విదేశాల్లోని చైనా కార్మికులపై దాడులు పెరుగుతున్నాయి ఎందుకు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జెరెమీ హోవెల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
పాకిస్తాన్‌లో చైనా కార్మికులే లక్ష్యంగా ఈ మధ్య కాలంలో దాడులు జరగడంపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. పాకిస్తాన్‌లో చైనీయులే లక్ష్యంగా గడచిన ఆరు నెలల్లోనే రెండు సార్లు తీవ్రవాద దాడులు జరిగాయని, ఇలాంటి చర్యలను ఏమాత్రం ఉపేక్షించలేమని చైనా వ్యాఖ్యానించింది. దోషులను కఠినంగా శిక్షించాలని, చైనా వ్యతిరేక తీవ్రవాద గ్రూపులను కట్టడి చేయాలని పాకిస్తాన్‌లోని చైనా రాయబారి జియాంగ్ జైడాంగ్ డిమాండ్ చేశారు.
పాకిస్తాన్‌లోని కరాచీ విమానాశ్రయం దగ్గర అక్టోబర్ 6న జరిగిన అనుమానాస్పద ఆత్మాహుతి దాడిలో ఇద్దరు చైనీయులు మరణించారు, పలువురు గాయపడ్డారు. ఈ దాడికి తామే బాధ్యులమని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్‌ఏ) ప్రకటించుకుంది. అంతకు ముందు ఇదే ఏడాది మార్చిలో కూడా చైనీయులే లక్ష్యంగా పాకిస్తాన్‌లో తీవ్రవాద దాడి జరిగింది.
ఇటీవలి సంవత్సరాలలో పాకిస్తాన్‌తో పాటు చాలా దేశాలలో చైనా వర్కర్లపై దాడులు పెరిగాయి.
చాలా దేశాల్లో అభివృద్ధి ప్రాజెక్టుల కోసం 5 లక్షల మందికి పైగా చైనా కార్మికులు పనిచేస్తున్నారు. వారిలో చాలామంది రాజకీయంగా అస్థిర పరిస్థితులు నెలకొన్న ప్రాంతాలలో ఉన్నారు. అయితే, ఆయా దేశాల్లో చైనా కార్మికులపై తరచూ దాడులు జరుగుతున్నాయి.


ఫొటో సోర్స్, Getty Images
పాకిస్తాన్ ప్రభుత్వం ఏమంటోంది?
కరాచీ సమీపంలోని పోర్ట్ ఖాసిమ్‌లో పవర్ ప్లాంట్ నిర్మాణం జరుగుతోంది. ఈ ప్లాంట్‌కు సంబంధించిన వర్కర్లను అక్టోబరు 6న ఒక వాహనంలో తీసుకెళ్తుండగా, కరాచీ విమానాశ్రయం సమీపంలో బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో వాహనంలోని ఇద్దరు చైనీస్ వర్కర్లు మరణించారు. 10 మంది దాకా గాయపడ్డారు.
"చైనీస్ టాప్ ఇంజనీర్లు, పెట్టుబడిదారుల వాహనాలను లక్ష్యంగా చేసుకున్న ఆత్మాహుతి దాడి ఇది" అని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పేర్కొంది.
పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ ఈ దాడిని "హేయమైన చర్య"గా పేర్కొన్నారు. ‘‘బాధ్యులు శిక్ష నుంచి తప్పించుకోలేరు’’ అని పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయం హెచ్చరించింది.
బలూచిస్తాన్ ప్రజలకు ‘ప్రత్యేక మాతృభూమి’ కోసం బీఎల్ఏ చాలా కాలంగా ఉద్యమిస్తోంది. ఈ ఏడాది మార్చిలో బలూచిస్తాన్‌లో చైనా కంపెనీలు అభివృద్ధి చేస్తున్న గ్వాదర్ పోర్ట్ సమీపంలోని వైమానిక స్థావరంపై కూడా దాడి చేసినట్లు బీఎల్ఏ అంగీకరించింది.
అంతేకాదు, 2022 ఏప్రిల్‌లో కరాచీ విశ్వవిద్యాలయంలో చైనీస్ ఆధ్వర్యంలో నడిచే కన్‌ఫ్యూషియస్ ఇన్‌స్టిట్యూట్ సమీపంలో జరిగిన ఆత్మాహుతి దాడిలో ముగ్గురు చైనీస్ విద్యావేత్తలను, వారి పాకిస్తానీ డ్రైవర్‌ను చంపినట్లు బీఎల్ఏ చెప్పింది.
తమ ప్రావిన్స్‌లోకి వస్తున్న విదేశీ పెట్టుబడుల నుంచి లేదా అక్కడ విదేశీ కంపెనీల ద్వారా జరిగే ఖనిజాల వెలికితీతలో(చమురు వంటివి) బలూచ్ ప్రజలకు న్యాయమైన వాటా దక్కడం లేదని బీఎల్ఏ వాదిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
విదేశాల్లో ఎంతమంది పని చేస్తున్నారు?
చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాల (2022) ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా చైనీస్ కంపెనీలు నిర్మిస్తున్న ప్రాజెక్టుల కోసం దాదాపు 5,68,000 మంది చైనీయులు విదేశాల్లో పనిచేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది చైనా ప్రతిష్ఠాత్మక బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (బీఆర్ఐ) ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు.
రోడ్డు, రైలు మార్గాలు, ఓడరేవులు, పవర్ స్టేషన్లు వంటి వాటిని మెరుగుపరిచే ఈ బీఆర్ఐ ప్రాజెక్టుల కోసం రూ. 83 లక్షల కోట్లకు పైగా (1 ట్రిలియన్ డాలర్లు) ఖర్చు చేస్తున్నారు.
చైనా ఎగుమతుల కోసం కొత్త మార్గాలను రూపొందించడం, బీఆర్ఐ ప్రాజెక్ట్‌పై సంతకం చేసిన ఆయా దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను చైనాతో మెరుగుపరచడానికి ఈ నిర్మాణాలు చేపడుతున్నారు.
బీఆర్ఐ అతిపెద్ద ప్రాజెక్టులలో చైనా-పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ (సీపీఈసీ) ఒకటి. ఈ ప్రాజెక్టులో భాగంగా చైనా పశ్చిమ సరిహద్దు నుంచి పాకిస్తాన్ గుండా అరేబియా సముద్రం తీరంలోని గ్వాదర్ పోర్టు వరకు రోడ్డు, రైలు మార్గాలను నిర్మిస్తున్నారు.
పాకిస్తాన్ మాదిరిగానే కెన్యా, ఇథియోపియా, సెనెగల్‌తో సహా ఆఫ్రికాలోని అనేక దేశాలు మెరుగైన రవాణా ఇంధన మౌలిక సదుపాయాలను నిర్మించడం కోసం చైనా నుంచి వేల కోట్ల రూపాయలను అప్పుగా తీసుకున్నాయి.
కాగా, 'అభివృద్ధి ప్రాజెక్టులు చేపడుతున్న కంపెనీలు కొన్ని ఉద్యోగాలను మాత్రమే స్థానికులకు ఇస్తున్నాయి, ఎక్కువగా చైనీయులనే నియమించుకుంటున్నాయి' అని ఆయా దేశాల ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారు.
"ఆఫ్రికన్ దేశాల్లోని స్థానిక ప్రజలు నిర్మాణ కంపెనీల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కంపెనీలు ఎక్కువగా చైనీస్ వర్కర్లను తీసుకొస్తున్నాయి. కష్టమైన ఉద్యోగాల్లో మాత్రమే ఆఫ్రికన్లను నియమించుకుంటున్నాయనే భావన స్థానిక ప్రజల్లో ఉంది" అని లండన్‌లోని ఎస్ఓఏఎస్ చైనా ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన ప్రొఫెసర్ స్టీవ్ చాంగ్ బీబీసీకి చెప్పారు.
"ఇతర దేశాల్లో పెట్టుబడులతో ఇరుపక్షాలకూ మేలు జరుగుతుందని చైనా చెబుతోంది. కానీ చైనాలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి ఈ దేశాలలోని ఉద్యోగాలు చైనా వర్కర్లకు ఇస్తున్నారు" అని యూకేకు చెందిన విదేశీ వ్యవహారాల థింక్ ట్యాంక్ ‘చాథమ్ హౌస్’ నిపుణులు డా. అలెక్స్ వైన్స్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
కిడ్నాప్‌లు, హత్యలు
విదేశాలలో చైనా పెట్టుబడుల కారణంగా, ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన దేశాలలో మాత్రమే కాకుండా తీవ్రమైన ఘర్షణలు, అస్థిరత కొనసాగుతున్న ప్రాంతాలలో కూడా చైనా వర్కర్లు పని చేస్తున్నారు. ఉదాహరణకు, ప్రపంచ బ్యాంకు వర్గీకరణ ప్రకారం, పాకిస్తాన్ రాజకీయంగా అత్యంత అస్థిరంగా ఉన్న దేశాలలో ఒకటి.
"చైనీస్ ప్రాజెక్టుల్లో పనిచేసే వర్కర్లే లక్ష్యంగా పాకిస్తాన్‌లో 16 దాడులు జరిగాయి. 12 మంది చైనా పౌరులు మరణించారు, 16 మంది గాయపడ్డారు" అని కరాచీలోని బీబీసీ వరల్డ్ సర్వీస్ కరస్పాండెంట్ రియాజ్ సోహైల్ చెప్పారు.
పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలోని బిషామ్ ప్రాంతంలో డసు జలవిద్యుత్ డ్యామ్ దగ్గర పనిచేస్తున్న ఐదుగురు చైనీస్ ఇంజనీర్లను 2024 మార్చిలో చంపడం కూడా వీటిలో ఉన్నాయి.
2018 నవంబర్‌లో కరాచీలోని చైనా రాయబార కార్యాలయంపై దాడి జరిగింది. నలుగురిని సాయుధులు చంపేశారు. ఈ దాడులకు ఏ సంస్థా బాధ్యత వహించలేదు.
ఆఫ్రికాలోని డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో సాయుధ మిలిటెంట్ గ్రూపుల రాజకీయ హింస విస్తృతంగా ఉంది. బంగారు గనులలో పనిచేస్తున్న చైనా కార్మికులపై అనేక దాడులు జరిగాయి.
గత జులైలో ఈశాన్య కాంగోలో చైనా కంపెనీకి చెందిన ఓ బంగారు గని దగ్గర ఆరుగురు చైనా పౌరులను, ఇద్దరు కాంగో సైనికులను సాయుధులు చంపారని రాయిటర్స్ తెలిపింది.
ఈ ఘటనకు పాల్పడిన వారు 'కోఆపరేటివ్ ఫర్ ది డెవలప్‌మెంట్ ఆఫ్ కాంగో' అనే సాయుధ గ్రూపు సభ్యులని పోలీసులు తెలిపారు. కాంగోలో భూమి, సహజ వనరుల నియంత్రణ కోసం పోరాడుతున్న అనేక గ్రూపులలో ఇది ఒకటి.
ఇక నైజీరియాలోని నైజర్ స్టేట్‌లో నిర్మిస్తున్న ఒక డ్యామ్ వద్ద 2022 జనవరిలో ముగ్గురు చైనా కార్మికులను సాయుధులు కిడ్నాప్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ డ్యామ్‌ను చైనా కంపెనీ సినోహైడ్రో నిర్మిస్తోంది.
అమెరికాకు చెందిన పీటర్సన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ (పీఐఈఈ) నివేదిక ప్రకారం.. 'ఆఫ్రికా, ఆగ్నేయాసియాలలోని సాయుధ గ్రూపులు చైనా జాతీయులను కిడ్నాప్ చేయడం లాభదాయకంగా భావిస్తున్నాయి. ఎందుకంటే చైనీయులకు ఉపాధి కల్పించే కంపెనీలు వారిని విడిపించడానికి భారీ మొత్తంలో చెల్లిస్తారని అనుకుంటున్నారు.'
అఫ్గానిస్తాన్‌లో గత రెండు దశాబ్దాల్లో తాలిబాన్లు అనేకసార్లు చైనా కార్మికులను అపహరించారు. డబ్బుల కోసం ఎక్కువగా ఈ పని చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
చైనా ఏం చేస్తోంది?
పీఐఈఈ ప్రకారం.. విదేశాల్లో పనిచేస్తున్న కార్మికులు 'కిడ్నాప్ అయితే డబ్బులు చెల్లించడం, మెరుగైన రక్షణ అందించాలని ఆయా దేశాల్లోని అధికారులపై ఒత్తిడి చేయడం, నేరస్థులను గుర్తించి, అలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా అరికట్టడంలో సహాయపడే నిఘా సాంకేతికతను ఎగుమతి చేయడం' ద్వారా చైనా ప్రభుత్వం, కంపెనీలు దాడులను నిలువరిస్తున్నాయి.
ఆయా దేశాల సైనిక దళాలకు కూడా చైనా శిక్షణ ఇస్తోంది. దీంతో తమ కార్మికులకు మెరుగైన రక్షణ కల్పించవచ్చని భావిస్తోంది. ఆత్మాహుతి బాంబు దాడులు, సాయుధ నేరస్థులు, స్మగ్లర్లను ఎదుర్కోవడానికి చైనా కంపెనీలు తమ సైట్‌లలో ప్రైవేట్ సెక్యూరిటీని ఎక్కువగా నియమించుకుంటున్నాయి.
అయితే, ఆయా దేశాల్లో ఎంత వరకు కల్పించుకోవాలనే దానిపై చైనాకూ పరిమితులు ఉంటాయని పీఐఈఈ పేర్కొంది. అందుకే, చైనీస్ విదేశీ పెట్టుబడులు తరచుగా బలహీనమైన చట్టాలు ఉన్న దేశాలకు వెళ్తాయని ఆరోపించింది.
పాకిస్తాన్‌లోని చైనా వర్కర్లపై ఇటీవల మరోసారి దాడి జరగడంతో, అక్కడి చైనా రాయబార కార్యాలయం 'చైనా కంపెనీలు, పౌరులు అప్రమత్తంగా ఉండాలి, సాధ్యమైనంత భద్రతా జాగ్రత్తలు తీసుకోవాలి' అని సూచించింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














