కోడలికి కాఫీ పెట్టే అత్త, అత్తను అమ్మలా చూసుకునే కోడలు...ఈ మార్పు ఎలా సాధ్యమవుతోంది?

- రచయిత, పద్మ మీనాక్షి
- హోదా, బీబీసీ కోసం
వంటింట్లో అత్తగారు - హాల్‌లో పేపర్ చదువుతూ కూర్చున్న కోడలు.
అత్తగారు కాఫీ పెట్టి కోడలి చేతికి ఇచ్చారు. 'థాంక్స్' అని చెప్పి, చేతిలో కాఫీ కప్ పట్టుకుని, కోడలు తన గదిలోకి వెళ్లిపోయింది.
ఇదేమీ సినిమాలోనో, సీరియల్‌లోనో సీన్ కాదు. గత 30 ఏళ్లుగా ఒకే ఇంట్లో కలిసి ఉంటున్న అత్తా కోడళ్ల మధ్య చోటు చేసుకున్న సన్నివేశం.
ఒక రోజు ఈ దృశ్యం చూసిన కోడలి తల్లి మాత్రం గాభరా పడిపోయారు. మీ అత్తగారు వంటింట్లో కష్టపడుతుంటే, నువ్వు కూర్చోవడం ఏంటంటూ కూతురిని మందలించారు.
ఇది విన్న అత్తగారు "పర్వాలేదండి, మా అమ్మాయికి కాఫీ ఇస్తున్నాను కదా, తనకి కూడా అలాగే ఇస్తున్నాను. తనకి చేయాలని అనిపించినప్పుడు చేస్తుంది" అని నవ్వేశారు.
సాధారణంగా మన సమాజంలో అత్తా కోడళ్లకు సరిగా పొసగదనే అభిప్రాయం ఉంది. ఈ అత్తాకోడళ్ల ‘బంధం’ మీదనే సంవత్సరాల పాటు నడిచే సీరియళ్లు ఉన్నాయి.
అయితే సమాజంలో ఉండే పాపులర్ పర్సెప్షన్‌కు భిన్నంగా ఫ్రెండ్లీగా జీవించే అత్తా కోడళ్లు కూడా ఉన్నారు. మారుతున్న డిజిటల్ యుగంలో అత్త అంటే ఆరళ్లు పెట్టే మహిళ కాదు, కోడలంటే కొడుకును దోచుకుని వెళ్లిపోయే అమ్మాయి కాదు అని చాలామంది అర్ధం చేసుకుంటున్నారు.
విశాఖపట్నానికి చెందిన వసంత విశ్వనాధుని (72) నాతో మాట్లాడుతూ.. వాళ్ల కోడలిని పెళ్లి చూపుల్లో మొదటిసారి కలిసిన రోజును గుర్తు చేసుకున్నారు.


ఇది 30 ఏళ్ల కిందటి సంగతి
"పెళ్లిచూపుల్లో గుంటూరులో ఒక హోటల్‌లో మా కోడలిని చూశాం. పెళ్లిచూపుల తర్వాత అందరూ కారు ఎక్కి ఇంటికి వెళుతుంటే, నేను మాత్రం కోడలితో కలిసి రిక్షాలో ఇంటికి వస్తానని చెప్పాను. నేను తనతో నేరుగా మాట్లాడాలని అనుకున్నాను.
"నువ్వు మా అబ్బాయిని చేసుకుంటే సంతోషంగా ఉండగలనని అనుకుంటున్నావా? మా ఇంటికి వస్తే నీ జీవితం బాగుంటుందని అనుకుంటున్నావా? బాగా ఆలోచించుకుని నీ నిర్ణయం చెప్పు" అని రిక్షాలో వస్తూ మా కోడలిని అడిగాను అన్నారు వసంత.
"అలా అడగ్గానే ఆ అమ్మాయి సిగ్గు పడిపోయింది. తనకి అప్పటికి 20 ఏళ్లు. అలా సిగ్గుపడిపోకు, స్పష్టంగా ఆలోచించుకో అని చెప్పాను. మా ఇంటికి వస్తే నువ్వు మాతో సంతోషంగా ఉండగలవు అనే భరోసా మాత్రం నేను ఇచ్చాను" అని వసంత గుర్తుచేసుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
'మా అత్తగారు బాగా చూసుకోలేదు'
ఆ తర్వాత కొన్ని రోజులకు మా అబ్బాయికి పెళ్లి చేశాం.
"మా అబ్బాయి పెళ్లయ్యేటప్పటికి నా వయసు 42 ఏళ్లు. ఇంట్లో పనులన్నీ నేనే చేసేదాన్ని. కోడలు వచ్చింది కాబట్టి, ఇక నుంచి పనులన్నీ తను చేయాలి, నేను కూర్చోవాలి అనుకోలేదు. నా నుంచి ఇంటి పెత్తనం తీసుకోవాలని మా కోడలు కూడా అనుకోలేదు.
