర్యాపిడ్ యాక్షన్ దళాలకు మధ్య జరుగుతున్న పోరాటంలో వేల మంది చనిపోయారు. ఈ ఘర్షణల కారణంగా 2023 ఏప్రిల్ నుంచి కోటి 10 లక్షల మంది ఇల్లు వదిలి పారిపోయారు.

ఐక్యరాజ్య సమితి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం సంస్థ అధ్యక్షురాలు సిండీ మెక్ కెయిన్ ఈ వారంలో పోర్ట్ సూడాన్‌లోని సహాయ కేంద్రంలో పర్యటించారు. సూడాన్‌లో కాల్పుల విరమణ అమలు కాకపోతే ఈ దేశంలో అతిపెద్ద మానవీయ సంక్షోభం రావచ్చని ఆమె బీబీసీతో చెప్పారు.

ఆకలితో లక్షల మంది చనిపోవచ్చని ఆమె హెచ్చరించారు.

జెజిరాలో పారా మిలటరీ దళాలకు చెందిన ఫైటర్లు రాష్ట్రంలోని ర్యాపిడ్ ఫోర్సెస్ టాప్ కమాండర్‌ అబు అక్లా కయకా నేతృత్వంలోని సైన్యానికి ఎదురు తిరిగినట్లు కథనాలు వచ్చాయి.

“అబు కయకా అధీనంలో ఉన్న ప్రాంతంలో ఆయనకు వ్యతిరేకంగా ఆర్ఎస్‌ఎఫ్ ప్రచారం ప్రారంభించింది. వాళ్లు దోచుకున్నారు. ఎదురు తిరిగిన వారిని చంపేశారు. మహిళలతో పాటు చిన్న పిల్లలపైనా అత్యాచారాలకు పాల్పడ్డారు” అని హార్న్ ఆఫ్ ఆఫ్రికాకు చెందిన స్ట్రాటజిక్ ఇనీషియేటివ్ ఫర్ విమెన్ అధ్యక్షురాలు హలా అల్ కరిబ్ బీబీసీతో చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
సూడాన్ అంతర్యుద్ధం

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, అంతర్యుద్ధంలో ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ ముందంజ వేశాయని తెలియడంతో అల్ జెజిరా రాష్ట్రం నుంచి వెళ్లిపోతున్న కుటుంబాలు

కొనసాగుతున్న 'ఆర్ఎస్ఎఫ్' మారణకాండ

సూడాన్‌ అంతర్యుద్ధంలో లైంగికత ఆధారంగా జరుగుతున్న హింస గురించి స్ట్రాటజిక్ ఇనీషియేటివ్ ఫర్ విమెన్ (సిహా) డాక్యుమెంటరీ రూపొందిస్తోంది. జెజిరా రాష్ట్రంలో గత వారంలో ముగ్గురు మహిళలు ఆత్మహత్య చేసుకున్నారని ఈ సంస్థ తెలిపింది.

వారిలో ఇద్దరు అల్ సెరిహా, మరో మహిళ రుఫ్పాకు చెందిన వారని కరిబ్ చెప్పారు.

గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న మహిళపై తన తండ్రి, సోదరుడి కళ్ల ముందే రాపిడ్ యాక్షన్ ఫోర్సెస్ ఫైటర్లు అత్యాచారానికి పాల్పడ్డారని ఆమె సోదరి ‘సిహా’తో చెప్పారు. తర్వాత ఆమె తండ్రిని, సోదరుడిని కూడా ఆ సాయుధులు చంపేశారు.

అల్ సెరిహాలో గత వారం ఆర్ఎస్ఎఫ్ చంపేసినట్లుగా చెబుతున్న పదుల మందిని దుప్పట్లలో చుట్టేసిన దృశ్యాలున్న అనేక వీడియోలను ఆన్‌లైన్‌లో షేర్ చేస్తున్నారు.

బీబీసీ వెరిఫై బృందం ఈ దృశ్యాలను పరిశీలించింది. ఈ పుటేజీలో ఉన్న ప్రాంతం అల్ సెరిహాలోని మసీదు వెనుక భాగంతో సరిపోలినట్లు ఈ పరిశీలనలో తేలింది.

50 లేదా అంతకు పైగా గ్రామాల్లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ దళాలు దాడులు చేశాయి. అయితే ఈ గ్రామాల్లో మహిళల ఆత్మహత్యలకు సంబంధించి రెండు ప్రాంతాల నుంచే ఆధారాలు లభించాయని కరిబ్ చెప్పారు. ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండవచ్చని, మొబైల్ సమాచార వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వల్ల పూర్తి వివరాలు తెలియడం లేదని ఆమె అన్నారు.

