H1B: ఈ వీసా కోసం అమెరికాలోని కొందరు భారతీయులు ఎలా పోరాడుతున్నారంటే...

- రచయిత, దివ్య ఆర్యా
- హోదా, బీబీసీ ప్రతినిధి
అనుజ్ క్రిష్చియన్ వాషింగ్టన్ డీసీలోని యూఎస్ క్యాపిటల్ హిల్ బిల్డింగ్ ఎదురుగా ఒక పోస్టర్‌ను చేతిలో పట్టుకుని ఒంటరిగా నిల్చుని ఉన్నారు.
అమెరికాలో గ్రీన్ కార్డు కోసం వేచిచూస్తున్న లక్షల మంది భారతీయుల్లో అనుజ్ ఒకరు. వారికంటే ఈయన ఎలా భిన్నమంటే....ఈ విధానంలో మార్పు కోసం ఏదో ఒకటి చేయాలని ఆయన గట్టిగా భావిస్తున్నారు.
అమెరికాలో శాశ్వతంగా నివసించడానికి, పనిచేయడానికి అవసరమైన గ్రీన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే భారతీయుల సంఖ్య గత కొన్నేళ్లుగా భారీగా పెరుగుతోంది. కానీ, గ్రీన్ కార్డుల కోటా మాత్రం పరిమితంగా ఉంటుంది.

అమెరికా ఇమిగ్రేషన్ ఏజెన్సీ యూఎస్‌సీఐఎస్ డేటా ప్రకారం, 2023 నాటికి ఈ కార్డు కోసం వేచి ఉన్న భారతీయుల సంఖ్య 10 లక్షలకు పైనే.
గ్రీన్ కార్డు, వీసా కోసం ఏళ్లు లేదా దశాబ్దాల తరబడి నిరీక్షించడం అమెరికాలో చదువుకుని, కెరీర్‌ను తీర్చిదిద్దుకోవాలని ఆశించే లక్షల మంది భారతీయుల కలలకు విఘాతంగా మారుతోంది.
అమెరికా ఇమిగ్రేషన్ వలస విధానాలు, చట్టాలలో మార్పుల ద్వారా అందుబాటులో ఉన్న వివిధ వీసా ఆప్షన్లపై భారతీయుల్లో అవగాహన పెంచి ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తోన్న అనుజ్‌తో పాటు, అలాంటి మరికొందరిని బీబీసీ కలిసింది.

అధ్యక్ష ఎన్నికల్లో ప్రధాన అంశంగా ఇమిగ్రేషన్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇమిగ్రేషన్ అనేది ప్రధాన అంశం. ఆ దేశంలోకి ప్రవేశించే వారిపై, ముఖ్యంగా మెక్సికో సరిహద్దు నుంచి అమెరికాలోకి వచ్చే వారిపై కఠిన నియంత్రణలు చేపట్టాల్సిన అవసరం ఉందని రిపబ్లికన్, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థులు ఇద్దరూ అంటున్నారు.
15 ఏళ్ల కిందట గుజరాత్ నుంచి అమెరికాకు వెళ్లిన అనుజ్, ఇప్పటికీ హెచ్1-బీ వీసా పైనే ఉంటున్నారు.
అమెరికా ఇమిగ్రేషన్ విధానాలు భారతీయుల పట్ల వివక్ష చూపుతున్నాయని ఆయన ఆరోపిస్తున్నారు.
అమెరికా ఇమిగ్రేషన్ నిబంధనల ప్రకారం, ప్రతి ఏడాది జారీ చేసే 1,40,000 గ్రీన్ కార్డులలో ఒక్కో దేశానికి పరిమితి 7 శాతం.
ఈ పరిమితితో భారత్, చైనా వృత్తి నిపుణులు బాగా నష్టపోతున్నారు. ఎందుకంటే, గ్రీన్ కార్డు కోసం ఇతర దేశాల నుంచి దరఖాస్తు చేసుకునే నిపుణులు కంటే భారత్, చైనా ప్రొఫెషనల్స్ ఎక్కువ.