పని మాత్రమే కాదు, మా కోడలి స్వేచ్చకు మేం అడ్డు రాలేదు. అపార్ధాలు లేవా అంటే కుటుంబం అన్నాక లేకుండా ఎలా ఉంటాయి? కానీ, ప్రతిదాన్నీ పెద్దవి చేసి భూతద్దంలో చూడలేదు. కొడుకు ఆర్ధిక వ్యవహారాల్లో నేను తల దూర్చలేదు" అని వసంత అన్నారు.
ఇదంతా ఎలా సాధ్యమైందని నేను అడిగినప్పుడు వసంత చెప్పిన మాట ఒకటే..
"అతడు నా కొడుకు మాత్రమే కాదు, నా కోడలికి భర్త కూడా అనుకోవాలి. వాళ్ల ఇష్టాయిష్టాలు, పనుల్లో తల దూర్చి, లేని పెద్దరికాన్ని రుద్దకుండా ఇంట్లో కూతురితో మెలిగినట్లు మెలిగితే, సమస్యలెందుకు వస్తాయి" అని అన్నారు.
అలా అని వసంత తన అత్తగారితో కూడా అలానే ఉన్నారా? అని అడిగినప్పుడు.. నవ్వి "లేదు" అని సమాధానమిచ్చారు.
"నన్ను మా అత్తగారు అర్ధం చేసుకోలేదు. ఆవిడ చెప్పేది నాకు నచ్చేది కాదు. మా ఇద్దరి మధ్య ఎందుకో తరాల అంతరం ఉండేది.
కానీ, నేను మా అమ్మ, నానమ్మల మధ్య సయోధ్య చూస్తూ పెరిగాను. అత్తగారు అంటే ప్రేమగా కూడా ఉండొచ్చు అని మా నానమ్మని చూసి నేర్చుకున్నాను. మా అమ్మ, నానమ్మ, అమ్మమ్మ కలిసి ఎడ్ల బండిపై పక్క ఊరికి సినిమాకు వెళుతూ ఉండేవారు.
మా అమ్మ ఆర్‌ఎంపీ డాక్టర్. ఆమె అలిసిపోయి వస్తే మా నానమ్మ భోజనం పెట్టి విసనకర్ర పెట్టి విసురుతూ ఉండేది. ఇవన్నీ చూస్తూ పెరగడం నా కోడలితో బాగా ఉండటానికి నాకు సహకరించాయి " అని అన్నారు వసంత.
వదిన, బావగారు అని పిలవను
వసంత కోడలు సుగుణను ఈ బంధాన్ని ఎలా చూస్తున్నారని నేను అడిగాను.
"పెళ్లయ్యేటప్పటికి నాకు 20 ఏళ్లు. అత్తా మామల నుంచి వేరుగా ఉండాలి, మాకు ప్రైవసీ ఉండాలి.. ఇలాంటి ఆలోచనలు ఆ వయసులో నాకు లేవు.
పెళ్లితో అమ్మ వాళ్ల ఇంటి నుంచి అత్త వాళ్లింటికి వచ్చాను. అక్కడ ఉన్నట్లే ఇక్కడా ఉన్నాను. నా స్వేచ్చకు, జీవితానికి ఇక్కడ ఎలాంటి నిబంధనలు, నియంత్రణలు లేవు. నేను ఎలాంటి డ్రెస్ వేసుకున్నా, ఎలా మాట్లాడినా నన్నెవరూ ఏమీ అనరు.
ఇప్పుడు నాకు అమ్మ లేదు. అత్తయ్యతోనే అన్నీ చెబుతాను. అత్తయ్య తరపు బంధువులందరినీ నా భర్త పిలిచినట్లే అక్క, అన్నయ్య అనే పిలుస్తాను కానీ, వరసలు పెట్టి వదిన, బావగారు... ఇలా పిలవను. ఈ కుటుంబంలో భాగం నేను" అని సుగుణ వివరించారు.
"మా ఇద్దరి మధ్య ఉన్నది ప్రేమ. అదే మేము గత 30 ఏళ్లుగా ఎటువంటి సమస్యలు లేకుండా కలిసి ఉండటానికి సహాయపడుతోంది. భేదాభిప్రాయాలు రావా అంటే వస్తాయి. కానీ ఇద్దరం వాటిని పట్టించుకోం. అవి చాలా క్షణికం" అని సుగుణ అన్నారు.
"కోడలు అంటే స్నేహితురాలిలా ఉండాలనే ఆలోచన ఉండేది మొదట్నుంచీ. అదే మా ఇద్దరి మధ్య బంధానికి నాంది" అని వసంత అంటారు.
