ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్: పని భారాన్ని తగ్గించడానికి బదులు పెంచుతోందా?
- పని భారం తగ్గించడానికి ఏఐ టూల్స్ ఉపయోగపడతాయనుకున్నారు.
- కానీ, ఏఐ టూల్స్ వల్ల పని భారం పెరుగుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి.
- ఒక్కోసారి తప్పుడు సమాచారం రావడంవల్ల సమస్యలు ఏర్పడుతున్నాయి.
- నిరంతరం వస్తున్న అప్‌డేట్స్‌తో ఇబ్బందిగా ఉందన్నది ఉద్యోగుల మాట.
- టూల్స్ వాడకమే కాదు, వాటి గురించి తెలుసుకోవాలని నిపుణులు అంటున్నారు.
- రచయిత, మెరిలు కోస్టా
- హోదా, బీబీసీ ప్రతినిధి

ఫొటో సోర్స్, Getty Images
2022లో చాట్‌జీపీటీ వెలువడినప్పుడు, తన ఆఫీసు పనుల్లో దీని సాయం తీసుకోవడానికి పబ్లిక్ రిలేషన్స్ ఏజెన్సీ వ్యవస్థాపకుడు అనురాగ్ గార్గ్ చాలా ఉత్సాహపడ్డారు.
బిజినెస్‌లో ప్రత్యర్థి కంపెనీలతో పోటీ పడేందుకు ఇది ఉపయోగపడుతుందని ఆయన అనుకున్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్‌ను వాడేలా తన సంస్థలోని ఉద్యోగులను కూడా ప్రోత్సహించారు.
ఈ ఏజెన్సీ తన క్లయింట్లకు స్టోరీ ఐడియాలు, మీడియా ప్రతిపాదనలు, ఇంటర్వ్యూ నోట్స్, సమావేశాలకు సంబంధించిన అంశాలను అందిస్తుంది.
అయితే ఏఐ టూల్స్ ఉపయోగించడం మొదలు పెట్టిన తర్వాత సంస్థలోని ఉద్యోగుల పని భారం తగ్గడం కాకుండా పెరగడం మొదలైంది.
దీంతో ఉద్యోగులు వాటిని పక్కనబెట్టడం మొదలుపెట్టారు. ఈ టూల్స్ వాడటం కోసం చాలా టైమ్ కేటాయించాల్సి వస్తోందని వాళ్లు అంటున్నారు.


ఫొటో సోర్స్, Anurag Garg
చాట్ జీపీటీని ఉపయోగించడానికి ముందు దాన్ని సిద్ధం చెయ్యాలి. తర్వాత దాని నుంచి సేకరించిన సమాచారాన్ని పరిశీలించాలి. అందులో చాలా తప్పులు ఉంటున్నాయి.
కొన్ని సందర్భాల్లో చాట్ జీపీటీలో ఏవైనా అప్‌డేట్స్ వస్తే ఉద్యోగులు వాటిని నేర్చుకోవాలి. దీనికి అదనపు సమయం కేటాయించాల్సి వస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
రెట్టింపవుతున్న పని గంటలు
“ఇందులో పనికిరాని అంశాలు అనేకం ఉన్నాయి. ఈ టూల్స్ వాడటం మొదలు పెట్టినప్పటి నుంచి పని పూర్తి చెయ్యడానికి రెట్టింపు సమయం పడుతోందని ఉద్యోగులు నాతో చెప్పారు” అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వాడకం గురించి అనురాగ్ గార్గ్ చెప్పారు.
“వాళ్లు ఏఐ టూల్స్ అన్నీ ఉపయోగించాలని మేము కోరుకున్నాం. అందువల్లే ఇలా జరిగి ఉండొచ్చు” అని ఆయన అన్నారు.
“ఏఐ టూల్స్ వాడకాన్ని ప్రోత్సహించడం వెనుక ముఖ్య ఉద్దేశం ఉద్యోగుల పని భారం తగ్గించడమే. అయితే వాస్తవంలో ఇందుకు వ్యతిరేకంగా జరుగుతోంది” అని అనురాగ్ గార్గ్ అన్నారు.
