US Elections 2024: ప్రపంచం మొత్తం ఈ కౌంటింగ్ కేంద్రంవైపు చూడనుందా, అక్కడ ఎందుకంత హై సెక్యూరిటీ?

అమెరికా ఎన్నికలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2020లో మారికోపా కౌంటీలోని ఎన్నికల కౌంటింగ్ కేంద్రం దగ్గర గుమిగూడిన ట్రంప్ అభిమానులు
    • రచయిత, క్రిస్టల్ హేయిస్
    • హోదా, బీబీసీ న్యూస్

రేజర్ వైర్, మందమైన నల్లని ఇనుప కంచె, మెటల్ డిటెక్టర్లు, సాయుధ బలగాలు, బాంబు స్వీప్స్.

ఇదంతా చూస్తుంటే ఎయిర్‌పోర్టు లేదా జైలు దగ్గర ఉండే రక్షణలాగా కనిపిస్తోంది కదా! అవును, ఆ స్థాయి భద్రతను ఒక ఓట్ల లెక్కింపు కేంద్రం దగ్గర ఏర్పాటు చేశారు.

అవసరమైతే డ్రోన్లు, అశ్వదళం, స్నైపర్లను రంగంలోకి దించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఆ కౌంటింగ్ కేంద్రం అరిజోనా రాష్ట్రంలోని మారికోపా కౌంటీలో ఉంది.

2020 అధ్యక్ష ఎన్నికల్లో వివాదాలకు కేంద్ర బిందువుగా మారికోపా కౌంటీ నిలిచింది. జో బైడెన్ చేతిలో దగ్గరదగ్గర 11వేల ఓట్ల తేడాతో ట్రంప్ ఓడిపోయారు. అయితే, ఈ కౌంటీలో అవకతవకలు జరిగినట్లు ట్రంప్ ఆరోపణలు చేశారు. కానీ, వాటికి ఆయన ఎలాంటి ఆధారాలూ చూపలేదు.

ఈ వైరల్ వార్తలతో ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని సాయుధ నిరసనకారులు ముంచెత్తారు. ఇక్కడ జరిగిన ఫలితాలను సవాల్ చేస్తూ అనేక వ్యాజ్యాలు దాఖలయ్యాయి.

దీంతో, ఆ ఎన్నికల అనంతరం బ్యాలెట్ల లెక్కింపు ప్రక్రియలో కొన్ని మార్పులు తీసుకువచ్చారు. అలాగే, భద్రతలో అత్యాధునిక అంశాలను చేర్చారు.

“ మేం దీనిని సూపర్ బౌల్‌లాంటి టోర్నీ నిర్వహణలాగా భావిస్తున్నాం” అని మారికోపా కౌంటీ షెరీఫ్ రస్ స్కిన్నర్ బీబీసీకి తెలిపారు.

బీబీసీ న్యూస్ తెలుగు, వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
యూఎస్ ఎన్నికలు 2024, కమలా హరీస్, డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన భద్రతా వలయం

అమెరికాలో అత్యధిక జనాభా ఉన్న కౌంటీల్లో నాలుగో స్థానంలో ఉంది మారికోపా. ఈ కౌంటీలోని మొత్తం ఓటర్లు అరిజోనాలోని ఓటర్లలో 60 శాతంమంది ఉంటారు.

ఏడాది కంటే ముందు నుంచే ఎన్నికల కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తూ వచ్చినట్లు స్కిన్నర్ తెలిపారు.

పోలింగ్‌, కౌంటింగ్ కేంద్రాల వద్ద షెరీఫ్ డిపార్ట్‌మెంట్ (పోలీస్ డిపార్ట్‌మెంట్) భద్రతను పర్యవేక్షిస్తుంది. ఆ భద్రత నిర్వహిస్తున్న అధికారులకు ఎన్నికల చట్టాలపై శిక్షణ ఇస్తారు.

భద్రత పరంగా డ్రోన్లు, స్నైపర్లతో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం గురించి స్కిన్నర్‌ను అడిగినప్పుడు ఆయన ఇలా సమాధానమిచ్చారు.

“ఆ స్థాయి భద్రతను ఉపయోగించే అవసరం రాకూడదనేది మా ఆశ. అయినప్పటికీ ఆయా కేంద్రాలు, అందులో పనిచేసే సిబ్బంది భద్రతకు భరోసా కల్పించేందుకు అవసరమైన స్థాయిలో సిద్ధంగా ఉన్నాం.” అని చెప్పారు.

ఇక్కడ జరిగే ఎన్నికల ప్రక్రియ దేశవ్యాప్తంగా ఉన్న కౌంటీలలో ప్రతిబింబిస్తుంది.

ఓట్లు వేసిన బ్యాలెట్స్‌ను ఫీనిక్స్‌లోని కొత్త టేబ్యులేషన్ మెషీన్‌లతో కూడిన కేంద్రానికి తీసుకెళతారు.

ఒకవేళ మెయిల్ ద్వారా ఓటు వేస్తే, ఆ బ్యాలెట్లను తనిఖీ చేసి సంతకాలను ధ్రువీకరిస్తారు. ఈ ప్రక్రియలో ఏమైనా లోపాలు జరుగుతున్నాయా? వంటివి పరిశీలించడానికి వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ఇద్దరు కార్యకర్తలు ఈ ప్రాసెస్‌లో భాగస్వాములుగా ఉంటారు.

