ఆ చిన్నారి ఎవరు? గాజా బందీల ఫోటోలో ఎందుకు కనిపిస్తోంది?

ఫొటో సోర్స్, Supplied
- రచయిత, ఫెర్గల్ కీన్
- హోదా, ప్రత్యేక ప్రతినిధి
గుంపుగా, అర్ధనగ్నంగా కూర్చుని ఉన్న కొందరు మగవాళ్ల మధ్య ఆ చిన్నారిని అలా చూడడం చాలా బాధ కలిగిస్తుంది. గుంపులో కాస్త వెనకాల చిన్న పాప కనిపిస్తోంది.
అండర్‌వేర్ మినహా ఒంటిపై మిగిలిన దుస్తులన్నీ తొలగించాలని సైనికులు మగవారిని ఆదేశించారు. వారిలో కొంతమంది వృద్ధులు కూడా ఉన్నారు. వారంతా తమను ఫోటో తీసేవారి వైపు చూస్తున్నారు. ఆ ఫోటో తీసేది కచ్చితంగా ఇజ్రాయెల్ సైనికులే అయ్యుంటారు.
ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్)తో దగ్గరి సంబంధాలున్న ఓ జర్నలిస్ట్ తన టెలిగ్రామ్ అకౌంట్‌లో మొదట ఈ ఫోటోను పోస్ట్ చేశారు.
ఫోటోలో మగవాళ్లు భయం, నిరాశానిస్పృహలు, అసహ్యభావనతో కనిపిస్తున్నారు. ఈ ఫోటోలో చిన్న బాలికను బీబీసీ ప్రొడ్యూసర్ గుర్తించారు. ఆమె దూరంగా ఏదో చూస్తోంది. కెమెరా వైపు చూడట్లేదు. అటువైపు ఆమె దృష్టినేదో ఆకర్షించి ఉండొచ్చు. లేదంటే సైనికుల వైపు, వారి తుపాకుల వైపు చూడడం ఆ చిన్నారికి ఇష్టం లేకపోయుండొచ్చు.
అక్కడితో ఆగిపోవాలని మిలటరీ ప్రజలకు చెప్పింది.
బాంబు పేలుళ్లలో ధ్వంసమైన భవనాలు వారి వెనక చాలా కనిపిస్తున్నాయి. హమాస్‌తో వారికి సంబంధాలున్నాయనడానకి ఏమన్నా ఆధారాలు దొరకుతాయేమో అన్న ఉద్దేశంతో ఇజ్రాయెల్ సైనికులు ఆ పురుషులను తనిఖీ చేస్తున్నారు. ఆయుధాల కోసం, ఇతర పత్రాల కోసం వెతుకుతున్నారు.


ఆ పాప ఎవరు? ఆ చిన్నారికి ఏం జరిగింది...?
ఆ చిన్నారి అక్కడ ఉండడం, దూరంగా చూస్తున్న ఆమె చూపులు, అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.
ముందుగా వచ్చే ప్రశ్న... ఆ పాప ఎవరు? ఆమెకేమైంది?
ఈ ఫోటోను వారం కిందట తీశారు.
ఆ వారంలో వందల మంది చనిపోయారు. అనేకమంది గాయపడ్డారు. వేల మంది తమ ఇళ్ల నుంచి చెల్లాచెదురైపోయారు. వైమానిక దాడులు మిగిల్చిన శిథిలాల కింద చిన్నారులు చనిపోయారు. మందులు లేక, తమకు చికిత్స అందించేవాళ్లు లేక పిల్లలు కన్నుమూశారు.
బీబీసీ అరబిక్ గాజా బృందంతో కలిసి ఆ చిన్నారి కోసం వెతకడం ప్రారంభించాం. గాజా నుంచి స్వతంత్రంగా రిపోర్ట్ చేయడానికి బీబీసీని గానీ, ఇతర అంతర్జాతీయ మీడియాను గానీ ఇజ్రాయెల్ అనుమతించడంలేదు. దీంతో బీబీసీ నమ్మదగ్గ ఫ్రీలాన్స్ జర్నలిస్టుల నెట్‌వర్క్‌పై ఆధారపడింది.