అత్తా కోడళ్ల బంధాలు అర్బన్ వాతావరణంలో మాత్రమే కాదు, పల్లెటూర్లలో కూడా చాలావరకు మారుతున్నాయి.

తిప్పరాజుపాలెంకి చెందిన 50 సంవత్సరాల మాణిక్యాంబ ఈ మధ్యనే కొడుకుకు పెళ్లి చేశారు. మాణిక్యాంబ కాజులూరు గ్రామ సర్పంచ్.
ఆమె కొడుకు ఇంజనీర్. కోడలు భార్గవి లండన్‌లో ఎంఎస్ చదువుకుని ఇండియా వచ్చారు. మాణిక్యాంబ పెద్దగా చదువుకోలేదు. అత్తాకోడళ్లిద్దరివీ విభిన్న నేపథ్యాలు.
‘‘లండన్‌లో చదువుకుని పల్లెటూళ్లో అత్తింట్లో ఎలా ఉండగలను అనే సందేహం తలెత్తిందా’’ అని భార్గవిని అడిగాను.
"పెళ్లికి ముందు వాళ్లతో మాట్లాడుతున్నప్పుడు వారి మనస్తత్వాలు అర్ధమయ్యాయి. దీంతో నేను ఉండగలను, కలిసి బతకగలను, కుటుంబంలో కలిసిపోగలను అనిపించింది" అని భార్గవి చెప్పారు.
"పల్లెటూళ్లలో అత్తమామల ఎదుట భర్తను పేరు పెట్టి పిలిస్తే తప్పుగా భావిస్తారు. భర్తకు గౌరవం ఇవ్వడం లేదన్నట్లు చూస్తారు. కానీ, నేను నా భర్తను పేరు పెట్టి పిలిచినా వాళ్లేం అనుకోరు, అభ్యంతరం చెప్పరు. చుట్టు పక్కల వాళ్లు వచ్చి వింతగా చూసినా కూడా వాళ్లు పట్టించుకోరు. ఈ మాత్రం స్వేచ్ఛ చాలు కదా, నేను నాలా ఉండటానికి" అని అన్నారు భార్గవి.

పల్లెటూరులోనే పుట్టి, పెరిగినా.. ఇలాంటి ధోరణి ఎలా వచ్చిందని మాణిక్యాంబను అడిగితే..
''నేను మా అత్తగారి నుంచి ఎలాంటి ప్రేమనూ పొందలేదు. అందుకే నా అనుభవం నేర్పిన పాఠం ఇది. కోడలిని బాగా చూసుకుంటే, ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. నాకు అమ్మాయిలు లేరు. అందుకే కూతురైనా కోడలైనా ఒకటే" అని అన్నారు.
మీ కోడలిలో అన్నీ మీకు నచ్చిన విషయాలే ఉన్నాయా? అని మాణిక్యాంబను అడిగినప్పుడు..
'అన్నీ నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు కానీ, తనేమైనా మార్చుకోగలిగినవి ఉన్నాయనిపిస్తే నెమ్మదిగా చెబుతాను. ఇలా ఉండు అని సలహా ఇస్తాను. రెండు విభిన్న కుటుంబాలు, వేర్వేరు పెంపకాలు, పద్ధతులు, అలవాట్లు, మాట.. వేరుగానే ఉంటాయి. ఆ విభిన్నతను ఆమోదించడమే కదా కుటుంబంలోకి ఆహ్వానించడమంటే" అని అన్నారు.
''నేనేదైనా ఉంటే అత్తయ్యతో చెప్పుకునే స్వేచ్ఛ ఉంది. నన్నేదైనా చేయమని అడిగే లోపు నేనే చేసేస్తూ ఉంటాను. అత్తగారు కూడా పనిలో సహాయం చేస్తూ ఉంటారు'' అని భార్గవి చెప్పారు.
అయితే, వీళ్లిద్దరూ వేర్వేరు ఊళ్లలో ఉంటారు. పండుగలు, ఫంక్షన్స్‌కి మాత్రమే కలుస్తూ ఉంటారు. కానీ, కలిసినప్పుడు కలహాలు ఉండవు.
"ముఖ్యంగా నాకు అత్తగారి నుంచి రూల్స్ ఏమీ లేవు. అందుకే హ్యాపీగా ఉండగలుగుతున్నా" అని భార్గవి నాతో చెప్పారు.
'స్వతంత్ర భావాలు ఉంటే భరించలేరు'
ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవు... ఈ సామెత అత్తా కోడళ్లను ఉద్దేశించి పుట్టినదే. ఈ ఇద్దరికీ ఎందుకు పడదు అనేది మిలియన్ డాలర్ ప్రశ్న.