‘‘ఉద్యోగ సంబంధిత ఇమిగ్రేషన్ అభ్యర్థులను ఎంపిక చేసేటప్పుడు చాలా మంది అమెరికన్లకు అవగాహన ఉండటం లేదు. వ్యక్తి అర్హత కంటే ఎక్కడ పుట్టారన్న దానికే వారు ప్రాధాన్యత ఇస్తున్నారు’’ అని అనుజ్ బీబీసీతో చెప్పారు.
గ్రీన్ కార్డుల కోసం వారు దశాబ్దాలుగా వేచిచూస్తున్నట్లు చాలా మంది అక్కడ ఉంటున్న భారతీయులు మాకు చెప్పారు.
దీని గురించి యూఎస్‌సీఐసీని సంప్రదించగా, వారి నుంచి సమాధానం రాలేదు. సమస్య చాలా పెద్దది, కానీ చాలా తక్కువ మందే దీని గురించి మాట్లాడుతున్నారని అనుజ్ అన్నారు.
‘‘దీని వల్ల నేరుగా ప్రభావితులయ్యే వారు బాగా భయపడుతున్నారు. వారే ఇక్కడ వీసాపై ఉంటున్నారు. దీని గురించి బహిరంగంగా మాట్లాడాలనుకోవడం లేదు’’ అని అనుజ్ చెప్పారు.
అనుజ్ కూడా ఇక్కడ వీసాపైనే ఉంటున్నారు. కానీ, దీనిపై మాట్లాడాలని నిర్ణయించుకున్నారు.
తన కారులో అమెరికాలోని 50 స్టేట్ క్యాపిటల్ బిల్డింగ్స్ దగ్గరకు వెళ్లి, ఇలా నిరసన తెలుపుతున్నారు.
దీప్ పటేల్ పోరాటం
అమెరికన్లతో మాట్లాడుతూ, ఈ సమస్యపై వారికి అవగాహన కలిగేలా చేస్తున్నారు అనుజ్. చాలా ప్రాంతాల్లో, మిగిలిన భారతీయులు కూడా చేరుతూ, తమ అనుభవాలను పంచుకుంటున్నారు.
అమెరికన్లు, భారతీయుల నుంచి వస్తోన్న మద్దతుతో, అనుజ్ ప్రస్తుతం ‘ఫెయిర్ అమెరికా’ అనే సంస్థను ఏర్పాటు చేశారు.
దరఖాస్తుదారుల అర్హతలను బట్టి గ్రీన్ కార్డులు జారీ చేయాలని, కంట్రీ కోటాను బట్టి కాదని వారు డిమాండ్ చేస్తున్నారు.
షికాగోలో నివసిస్తోన్న దీప్ పటేల్ ఈ విషయంలో మరో రకమైన సమస్యను ఎదుర్కొంటున్నారు.
దీప్ పటేల్ తొమ్మిదేళ్లప్పుడు, తల్లిదండ్రులతో కలిసి అమెరికాకు వచ్చారు. ఇక్కడ స్కూళ్లు, కాలేజీల్లోనే చదువుకున్నారు. అమెరికాలోనే ఆయనకు స్నేహితులున్నారు.
ఆయనకు 21 ఏళ్లు వచ్చినా, తల్లిదండ్రులకు మాత్రం ఇంకా గ్రీన్ కార్డు రాలేదు. దీంతో, అమెరికాలో దీప్ పటేల్ ప్రస్తుతం చట్టవిరుద్ధంగా ఉంటున్నట్లు అర్థం.
ఇమిగ్రేషన్ నిబంధనల ప్రకారం, ఎవరైనా ఇమిగ్రెంట్ తన పిల్లలతో కలిసి అమెరికా వస్తే, పిల్లలకు 21 ఏళ్లు వచ్చే లోపు వారికి గ్రీన్ కార్డు రాకపోతే, తల్లిదండ్రుల వీసాపై వారు నివసించేందుకు వీలు లేదు. వారికోసం ప్రత్యేకంగా వీసా కావాల్సి ఉంటుంది.