ఈ ప్రక్రియ అంతా 24 గంటలపాటు లైవ్ స్ట్రీమ్ చేస్తారు. ఈ ప్రక్రియ చాలా వరకు ఇలాగే కొనసాగుతున్నప్పటికీ ఈసారి ఎన్నికల్లో కొన్ని మార్పులు తీసుకువచ్చారు.

2020 ఎన్నికల తరువాత రీ-కౌంటింగ్‌ను సులభతరం చేస్తూ కొత్త చట్టాలు వచ్చాయి. ఇంతకు ముందు 0.1శాతం మాత్రమే తేడా వస్తే రీ-కౌంటింగ్‌కు అనుమతించేవారు. ప్రస్తుతం దానిని 0.5శాతానికి పెంచారు.

కౌంటింగ్ కేంద్రాల వద్ద సెక్యూరిటీ కెమెరాలు, సాయుధ బలగాలు, రెండంచెల ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ఒక ఫెన్సింగ్‌ను మందమైన కార్పెట్లతో కప్పారు.

“ఈ తరహా చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితులు రావడం నిజంగా బాధాకరం” అని మారికోపా కౌంటీ సూపర్‌వైజర్ బిల్‌గేట్స్ అన్నారు.

2020 ఎన్నికల సమయంలో వచ్చిన బెదిరింపుల తరువాత తాను పోస్ట్ ట్రమాటిక్ స్ట్రెస్ డిజార్డర్ (పీటీఎస్‌డీ) అనే మానసిక సమస్యలతో ఇబ్బందిపడ్డానని గేట్స్ చెప్పారు. ఈ నేపథ్యంలో ఈసారి ఆ ప్రక్రియలో పాల్గొనడానికి ఆసక్తిగా లేనట్లు ఆయన స్పష్టం చేశారు.

“పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన భద్రతను చూసి ఇవి సైనిక స్థావరాలుగా ఓటర్లు భావించవద్దు. మీ కుటుంబంతో కలిసి సురక్షితమైన వాతావరణంలో ఓటు వేసి ప్రజాస్వామ్యంలోని కీలక ప్రక్రియలో భాగస్వాములు కావాలి.” అని ఆయన సూచించారు.

అమెరికా 2024 ఎన్నికలు, కౌంటింగ్ కేంద్రాలు
ఫొటో క్యాప్షన్, కౌంటింగ్ సెంటర్‌లోకి సందర్శకులను అనుమతిస్తారు

ఈ కౌంటీ 2020 నుంచి మిలియన్ల కొద్ది పెట్టుబడి పెట్టింది. ఇది కేవలం భద్రత కోసమే కాదు. ప్రస్తుతం వారికి 30 మంది సభ్యుల కమ్యూనికేషన్ టీం ఉంది.

ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నాయనే ప్రచారం నేపథ్యంలో ఈ సారి పారదర్శకతపై ఎక్కువగా దృష్టిసారించారు.

ఓట్ల లెక్కింపు మెషిన్లను గంటలకొద్ది లైవ్ స్ట్రీమింగ్ చేయడం, కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించేందుకు డజన్ల కొద్ది ప్రజలను అనుమతించడం వంటివి చేస్తున్నారు.

“ఈ ప్రక్రియలోని ప్రతి చిన్న విషయాన్ని మేము బహిర్గతం చేయబోతున్నాం. తద్వారా, అసత్య ప్రచారాలకు చెక్ పెట్టొచ్చు” అని అసిస్టెంట్ కౌంటీ మేనేజర్ జాక్ షిరా బీబీసీతో చెప్పారు.

“మేము అత్యంత కఠినమైన సవాళ్లు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ, అంతా సాఫీగానే జరుగుతుందని ఆశిస్తున్నాం” అని జాక్ షిరా అన్నారు.

రిపబ్లికన్ పార్టీ, అరిజోనా
ఫొటో క్యాప్షన్, అరిజోనాలో రిపబ్లికన్ పార్టీ ప్రచార ర్యాలీలో పాల్గొన్న మద్దతుదారులు

ఇటీవలి మార్పులను గమనించిన కొందరు మారికోపా రిపబ్లికన్లు ఈ ఎన్నికల ప్రక్రియలో కొన్ని సమస్యలను గుర్తించినట్లు బీబీసీకి తెలిపారు.

“వాళ్లు తీసుకున్న చర్యలు నాకు తెలిసి ఉపయోగపడొచ్చు” అని 25 ఏళ్ల గారెట్ లడ్విక్ చెప్పారు. ట్రంప్ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్‌ కోసం ఇటీవల స్కాట్స్ డేల్‌లో చేపట్టిన ర్యాలీకి హాజరైన సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

“ప్రస్తుతం ఎక్కువ మందికి ఈ విషయాల గురించి అవగాహన ఉంది. వారు ప్రతి విషయాన్ని డేగ కన్నుతో చూస్తారు” అని గారెట్ తెలిపారు.

అరిజోనాలో ఫలితాలు ప్రధానంగా మారికోపా కౌంటీపై ఆధారపడి ఉంటాయి. అధ్యక్ష ఫలితాల్లో ఈ కౌంటీ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ కౌంటీలోని అన్ని బ్యాలెట్లు లెక్కించడానికి 13 రోజులు పట్టొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

స్వింగ్ స్టేట్స్‌లో భాగమైన మారికోపా కౌంటీ ఫలితాలపై యావత్ ప్రపంచం ఆసక్తి కనబర్చే అవకాశం ఉందని అసిస్టెంట్ కౌంటీ మేనేజర్ షిరా అభిప్రాయపడుతున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)