"భర్త తన సొంతం అని కోడలు అనుకుంటుంది. కొడుకును తన దగ్గర్నుంచి లాక్కున్నారని తల్లి అనుకుంటుంది. ఇద్దరి మధ్య ప్రేమ ఉండదు. సమాజం కోడలు ఎలా ఉండాలి అనేది ఒక ఫ్రేమ్ వర్క్‌లో చూస్తుంది. పోటీ తత్త్వం, అసూయ, ప్రాథమిక కారణాలు" అని విశాఖపట్నానికి చెందిన కన్సల్టెంట్ సైకాలజిస్ట్ అరుణశ్రీ అంటున్నారు.
"రెండు తరాలు, రెండు కుటుంబాలు, రెండు విభిన్న నేపథ్యాలు - వీటి మధ్య సయోధ్య కుదరడం అంత సులభంగా సాధ్యపడే విషయం కాదు. సామాజిక నేపథ్యం కూడా కొంత వరకు కారణం. నేను మా అత్తగారి చేతిలో బాధలు పడ్డాను. అలాంటప్పుడు నా కోడలు ఎందుకు సంతోషంగా ఉండాలనే సంకుచిత స్వభావం కూడా కొంత వరకు అంతరాలకు దారి తీస్తుంది" అని అరుణశ్రీ అన్నారు.
"చాలా కుటుంబాల్లో స్వతంత్ర భావాలున్న కోడలిని భరించలేరు. కోడలు అంటే ఎదురు ప్రశ్నించకూడదు. తమ పద్ధతులను అలవాటు చేసుకోవాలంటూ నియంత్రణ పెట్టాలని చూస్తారు. మరోవైపు స్వతంత్ర భావాలతో పెరిగిన అమ్మాయిలెవరూ మరొకరి ఆధిపత్యాన్ని కానీ, పెత్తనాన్ని కానీ, సహించడానికి సిద్ధంగా ఉండటం లేదు. అహం దెబ్బ తిని, చిలికి చిలికి గాలి వానలా మారుతుంది’’ అని అరుణశ్రీ వివరించారు.
"అత్తగారు అనే సరికి అధికారానికి ప్రతినిధిగా చూసే సంస్కృతి ఇటీవల మారింది. కోడలు కూడా నా లాంటి స్త్రీ అనే భావన బాగా పెరిగింది. కోడలి చదువును, ఉద్యోగాన్ని ప్రశంసిస్తూ, నలుగురిలో ఒక స్నేహితురాలిలా చూస్తున్నారు.
విద్య ముఖ్య పాత్ర పోషిస్తోంది. అత్తా కోడళ్ల మధ్య ఓపెన్‌నెస్ పెరిగింది. అత్తగారితో నేరుగా మాట్లాడటం వల్ల చాలా సమస్యలు మాసిపోతున్నాయి. వాళ్లిద్దరూ బాగా ఉండటం వల్ల కొడుకులు కూడా సంతోషంగా ఉన్నారు. ఎవరి హద్దులు వాళ్లు సెట్ చేసుకుంటున్నారు.
ఏదైనా మొదటి మీటింగ్‌లో.. లవ్ ఎట్ ఫస్ట్ సైట్‌లో ఒకరి మీద ఒకరికి కలిగే ఇంప్రెషన్ ఏదైతే ఉంటుందో అది పునాదిగా మారుతుంది" అని అరుణశ్రీ చెప్పారు.
అధికారిక లెక్కలేం చెబుతున్నాయి?
నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) 2023లో విడుదల చేసిన నివేదిక ప్రకారం 2022లో భారత్‌లో మహిళలపై జరిగే నేరాల్లో 4% పెరుగుదల ఉన్నట్లు తెలిసింది. ఇందులో ఎక్కువగా భర్త, అతని తరపు బంధువుల వేధింపులు, అపహరణలు, దాడులు, అత్యాచారాలు ఉన్నాయి.
2020లో 3,71,503 ఉన్న మహిళలపై వేధింపుల కేసులు 2022 నాటికి 4,45,256 కు పెరిగాయి. భర్త, అతని తరపు బంధువుల కారణంగా వేధింపులకు గురైనవారి కేసులు 31.4% ఉన్నాయి.
వరకట్న నిరోధక చట్టం కింద 13,471 కేసులు నమోదు చేస్తే, భర్త, అతని తరపు బంధువుల చేతుల్లో వేధింపులకు గురైన కేసులు దాదాపు 1.4 లక్షలున్నాయి.
దిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో మహిళలపై నేరాల కేసులు ఎక్కువగా నమోదయ్యాయి.
అత్తాకోడళ్ల మధ్య అపార్థాలకు తావులేకుండా, ఒకరినొకరు అర్థం చేసుకుంటే ఈ తరహా నేరాలు చాలా వరకు తగ్గే అవకాశం ఉందని అరుణశ్రీ అభిప్రాయపడ్డారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