అమెరికాలో ఇలాంటి యువత 2.5 లక్షల మంది ఉన్నారు.
‘‘కాలేజీలో నేను అడ్మిషన్ తీసుకునేందుకు వెళ్లినప్పుడు, అమెరికా స్కూళ్లలో చదివినప్పటికీ, నేనింకా అంతర్జాతీయ విద్యార్థినే అన్న విషయం తెలిసింది. కెరీర్‌ను ఎంపిక చేసుకునేందుకు, అమెరికాలో ఉండేందుకు ఏదైనా ఆప్షన్ ఉందా అని నేను చూసుకోవాల్సి వచ్చింది లేదా దేశాన్ని విడిచిపెట్టాలి. ఇవన్నీ నన్ను తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేశాయి’’ అని దీప్ పటేల్ బీబీసీతో అన్నారు.
కొంతమంది, ఈ ఒత్తిడిని భరించలేకపోతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
దీప్ పటేల్ లాగానే భారత్‌లో జన్మించిన అతుల్య రాజా కుమార్, ఆమె సోదరుడు చిన్న వయసులోనే తల్లితో కలిసి అమెరికాకు వచ్చారు.
ఈ విషయంపై ఏర్పాటైన అమెరికా సెనేట్ కమిటీకి ఇచ్చిన ప్రకటనలో అతుల్య మాట్లాడుతూ, దీనివల్ల తన సోదరుడు తీవ్ర మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడ్డారని, కాలేజీలో చేరడానికి ముందే ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు.
‘‘నా సోదరుడికి వాషింగ్టన్ యూనివర్సిటీలో ఓరియెంటేషన్ ఉంది. కానీ, దానికి ఒక రోజు ముందే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఒక్కసారిగా నా కుటుంబం అంతా ఛిన్నాభిన్నమైంది. స్కూల్ పరీక్షలు రాయడానికి బదులు, సంతాప సందేశం రాయాల్సి వచ్చింది.’’ అని అతుల్య చెప్పారు.
దీప్ పటేల్ ప్రస్తుతం వర్క్ వీసాపైన అక్కడ ఉంటుండగా.. అతుల్య స్టూడెంట్ వీసాపై ఉంటున్నారు.
వీరి సంస్థ చేపట్టిన చర్యలలో భాగంగా.. ఎట్టకేలకు అమెరికా కాంగ్రెస్, సెనేట్‌లో అమెరికా చిల్డ్రన్ యాక్ట్ 2023 బిల్లును ప్రవేశపెట్టారు.
చట్టసవరణ ద్వారా అమెరికాలో చాలా కాలంగా వీసాలపై ఉంటున్న తల్లిదండ్రుల పిల్లలకు గ్రీన్ కార్డులు ఇవ్వాలనే ప్రతిపాదన ఇందులో ఉంది. కానీ, ఇది ఆమోదం పొందలేదు.
డెమొక్రటిక్ పార్టీకి చెందిన కాంగ్రెస్ సభ్యుడు అబీ బేరా ఈ బిల్లుకు మద్దతు ఇచ్చారు. వచ్చే ప్రభుత్వంలోనైనా ఈ బిల్లు ఆమోదం పొందుతుందని ఆయన ఆశిస్తున్నారు.
‘‘ఈ యువతను మేం డాక్యుమెంటెడ్ డ్రీమర్స్ అని పిలుస్తాం. తల్లిదండ్రులతో కలిసి చట్టబద్ధంగా ఈ పిల్లలు ఇక్కడకు వచ్చారు. ఇది వారి దేశం. వారు పెరిగిన తర్వాత ఇక్కడి నుంచి పంపేయడం ఏ మాత్రం సరైంది కాదు. ఈసారి ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా, అంటే రిపబ్లికన్ అయినా, డెమొక్రటిక్ అయినా.. ఈ బిల్లును ఆమోదిస్తుందని మేం ఆశిస్తున్నాం’’ అని అమీ బేరా చెప్పారు.