మార్కెట్‌లోకి ఏఐ టూల్స్ వెల్లువలా వచ్చాయని, ఒక్క టూల్ సాయంతో అనేక సమస్యల్ని ఒక్కసారే పరిష్కరించలేమని ఆయన చెప్పారు. ప్రస్తుతం అన్ని పనులకు ఏఐ టూల్స్‌ను వాడొద్దని గార్గ్ తన టీమ్ సభ్యులకు చెప్పారు.
దీంతో ప్రాథమిక దశలో కొంత పరిశోధన కోసం మాత్రమే ఆయన టీమ్ ఏఐ టూల్స్‌ను వాడుతోంది. ఈ మార్పు తర్వాత ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఫొటో సోర్స్, Gemma Shoots People
సర్వేలో ఏం తేలింది?
గార్గ్, ఆయన సంస్థలో ఉద్యోగులు అనుభవించిన ఒత్తిడి ఇటీవలి పరిశోధనలో వెల్లడైంది.
ఏఐ టూల్స్ వాడకంలో ఎదురవుతున్న ఒత్తిడి గురించి “అప్‌వర్క్” అనే ఫ్రీలాన్సర్ ఫ్లాట్‌ఫామ్ అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడాకు చెందిన 2500 మంది ఉద్యోగులతో ఒక సర్వే నిర్వహించింది.
వీరిలో 96 శాతం మంది ఏఐ టూల్స్ వినియోగం వల్ల తమ కంపెనీ ఉత్పాదకత పెరుగుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. 81 శాతం మంది తమ ఉద్యోగులను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించాల్సిందిగా కోరినట్లు తెలిపారు.
సర్వేలో పాల్గొన్న 77 శాతం మంది ఉద్యోగులు ఏఐ టూల్స్ తమ ఉత్పాదకతను తగ్గించి, పనిని పెంచాయని అంగీకరించారు.
కంపెనీ యజమానుల అంచనాలకు అనుగుణంగా ఉత్పాదకతను ఎలా, ఎంతమేరకు పెంచవచ్చనే దాని గురించి తమకు తెలియదని 47 శాతం మంది ఉద్యోగులు చెప్పారు.
పనిలో ఏఐ సాధనాలను ఉపయోగించడం వల్ల ఒత్తిడి, చికాకు పెరిగే అవకాశాలు పెరుగుతాయని 61 శాతం మంది అభిప్రాయపడ్డారు.
ఏఐ టూల్స్ తమ వృత్తి, వ్యక్తిగత జీవితాలను బ్యాలన్స్ చేస్తున్నాయని 43 శాతం మంది చెప్పినట్లు ఉద్యోగాలకు దరఖాస్తులు, రెజ్యుమేలు రాసే సంస్థ రెజ్యుమే నౌ చేసిన సర్వేలో వెల్లడైంది.
పని ఆధారిత యాప్‌ల వల్ల ఏర్పడిన ప్రభావాల గురించి వర్క్ మేనేజ్‌మెంట్ ప్లాట్‌ఫామ్ ‘అసాన’ ఒక అధ్యయనం నిర్వహించింది.
ఈ సర్వేలో ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, బ్రిటన్, అమెరికాకు చెందిన 9,615 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. వర్క్‌ప్లేస్‌లో 6 నుంచి 15 యాప్‌లను వాడుతుంటామని వారు చెప్పారు.
కుప్పలు తెప్పలుగా ఉన్న టూల్స్ కారణంగా కొన్ని సార్లు తమకు వస్తున్న సందేశాలు, నోటిఫికేషన్లను కూడా చెక్ చెయ్యడం మర్చిపోతున్నట్లు 15శాతం మంది చెప్పారు.

ఫొటో సోర్స్, Flown
నిపుణులు ఏం చెబుతున్నారు?
అసాన నిర్వహించిన అధ్యయనంపై లాస్ ఏంజిల్స్‌లోని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో మేనేజ్‌మెంట్ ప్రొఫెసర్ కేసీ హోమ్స్ కీలక వ్యాఖ్యలు చేశారు.