ఉత్తర గాజా ప్రాంతంలోని సహాయకబృందాల దగ్గర తమకు తెలిసినవారిని మా కొలీగ్స్ సంప్రదించారు. ప్రజలు ఇళ్ల నుంచి వెళ్లిపోయిన ప్రాంతాల్లో ఆ ఫోటో చూపిస్తూ పాప సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేశారు.
48 గంటల్లోనే మాకు కోరుకున్న సమాధానం వచ్చింది. ‘‘మేం చిన్నారిని గుర్తించాం’ అనే మెసేజ్‌ను ఫోన్‌లో చదివాం.
చిన్నారి పేరు జూలియా అబు వర్డా. ఆమె బతికి ఉంది. గాజా నగరంలో ఆమె కుటుంబం ఉన్న ఇంటికి మా జర్నలిస్టులు వెళ్లేటప్పటికీ జూలియా తన తల్లి, తండ్రి, తాతతో కలిసి ఉంది. జబాలియా ప్రాంతంలోని ఇళ్లను విడిచిపెట్టి వచ్చిన వారు చాలా మంది గాజా నగరంలో ఉంటున్నారు.
బీబీసీ జర్నలిస్టులు వెళ్లేటప్పటికి కోడిపిల్లలు పాడుతున్న కార్టూన్‌ను జూలియా చూస్తోంది. కానీ పైనుంచి వస్తున్న ఇజ్రాయెల్ డ్రోన్ ధ్వని కారణంగా, తనకు ఆ కార్టూన్ సౌండ్ సరిగ్గా వినిపించడం లేదు.
తెలియనివారు వచ్చి అకస్మాత్తుగా తనని చూస్తుండడం జూలియాకు ఆశ్చర్యంగా అనిపించింది.
‘‘నువ్వెవరు?’’ అని జూలియా తండ్రి నవ్వుతూ ఆమెను అడిగారు.
ప్రతి అక్షరాన్ని నొక్కి చెబుతూ ‘‘జూలియా’’ అని ఆమె సమాధానమిచ్చింది.
జూలియా శరీరంపై ఎలాంటి గాయాలూ కాలేదు. జీన్స్, జంపర్ వేసుకుంది. రెండు పిలకలు వేసుకుని బ్లూ కలర్ పూల రబ్బర్ బ్యాండ్‌లు పెట్టుకుంది.
కానీ ఆ చిన్నారి చూపుల్లో ఆందోళన కనిపిస్తోంది.

ఆ ఫోటోలో చిన్నారి ఎందుకుంది?
ఆ ఫోటో వెనక ఉన్న కథను చిన్నారి తండ్రి మొహమ్మద్ చెప్పడం ప్రారంభించారు.
గడచిన 21 రోజుల్లో ఆ చిన్నారి కుటుంబం ఏడుసార్లు ఒకచోట నుంచి మరో చోటకు మారింది. ప్రతీసారీ ఆ కుటుంబం వైమానిక దాడులు, తుపాకుల కాల్పుల నుంచి తప్పించుకునేందుకు పరుగులు తీసింది.
ఆ ఫోటో తీసిన రోజు... ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలంటూ ఇజ్రాయెల్ డ్రోన్ చేస్తున్న హెచ్చరిక సందేశాన్ని వారు విన్నారు. హమాస్‌పై ఇజ్రాయెల్ పట్టు సాధించిన అల్-ఖలూఫా జిల్లాలో ఆ ప్రాంతం ఉంది.
‘‘ఆ రోజు అక్కడ కొంతమేర కాల్పులు జరిగాయి. దాంతో జబాలియా శరణార్థి శిబిరం వైపు వెళ్లేదారిలో చెక్‌పాయింట్ వైపు వెళ్లాం’’ అని మొహమ్మద్ చెప్పారు.