కొందరికైతే, గ్రీన్ కార్డే కాకుండా, దానికి తొలిమెట్టు అయిన హెచ్1-బీ వీసా కూడా దొరకడం లేదు.
చదువు కోసం చిన్మయ్ జాగ్ స్టూడెంట్ వీసాపై పుణె నుంచి కాలిఫోర్నియా వచ్చారు. తర్వాత ఉద్యోగం వెతుక్కునేటప్పుడు, చిన్మయ్‌కు వర్క్ వీసా దొరకలేదు.
‘‘ప్రతి ఏడాది 85,000 హెచ్1-బీ వీసాలు జారీ అవుతుంటాయి. కానీ, దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల సంఖ్య ఎక్కువ. యూఎస్‌సీఐఎస్ ఈ ప్రక్రియను లాటరీ ద్వారా చేపడుతోంది. గత ఏడాది 4 లక్షల మందికి పైగా ఈ వీసా కోసం దరఖాస్తు చేసుకోగా, కేవలం 85 వేల వీసాలు మాత్రమే జారీ చేశారు’’ అని చిన్మయ్ చెప్పారు.

చిన్మయ్ గరిష్టంగా మూడుసార్లకు పైగా హెచ్1-బీ వీసాను దరఖాస్తు చేసుకున్నారు. కానీ, వీసా లాటరీ విధానంలో కనీసం ఒక్కసారి కూడా ఆయనకు రాలేదు.
భారత్‌కు రావడం తప్ప ఆయనకు మరోదారి లేకుండా పోయింది. ఇంతలో, సౌందర్య బాలసుబ్రమణి రాసిన పుస్తకం ‘Unshackled’ ద్వారా మరో వీసా గురించి ఆయనకు తెలిసింది.
అదే ఓ1 వీసా. హెచ్1-బీ వీసా మాదిరి లాటరీ విధానంలో కాకుండా అర్హతలను బట్టి ఓ1 వీసాను ఇస్తారు.
హెచ్1-బీ వీసా కోటా 85 వేలు అయితే, ఓ1 వీసాల జారీకి ఎలాంటి పరిమితి లేదు. నిబంధనలకు అనుగుణంగా అర్హులైన అభ్యర్థులకు వీసాను జారీ చేస్తారు.
అమెరికా ఇమిగ్రేషన్ విధానంలో ఉన్న సంక్లిష్టతల నుంచి బయటపడే ప్రయత్నాల్లో భాగంగా సౌందర్యకు ఓ1 వీసా గురించి తెలిసింది.
ఇలాంటి వర్క్ వీసాలు ఉంటాయని తెలియజేసేందుకు ఆమె ఈ పుస్తకాన్ని రాశారు. ఓ కంపెనీని పెట్టిన తర్వాత ఆమె ప్రొఫెషనల్ సర్వీసులను అందజేస్తున్నారు.
‘‘వీసాలు పొందిన తర్వాత, చాలా మంది ఇప్పుడు ఇమిగ్రేషన్ గురించి కాకుండా వారు ఏం చేయాలనుకుంటున్నారో దానిపై దృష్టి పెట్టగలుగుతున్నామని చెబుతున్నారు. కంపెనీ ఫౌండర్లే నాతో ఆ మాట చెప్పారు.’’ అని సౌందర్య అన్నారు.
అనుజ్, దీప్, అతుల్య, చిన్మయ్, సౌందర్యల దారులు వేరు. కానీ, గమ్యస్థానం మాత్రం ఒకటే.
అమెరికాకు వెళ్లడం ఎంతో కొంత తేలికే. కానీ, అక్కడే ఉండటం, కెరీర్‌ను బిల్డ్ చేసుకోవడం, జీవనం సాగించడం కాస్త కష్టమే.
కానీ, అమెరికాలో ఉండాలనే కల, వారందరిలో ఈ ధైర్యాన్ని, ఆశను నింపుతోంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