"ఒకటి కంటే ఎక్కువ యాప్‌లను ఉపయోగించాలంటే, ముందు వాటి గురించి తెలుసుకోవాలి. దీనికి చాలా సమయం పడుతుంది." అని ఆమె చెప్పారు
“యాప్‌లు మార్చడానికి సమయం పోతోంది. ఇది అంత మంచిది కాదు. ఎందుకంటే మన జీవితంలో టైమ్‌కు చాలా విలువుంది.’’ అన్ని అన్నారామె.
లియా స్టీలే న్యాయవాద వృత్తి నుంచి మెంటల్ స్ట్రెస్ కోచ్‌గా మారారు. న్యాయ నిపుణులు మానసిక ఒత్తిడి సమస్యల నుంచి బయటపడేందుకు ఆమె సాయం చేస్తున్నారు.
ఆమె వద్దకు వస్తున్న వారిలో ఎక్కువ మంది ప్రస్తావిస్తున్న సమస్య...ఏఐ టూల్స్ రాకతో, వారు పని చేస్తున్న సంస్థలు వారి నుంచి ఎక్కువ ఫలితాలను ఆశిస్తున్నాయని.
ఏఐ ఆధారిత సాధానలతో వారిపై పనిభారం పెరుగుతోంది.
" తక్కువ వనరులతో ఎక్కువ పని చెయ్యాలనే డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. అయితే తాము అందిస్తున్న సాంకేతికత, అనుసరిస్తున్న విధానాల వల్ల అది సాధ్యం కావడం లేదని కంపెనీలు గుర్తించడం లేదు” అని స్టీలే చెప్పారు.
“టెక్నాలజీ చాలా వేగంగా మారిపోతోంది. దానితో పోటీ పడుతూ ఎప్పటికప్పుడు అప్‌డేట్ కావడం, అందులో నైపుణ్యం సాధించడం చాలా ఒత్తిడితో కూడుకున్న వ్యవహారం” అని ఆమె అన్నారు.
అభివృద్ధి చెందిన దేశాల్లో న్యాయవాదులు తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. అయితే ఇది కేవలం సాంకేతిక పరిజ్ఞానం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వల్ల వచ్చిన సమస్య కాదు. వాటి ప్రభావం వల్ల ఏర్పడిన సమస్య అని స్టీలే అన్నారు.
తమ పనిలో ఏఐ టూల్స్ ఉపయోగించుకోవడానికి న్యాయ సంస్థలలో ఉన్నత స్థాయిలోని వ్యక్తుల సహకారం తీసుకోవడం అవసరమని లా సొసైటీ ఆఫ్ ఇంగ్లండ్ అండ్ వేల్స్‌కు చెందిన లాయర్లు అంగీకరించారు.
"ఆ టూల్స్‌ను నేర్చుకోవడానికే కాదు, వాటితో పని చెయ్యడానికి కూడా సమయం పడుతుంది" అని న్యాయవాది అట్కిన్సన్ అన్నారు.
"ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న సాంకేతికపరమైన టూల్స్ చాలా వరకు న్యాయ విభాగం కోసం రూపొందించినవి కాదు. లీగల్ వ్యవహారాల్లో వాటి ఉపయోగం కచ్చితంగా కష్టమైన పనే.” అని ఆయన అన్నారు.
అలీసియా నవారో 'ఫ్లోన్' అనే ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్ వ్యవస్థాపకురాలు.
ఈ ప్లాట్‌ఫామ్ ప్రజలు ‘డీప్ వర్క్’ పై దృష్టి పెట్టడంలో సహాయపడుతుంది.
ప్రస్తుతం ఏఐ టూల్స్ వరదలా వస్తున్నాయని, వాటిని సరిగ్గా ఉపయోగించాల్సిన అవసరం ఉందని ఆమె అంగీకరిస్తున్నారు.
"ఈ సాధనాలతో మన జీవితంలో మెరుగైన ఉత్పత్తి సాధించగలం. అయితే దీనికి ముందు వీటి గురించి శిక్షణ తీసుకోవడం అవసరం” అని ఆమె చెప్పారు.
పరిమిత వనరులు ఉన్న చిన్న కంపెనీలకు ఏఐ టూల్స్ గొప్ప సహాయకారిగా ఉంటాయని ఆమె భావిస్తున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