దుస్తులు, ఆహార పొట్లాలతో పాటు మరికొంత వ్యక్తిగత సామాగ్రి తీసుకుని ఆ కుటుంబం బయలుదేరింది.
మొదట్లో అందరూ కలిసే ఉన్నారు. జూలియా తల్లి అమల్, తండ్రి మొహమ్మద్, ఆమె 15 నెలల తమ్ముడు హమ్జా, తాత, ఇద్దరు బంధువులు, ఒక కజిన్ అంతా కలిసి బయలుదేరారు.
కానీ తర్వాత మొహమ్మద్, జూలియా మిగిలిన కుటుంబ సభ్యుల నుంచి విడిపోయారు.
‘‘గుంపుతో కలిసి నడిచే క్రమంలో నేను, జూలియా విడిపోయాం. జూలియా తల్లి అక్కడి నుంచి వెళ్లిపోగలిగారు. నేను అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది’’ అని మొహమ్మద్ చెప్పారు.
తర్వాత తండ్రి, కూతురు గుంపుతో కలిసి అక్కడి నుంచి ముందుకు కదిలారు. వాళ్లు వెళ్లేదారిలో వీధులన్నీ మృతదేహాలతో నిండి ఉన్నాయి.
‘‘విధ్వంసాన్ని, నేలపై చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలను మేం చూశాం’’ అని మొహమ్మద్ చెప్పారు.
వాటిలో కొన్నింటినైనా జూలియా చూడకుండా ఆపడానికి అవకాశమే లేదు. సంవత్సరం కాలానికి పై నుంచి సాగుతున్న యుద్ధంలో హింసాత్మక మరణాల దృశ్యాలు పిల్లలకు సాధారణమైపోయాయి.

ఒక్కచోటకు చేరిన జూలియా కుటుంబం
ఇలాంటి బాధాకర దృశ్యాలు చూస్తూనే... ఆ గుంపులోని వారంతా ఇజ్రాయెల్ చెక్‌పాయింట్ చేరుకున్నారు.
‘‘అక్కడ ట్యాంకుల మీద, విడిగా సైనికులున్నారు. వాళ్లు జనం దగ్గరకు వచ్చి... తలలపై గురిపెట్టి కాల్పులు జరపడం ప్రారంభించారు. ఆ కాల్పులతో ప్రజలు ఒకరినొకరు తోసుకోవడం మొదలుపెట్టారు’’ అని మొహమ్మద్ చెప్పారు.
మగవాళ్లందరూ అండర్‌వేర్ తప్ప మిగిలిన దుస్తులన్నీ తొలగించాలని సైనికులు ఆదేశించారు. ఐడీఎఫ్ సహజంగా చేసే తనిఖీలు ఇవి. ప్రజల దగ్గర ఆయుధాలేమైనా ఉన్నాయా? లేక వాళ్లల్లో ఎవరైనా ఆత్మాహుతి దళ సభ్యులున్నారా? అన్న అనుమానంతో ఇలాంటి సోదాలు చేస్తుంటుంది.
చెక్ పాయింట్ దగ్గర ఆరేడు గంటలు ఉన్నామని మొహమ్మద్ చెప్పారు. ఫోటోలో జూలియా మౌనంగా ఉన్నట్టు కనిపిస్తోంది. కానీ ఆ తర్వాత జూలియా ఎలా ప్రవర్తించిందో తండ్రి గుర్తుచేసుకున్నారు.
‘‘జూలియా ఏడవడం మొదలుపెట్టింది. అమ్మ కావాలని మారాం చేసింది’’ అని మొహమ్మద్ తెలిపారు.