ర్యాపిడ్ ఫోర్సెస్ సైనికులు తమ భర్తలను చంపేయడంతో భయపడిన కొంత మంది మహిళలు ఆత్మహత్య చేసుకున్నట్లు తనకు తెలిసిందని జెజిరాలోని ఓ కార్యకర్త బీబీసీకి చెప్పారు. తన ప్రాణాలకు ముప్పు ఉందనే భయంతో ఆమె తన పేరు వెల్లడించవద్దని కోరారు.

సూడాన్ అంతర్యుద్ధం

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్‌కు చెందిన ఫైటర్లు తన చేతిని కాల్చేశారని చూపిస్తున్న మహిళ. ఆమె ప్రస్తుతం నిర్వాసితుల శిబిరంలో తలదాచుకుంటున్నారు.

ఆమె తనకు వచ్చిన వాట్సాప్ వీడియోల్లో ఒక దాన్ని చూశారు. అందులో అల్ సెరిహాలో ఆర్ఎస్ఎఫ్ ఫైటర్లు తనపై అత్యాచారం చేసిన తర్వాత ఒక మహిళ ఎలా ఆత్మహత్య చేసుకున్నారో ఆమె సోదరి వివరిస్తున్న దృశ్యాలు ఉన్నాయి. ఆమెను రేప్ చేసిన తర్వాత ఆ ఫైటర్లు ఆమె ఐదుగురు సోదరులను, ఇతర బంధువులను చంపేశారు.

అత్యాచారాలకు భయపడి మహిళలు సామూహికంగా ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా ఆన్‌లైన్‌లో కనిపిస్తున్న వీడియోలను నిర్థరించుకోవడం చాలా కష్టంగా మారిందని ఆమె చెప్పారు. సమాచార వ్యవస్థలో సమస్యల వల్ల ఇది మరింత కష్టంగా మారిందని చెప్పారు.

అంతర్యుద్ధం మొదలైనప్పటి నుంచి 2024 జులై వరకు 400 మందికి పైగా మహిళలపై లైంగిక దాడులు జరిగినట్లు ఐక్యరాజ్య సమితి నివేదిక తెలిపింది. అయితే ఈ సంఖ్య ఇంకా చాలా ఎక్కువగా ఉండవచ్చని విశ్లేషకులు అనుమానిస్తున్నారు.

ఐరాస రూపొందించిన నివేదికలో బాధితులు ఎనిమిదేళ్ల నుంచి 75 ఏళ్ల మధ్య వయసు వారు ఉన్నారు. వారిలో అనేక మందికి వైద్య చికిత్స అవసరం. అయితే అంతర్యుద్ధం కారణంగా అనేక ఆసుపత్రులు, క్లినిక్‌లు చికిత్సను నిరాకరించాయని ఐక్యరాజ్య సమితి చెప్పింది.

అయితే, “ఈ ఆరోపణలన్నీ అవాస్తవాలు, నిరాధారమైనవి” అని ఆర్ఎస్ఎఫ్ అధికార ప్రతినిధి నిజార్ సయద్ అహ్మద్ బీబీసీకి చెప్పారు.

“క్షేత్ర స్థాయిలో నిజాలేంటో తెలుసుకునేందుకు ఐక్యరాజ్య సమితి తప్పకుండా ఒక నిజ నిర్థరణ బృందాన్ని సూడాన్‌కు పంపించాలి” అని ఆయన కోరారు.

యుద్ధంలో ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్‌ ముందంజ వేశాయని తెలియడంతో భయపడి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న ఆరుగురు మహిళలతో సిహా సంస్థ సంప్రదింపులు జరుపుతున్నట్లు కరిబ్ బీబీసీకి చెప్పారు. వారికి ‘సిహా’ మానసికంగా భరోసా కల్పిస్తోందని, వారిని సురక్షిత ప్రాంతాలకు చేర్చేందుకు సామాజిక కార్యకర్తలు ప్రయత్నిస్తున్నారని తెలిపారు.

జెజిరాలో ఆర్ఎస్ఎఫ్ ఫైటర్లు ఓ 13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం చేశారని, ఆమెకు కూడా సామాజిక కార్యకర్తలు సాయం అందించేందుకు ప్రయత్నిస్తున్నారని, ఆమెకు తక్షణం వైద్య చికిత్స అవసరం అని కరిబ్ చెప్పారు.

ఆ బాలిక తన గ్రామం నంచి బయల్దేరి రుఫ్పా నుంచి న్యూ హల్ఫాకు వెళ్లే రోడ్డు మీదకు వెళ్లారని, ఆమెకు తీవ్రంగా రక్తస్రావం అయిందని కరిబ్ తెలిపారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)