జూలియా కుటుంబం మొత్తం తిరిగి కలుసుకుంది. చెల్లాచెదురైనవాళ్లంతా చిన్న చిన్న ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఆ కుటుంబంలో బంధం బలంగా ఉంది. తనను ప్రేమించే వాళ్ల మధ్య జూలియా సురక్షితంగా ఉంది. వాళ్ల దగ్గర స్వీట్లు, బంగాళదుంప చిప్స్ ఉన్నాయి.

ఫొటో సోర్స్, Reuters
జూలియా అదృష్టవంతురాలు అనగలమా?
జబాలియా నుంచి గాజా నగరానికి వచ్చే ముందు రోజు ఏం జరిగిందో, జూలియా ఎంతటి బాధలో ఉందో అపుడు మొహమ్మద్ మా కొలీగ్స్‌కు చెప్పారు.
జూలియాకు ఇష్టమైన ఓ కజిన్ ఉన్నారు. ఆ బాలుడి పేరు యాహ్యా. వయసు ఏడేళ్లు. జూలియా, యాహ్యా కలిసి వీధుల్లో ఆడుకునేవారు. దాదాపు రెండు వారాల కిందట యాహ్యా వీధిలో ఆడుకుంటోంటే, ఇజ్రాయెల్ డ్రోన్ దాడి చేసింది. ఆ దాడిలో యాహ్యా చనిపోయారు.
‘‘ఇప్పుడు జీవితం సాధారణంగానే ఉంది. జూలియా ఆడుకుంటోంది. పరుగులు తీస్తోంది. కానీ కాల్పుల మోత ఎప్పుడు వినిపించినా జూలియా పరిగెత్తుకుంటూ వచ్చి విమానం అని అరుస్తోంది. ఆమె చూపించిన వైపు మేం చూస్తే.. మా పైన డ్రోన్ ఎగురుతుంటుంది’’ అని మొహమ్మద్ చెప్పారు.
ఐక్యరాజ్యసమితి పిల్లల సంస్థ యునిసెఫ్ అంచనా ప్రకారం ఇప్పటిదాకా జరిగిన యుద్ధంలో 14 వేల మంది చిన్నారులు మరణించారు.
‘‘తాము మొదలు పెట్టని యుద్ధానికి ప్రతిరోజూ ఆ చిన్నారులు మూల్యం చెల్లిస్తున్నారు’’ అని యునిసెఫ్ ప్రతినిధి జొనాథన్ క్రిక్స్ ఆవేదన వ్యక్తంచేశారు.
‘‘నేను కలిసిన చిన్నారుల్లో ఎక్కువ మంది భయంకరమైన పరిస్థితుల మధ్య తమకిష్టమైన వారిని పోగొట్టుకున్నవారే’’ అని క్రిక్స్ తెలిపారు.
ఐక్యరాజ్యసమితి అంచనా ప్రకారం గాజా స్ట్రిప్‌లోని దాదాపు పిల్లలందరికీ అంటే సుమారు పదిలక్షలమంది చిన్నారులకు మానసిక చికిత్స అవసరం.
జూలియా ఏం చూసింది? ఏం పోగొట్టుకుంది? ఎలాంటి పరిస్థితుల్లో చిక్కుకుని ఉంది వంటివన్నీ గమనించినప్పుడు ఆమెను అదృష్టవంతురాలు అనుకోలేం. రానున్న రోజుల్లో ఆ చిన్నారికి ఎలాంటి కలలు వస్తాయో.. ఏ జ్ఞాపకాలు వెంటాడతాయో ఎవరికి తెలుసు. ఊహించలేనంత అకస్మాత్తుగా జీవితం ముగిసిపోతుందని ఇప్పటికే ఆమెకు తెలుసు.
వైమానిక దాడులు, తుపాకీ కాల్పులు, ఆకలి, వ్యాధుల పరిస్థితుల మధ్య కూడా జూలియాను రక్షించేందుకు చేయగలిగిందంతా చేసే కుటుంబంలో ఉండడం ఆమె అదృష్టం.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














